సత్ఫలితాలిచ్చిన వీక్లీ హెచ్ఐవీ పిల్

ఫొటో సోర్స్, Getty Images
హెచ్‌ఐవీకి జంతువులపై నిర్వహించిన వారానికో పిల్ పరిశోధనల్లో ఆశాజనకమైన ఫలితాలు వెలువడ్డాయని అమెరికా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. త్వరలో మనుషులపైనా ఈ ప్రయోగాలు చేపడతామని తెలిపారు.
మెల్లమెల్లగా ఔషధం విడుదలయ్యే ఈ క్యాప్సూల్ వల్ల హెచ్‌ఐవీ పేషెంట్లు రోజూ మందులను వేసుకోవాల్సిన అవసరం ఉండదు.
చూడడానికి ఇది సాధారణ క్యాప్సూల్‌లాగే ఉంటుంది కానీ, కడుపులో చేరాక దానిపై ఉన్న కోటింగ్ కరిగిపోయి, వారం రోజుల వ్యవధిలో దాని లోపల నక్షత్ర రూపంలో ఉండే ఔషధం విడుదలౌతుంది.
పందులపై నిర్వహించిన ప్రయోగంలో పరిశోధకులు వారం రోజుల పాటు ఉండేలా మూడు యాంటీరెట్రోవైరల్ డ్రగ్స్ - డొల్యూట్‌గ్రావిర్, రిల్పివిరైన్, క్యాబోటెగ్రావిర్ - దాని పొట్టలో ప్రవేశపెట్టారు.
ఈ విషయంలో కోతులతో పాటు ఇతర పాలిచ్చే జంతువులపై మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉంది. అయితే సైంటిస్టులు మాత్రం మరో రెండేళ్లలో మనుషులపై ఈ ప్రయోగాలు జరిగే అవకాశం ఉందంటున్నారు.
హెచ్‌ఐవీ నిపుణులు ఈ కొత్త ట్రీట్‌మెంట్‌ను ఆహ్వానిస్తూనే, మనుషుల్లో వారానికో-పిల్ వాస్తవరూపం ధరించాలంటే చాలా కాలమే పడుతుందని అభిప్రాయపడ్డారు.
ఇలా క్రమక్రమంగా ఔషధాన్ని విడుదల చేసే విధానాన్ని కేవలం హెచ్‌ఐవీకి మాత్రమే కాకుండా భవిష్యత్తులో ఇతర వ్యాధులకు కూడా ఉపయోగించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Giovanni Traverso
నెమ్మదినెమ్మదిగా విడుదల
ఇప్పటికే పందుల్లో 'ఇవెర్‌మెక్టిన్' అనే మలేరియా డ్రగ్‌ను ఇలా క్యాప్సూల్ రూపంలో ప్రవేశపెట్టారు. ఇది రెండు వారాల పాటు పంది కడుపులోనే ఉంది.
అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పరిశోధకుడు జియోవానీ ట్రావెర్సో, ''ఔషధాన్ని రోజూ కాకుండా కేవలం వారానికోమారు మత్రమే తీసుకునేలా చేయడం వల్ల రోగులకు సౌకర్యవంతంగా ఉంటుంది. భవిష్యత్తులో కొన్ని వ్యాధులకు నెలకోమారు ఔషధం తీసుకునే విధానం కూడా సాధ్యమయ్యే అవకాశం ఉంది'' అన్నారు.
డిమెన్షియా, స్క్రిజోఫ్రెనియాలాంటి మానసిక ఆరోగ్య సమస్యలున్న పేషెంట్లకు ఇది బాగా ఉపయోగపడుతుంది అని డాక్రట్ ట్రావెర్సో తెలిపారు. కొన్ని స్లో-రిలీజ్ ఔషధాలను ఇంజెక్షన్ రూపంలో కూడా ఇవ్వొచ్చని వివరించారు.
లిండ్రా అనే సంస్థ రాబోయే 12 నెలల్లో ఇలా దీర్ఘకాలం పాటు ఔషధాన్ని విడుదల చేసే ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని మనుషులలో ప్రయోగించి చూడాలని భావిస్తోంది. ఆ తర్వాత మరికొన్ని జంతువులపై ప్రయోగాలు చేసి, మనుషులపై ప్రయోగాలకు ఆమోదం లభించిన తర్వాత హెచ్‌ఐవీ ఔషధంపై ప్రయోగాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
బ్రిటిష్ హెచ్‌ఐవీ అసోసియేషన్ ప్రతినిధి ఒకరు, ''ఈ పరిశోధన ఇంకా మొదటి దశలో ఉంది. ఇలాంటి ప్రయోగాలను జంతువుల తర్వాత మనుషులపై చేయడానికి ముందు వాటి ప్రభావాన్ని పరిశీలించాల్సి ఉంటుంది'' అన్నారు.
టెర్రాన్స్ హిగ్గిన్స్ ట్రస్ట్ ప్రతినిధి, ''హెచ్‌ఐవీతో జీవిస్తున్న పేషెంట్లు రోజూ ఒక మాత్రను వేసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో మనకు తెలీదు. ఒకవేళ అలాంటివి ఉంటే, ఇలాంటి పరిశోధనలు ఆ ఇబ్బందులను తొలగిస్తే అది మంచిదే. అయితే అలాంటి ప్రత్యామ్నాయాలు ప్రస్తుతం లభిస్తున్న వాటికన్నా తక్కువ ప్రభావవంతంగా మాత్రం ఉండరాదు'' అన్నారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








