చైనా: షెంజెన్ నగరంలో ఎందుకలా కోట్లకొద్దీ డబ్బు పంచుతున్నారు

ఫొటో సోర్స్, Getty Images
చైనాలోని షెంజెన్ నగరంలో డిజిటల్ కరెన్సీకి సంబంధించి కీలకమైన ప్రయోగాలు జరుగుతున్నాయి.
నగరంలోని 50,000 మందికి కోటి యువాన్‌ల( సుమారు రూ.11 కోట్లు) విలువైన డిజిటల్ కరెన్సీని చైనా సెంట్రల్ బ్యాంక్ లాటరీ పద్దతిలో పంచిపెట్టింది.
డిజిటల్ కరెన్సీ ఎలక్ట్రానిక్ పేమెంట్ (DCEP) విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్న చైనా ప్రభుత్వం వరుసగా చేపడుతున్న ప్రయోగాలలో భాగంగా ఇలా డబ్బును పంచి పెడుతోంది.
ఒక్కొక్కరికి 200 యువాన్‌ల విలువైన డిజిటల్ కరెన్సీని అందించింది.
ఈ కరెన్సీని డౌన్‌లోడ్ చేసుకుని దేశంలోని 3 వేలకు పైగా స్టోర్లలో వాడుకోవచ్చు.
ఈ ప్రయోగానికి సంబంధించిన లాటరీలో పాల్గొనడానికి సుమారు 20 లక్షల మంది ప్రయత్నించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ డిజిటల్ పేమెంట్ విధానాన్ని గత ఏడాదే ప్రవేశపెట్టాలనుకున్నామని, ఇంకా దీనికి తుది రూపు రాలేదని ది పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా (PBOC) వెల్లడించింది.
ఈ ఏడాది ఏప్రిల్‌లో నాలుగు నగరాలలో ఈ డిజిటల్ పేమెంట్ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసింది చైనా.
నగదు రహిత లావాదేవీలు
వాస్తవానికి డిజిటల్ కరెన్సీ ఎలక్ట్రానిక్ పేమెంట్ విధానం క్రిప్టో కరెన్సీలాంటిది కాదు. చైనా సెంట్రల్ బ్యాంక్ ముద్రించే యువాన్‌కు ఇది డిజిటల్ రూపం.
నగదు రహిత లావాదేవీలకు మళ్లాలనుకున్న చైనా ఈ సరికొత్త విధానాన్ని ఎంచుకుంది.
ప్రస్తుతం చైనాలో జరుగుతున్న ప్రతి ఐదు పేమెంట్లలో నాలుగు పేమెంట్లు వీచాట్ పే ద్వారాగానీ, అలీబాబా సంస్థకు చెందిన అలీపే ద్వారా గానీ జరుగుతున్నాయని వివిధ సర్వేల్లో తేలింది.

ఫొటో సోర్స్, Getty Images
2019లో బ్యాంకుల్లో నాన్-క్యాష్ పేమెంట్లు సుమారు 29.27 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నాయని, అంతకు ముందు సంవత్సరంకన్నా ఇది 25% ఎక్కువని ఒక నివేదికలో పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా పేర్కొంది.
డిజిటల్ కరెన్సీలో వరల్డ్ లీడర్‌గా మారాలని చైనా ప్రణాళికలు రచిస్తోంది. యువాన్‌ను ప్రపంచవ్యాప్తం చేయడం, డాలర్ మీద ఆధారపడే పరిస్థితి నుంచి బైటికి రావడం కోసం చైనా ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోందని పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ఒక నివేదికలో పేర్కొంది.
డిజిటల్ కరెన్సీ యుద్ధం
ప్రపంచవ్యాప్తంగా పలు సెంట్రల్ బ్యాంకులు డిజిటల్ కరెన్సీ మీద దృష్టిపెట్టి, వాటి నిర్వహణ ఎలాగన్న దానిపై సమాలోచనలు చేస్తున్న సమయంలోనే చైనా కూడా తన ప్రయత్నాలను మొదలు పెట్టింది.
ప్రపంచవ్యాప్తంగా 17దేశాలు ఇప్పటికే ఈ డిజిటల్ కరెన్సీ కోసం ప్రయత్నాలు, ప్రయోగాలు చేస్తున్నాయి.
వివిధ దేశాల ప్రభుత్వాలే కాకుండా ప్రైవేట్ కంపెనీలు కూడా డిజిటల్ కరెన్సీ మీద దృష్టి సారించాయి. లిబ్రా పేరుతో తాను తీసుకు రావాలనుకున్న డిజిటల్ కరెన్సీపై పలు దేశాలు అభ్యంతరాలు లేవనెత్తడంతో ఈ ప్రణాళికలపై ఫేస్‌బుక్ పునరాలోచనలో పడింది.
ఇవి కూడా చదవండి:
- తనిష్క్: హిందూ కోడలికి ముస్లిం అత్త సీమంతం చేస్తున్నట్లుగా వాణిజ్య ప్రకటన.. ‘లవ్ జిహాద్’ అంటూ సోషల్ మీడియాలో ఆగ్రహం
- నిర్మలా సీతారామన్ ప్రకటనతో ప్రభుత్వ ఉద్యోగులకేనా, ప్రైవేటు రంగాల్లో వారికి కూడా ప్రయోజనం ఉంటుందా
- ఉత్తరకొరియా ఆయుధ వ్యాపారం కోసం ఆంక్షలను ఉల్లంఘించిందా? ఆ సీక్రెట్ డాక్యుమెంటరీలో ఏముంది?
- భారత్ సాయం లేకుండా ప్రపంచ కోవిడ్ వ్యాక్సీన్ కల నెరవేరదు... ఎందుకంటే..
- ఇండియా - చైనా మధ్య గొడవల్లో భారత స్టార్టప్ కంపెనీలు దెబ్బతింటున్నాయా?
- ఆన్లైన్ వీడియో టెక్ వ్యాపార సామ్రాజ్యాన్ని జయించిన ఇరానీ మహిళ
- భారత్, చైనా: ఆసియాలోని రెండు అతిపెద్ద వ్యవస్థలు పోట్లాడుకుంటే ఏం జరుగుతుంది?
- ఇరాక్, సిరియాల్లో ఐఎస్ఐఎస్ అంతమైనట్లేనా.. ప్రస్తుత పరిస్థితి ఏమిటి
- సిరియాలో కుర్దు సేనలకు అమెరికా వెన్నుపోటు పొడిచిందా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








