ఆల్బాట్రాస్ పక్షుల లైంగిక సామర్థ్యం తగ్గిపోతోంది, భాగస్వాముల్ని మోసం చేస్తున్నాయి... ఎందుకిలా?

ఆల్బాట్రాస్ పక్షులు

ఫొటో సోర్స్, Francesco Ventura

ఫొటో క్యాప్షన్, ఆల్బాట్రాస్ పక్షులు
    • రచయిత, మనీష్ పాండే
    • హోదా, బీబీసీ న్యూస్ బీట్ ప్రతినిధి

ఇద్దరు భాగస్వాముల మధ్య ఆకర్షణ తగ్గినా లేదా ఒకరి కోసం ఒకరు సమయం కేటాయించలేకపోయినా వారి సంబంధాలు విడాకులకు దారి తీస్తూ ఉంటాయి.

కానీ, వాతావరణ మార్పులు కూడా జంటలు విడిపోయేందుకు కారణమవుతాయా?

"అయ్యే అవకాశముంది" అని ఇటీవల ఆల్బాట్రాస్ పక్షులపై నిర్వహించిన అధ్యయనాలు చెబుతున్నాయి.

భాగస్వామ్యం విషయంలో ప్రపంచంలోనే అత్యంత విశ్వసించదగినవని ఆల్బాట్రాస్ పక్షులను అంటారు.

కానీ, ఇటీవల కాలంలో ఆల్బాట్రాస్ పక్షి జంటలు కూడా విడిపోతున్నాయి.

వీడియో క్యాప్షన్, పక్షిలా ఎగరగలిగితే ఎలా ఉంటుందో తెలుసా?

వీటిపై నిర్వహించిన అధ్యయనం రాయల్ సొసైటీ జర్నల్‌లో ప్రచురితమైంది. ఈ అధ్యయనంలో భాగంగా ఫాక్ ఐలాండ్స్‌లో 15 ఏళ్లకు పైగా జంటలుగా ఉన్న 15,500 పక్షులపై పరిశోధన చేశారు.

మనుషుల భాషలో చెప్పాలంటే, అవి భాగస్వాములను మోసం చేస్తున్నాయి. ఈ పక్షులు తమ జంట పక్షితో కాకుండా ఇతర పక్షులతో సంబంధాలు పెట్టుకుంటున్నాయట.

మనుషుల మాదిరిగానే ఆల్బాట్రాస్‌ల జీవితంలో కూడా వివిధ పరిణామ దశలుంటాయి. అవి కూడా నేర్చుకుంటూ, కొన్నిసార్లు ఓడిపోతూ, కొన్ని సార్లు సంబంధం ఏర్పర్చుకునేందుకు ఉత్తమమైన మార్గాలను ఎంచుకుంటూ ఉంటాయి.

కానీ, ఒక్కసారి వాటికి తగిన భాగస్వామి దొరికిన తర్వాత జీవితాంతం ఆ పక్షికే కట్టుబడి ఉంటాయి.

వీటి జనాభాలో కేవలం 1 శాతం మాత్రమే భాగస్వామిని ఎన్నుకున్న తర్వాత కూడా విడిపోతూ ఉంటాయి. ఇది యూకేలో నమోదైన సాధారణ విడాకుల శాతం కంటే చాలా తక్కువ.

"ఒకే భాగస్వామితో దీర్ఘ కాలిక బంధాలు కొనసాగించడం ఈ పక్షుల్లో చాలా సాధారణం" అని అధ్యయన సహ రచయిత, లిస్బన్ యూనివర్సిటీ పరిశోధకులు ఫ్రాన్‌సెస్కో వెంచురా చెప్పారు.

కానీ, ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉండటంతో, ఆల్బాట్రాస్ జనాభాలో 8 శాతం జంటలు విడిపోతున్నట్లు ఈ అధ్యయనం గమనించింది.

ఆల్బాట్రాస్ పక్షులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆల్బాట్రాస్ పక్షులు

పర్యావరణ మార్పులే ఇందుకు కారణమా?

