దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు జాతి వివక్ష అనంతరం తొలి పర్యటనకు భారత్ వచ్చినప్పుడు.. ‘నాకు పాస్‌పోర్ట్ కూడా లేదు’

దక్షిణాఫ్రికా జట్టు చరిత్రాత్మక 1991 భారత పర్యటనలో తొలి మ్యాచ్‌కు ముందు భారత జట్టు కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్‌తో, దక్షిణఫ్రికా జట్టు కెప్టెన్ క్లైవ్ రైస్ కరచాలనం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దక్షిణాఫ్రికా జట్టు చరిత్రాత్మక 1991 భారత పర్యటనలో తొలి మ్యాచ్‌కు ముందు భారత జట్టు కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్‌తో, దక్షిణఫ్రికా జట్టు కెప్టెన్ క్లైవ్ రైస్ కరచాలనం
    • రచయిత, మట్ డేవిస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దక్షిణాఫ్రికా క్రికెట్ టీంలో ఇప్పుడు వినిపిస్తున్న సక్సెస్‌ఫుల్ నల్లజాతి క్రికెటర్ల పేర్లు.. కగిసో రబాడా, టెంబా బవుమా, లుంగీ ఎన్గిడి.

అయితే, జాతి వివక్ష ముగిసిన అనంతరం దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు తొలి పర్యటన.. పెద్దగా తెలియని ఇద్దరు నల్లజాతి క్రికెటర్లు లేకపోయినట్లయితే.. జరిగి ఉండేది కాదు. అంతర్జాతీయ క్రికెట్‌లో అంతకుముందెన్నడూ బౌలింగ్ కానీ, బ్యాటింగ్ కానీ చేయని ఇద్దరు అనామకులను అప్పుడు జట్టులోకి తెచ్చారు.

వారి పేర్లు హుసేన్ మనాక్, ఫయీక్ డేవిడ్స్. సరిగ్గా 30 ఏళ్ల కిందట తొలిసారి భారత పర్యటనకు వచ్చిన దక్షిణాఫ్రికా జట్టులో భాగంగా ఉన్నారు. వారి కథ చాలా ఆసక్తికరమైనది.

ఇండియాలో మూడు వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల టూర్‌ ప్రకటించిన దక్షిణాఫ్రికా.. తన జట్టులో అందరూ తెల్లజాతి వాళ్లే కాకుండా ఉండేలా చూడటానికి రాజకీయ జోక్యం అవసరమైంది.

‘‘భారత క్రికెట్ అధ్యక్షుడి నుంచి నాకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ‘అలీ మీరు వస్తుండటం చాలా బాగుంది. కానీ జట్టులో అందరూ తెల్లవాళ్లే ఉంటే ఇండియాలో పెద్ద సమస్య అవుతుంది’ అని ఆయన నాతో అన్నారు. అది నాకు వదిలేయండి. నేను చూసుకుంటాను అని నేను చెప్పాను’’ అని అప్పుడే కొత్తగా ఏర్పాటైన యునైటెడ్ క్రికెట్ బోర్డ్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ అలీ బషర్ బీబీసీకి తెలిపారు.

ఓ సౌత్ ఆఫ్రికన్ క్రికెట్ బోర్డ్ ఎలెవన్ మ్యాచ్‌కు ముందు తీసిన ఫొటోలో హుసేన్ మనాక్ (వెనుక వరుసలో కుడివైపు నుంచి రెండో వ్యక్తి), ఫయీక్ డేవిడ్స్ (కింది వరుసలో ఎడమవైపు నుంచి మొదటి వ్యక్తి)
ఫొటో క్యాప్షన్, ఓ సౌత్ ఆఫ్రికన్ క్రికెట్ బోర్డ్ ఎలెవన్ మ్యాచ్‌కు ముందు తీసిన ఫొటోలో హుసేన్ మనాక్ (వెనుక వరుసలో కుడివైపు నుంచి రెండో వ్యక్తి), ఫయీక్ డేవిడ్స్ (కింది వరుసలో ఎడమవైపు నుంచి మొదటి వ్యక్తి)

బషర్ దానిని పరిష్కరించారు.

మొబైల్ ఫోన్లకు ముందు రోజుల్లో.. జొహెనెస్‌బర్గ్‌ సమీపంలోని తన ఇంటికి ఓ రోజు సాయంత్రం ఫోన్ రావటం మనాక్‌కు ఇంకా గుర్తుంది.

‘‘ఎక్స్‌పీరియన్స్ పొందటం కోసం ఆడకుండా ఉండే స్థానంలో ఇండియాకు వస్తారా అని డాక్టర్ బషర్ నన్ను అడిగారు’’ అని ఆయన చెప్పారు.

