రాహుల్ ద్రవిడ్ కోచింగ్‌లో టీమిండియా దూకుడు తగ్గుతుందా? పెరుగుతుందా?

రాహుల్ ద్రవిడ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అయాజ్ మేనన్
    • హోదా, క్రికెట్ రచయిత

టీమిండియా కోచ్‌గా ఎలాంటి సవాళ్లు ఎదుర్కోనున్నారనేది రాహుల్ ద్రవిడ్‌ను అడిగి చూడండి..? జట్టుపై ఉన్న వయోభారం గురించి ఆయన మాట్లాడే అవకాశాలున్నాయి.

భారత్‌లో క్రీడాకారులు తమ వయసు రెండు మూడేళ్లు తక్కువగా చూపించడమనేది జూనియర్ లెవల్‌లో చాలా ఎక్కువగా ఉంది. దీనికోసం డాక్టర్ల సహాయంతో తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలు సృష్టిస్తుంటారు.

''15-16 ఏళ్లవారు మోసపూరితంగా 12-13 ఏళ్లని చెప్పడం చాలా అన్యాయం'' అని ద్రవిడ్ ఏడాది కిందట నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.

''వయసులో చిన్నవారైన ఆటగాళ్లను ఇలాంటివి మానసికంగా బలహీనులను చేస్తాయి. మరోవైపు వయసు తక్కువగా చూపించి ఆటలోకి వచ్చినవారిని ఇది ఏదో సాధించామనే భావనలోకి నెడుతుంది. పైస్థాయికి వెళ్లాక అది బయటపడిపోతుంది. దీనివల్ల రెండు రకాలుగా నష్టం. తల్లిదండ్రులు, కోచ్‌లు, స్కూల్ ప్రిన్సిపల్స్, రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్ల అధికారుల సహకారంతో ఇదంతా జరుగుతోంది'' అన్నారు ద్రవిడ్.

ఏడాది తరువాత ద్రవిడ్ ఇండియా సీనియర్ ఆటగాళ్లకు శిక్షణ ఇస్తున్నారు.

ఆటగాడిగా, కెప్టెన్‌గా అత్యుత్తమ కెరీర్ సాగించిన ద్రవిడ్ అనంతరం అండర్-19, ఇండియా ఏ జట్లకు కోచ్‌గా పనిచేశారు. నేషనల్ క్రికెట్ అకాడమీ బాధ్యతలూ చేపట్టారు. ప్రస్తుతం భారత జట్టులో ఉన్న ఆటగాళ్లలో చాలామంది ద్రవిడ్ మెంటార్‌షిప్ నుంచి వచ్చినవారే.

రవిశాస్త్రి బాధ్యతలు చేపట్టడానికి ముందే ద్రవిడ్‌ను చీఫ్ కోచ్ చేయాలనే చర్చ నడిచింది. భారత జట్టు ప్రధాన కోచ్‌ పదవి అనేది అత్యంత ఆకర్షణీయమైనది. కానీ, ద్రవిడ్ అంతవేగంగా ఆ పదవి చేపట్టడానికి సిద్ధపడలేదు. ప్రధాన కోచ్ పదవి చేపట్టనికి సరైన సమయం అని తాను, తన కుటుంబం భావించేవరకు సమయం తీసుకున్నారాయన.

దీంతో నేరుగా సంబంధం లేకపోయినా ఓ ఎపిసోడ్ ద్రవిడ్ ఆలోచనలను వివరించే అవకాశం ఉంది.

ఏడెనిమిదేళ్ల కిందట టీవీ కామెంటరీ సర్క్యూట్ నుంచి ఆయన తప్పుకొన్నారు. అప్పటికి ఆయనకు బ్రాడ్‌కాస్టర్ల నుంచి మంచి డిమాండ్ ఉంది. ఆయన ఉచ్ఛరణ, విశ్లేషణ అన్నీ అద్భుతంగా ఉండేవి. కానీ, ద్రవిడ్ మాత్రం అదంతా కాదనుకుని ఇండియా ఏ జట్టు ఆటగాళ్లు, జూనియర్లకు శిక్షణ ఇచ్చేందుకు నిశ్చయించుకున్నారు.

కామెంటరేటర్‌గా ద్రవిడ్

ఫొటో సోర్స్, Getty Images

ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ సమయంలో నేను బెంగళూరులో ద్రవిడ్‌తో మాట్లాడేందుకు ఆయన్ను కలిశాను. టీవీలో కామెంటరీ చెప్పడం ఎందుకు ఆపేశారని అడిగాను.

''సుదీర్ఘ కాలం ఇంటికి దూరంగా ఉండలేను నేను'' అని సమాధానమిచ్చారు ద్రవిడ్.

ద్రవిడ్ భార్య విజేత ఆ సమయంలోనే వైద్యురాలిగా తన కెరీర్ తిరిగి ప్రారంభించారు.

''నేను ఆటగాడిగా జట్టులో ఉన్నప్పుడు ఆమె పిల్లల బాధ్యత చూసుకునేవారు. ఇప్పుడు ఆమె తన కెరీర్ తిరిగి ప్రారంభించారు, పిల్లల పెంపకం ఇప్పుడు నా వంతు'' అన్నారు ద్రవిడ్.

2021 నాటికి పరిస్థితులు మారాయి. కోవిడ్ ముప్పు తగ్గింది.. రానున్న రెండేళ్లలో భారత జట్టు టీ20, వన్డే ప్రపంచకప్‌లు.. ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ వంటి మూడు ఐసీసీ టోర్నీలు ఆడనుంది. దీంతో ద్రవిడ్‌లో పోటీతత్వ స్ఫూర్తి మళ్లీ ప్రవహిస్తోంది.

