'ఇ-రూపీ' అంటే ఏమిటి, ఎలా పని చేస్తుంది? ఎవరికి లాభం?

ఫొటో సోర్స్, AYUSHMANNHA/TWITTER
- రచయిత, జుబైర్ అహ్మద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నాడు 'ఇ-రూపీ'ని ప్రారంభించారు.
డిజిటల్ చెల్లింపుల ప్రస్థానంలో ఇదొక ముఖ్యమైన మలుపు అని విశ్లేషకులు అంటున్నారు.
ఈ సేవల్లో, డబ్బు చెల్లింపుదారులు, గ్రహీతల మధ్య "ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్టెడ్" ఉంటుందని అంటున్నారు. అంటే, మూడవ పార్టీ జోక్యం ఉండదు.
దీన్ని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) అభివృద్ధి చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఎన్‌పీసీఐ అనేది భారతదేశంలో రిటైల్ చెల్లింపులు, సెటిల్మెంట్ వ్యవస్థలను నిర్వహించే ఒక సంస్థ. ఇది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజమాన్యం కింద పనిచేస్తుంది.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
ఇ-రూపీ అంటే ఏమిటి?
డిజిటల్ చెల్లింపుల కోసం క్యాష్‌లెస్, కాంటాక్ట్‌లెస్ ప్లాట్‌ఫారమే ఇ-రూపీ అని ఎన్‌పీసీఐ వివరించింది.
ఇది QR కోడ్ లేదా SMS ఆధారంగా ఓ ఈ-వోచర్‌లా పనిచేస్తుంది.
కార్డు, డిజిటల్ చెల్లింపుల యాప్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఏవీ లేకుండానే ఇ-రూపీ వోచర్‌ను యూజర్లు రిడీమ్ చేసుకోవచ్చు.
బ్యాంకు ఖాతా, గూగుల్, ఫోన్ పే, ఇంటర్నెట్ బ్యాంకింగ్, స్మార్ట్ ఫోన్ లేకున్నా ఇ-రూపీ వోచర్లను వాడుకోవచ్చు.
అయితే, గూగుల్ పే, ఫోన్ పే, యూపీఐ, పేటీఎం, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి చెల్లింపు విధానాల మాదిరిగా ఇ-రూపీ అనేది పేమెంట్ ప్లాట్ ఫాం కాదు. ఇది కొన్ని ప్రత్యేక సేవలకు ఉద్దేశించిన ఒక ఇ-వోచర్ మాత్రమే.
లబ్ధిదారుల వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచడం వలన 'ఇ-రూపీ' ఎంతో సురక్షితంగా, సులభంగా ఉంటుందని భావిస్తున్నారు.
అవసరమైన డబ్బు మొత్తం ముందే వోచర్‌లో నిక్షిప్తమై ఉంటుంది కాబట్టి ఇ-రూపీ ద్వారా జరిగే లావాదేవీలు వేగంగా, విశ్వసనీయంగా ఉంటాయని అంటున్నారు.

ఫొటో సోర్స్, AFP
దీని వల్ల కలిగే లాభాలేంటి?
ప్రభుత్వం వివిధ పథకాల కింద పేదలకు, రైతులకు నగదును నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేస్తోంది. కరోనా సమయంలో కూడా ఇదే జరిగింది.
అయితే, ఇలాంటి నగదు బదిలీ వ్యవహారాల్లో ప్రభుత్వ ఉద్యోగుల జోక్యం చాలా ఉంటుంది. దీనివల్ల కొన్నిసార్లు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి.
ఇ-రూపీ వ్యవస్థ ఇలాంటి సమస్యలకు స్వస్తి పలుకుతుందని, "ఎలాంటి ఇబ్బందీ లేకుండా లబ్ధిదారుడికి ప్రయోజనాలు చేకూరేలా చేస్తుందని" ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
దీన్ని ప్రభుత్వ ప్రత్యేక నగదు సహాయంగా చూడవచ్చు. ప్రయివేటు సంస్థలు కూడా తమ ఉద్యోగుల కోసం దీన్ని ఉపయోగించవచ్చు.
ఉదాహరణకు, ఏదైనా ఓ కంపెనీ, ఒక నెలలో తన ఉద్యోగులకు జీతాలతో పాటు అదనంగా రూ.500 ఇవ్వాలని నిర్ణయించుకుంటే ఇ-రూపీ వోచర్లు ఇవ్వొచ్చు. ఉద్యోగుల మొబైల్ ఫోన్‌కు కోడ్ లేదా మెసేజ్ ద్వారా ఈ వోచర్ వచ్చేస్తుంది.
ఇచ్చిన ఇ-రూపీ వోచర్లను వినియోగించారా, లేదా అనేది కూడా ట్రాక్ చేయవచ్చు.
డిజిటల్ వాలెట్, డిజిటల్ చెల్లింపు వ్యవస్థలకు మొదటి నుంచీ ప్రధాని మోదీ భారీ స్థాయిలో మద్దతు ఇస్తూ వస్తున్నారు.