కేప్ టౌన్‌లో డేవిడ్స్‌కు కూడా ఇదే ఆహ్వానం అందింది. ‘‘అసలు ఇటువంటిది నేను ఊహించలేదు. నాకు పాస్‌పోర్ట్ కూడా లేదు’’ అని ఆయన తెలిపారు.

ఆ ఆఫర్‌ను ఇద్దరు ఆటగాళ్లూ అంగీకరించారు. కానీ తమని ఈ పర్యటనలో ఎందుకు చేర్చారనే దానిపై వారి మనసులో సందేహాలున్నాయి.

‘‘దీని గురించి నా సన్నిహితులతో చర్చించాను. అది దక్షిణాఫ్రికాకు సంచలన పర్యటన అవుతుంది. కానీ ఇది కేవలం పైన మెరుగులుదిద్దే పనే అనే భావన ఉంది’’ అని మనాక్ చెప్పారు.

‘’28 ఏళ్ల వయసులో నన్ను డెవలప్‌మెంటల్ ప్లేయర్‌గా పేర్కొనటం ఆశ్చర్యం కలిగించింది. నాకు ఇబ్బందిగా అనిపించింది’’ అని డేవిడ్స్ తెలిపారు.

డెవలప్‌మెంటల్ ప్లేయర్‌ హోదాలో మొత్తం నలుగురు క్రికెటర్లను సెలెక్ట్ చేశారు. ఇద్దరు నల్లజాతి ప్లేయర్లు మనాక్, డేవిడ్స్.. కాగా మరో ఇద్దరు తెల్లజాతి ప్లేయర్లు. వారిలో ఒకరు దక్షిణాఫ్రికా భవిష్యత్ కెప్టెన్ హన్సీ క్రోనే, మరొకరు స్పిన్నర్ డెరెక్ క్రూక్స్. ఆయన ఆ తర్వాత 32 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడారు.

ఆ జట్టుకు కోల్‌కతాలో – అప్పటి కలకత్తా – అందిన ఆహ్వానం అన్ని అంచనాలనూ దాటిపోయింది.

హుసేన్ మనాక్ (కుడివైపు) ఇప్పటికీ దక్షిణాఫ్రికా క్రికెట్‌లో కామెంటేటర్‌గా కొనసాగుతున్నారు
ఫొటో క్యాప్షన్, హుసేన్ మనాక్ (కుడివైపు) ఇప్పటికీ దక్షిణాఫ్రికా క్రికెట్‌లో కామెంటేటర్‌గా కొనసాగుతున్నారు

‘‘మమ్మల్ని ఆహ్వానించటానికి ఎయిర్‌పోర్టు నుంచి హోటల్ వరకూ ప్రయాణంలో ఒక లక్ష మంది జనం రోడ్లకు ఇరువైపులా బారులు తీరారు. అది నమ్మశక్యం కానిది’’ అని తెలిపారు బషర్.

ఆ పది రోజుల టూర్‌లో మూడు వన్డే మ్యాచ్‌లతో పాటు.. మదర్ థెరిసాతో భేటీ, తాజ్ మహల్ సందర్శన కూడా ఉన్నాయి.

‘‘ఆటగాళ్లు చాలా సాదరంగా, స్నేహంగా ఉన్నారు. కానీ మమ్మల్ని (తనను, డేవిడ్స్‌ను) ఇండియన్ మీడియాకు చూపించటానికి ఒక టోకెన్ గానే ఉంచారని నేను అనుకున్నాను’’ అని మనాక్ గుర్తుచేసుకున్నారు.

డేవిడ్స్ కూడా అదే ఒంటరితనం ఫీలయ్యారు. కానీ సాధ్యమైనంత అనుభవం సంపాదించుకోవాలని చాలా ఆసక్తిగా ఉన్నారు. ‘‘జట్టుతో పాటు ఉన్నా మనం ఆడబోయేది లేదని తెలిసి ఉండటం చాలా కష్టంగా ఉంటుంది. కానీ, నేను ఇక్కడున్నాను, భవిష్యత్తులో జట్టులో భాగం కావటానికి ఇప్పుడు జట్టుతో ఇన్‌వాల్వ్ కావటం మంచిదని అనుకున్నాను’’ అని చెప్పారాయన.

21 ఏళ్ల తర్వాత దక్షిణాఫ్రికా జట్టు తొలి అధికారిక ఇంటర్నేషనల్ మ్యాచ్‌ను వీరిద్దరూ పక్కన నిల్చుని చూశారు.

