బ్లాక్ చెయిన్: బిట్‌కాయిన్, క్రిప్టోకరెన్సీలను నడిపించే ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది? - డిజిహబ్

బ్లాక్ చెయిన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, పూర్ణిమ తమ్మిరెడ్డి
    • హోదా, బీబీసీ కోసం

ప్రస్తుతం ఎటు చూసినా, ఎవరి నోట విన్నా, ఏ యాడ్ చూసినా ఒకటే మాట - క్రిప్టోకరెన్సీ. భవిష్యత్తు అంతా దానిదే.. ఆలస్యం చేయకుండా మదుపు చేయమంటూ వ్యాపార ప్రకటనలు కనిపిస్తున్నాయి.

మరోవైపు, దాని భవిష్యత్తే డోలాయమానం, తొందరపడి పెట్టుబడి పెట్టొద్దని వారెన్ బఫెట్‌లాంటి దిగ్గజాలు సూచిస్తున్నారు.

రోజుకో కొత్తరకం వర్చువల్ కాయిన్లు/టోకెన్లు పుట్టుకురావడం, పెట్టుబడి పెట్టిన డబ్బునంతా స్వాహా చేసే స్కాములతో మరింత గందరగోళంగా తయారైంది పరిస్థితి.

దానికి తోడు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం క్రిప్టోకరెన్సీ చట్టంలో ఏమేం తీసుకురాబోతుందో, వేటిని నిషేధిస్తుందో అని ఒకటే కుతూహలం.

ఈ నేపథ్యంలో క్రిప్టోకరెన్సీని సాధ్యమయ్యేలా చేసిన బ్లాక్‌ చెయిన్ టెక్నాలజీ కథ ఏంటో తెలుసుకుందాం.

వీడియో క్యాప్షన్, బిట్‌కాయిన్ అంటే ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది?

బ్లాక్ చెయిన్‌ అంటే ఏమిటి?

బ్లాక్ చెయిన్‌ ప్రధమ ఉద్దేశ్యం, డిజిటల్ సమాచారాన్ని డి-సెంట్రలైజ్డ్ (అంటే ఒకేచోట లేదా ఒకరి ఆధీనంలో ఉండకుండా) రికార్డ్ చేయడం.

ఒకసారి నమోదు చేసిన సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ మార్చే వీలు ఉండకూడదు.

దీనికోసం బ్లాక్ చెయిన్‌ కొన్ని లెడ్జర్స్ (ledgers) వాడుతుంది. ఒకసారి వాటిలోకి డేటా వెళ్ళాక ఇక మార్చడంగానీ, నాశనం చేయడంగానీ అసాధ్యం.

పైగా వాటి కాపీలు నెట్‌వర్క్‌లోని అనేక మెషీన్లలో ఉంటాయి కాబట్టి ఒకటో రెండో మెషీన్లు పాడైనా, మొరాయించినా డేటాకి వచ్చే ఢోకా ఉండదు. అందుకే బ్లాక్ చెయిన్‌ను డిస్ట్రిబ్యుటెడ్ లెడ్జర్ టెక్నాలజీ (DLT) అని అంటారు.

దీన్ని మొదట 1991లో ప్రతిపాదించారు. దీన్ని వాడుకుంటూ 2009లో బిట్‌ కాయిన్ (ఒకరకం క్రిప్టోకరెన్సీ) సృష్టించాకే దీనికి పేరు వచ్చింది.

బ్లాక్ చెయిన్

ఫొటో సోర్స్, Purnimat

బ్లాక్ చెయిన్‌ ఎలా పని చేస్తుంది?

బ్లాక్ చెయిన్‌ పని చేసే విధానాన్ని తెలుసుకోవడానికి ముందుగా ఒక యూజర్ ఒక ట్రాన్సాక్షన్ (లావాదేవీ)ని మొదలుపెట్టినప్పుడు ఏం జరుగుతుందో పరిశీలిద్దాం.

సులువుగా అర్థం అవ్వటానికి ఇక్కడ ఒక వ్యక్తి తాను సృష్టించిన మ్యూజిక్ ఆల్బమ్‌ను ఇంకొకరికి అమ్మడానికి ప్రయత్నించినప్పుడు నెట్‌వర్క్‌లో ఏమవుతుందో చూద్దాం.

