అద్భుతం: చికిత్స లేకుండానే హెచ్‌ఐవీ వైరస్‌‌ను తరిమేసిన మహిళ శరీరం

హెచ్‌ఐవీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మిచెల్ రాబర్ట్స్
    • హోదా, హెల్త్ ఎడిటర్, బీబీసీ న్యూస్ ఆన్‌లైన్

అర్జెంటీనాకు చెందిన ఓ మహిళ ఎలాంటి వైద్య చికిత్స తీసుకోకుండానే హెచ్‌ఐవీ నుండి కోలుకున్నారు. ప్రపంచంలో ఈ రకంగా గుర్తించిన రెండవ కేసు ఇది.

పేషెంట్‌ రోగనిరోధక వ్యవస్థ తనంతట తానుగా శరీరం నుంచి హెచ్‌ఐవీ వైరస్‌ లేకుండా నాశనం చేసిందని వైద్యులు భావిస్తున్నారు.

ఆ మహిళ శరీరంలోని సుమారు ఒక బిలియన్ కన్నా ఎక్కువ కణాలను విశ్లేషించిన తర్వాతే, ఇన్ఫెక్షన్‌కు సంబంధించిన జాడ కనిపించలేదనే నిర్ధారణకు వచ్చినట్టు ఆర్కైవ్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ పేర్కొంది.

ఈ ప్రక్రియను లోతుగా అధ్యయనం చేయగలిగితే, అది హెచ్‌ఐవీని సమూలంగా నిర్మూలించడానికి లేదా సమర్థవంతంగా నయం చేయడానికి ఒక మార్గాన్ని అందిస్తుందని నిపుణులు అంటున్నారు.

వీడియో క్యాప్షన్, ఇక్కడ హెచ్‌ఐవీ బాధితులకే పెళ్లి సంబంధాలు చూస్తారు!

హెచ్‌ఐవీ నిర్మూలనకు అవకాశం

కొంతమంది వ్యక్తులు హెచ్‌ఐవీ వైరస్‌కి సహజమైన నిరోదకశక్తితో జన్మిస్తారనే విషయాలకు, ఈ కేసులో కనుగొన్న అంశాలు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. కొందరిలో ఇన్ఫెక్షన్ రాకుండా నిరోధించే జన్యువులు ఉంటాయి.

అలాంటివారిలో "ఎస్పెరాన్జా పేషెంట్"కూడా ఒకరు. తనపేరు బయటకు తెలియడాన్ని ఆమె ఇష్టపడటం లేదు. అందుకే ఊరి పేరుతో ఎస్పెరాన్జా పేషెంట్‌గా ఆమెను పిలుస్తున్నారు. ఆమెకు హెచ్‌ఐవీ వైరస్‌ సోకినా, ఎలాంటి వైద్యచికత్స తీసుకోకుండా సొంతంగానే వైరస్‌ నుంచి బయటపడ్డారు.

చాలా మంది హెచ్‌ఐవీ ఉన్నవారికి జీవితకాల యాంటీరెట్రోవైరల్ థెరపీ (ఏఆర్‌టీ) అవసరం. వారు ఈ మందులు తీసుకోవడం ఆపేస్తే, నిద్రావస్థలో ఉన్న వైరస్ మళ్లీ మేల్కొని సమస్యలను కలిగిస్తుంది.

అయితే ఇటీవలి సంవత్సరాలలో "ఎలైట్ కంట్రోలర్ల" గురించి నివేదికలు ఉన్నాయి. వీటి సహాయంతో వైరస్‌ ప్రబలకుండా చేయొచ్చు. కానీ హెచ్‌ఐవీకి మందులు మాత్రం ఇంకా రాలేదు.

లండన్‌కు చెందిన ఆడమ్ కాస్టిల్లెజో, తనకు క్యాన్సర్‌ కూడా ఉండటంతో దాత ద్వారా స్వీకరించిన మూలకణ చికిత్స తర్వాత తన రోజువారీ హెచ్‌ఐవీ మాత్రలు తీసుకోవడం మానేశారు.

క్యాన్సర్ చికిత్స సమయంలో ఆయనలో హెచ్‌ఐవీ సోకిన కణాలు తుడిచిపెట్టుకుపోయి, కొత్తవి భర్తీ అయ్యాయి.

అదృష్టవశాత్తూ, హెచ్‌ఐవి సోకకుండా నిరోధించే జన్యువులతో జన్మించిన 1% మంది వ్యక్తులలో ఆయన దాత ఒకరు.