‘‘టెండూల్కర్, సంజయ్ మంజ్రేకర్ వంటి ప్లేయర్లను కలవటం చాలా విజ్ఞానవంతమైన అనుభవం. తొలి మ్యాచ్ కోసం మేం ఈడెన్ గార్డెన్‌కు వెళ్లినపుడు.. టెండూల్కర్ మిడ్-వికెట్ బౌండరీని క్లియర్ చేయటం నాకు గుర్తుంది. లక్ష మంది జనం ముందు ఆయన ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆడారు. అది నమ్మశక్యం కాదు’’ అని మనాక్ చెప్పారు.

కానీ ఆ తర్వాత కొన్నేళ్ల వరకూ మనాక్, డేవిడ్స్‌కు అంతర్జాతీయ గుర్తింపు రాలేదు. మరైతే.. వారు తిరిగి స్వదేశానికి – వివక్ష రూపుమాసిన దేశవాళీ క్రికెట్‌ క్రీడకు వెళ్లాక ఏం జరిగింది?

వీడియో క్యాప్షన్, హిజాబ్‌ ధరించి క్రికెట్ ఆడుతున్న అమ్మాయిలు

‘‘నేను కొంతమంది అద్భుతమైన నల్లజాతి క్రికెటర్లతో కలిసి ఆడాను. వారు దక్షిణాఫ్రికా జట్టులోకి చాలా సులభంగా చేరగలిగేవారు. కానీ వారికి తగిన గుర్తింపును ఇవ్వలేదు. వాళ్లు ఎప్పుడూ తెరచాటునే ఉండిపోయారు’’ అని మనాక్ తెలిపారు.

‘‘ఓ నల్లజాతి క్రీడాకారుడిగా మనల్ని మనం ప్రతిసారీ నిరూపించుకోవాల్సి ఉంటుంది’’ అని డేవిడ్స్ చెప్పారు. ‘‘నేను అనుకున్నట్లుగా జరగలేదు. హాన్సీ క్రోనే, డెరెక్ క్రూక్స్‌లకు లభించిన అవకాశాలు.. నాకు, మనాక్‌కు లభించిన అవకాశాల కన్నా చాలా భిన్నమైనవని చరిత్ర పుస్తకాలు చెప్తాయి. అది చాలా కష్ట కాలం’’ అని ఆయన పేర్కొన్నారు.

ఆ భ్రమలు తొలగిపోవటం వల్ల.. చాలా మంది నల్లజాతి క్రీడాకారులు క్రికెట్‌ను వదిలేశారు.

‘‘రెండేళ్లలోనే చాలా మంది రిటైర్ అయి, క్రికెట్ ఆడటం మానేశారు. అకస్మాత్తుగా మేం ఈ ఆటకు సరిపోమని భావించటం మొదలుపెట్టారు. దీంతో చాలా మంది క్రికెటర్లు మేం మా సమయాన్ని వృథా చేసుకుంటున్నామని చెప్పారు. అదంతా ఓ జోక్’’ అని మనాక్ గుర్తుచేసుకున్నారు.

దక్షిణాఫ్రికా జట్టు గత 20 ఏళ్లలో బహుళ జాతులు మిళితమైన జట్టుగా పురోగమించింది. కానీ మనాక్, డేవిడ్స్‌, వారి తరం ఆటగాళ్లకు అది అందలేదు. కొంత కాలం పాటు ట్రాన్స్‌వాల్ ప్రావిన్స్ జట్టులో మనాక్, వెస్ట్రన్ ప్రావిన్స్‌ జట్టులో డేవిడ్స్ ఫస్ట్ క్లాస్ కెరీర్ సాగించారు. ఇద్దరూ ఇప్పటికీ ఈ క్రీడలో కొనసాగుతున్నారు.

మనాక్ ఏడేళ్ల పాటు జాతీయ సెలెక్టర్‌గా ఉన్నారు. ఇప్పుడు సౌత్ ఆఫ్రికన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్‌కు గౌరవనీయ కామెంటేటర్‌గా పనిచేస్తున్నారు. డేవిడ్స్ 1992 ప్రపంచ కప్ పోటీలకు కూడా.. నాన్-ప్లేయింగ్ మెంబర్‌గా వెళ్లారు. ఇప్పుడు కేప్ టౌన్‌లో తన మాజీ జట్టుకు కోచింగ్ చేస్తున్నారు.

మరి.. ముప్పై ఏళ్ల కిందట ఈ నెలలో జరిగిన భారత పర్యటన గురించి వీరేమంటారు?

‘‘నాకు ఎలాంటి విచారం లేదు. అయితే.. లక్షలాది మంది జనం ముందు నేను ఆడి ఉంటే చాలా బాగుండేదనే విచారం మాత్రం ఉంది’’ అంటారు డేవిడ్స్.

వీడియో క్యాప్షన్, 1983 క్రికెట్ వరల్డ్ కప్ భారత్ ఎలా గెలిచిందంటే...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)