1.అమూల్య దగ్గర మ్యూజిక్ ఉంది. భాస్కర్ దగ్గర డబ్బులున్నాయి. ఇవి ఇప్పుడు చేతులు మారాలి. అమ్మే ఉద్దేశ్యం, కొనే ఆసక్తి వారిద్దరికీ ఉంది కాబట్టి లావాదేవీ మొదలవుతుంది.

2.ఈ లావాదేవీని ఆన్‌లైన్‌లో 'బ్లాక్‌' అని పిలుస్తారు. బ్లాక్‌లో ఎక్కడ నుంచి మొదలైంది, ఇంతకు ముందు హాష్ ఏమిటి, ఇప్పుడు హాష్ ఎంత వగైరా వివరాలు ఉంటాయి.

3.ఇప్పుడు నెట్‌వర్క్‌లో ఉన్న అన్ని నోడ్స్ (బ్లాక్ చెయిన్ వెరిఫికేషన్ చేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేసిన కంప్యూటర్ల)కి ఈ బ్లాక్‌ను పంపిస్తారు.

4.ఈ బ్లాక్‌లో ఇచ్చిన వివరాలను పరిశీలించి, నిర్దారించడానికి కొన్ని అల్గోరిథములు వాడుకుని, వచ్చిన బ్లాక్‌ను ఆమోదించాలా లేదా అన్నది ప్రతీ నోడ్ నిర్ణయించుకుంటుంది.

ఉదా: భాస్కర్ దగ్గర కావాల్సినంత బాలెన్స్ ఉందా, అమూల్యకి ఆ మ్యూజి‌క్‌ను అమ్మే హక్కు ఉందా లాంటి వాటి ఆధారంగా నిర్ణయానికి వస్తాయి.

5.ఒకసారి ఆమోదం ఇచ్చాక, ఆ బ్లాక్ ఇంతకు ముందున్న బ్లాక్ చెయిన్‌లో కలిపేస్తారు. ఒక్కసారి ఇలా కలిపాక మరల మార్చడం గానీ, తీసివేయడం గానీ జరగని పని.

6. బ్లాక్ చెయిన్‌లో ఈ లావాదేవీ రికార్డ్ అయిపోయాక, అమ్యూల్యకి డబ్బులు వెళ్తాయి, భాస్కర్‌కు మ్యూజిక్ ఫైల్ అందుతుంది.

బ్లాక్ చెయిన్

ఫొటో సోర్స్, Purnimat

ఇప్పుడు, మొదట అసలా నెట్‌వర్క్ ఎలా ఏర్పడుతుందో చూద్దాం. (పై ఫొటో చూడండి.)

1.ఒక నోడ్‌తోనే వ్యవహారమంతా మొదలవుతుంది. లావాదేవీలని నమోదు చేయడానికి, వెరిఫై చేయడానికి డిజిటల్ లెడ్జర్ ఉంటుంది.

2.మరో నోడ్ కూడా దీనితో పాటు చేరినప్పుడు లెడ్జర్ కాపీ కొత్త నోడ్‌కి కూడా పంపిస్తుంది.

3.అలా అలా ఇంకొన్ని నోడ్స్ చేరాక అన్నీ కలిసి ఒక నెట్‌వర్క్‌గా ఏర్పడతాయి.

4.యూజర్లు ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు ఆ బ్లాక్ సమాచారం అన్ని నోడ్స్‌కి చేరుకుంటుంది.

5.వచ్చిన బ్లాక్‌ను ఆమోదించాలా, తిరస్కరించాలా అన్న నిర్ణయానికి రావడానికి నోడ్స్ ప్రూఫ్-ఆఫ్-వర్క్ లాంటి అల్గారిథములు సహాయపడతాయి. అన్ని నోడ్స్ కలిసి ఒక లీడర్ని ఎన్నుకుంటారు. ఆ లీడర్ నోడ్‌కి బ్లాక్ చెయిన్‌ను మార్చే అధికారం వస్తుంది.

6.అన్ని నోడ్స్ ఆమోదించిన విధంగా, ఎన్నుకోబడ్డ లీడర్ నోడ్ బ్లాక్ చెయిన్‌కి "అమూల్య దగ్గర భాస్కర్ మ్యూజిక్ కొన్నాడు" అన్న కొత్త బ్లాక్‌ను జత చేస్తుంది.