ఆ దిశలో ఇ-రూపీ వ్యవస్థ మరిన్ని ప్రయోజనాలను అందించగలదని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, REUTERS
నగదు రహిత సమాజం
2016లో డీమోనిటైజేషన్ అమలు చేయడం ద్వారా అక్రమ నగదుకు స్వస్తి పలికి, భారతదేశాన్ని నగదు రహిత సమాజంగా తీర్చిదిద్దుతామని ప్రధాని పేర్కొన్నారు.
అయితే, తరువాత దాన్ని కొంచెం మార్చి, తక్కువ నగదు అమలులో ఉండే వ్యవస్థగా తీర్చిదిద్దుతామని అన్నారు. నిరంతరం డిజిటల్ వాలెట్‌ను ప్రోత్సహిస్తూ వచ్చారు.
కాగా, 2020లో ఇండియాలో 89 శాతం లావాదేవీలు నగదు రూపంలో జరిగాయని డెలాయిట్ ఇటీవల ఓ నివేదికలో తెలిపింది. అదే సంవత్సరం చైనాలో 44 శాతం లావాదేవీలు నగదు రూపంలో జరిగాయి.
ఈ నివేదిక బట్టీ మోదీ కలలు కంటున్న డిజిటల్ పుష్ అనుకున్నంత విజయవంతం కాలేదని తెలుస్తోంది.
ఇప్పుడు ప్రవేశపెట్టిన, ఇ-రూపీ ఆ దిశగా ఒక సానుకూల పరిణామం అని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
దేశంలో చౌక ధరలో లభించే స్మార్ట్ ఫోన్ల వాడకం పెరిగేకొద్దీ డిజిటల్ వాలెట్ల వాడకం పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
ప్రస్తుతం గూగుల్‌పే, పేటీఎం, ఫోన్‌పే, అమెజాన్ పే, ఎయిర్‌టెల్ మనీ లాంటి డిజిటల్ వాలెట్ల వాడకం సాధారణమైపోయింది.
కరోనా కారణంగా వీటిని మరింత విరివిగా వాడుతున్నారు. డిజిటల్ వాలెట్ ద్వారా కాంటాక్ట్‌లెస్‌గా ఉండగలగడం ఒక సౌలభ్యం.
డిజిటల్ కరెన్సీ వాడుక ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది
ఇ-రూపీని డిజిటల్ రూపంలో ఉన్న రూపాయిగా పరిగణించే ప్రయత్నం ఇది. దీన్ని ప్రస్తుతం ‘లక్ష్మి’ అని పిలుస్తున్నారు.
చైనా కూడా ఇదే దిశలో ఓ అడుగు ముందుకు వేసింది. పలు నగరాల్లో యువాన్‌ను డిజిటల్ రూపంలో ప్రవేశపెట్టింది.
2022 బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ ఆరంభమయే సమయానికి 'ఈ-ఆర్‌ఎమ్‌బీ' అనే డిజిటల్ యువాన్ కరెన్సీని దేశవ్యాప్తంగా విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
2022లో చైనా వెళ్లేవారు ఈ-ఆర్‌ఎమ్‌బీ కరెన్సీలోనే అమ్మకాలు, కొనుగోళ్లు చేయాల్సి రావొచ్చు.
బిట్‌కాయిన్ ప్రస్తుతం ప్రైవేట్ రంగంలో చలామణి అవుతున్న అతిపెద్ద క్రిప్టోకరెన్సీ.
అయితే, ఆర్బీఐ ‘లక్ష్మి’కి, బిట్‌కాయిన్ లాంటి క్రిప్టోకరెన్సీలకు మధ్య ఉన్న అతి పెద్ద వ్యత్యాసం ఏమిటంటే, లక్ష్మి ప్రభుత్వ నియంత్రణలో ఉంటుంది, బిట్‌కాయిన్ లాంటి క్రిప్టోకరెన్సీలు ప్రభుత్వ నియంత్రణలో ఉండవు.
ఇవి కూడా చదవండి:
- లిబ్రా కరెన్సీ: ఫేస్‌బుక్, వాట్సాప్‌లో డబ్బు దాచుకోవచ్చు, చెల్లింపులు చేయొచ్చు
- రూపాయి చరిత్ర : కరెన్సీ నోట్ల మీదకు గాంధీ బొమ్మ ఎప్పుడు వచ్చింది...
- ఒకప్పటి భారతదేశానికి నేటి ఇండియాకు తేడా ఇదే
- బిట్‌కాయిన్: క్రిప్టో కరెన్సీల భవితవ్యాన్ని భారత్ ఎప్పుడు నిర్ణయిస్తుంది
- ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని ఉత్పత్తి చేసే కంపెనీ ఇదే
- లబ్‌డబ్బు: గృహరుణం తీసుకోవాలనుకుంటున్నారా? అయితే తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివి
- పాకిస్తాన్‌కు ఉన్నట్లుండి విదేశాల నుంచి వచ్చే ఆదాయం ఎలా పెరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









