క్రిప్టోకరెన్సీ- బిట్‌కాయిన్‌: డిజిటల్ కరెన్సీపై మోదీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది?

బిట్ కాయిన్

ఫొటో సోర్స్, Getty Images

డిజిటల్ కరెన్సీపై చట్టాన్ని రూపొందించే పనిని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రారంభించింది.

నవంబర్ 29 నుంచి జరగనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టనుంది.

పార్లమెంట్ సమావేశాల్లో మొత్తం 26 బిల్లులు ప్రవేశపెట్టేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.

ఇందులో క్రిప్టోకరెన్సీ, డిజిటల్ కరెన్సీల బిల్లు కూడా ఉంది.

ఈ బిల్లుకు 'క్రిప్టో కరెన్సీ, అధికారిక డిజిటల్ కరెన్సీ వినిమయ నియంత్రణ బిల్లు-2021' అని పేరు పెట్టారు.

భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) జారీ చేసే అధికారిక డిజిటల్ కరెన్సీని రూపొందించడానికి, దేశంలోని ఇతర డిజిటల్ క్రిప్టోకరెన్సీలపై నిషేధం విధించడానికి అవసరమైన సులభమైన యంత్రాంగాన్ని రూపొందించడమే లక్ష్యంగా ఈ బిల్లును ప్రవేశపెడుతున్నట్లు లోక్‌సభ తన యాక్షన్ ప్లాన్‌లో పేర్కొంది.

అదేవిధంగా, క్రిప్టోకరెన్సీ వాడకాన్ని ప్రోత్సహించడం, దానిపై అవగాహన కల్పించడం వంటి అంశాల్లో ఈ బిల్లు ఉపశమనం కల్పిస్తుందని లోక్‌సభ తెలిపింది.

వీడియో క్యాప్షన్, బిట్‌కాయిన్ అంటే ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది?

క్రిప్టోకరెన్సీ బిల్లుపై సర్కారు మౌనం

ఆర్‌బీఐ చాలాకాలంగా తన సొంత డిజిటల్ కరెన్సీని తీసుకురావాలని యోచిస్తోంది. కానీ, దీనికి సంబంధించిన పైలట్ ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభం అవుతుందనేది ఇంకా నిర్ణయించలేదు.

ఇప్పటివరకు, ఈ బిల్లుకు సంబంధించిన కచ్చితమైన రూపురేఖలు బహిర్గతం కాలేదు. దీనిపై బహిరంగ చర్చలు కూడా జరగడం లేదు.

ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా ఈ బిల్లు గురించి చాలా కాలంగా ఏమీ మాట్లాడటం లేదు. కానీ ఆగస్టు నుంచే ఈ బిల్లు మంత్రివర్గం ఆమోదానికి సిద్ధంగా ఉన్నట్లు భావిస్తున్నారు.

ఇప్పటికే చాలామంది ప్రజలు క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు పెట్టారు. దీంతో ఈ బిల్లుకు సంబంధించి అనేక ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. ఒకవేళ ప్రభుత్వం, మిగతా అన్ని క్రిప్టోకరెన్సీలపై నిషేధం విధిస్తే, ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన వారి పరిస్థితి ఏంటి?

అయితే ఈ డిజిటల్ కరెన్సీలకు సంబంధించి మోదీ సర్కారు లక్ష్యం మరోలా ఉంది.

ప్రధాని నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, EPA

'ద హిందూ' పత్రిక కథనం ప్రకారం, క్రిప్టో కరెన్సీపై నియమ నిబంధనలు రూపొందించడానికి నవంబర్ 13న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో రిజర్వు బ్యాంకు, కేంద్ర ఆర్థిక, హోం మంత్రిత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

పెద్ద పెద్ద హామీలు గుప్పిస్తూ, పారదర్శకంగా లేని ప్రకటనలతో యువతను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను ఆపివేసే చర్యలను తీసుకోవాలని ఆ సమావేశంలో నిర్ణయించారు.