ప్రోగ్రామింగ్ వచ్చి, కొంచెం ఎక్కువ కెపాసిటీ ఉన్న కంప్యూటర్లు ఉంటే ఎవరన్నా బ్లాక్ చెయిన్‌ ఆధారంగా కొత్త సర్విస్‌ను మొదలుపెట్టవచ్చు.

ప్రస్తుతం వందల సంఖ్యలో క్రిప్టోకరెన్సీలు ఉండడానికి కారణమిదే. ఎవరన్నా ఇలా ఒక నెట్‌వర్క్ మొదలెట్టవచ్చు. ఎన్ని లావాదేవీలైనా చేయవచ్చు. ఎవరికీ చెప్పా పెట్టకుండా నెట్‌వర్క్ నుంచి వైదొలగవచ్చు.

బిట్ కాయిన్

ఫొటో సోర్స్, Getty Images

ఒక నోడ్ క్రియేట్ చేయడానికి కంప్యూటర్‌లో ఇవి తప్పనిసరి

1.విండోస్/మాక్/ లినక్స్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నా పని చేస్తుంది.

2.కనీసం 500GB హార్డ్‌డిస్క్ స్పేస్ ఉండి, 100 MB/s రీడ్ స్పీడ్ ఉండాలి.

3.కనీసం 8GB RAM ఉండాలి.

4.SSD కూడా కనీసం 68MBps random write, 30.9 MBps random read ఉండాలి.

5.ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఎక్కువ స్పీడ్, అప్‌లోడ్ లిమిట్స్ లేకుండా ఉంటే మంచిది.

కోడ్

ఫొటో సోర్స్, Getty Images

బ్లాక్ చెయిన్‌ ఏయే రంగాలను కొత్త దారుల్లోకి తీసుకువెళ్ళగలదు?

ప్రస్తుతం క్రిప్టోకరెన్సీ చుట్టూనే అన్ని చర్చలూ నడుస్తున్నాయి కానీ, బ్లాక్ చెయిన్‌తో మరిన్ని అద్భుతాలు చేయవచ్చు.

బ్యాంకింగ్, ఫైనాన్స్: బాంకులకి కొన్ని పనివేళలు ఉంటాయి. సెలవులు ఉంటాయి. అలాంటి వేళల్లో బ్యాంకుకు వెళ్లి పనులు చేసుకోలేము.

అలాగే, కొన్ని పరిమితులు ఉంటాయి. రోజుకి ఎంత డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు, టాక్స్ కడుతున్నారా లాంటివి. బ్యాంకులు కూడా బ్లాక్ చెయిన్‌ టెక్నాలజీ వాడి ఈ అడ్డంకులను అధిగమించచ్చు.

రోజులు, వారాలు పట్టే లావాదేవీలను కొన్ని నిముషాల నుంచి కొన్ని గంటల్లో పూర్తి చేయవచ్చు.

కరెన్సీ: పైన చెప్పుకున్నట్టు, క్రిప్టోకరెన్సీకి పునాదే బ్లాక్ చెయిన్‌. ఒక సెంట్రల్ బ్యాంక్ అజమాయిషీ అక్కర్లేకుండా డబ్బుని జాగ్రత్తగా ఒకరి నుంచి ఒకరిని పంపించగలిగితే అనేక లాభాలు ఉంటాయి.

ముఖ్యంగా, బ్యాంక్ అకౌంట్ కూడా లేని ప్రజలకి లేదా ఒక దేశ పౌరులుగా గుర్తింపు లేని/ఇంకా రాని వారికి, లేదా యుద్ధాలు, రాజకీయ అనిశ్చితి (లేక మరే కారణాల వల్లనైనా) సరైన ఆర్థిక వ్యవస్థను అందించలేని ప్రభుత్వాలకి కూడా క్రిప్టోకరెన్సీ వరంగా మారవచ్చు.

