వరల్డ్ ఎయిడ్స్ డే: "వివాహానికి జాతకాలు చూడటం కన్నా.. రక్త పరీక్షలు చేయడం అవసరం"

ఎయిడ్స్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, పద్మ మీనాక్షి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అది 1999వ సంవత్సరం. సాలూరు మండలంలోని ఒక గ్రామంలో దేవి (పేరు మార్చాం) భర్త ఒక ట్రక్ డ్రైవరు. అతనికి హెచ్ఐవీ సోకింది.

అప్పటికే ఆమె గర్భవతి. కొన్ని రోజుల్లోనే ఆమె భర్త మరణించారు. దాంతో ఆ గ్రామ ప్రజలు ఆ అమ్మాయిని బయట పెట్టి ఆమె భర్తతో కలిసి నివాసం ఉన్న పూరింటిని తగలబెట్టేశారు. అప్పుడామెకు నిలువ నీడ కోల్పోయింది. తన వస్తువులను కూడా కాలిపోయాయి.

హెచ్ఐవీ పట్ల తీవ్రమైన అనుమానాలు, సామాజిక రుగ్మత నెలకొన్న సమయం అది. భారతదేశంలో తొలి హెచ్ఐవీ కేసు చెన్నయ్‌లో 1986లో నమోదయింది.

అప్పటి నుంచి 2004 వరకు 68,809 కేసులు నమోదైనట్లు నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సమాచారం తెలుపుతోంది.

భారతదేశ వ్యాప్తంగా నమోదైన హెచ్ఐవీ కేసులలో 80 శాతం కేసులు దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్), తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలతో పాటు.. ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్, నాగాలాండ్‌లలో నమోదయ్యాయి.

అందులో ఒక శాతానికి పైగా గర్భవతులు ఉన్నట్లు యూఎన్ ఎయిడ్స్ డేటా చెబుతోంది.

గర్భవతి అయిన దేవి ఊర్లో ఉండటానికి కూడా అప్పుడు గ్రామస్థులు ఒప్పుకోలేదు. గ్రామాలలో పని చేసే ఎయిడ్స్ కౌన్సెలర్ల సహాయంతో ఆమె గ్రామం బయటకు వచ్చి బిడ్డకు జన్మ నిచ్చారు.

అదృష్టవశాత్తు తల్లీ బిడ్డలకు ఎయిడ్స్ సోకలేదు. కానీ, ఆమె భర్త మరణ ధ్రువీకరణ పత్రంతో పాటు ఇన్సూరెన్స్ పత్రాలు కూడా ఇంటితో పాటు కాలిపోయాయి.

ఆమెకు ఎయిడ్స్ సోకకపోయినప్పటికీ ఎచ్ఐవీ నిరోధక చికిత్స చేయించి ఆమె సంరక్షణ చూసుకున్నారు సాయి పద్మ. అప్పుడు సాయి పద్మ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్‌గా పని చేస్తున్నారు.

హెచ్ఐవీ అవగాహనా కార్యక్రమాల నిమిత్తం క్లింటన్ ఫౌండేషన్, ఇంటర్నేషనల్ ఎయిడ్స్ హెచ్ఐవీ అలయన్స్‌తో కూడా సాయి పద్మ కలిసి పని చేశారు.

సంస్థ ద్వారా వలంటీర్లు, కౌన్సెలర్ల సహకారంతో 1998 - 2005 వరకు జాతీయ రహదారి 43 పరిధిలో ఉన్న విజయనగరం జిల్లా నుంచి ఒడిశా సరిహద్దులో ఉన్న చిలకపాలెం గ్రామ పరిధిలో ఎయిడ్స్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

2000 దశకంలో ఎచ్ఐవి అవగాహనా కార్యక్రమాలు విరివిగా నిర్వహించారు.

ఫొటో సోర్స్, SAIPADMA

ఫొటో క్యాప్షన్, 2000 దశకంలో ఎచ్ఐవి అవగాహనా కార్యక్రమాలు విరివిగా నిర్వహించారు.

హెచ్ఐవీ పట్ల ఉన్న సామాజిక రుగ్మతతో కొన్ని గ్రామాలలో హెచ్ఐవీ సోకి మరణించిన వారికి అంతిమ సంస్కారాలు చేయడం ఆపేసారు. అలాంటి వారికి కూడా కొన్ని చోట్ల వలంటీర్లు చొరవ తీసుకుని దహన సంస్కారాలు చేసినట్లు సాయి పద్మ తెలిపారు.