క్రమబద్దీకరించని క్రిప్టో మార్కెట్లను మనీలాండరింగ్, తీవ్రవాదులు నిధులు సమకూర్చేందుకు వినియోగించుకునే ప్రమాదం ఉందని వారు గుర్తించారు. అందుకే ఈ రంగానికి సంబంధించి మెరుగైన, వేగవంతమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సంకల్పించింది.

బిట్ కాయిన్

ఫొటో సోర్స్, Reuters

భారీ పతనం

మంగళవారం, క్రిప్టో కరెన్సీ బిల్లుకు సంబంధించిన సమాచారం బయటకు రాగానే, క్రిప్టో మార్కెట్లు భారీ పతనాన్ని చవిచూశాయి.

ప్రధాన క్రిప్టోకరెన్సీల విలువ దాదాపు 15 శాతం లేదా అంతకంటే ఎక్కువే పడిపోయింది.

బిట్‌కాయిన్ 17 శాతం కంటే ఎక్కువ, ఎథెరియమ్ దాదాపు 15 శాతం, టీథర్ దాదాపు 18 శాతం క్షీణించాయి.

క్రిప్టోకరెన్సీ అంటే ఏంటి?

క్రిప్టోకరెన్సీ అనేది ఏదైనా కరెన్సీకి సంబంధించిన డిజిటల్ రూపం. ఇది ఒక నాణేం లేదా నోటు రూపంలో ఉండదు. ఇది పూర్తిగా ఆన్‌లైన్ ఆధారితమైనది. దీనికి సంబంధించిన లావాదేవీలన్నీ ఆన్‌లైన్ వేదికగానే జరుగుతాయి.

దీన్ని ఏ ప్రభుత్వం గానీ, నియంత్రణా సంస్థలు గానీ జారీ చేయవు. ప్రభుత్వం, బ్యాంకులు వంటి కేంద్రీకృత సంస్థలకు దీనిపై నియంత్రణ ఉండదు.

డిజిటల్ కరెన్సీ కారణంగా జరిగిన సైబర్ మోసాల అంశాన్ని భారతీయ రిజర్వు బ్యాంక్ ఈ ఏడాది లేవనెత్తింది.

క్రిప్టోకరెన్సీ లావాదేవీలకు మద్దతుగా నిలిచే బ్యాంకులపై, ఆర్థిక సంస్థలపై 2018లో రిజర్వు బ్యాంకు నిషేధం విధించింది.

బిట్ కాయిన్

ఫొటో సోర్స్, Reuters

కానీ ఆర్‌బీఐ విధించిన నిషేధానికి వ్యతిరేకంగా 2020 మార్చిలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీనిపై ఒక నిర్ణయం తీసుకొని డిజిటల్ కరెన్సీకి సంబంధించిన చట్టాన్ని రూపొందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

భారత్‌కు చెందిన సొంత క్రిప్టోకరెన్సీని చెలామణిలోకి తీసుకురావడానికి అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని ఈ ఏడాది మార్చిలో ఆర్‌బీఐ పేర్కొంది.

భారత్‌లో క్రిప్టో కరెన్సీని ఎలా ఉపయోగించాలనే అంశంపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం చాలా ప్రభావాన్ని చూపిస్తుంది.

ఎంతమంది భారతీయులు క్రిప్టో కరెన్సీని వాడుతున్నారు, ఎంతమంది దానితో వ్యాపారం చేస్తున్నారు అనే అంశంలో అధికారిక గణాంకాలు లేవు.

అయితే కోట్లాది మంది భారతీయులు ఈ డిజిటల్ కరెన్సీపై పెట్టుబడి పెడుతున్నారని, కరోనా మహమ్మారి సమయంలో దీని వాడకం మరింత ఎక్కువైందని పలు మీడియా నివేదికలు తెలుపుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)