సప్లై చెయిన్: అమ్మకానికి పెట్టిన వస్తువు, ఉత్పత్తి నుంచి అమ్మకానికి స్టోర్లో పెట్టేవరకూ అనేక చోట్ల డామేజ్‌కి గురి కావచ్చు. అలా పాడైన వస్తువులు ఏ దశలో పాడవుతున్నాయో, ఏ కారణంతో పాడవుతున్నాయో తెలుసుకోవడం చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని.

అదే ఆ వస్తువు చరిత్రని (ఏ రూపంలో ఉంది, ఎంత బరువు, టెంపరేచర్, ఎంత దూరం ప్రయాణించింది, ఎవరు దాని మీద పనిచేశారు వగైరా వివరాలు) మొదటి దశ నుంచి బ్లాక్ చెయిన్‌‌లో రికార్డ్ చేస్తే, ఆ తర్వాత ఎక్కడన్నా తేడా వచ్చినప్పుడు పట్టుకోవడం తేలికవుతుంది. అలానే కస్టమర్లకి కొన్నిసార్లు కొనేవాటి మీద అపనమ్మకం ఉంటుంది.

ఉదాహరణకి బ్లాక్ చెయిన్‌ వాడి "ఫుడ్ ట్రస్ట్ ట్రేసబిలిటీ" ప్రవేశపెట్టింది ఐబీఎమ్. దీని ద్వారా ఆహారం ఎక్కడ నుంచి వస్తుంది, "ఆర్గానిక్", "లోకల్", "ఫేర్ ట్రేడ్" లేబుల్స్‌కి అనుగుణంగానే లభించిందా లేదా అన్నది తెలుసుకోగలుగుతున్నారు. దీని వల్ల వ్యాపారస్తుల మధ్య, వ్యాపారి-వినియోగదారుల మధ్య నమ్మకం పెరుగుతుంది.

వీడియో క్యాప్షన్, క్రిప్టో కరెన్సీ ఎలా పనిచేస్తుంది? నగదు, క్రిప్టో కరెన్సీ చెల్లింపులకు మధ్య తేడా ఏంటి?

హెల్త్ కేర్: ప్రస్తుతం మన మెడికల్ రికార్డులన్నీ మనం ఏ డయగ్నాస్టిక్ సెంటర్ దగ్గర పరీక్షలు చేయించుకుంటున్నామో, ఏ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నామో వారి డేటాబేస్‌లో ఉంటాయి. ఒకవేళ హ్యాకర్లు ఆ డేటాబేస్‌లోకి జొరబడగలిగితే, మన రికార్డులన్నీ వారి హస్తగతమవుతాయి. ఆర్థిక లావాదేవీలు ఎంత ముఖ్యమో, ఆరోగ్యానికి సంబంధించిన డేటా అంతే ముఖ్యం కాబట్టి మన వివరాలని బ్లాక్ చెయిన్‌లో భద్రపరిస్తే గోప్యత ఉంటుంది.

ఓటింగ్: ప్రస్తుతం ఈ-ఓటింగ్ టెక్నాలజీ వచ్చినా కూడా ప్రతి ఎన్నికల ముందు టాంపరింగ్ ఆరోపణలు వినిపిస్తూనే ఉంటున్నాయి. అదే బ్లాక్‌ చెయిన్‌ వాడితే ఆ బెడద ఉండదు.

స్మార్ట్ కాంట్రాక్ట్స్: ఏదైనా లావాదేవీ జరిగినప్పుడు బ్లాక్‌ చెయిన్‌లో ఒక కొత్త బ్లాక్ చేరి, దాన్ని నెట్‌వర్క్ ఆమోదించాక బ్లాక్‌ చెయిన్‌లో భాగమవుతుందని పైన చెప్పుకున్నాం.

అయితే, కొన్నిసార్లు, ఈ కొత్త లావాదేవీ మనుషులు మొదలుపెట్టేంత వరకూ ఆగడం వల్ల ఆలస్యమవుతుంది.

ఉదాహరణకి: కారుకు డామేజ్ అయితే, మన ప్రూఫ్స్, డాక్యుమెంట్స్ అన్నీ మొదట ఇన్సూరెన్స్ కంపెనీకి పంపాలి. ఫ్రాడ్ క్లైయిమ్ కాదని నమ్మించేట్టు ఉండాలి. బ్లాక్‌ చెయిన్‌ వాడినా కూడా ఈ డాక్యుమెంట్స్ అన్నీ పంపే పని వ్యక్తులదే.