హెచ్ఐవీ కేసుల నమోదు సంఖ్యను పక్కన పెడితే, దీని పట్ల ఉన్న సామాజిక రుగ్మతను తొలగించడంలో మాత్రం అప్పటికి ఇప్పటికీ పరిస్థితుల్లో మార్పులయితే వచ్చాయని చెప్పారామె.

2019 నాటికి దేశంలో 23.49 లక్షల మంది ప్రజలు హెచ్ఐవీ బారిన పడినట్లు నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ 2019 నివేదిక చెబుతోంది. 2010 నుంచి పోలిస్తే ఇది 37 శాతం తగ్గగా, 1997లో అత్యధిక స్థాయిలో కేసులు నమోదవుతున్న స్థాయి నుంచి 86 శాతం తగ్గాయి. ఈ తగ్గుదల అన్ని రాష్ట్రాలలోనూ కనిపించినట్లు నివేదిక చెబుతోంది.

ఈ నివేదిక ప్రకారం.. 2010 - 2017 మధ్యలో కొత్తగా చోటు చేసుకునే ఇన్ఫెక్షన్లు 27 శాతం తగ్గి ఎయిడ్స్ మరణాలు కూడా సగానికి పైగా తగ్గాయి.

2019 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 3.14 లక్షల పీఎల్‌హెచ్ఐవీ (హెచ్ఐవీ సోకిన వారితో కలిసి నివసిస్తున్న భాగస్వాములు) కేసులు నమోదు కాగా తెలంగాణలో 1.58 లక్షల కేసులు నమోదయ్యాయి.

గత 40 ఏళ్లలో ప్రపంచ వ్యాప్తంగా ఎయిడ్స్ సంబంధిత రోగాలతో 3.27 కోట్ల మంది ప్రజలు మరణించినట్లు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో ప్రచురితమైన వ్యాసం పేర్కొంటోంది.

ఎయిడ్స్

ఫొటో సోర్స్, Getty Images

2017లో హెచ్ఐవీ సోకిన మహిళల శాతం 0.19 ఉంటే పురుషుల్లో 0.25 శాతం ఉంది. స్వలింగ సంపర్కం కూడా దీనికి కొంత వరకు కారణమని సాయి పద్మ అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు 2018 సెప్టెంబరులో స్వలింగ సంపర్కాన్ని చట్ట బద్ధం చేసింది.

ముంబయి, హైదరాబాద్‌లలో లైంగిక వ్యాధుల చికిత్స కోసం సంప్రదించిన స్వలింగ సంపర్కులలో 70 శాతం మంది పురుష సెక్స్ వర్కర్లే ఉన్నట్లు సంగ్రామ్ అనే స్వచ్ఛంద సంస్థ చేసిన అధ్యయనం చెప్తోంది. ఈ అధ్యయనాన్ని 2015లో పన్నెండు నగరాలలో నిర్వహించారు.

‘‘స్వలింగ సంపర్కుల లైంగిక ప్రక్రియల వలన సాధారణ సెక్స్ వర్కర్లలో హెచ్ఐవీ సోకిన వారు 1.8 శాతం ఉంటే.. వీరికి 17 శాతం ఎక్కువగా ఉంటాయి" అని సెంటర్ ఫర్ అడ్వొకసి అండ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ స్టేట్ కోఆర్డినేటర్‌గా పని చేసిన సుధా చల్లా పేర్కొన్నారు.

సెక్స్ వర్కర్లు, ట్రాన్స్‌జండర్లు, స్వలింగ సంపర్కులు, ఇంజక్షన్ ద్వారా మాదక ద్రవ్యాలు సేకరించే వారు హెచ్ఐవీకి గురయ్యే ముప్పు ఎక్కువగా ఉంది.

ప్రస్తుతం హెచ్ఐవీ మహమ్మారి తిరగబెట్టే దశలో ఉందని, దీని ముప్పు పూర్తిగా పోయిందని చెప్పలేమని సుధ చెప్పారు. అయితే, ప్రజల్లో ఈ వ్యాధి పట్ల ఉన్న అపోహలు, వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షను పోగొట్టడంలో, అవగాహన కల్పించడంలో మాత్రం విజయవంతం అయ్యామంటారామె.

"2007లో పుట్టిన ప్రతీ బిడ్డ ఇన్ఫెక్షన్ రహితంగా పుట్టాలని 0/7 ప్రచారాలు నిర్వహించారు. రెడ్ రిబ్బన్ క్లబ్స్, ఆశా క్లబ్స్ ద్వారా ఎయిడ్స్ గురించి వివిధ ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో క్షేత్ర స్థాయిలో అనూహ్యంగా మార్పులు వచ్చాయి" అని ఆమె వివరించారు.