అయితే, కాస్టిల్లెజోకు ఈ ప్రయోజనం ఎంతకాలం కొనసాగిందో తెలియాల్సి ఉంది.

వీడియో క్యాప్షన్, ‘నా అనుమతి లేకుండానే నాకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేశారు’

'స్టెరిలైజింగ్ క్యూర్'

కానీ ''ఎస్పెరాన్జా పేషెంట్‌''కి ఎనిమిది సంవత్సరాలకు పైగా గుర్తించదగిన హెచ్‌ఐవీ లేదు.

శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన లోరీన్ విల్లెన్‌బర్గ్ కూడా తన సొంత రోగనిరోధక వ్యవస్థ ద్వారా హెచ్‌ఐవీని అధిగమించారు. శరీరం నుండి హెచ్‌ఐవీని తొలగించే వ్యూహాన్ని 'స్టెరిలైజింగ్ క్యూర్'గా పేర్కొంటారు. ఇతర హెచ్‌ఐవీ రోగుల్లో కూడా 'స్టెరిలైజింగ్ క్యూర్'పై ఆశలు పెరుగుతున్నాయి.

"ఇలా సొంతంగా నయం కాని వ్యక్తుల్లో స్టెరిలైజింగ్ క్యూర్‌కి ఏదైనా కార్యచరణ మార్గం ఉండవచ్చు" అని రాగాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్, మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ప్రముఖ పరిశోధకులు డాక్టర్ జు యు అన్నారు.

"మేము ఇప్పుడు జీవితకాల యాంటీరెట్రోవైరల్ థెరపీలో ఉన్న వ్యక్తులలో టీకా ద్వారా ఈ రకమైన రోగనిరోధక శక్తిని ప్రేరేపించేలా ప్రయత్నిస్తున్నాము. ఈ థెరపీ అవసరం లేకుండానే వైరస్‌ను నియంత్రించగలిగేలా వారి రోగనిరోధక వ్యవస్థలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నాము".

వీడియో క్యాప్షన్, కోవిడ్-19: ముహూర్తానికి ముందు వరుడికి పాజిటివ్... పీపీఈ కిట్స్‌తో జరిగిన పెళ్లి

అసంపూర్ణ ఇన్ఫెక్షన్

ఎవరైనా నిజంగా హెచ్‌ఐవీ నుండి నయమయ్యారా అని చెప్పడం దాదాపు అసాధ్యం అని ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ జాన్ ఫ్రాటర్ బీబీసీ న్యూస్‌తో చెప్పారు. అయితే పరిశోధకులు ప్రస్తుత సాంకేతికతతో నిరూపించడానికి అవసరమయ్యే ప్రతీ సమాచారాన్ని అందించారు అని చెప్పారు.

"ఈ రోగి వాస్తవానికి తమను తాము సొంతంగా వైరస్‌ నుంచి నయం చేసుకోగలిగారా లేక ఇంకా ఎంతోకొంత అబార్టివ్ ఇన్ఫెక్షన్ ఉందా అనేది కీలకమైన ప్రశ్న" అని ఆయన చెప్పారు.

"ఆమె రోగనిరోధక వ్యవస్థను బట్టి హెచ్‌ఐవీ సోకినట్టు స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు".

"ఇలాంటి రోగులు ఇంకా చాలా మందే ఉండే అవకాశం ఉంది. హెచ్‌ఐవీ నివారణ చర్యలకు వీరి రోగనిరోధక శక్తి నుంచి మరింత నేర్చుకోవచ్చు".

ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న రోగనిరోధక చికిత్సలకు ఈ పరిశోధనలు మరింత సహాయపడతాయని ఇంపీరియల్ కాలేజ్ లండన్‌లోని హెచ్‌ఐవీ వైద్య నిపుణులు ప్రొఫెసర్ సారా ఫిడ్లర్ అన్నారు.

అయితే ''ప్రస్తుతం హెచ్‌ఐవీ మందులు చాలా ప్రభావవంతంగా పని చేస్తున్నాయి. భవిష్యత్తులో ఈ వ్యాధికి చికిత్స చాలా అవసరం. జీవితకాలాన్ని మరింతకాలం పెంచగలిగే యాంటీరెట్రోవైరల్ థెరపీని ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడం మన ముందున్న తక్షణ కర్తవ్యం'' అని కార్డిఫ్ యూనివర్శిటీ మెడికల్ స్కూల్‌కి చెందిన డాక్టర్ ఆండ్రూ ఫ్రీడ్‌మాన్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)