అలా కాకుండా, ఒక వాహనానికి క్లెయిమ్ అవసరం ఉందని, ఆక్సిడెంట్ జరిగిన వివరాలు, వాహన వివరాలు అన్నీ ఆటోమేటిగ్గా ఇన్సూరెన్స్ కంపెనీకి పంపించగలిగితే చాలా సమయం ఆదా అవుతుంది.

అలా ఆటోమేటిగ్గా పనులు అవ్వాలంటే, బ్లాక్‌ చెయిన్‌ పైన ఇంకొంత కోడ్ రాయాల్సి ఉంటుంది. దాన్నే స్మార్ట్ కాంట్రాక్ట్ అని అంటారు. ఏ పార్టీల మధ్య (వాహన ఓనర్-ఇన్యూరెన్స్ కంపెనీ), ఎప్పుడు (ఆక్సిడెంట్ జరిగి వాహనం పాడైనప్పుడు), ఏ కండీషన్ మీద (క్లెయిమ్ ఫైల్ చేయడానికి తగినంత డ్యామేజ్ జరిగితే) లాంటి వివరాల బట్టి ఈ స్మార్ట్ కాంట్రాక్ట్ ఆటోమెటిగ్గా ట్రిగ్గర్ అవుతుంది.

మైక్రో పేమెంట్స్: ఇప్పుడు ఆన్‌లైన్లో పత్రికలు చదవడానికి డబ్బులు కడుతుంటాం. అయితే చదివినా చదవకపోయినా సబ్‌స్క్రిష్షన్ ఆక్టివ్ ఉన్నంత వరకు మనం డబ్బులు కట్టాల్సిందే. అలాకాకుండా మనం ఏ ఆర్టికల్స్ చదువుతున్నామో ఆ ఆర్టికల్సుకే డబ్బు కట్టేలా చేయచ్చు బ్లాక్ చెయిన్ వాడి.

ప్రస్తుత ఆన్‌లైన్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా వెళ్తాయి కాబట్టి వాటికి చార్జీలు కూడా ఎక్కువ ఉంటాయి. బ్లాక్‌ చెయిన్‌లో ఆ ఖర్చు తక్కువ కాబట్టి మైక్రో పేమెంట్స్ సాధ్యమవుతాయి.

వీడియో క్యాప్షన్, క్రిప్టోకరెన్సీలో 70 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్న టీచర్

బ్లాక్‌ చెయిన్‌ వినియోగంలో ఇబ్బందులేంటి?

ఈ టెక్నాలజీని అర్థం చేసుకోవడం, చేయించడం కొంచెం కష్టమే. దానితో ప్రభుత్వాలు, సంస్థలు, ప్రజలు దీనిలోని వెసులుబాటులను గుర్తించలేకపోవచ్చు. మనకు ఇప్పటి వరకు తెలిసిన లావాదేవీల వ్యవహారం కన్నా ఇది చాలా భిన్నంగా పనిజేస్తుంది.

ఉదా: ఎప్పుడూ చూడని, తాకని, ఎవరూ నియత్రించని డబ్బు ఒకటి ఉంటుందంటే అదేదో మాయలా అనిపిస్తుంది. పైగా, క్రిప్టోకరెన్సీ లాంటివి పెరిగితే ఆర్థిక వ్యవస్థ, స్మార్ట్ కాంట్రాక్ట్స్ లాంటివి పెరిగితే వ్యాపారాల స్వభావాలు, స్వరూపాలూ మారిపోతాయి.

అంతటి పెనుమార్పుకి సిద్ధంలేక కొందరు వీటిని దూరం పెట్టచ్చు. నియంత్రణ అవసరంలేని ఈ టెక్నాలజీని నియత్రించాల్సిన అవసరం కలగవచ్చు.

సమస్య ఎప్పుడూ టెక్నాలజీలో ఉండదు, ఉన్నా అది టెక్ నిపుణులు చూసుకుంటారు. టెక్నాలజీని వాడే విధానంలో మాత్రం ప్రభుత్వాలు, మేధావులు, ప్రజలు అందరూ అవగాహనతో కూడిన నిర్ణయాలు తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)