వాతావరణ మార్పుల వల్ల విడిపోతున్న ఈ జంటల గురించి ఎవరూ దృష్టి పెట్టరని అధ్యయనం చెబుతోంది.

సాధారణంగా, ఆల్బాట్రాస్ జంటలకు పిల్లలు కలగనప్పుడు అవి విడిపోతాయని చెబుతారు. దాంతో, అవి తర్వాత సీజన్‌లో కొత్త భాగస్వాములను వెతుక్కుంటాయి.

కానీ, సంతానోత్పత్తి చేస్తున్న పక్షి జంటలు కూడా విడిపోతున్నట్లు ఈ అధ్యయనం గమనించింది.

వీడియో క్యాప్షన్, విమానం.. పక్షి.. మధ్యలో చార్లెస్ డార్విన్

దీనికి రెండు సిద్ధాంతాలు ఉండి ఉండవచ్చని ఫ్రాన్ సెస్కో చెబుతున్నారు. ఒకదాంతో ఒకటి దూరంగా ఉంటూ సంబంధాన్ని కొనసాగించలేకపోవడం.

నీరు వేడెక్కుతూ ఉండటంతో వేట కోసం దూర ప్రాంతాలకు ఎగిరి వెళ్లడం ఒక కారణం కావచ్చని అంటున్నారు.

దూర ప్రాంతాలకు వెళ్లిన పక్షులు బ్రీడింగ్ సీజన్ మొదలయ్యే సమయానికి తిరిగి రాలేకపోతే వాటి భాగస్వాములు మరో కొత్త భాగస్వాములను వెతుక్కుంటున్నాయి.

కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో ఆల్బాట్రాస్ పక్షుల్లో ఒత్తిడి కలిగించే హార్మోన్లు పెరగడాన్ని మరొక కారణంగా చెబుతున్నారు. నీరు వేడెక్కినప్పుడు వాటిలో ఒత్తిడి పెరుగుతుంది.

"బ్రీడింగ్ కు అనుకూలంగా లేని పరిస్థితులు, ఆహార కొరత, వాటిని మరింత ఒత్తిడికి గురి చేస్తాయి. వాటి లైంగిక సామర్థ్యం లోపించినప్పుడు భాగస్వామిపై నింద పడుతుంది. ఇది చివరకు ఆ జంటలు విడిపోయేందుకు దారి తీస్తుంది" అని ఫ్రాన్‌సెస్కో చెప్పారు.

ఒకే భాగస్వామితో జీవితాంతం ఉండే పక్షుల్లో ఆల్బాట్రాస్ పక్షులు విశ్వసనీయమైనవి అని చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా వీటి జనాభాలో తలెత్తిన సమస్యల వల్ల వీటి పై పరిశోధన నిర్వహించారు.

వీటి జనాభా 1980లో ఉన్న జనాభాలో సగం కంటే కాస్త ఎక్కువగా ఉన్నట్లు 2017లో సేకరించిన డేటా తెలియచేస్తోంది.

ఆల్బాట్రాస్ పక్షులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆల్బాట్రాస్ పక్షులు

అయితే, ఫాక్ ఐలాండ్స్‌లో మాత్రం ఈ విషయం తక్షణమే ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదని ఫ్రాన్ సెస్కో చెప్పారు.

కానీ, ఆల్బాట్రాస్ జనాభా బాగా తగ్గుముఖం పడుతున్న ప్రాంతాల్లో మాత్రం ఇది ఆందోళన చెందాల్సిన విషయం అని అన్నారు.

"ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అవి మరింత పెరిగే అవకాశం ఉంది. దాంతో, వీటి మనుగడకు మరిన్ని ఆటంకాలు కలగవచ్చు" అని అన్నారు.

వీడియో క్యాప్షన్, సముద్రపు దొంగల్ని పట్టుకునే విమానం లాంటి పక్షి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)