"ఇదంతా ఒక దశాబ్దం పాటు జరిగిన ప్రయాణం. 2000 - 2010 వరకు హెచ్ఐవీ దశాబ్దం అని చెప్పవచ్చు" అని అభివర్ణించారు.

హెచ్ఐవీ ఒక తరం నుంచి మరో తరానికి వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ, ఏ వైద్య కార్యక్రమాన్ని కొనసాగించాలన్నా నిధులు, నిరంతర పర్యవేక్షణ, అందుకు తగిన మానవ వనరులు చాలా అవసరమని సుధ చెప్పారు.

2000 దశకంలో ఎచ్ఐవి అవగాహనా కార్యక్రమాలు విరివిగా నిర్వహించారు.

ఫొటో సోర్స్, SAIPADMA

ఫొటో క్యాప్షన్, 2000 దశకంలో ఎచ్ఐవి అవగాహనా కార్యక్రమాలు విరివిగా నిర్వహించారు.

15 - 49 వయసు వారిలో ఎక్కువగా

భారతదేశంలో హెచ్ఐవీకి గురవుతున్న వారిలో 15 - 49 వయసు మధ్య వయసు వారు ఎక్కువ శాతం ఉన్నట్లు నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నివేదిక చెబుతోంది.

దీని ప్రభావం ఒక్క ఆరోగ్య రంగం పైనే కాకుండా, దేశ సామాజిక, ఆర్ధిక రంగాల పైన కూడా పడుతుందని సుధా చల్లా అంటారు.

హెచ్ఐవీ చికిత్స కోసం గతంలో ఉన్న కమ్యూనిటీ చికిత్సాలయాలు, ప్రత్యేక సంరక్షణా కేంద్రాలు తగ్గిపోవడానికి.. హెచ్ఐవీ కేసులు తగ్గటమే కారణం కాదంటారామె.

1997లో దేశంలో కేవలం 67 హెచ్ఐవీ టెస్టింగ్ అండ్ కౌన్సెలింగ్ కేంద్రాలు ఉండగా 2017 నాటికి 23,400 కేంద్రాలు ఈ సేవలు అందిస్తున్నాయి.

‘‘భారతదేశంలో లోక్‌పాల్ బిల్లు అమలులో లేనప్పుడు ఆరోగ్య కార్యక్రమాల కోసం అంతర్జాతీయ నిధులు బాగా వచ్చేవి. కానీ, ఈ బిల్లు అమలుతో అంతర్జాతీయ నిధుల రాకకు గండి పడింది’’ అని ఆమె పేర్కొన్నారు. అయితే ఇదొక్కటే కారణం అని పూర్తిగా చెప్పలేకపోయినప్పటికీ ప్రచార కార్యక్రమాల నిమిత్తం పనులు ఆగిపోవడానికి మాత్రం ఇదొక కారణమని చెప్పారు.

"భారతదేశంలో సెక్స్ ఒక రహస్య పని. రహస్యంగా జరిగే పనిలోనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కానీ, సెక్స్ గురించి ఆరోగ్యకరమైన రీతిలో చర్చించడం మొదలయితేనే హెచ్ఐవీ లాంటి వాటిని నియంత్రించగలం’’ అని సుధ చెప్పారు.

"అసలు వివాహానికి జాతకాలు చూడటం కన్నా రక్త పరీక్షలు చేయడం అవసరం" అన్నారామె.

"హెచ్ఐవీ పట్ల అవగాహన పెరిగింది కానీ, అంతం కాలేదు"
ఫొటో క్యాప్షన్, "హెచ్ఐవీ పట్ల అవగాహన పెరిగింది కానీ, అంతం కాలేదు"

ఎచ్ఐవి నిర్మూలనకు కృషి జరుగుతోందా?

2019లో హెచ్ఐవీ సెల్ఫ్ టెస్టింగ్ కిట్లు కూడా పైలట్ ప్రాజెక్టుగా అందుబాటులోకి తెచ్చారు. ఈ ప్రతిపాదనను భారత వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా పరిశీలిస్తోంది.

ప్రపంచ దేశాలు పరస్పర సహకారంతో పని చేస్తే ఎటువంటి మార్పులు వస్తాయో, హెచ్ఐవీ విషయంలో చేసి నిరూపించారని డెస్మండ్ టుటు హెచ్ఐవీ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ లిండా గైల్ బెకర్ రాసిన వ్యాసంలో పేర్కొన్నారు.

"కానీ, ఇది సీసాలో బంధించి పెట్టిన కోవిడ్-19 లాంటిది. దీని పట్ల అవగాహన పెరిగింది కానీ, పూర్తిగా అంతమవ్వలేదు" అని సాయి పద్మ అభివర్ణించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)