ద్రవిడ్ ఆటను, గొప్పతనాన్ని వర్ణించడానికి లెక్కలేనన్ని విశేషణాలు ఉపయోగిస్తుంటారు. ద్రవిడ్ పేరు చెప్పగానే నిఖార్సయిన, పద్ధతైన, నిరాడంబరమైన, తొణకనిబెణకని, గోడలాంటి ఆటగాడు వంటి ఎన్నో పదాలు గుర్తుకొస్తాయి.

కానీ 'దూకుడు, ప్రగాఢ వాంఛ' లేకపోతే ద్రవిడ్ ఆటగాడిగా, కోచ్‌గానూ నిస్సారమే.

బలమైన బాడీ లాంగ్వేజ్, ఆడంబరం అతని శైలి కాదు. అలా అని ద్రవిడ్ మెతక మనిషి, రక్షణాత్మకమైన వ్యక్తి అనుకుంటే పొరపాటే.

మాథ్యూ హేడెన్ మాటల్లో చెప్పాలంటే ఆటలో దూకుడును ఎవరైనా అర్థం చేసుకోవాలంటే ద్రవిడ్ బ్యాటింగ్ చేసేటప్పుడు ఆయన కళ్లలోకి చూడాలి.

ద్రవిడ్ దూకుడు ఎలాంటిదో ఆయన కెరీర్ గ్రాఫ్ చెబుతుంది. క్రికెట్ చరిత్రలోని గొప్ప బ్యాట్స్‌మన్లలో ఒకరిగా మారడంలో నిర్దాక్షిణ్యమైన ఆశయంతో ఆయన ఎలా దూకుడు చూపారో తెలుస్తుంది.

ద్రవిడ్

ఫొటో సోర్స్, Getty Images

ఈ సహస్రాబ్దిలోని తొలి ఆరేడేళ్లు భారత క్రికెట్ జట్టులో బ్యాటింగ్ స్వర్ణయుగంగా చెబుతారు. సచిన్ తెండూల్కర్ తన బ్యాటింగ్ విన్యాసాలతో గుండెచప్పుడుగా మారగా ద్రవిడ్ జట్టుకు స్థిరత్వాన్ని అందించారు.

ద్రవిడ్ అనుభవించిన నమ్మకం ఆయన ఆడుతున్న కాలం నుంచి రిటైరైన తరువాత దశాబ్దం వరకు కొనసాగింది.

చీఫ్ కోచ్‌గా ద్రవిడ్‌ను నియమించడంతో అభిమానులు, మాజీ ఆటగాళ్లు, ప్రస్తుత ఆటగాళ్లు ఎంతో ఆనందం, ఉపశమనం వ్యక్తంచేస్తున్నారు.

టీ20 ప్రపంచ కప్ రన్నరప్ న్యూజీలాండ్‌తో టీ20 సిరీస్‌ను భారత్ గెలవడంతో అంతటా ప్రశంసలు దక్కుతున్నాయి.

భారత జట్టు కోచ్‌లలో జాన్ రైట్, గ్యారీ కిర్‌స్టన్, రవిశాస్త్రిలు విజయవంతమైనవారుగా పేరుపొందారు. గ్రెగ్ చాపెల్, అనిల్ కుంబ్లేల పదవీకాలం తక్కువ సమయంలోనే వివాదాలతో ముగిసింది.

సమకాలీన క్రికెట్‌లో కోచింగ్ అనేది వివిధ ఫార్మాట్లలో ఉంటూ భారంగానే ఉంటుంది. ఒత్తిళ్లను ఎదుర్కోవడమే కాకుండా మరెన్నో అంశాలతో ముడిపడి ఉన్నది. సాంకేతిక అంశాలలో తీర్చిదిద్దడం, మ్యాచ్ పరిస్థితులపై నిర్దిష్టమైన అవగాహన కలిగిఉండడం, పనిభారం మోయడం, క్రికెటర్ల నుంచి చక్కని ఆట రాబట్టుకోవడానికి కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం.

ద్రవిడ్ ముందు ప్రధానంగా రెండు సవాళ్లు ఉన్నాయి.

అందులో మొదటిది.. పరస్పర విరుద్ధమైన వ్యక్తిత్వాలున్న ఇద్దరు కెప్టెన్లను డీల్ చేయడం. టెస్టులు, వన్డేలకు విరాట్ కోహ్లీ కెప్టెన్‌ కాగా.. టీ20లకు రోహిత్ శర్మ కెప్టెన్. ఇద్దరు కెప్టెన్లు ఉండడం డ్రెసింగ్ రూమ్‌పై చాలా ప్రభావం చూపిస్తుంది కాబట్టి సున్నితంగా డీల్ చేయాల్సి ఉంటుంది.

రెండోది.. అనేక దేశాలు కలిసి ఆడే టోర్నీలను గెలవలేకపోతున్నామన్న మానసిక బాధ నుంచి జట్టుకు బయటకు తేవడం. 2013 చాంపియన్స్ ట్రోఫీ తరువాత భారత్ ఐసీసీ టైటిల్ ఏదీ గెలవలేదు.

2013 చాంపియన్స్ ట్రోఫి తరువాత టీమిండియా వివిధ దేశాలతో సిరీస్‌లను గెలుస్తున్నా 2015, 2019 వన్డే ప్రపంచకప్‌లు, 2017 చాంపియన్స్ ట్రోఫీ, ఈ ఏడాది ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ గెలవలేకపోయింది. ఇక మొన్నటి టీ20 ప్రపంచకప్‌లో అయితే నాక్‌అవుట్ దశకు కూడా అర్హత సాధించలేకపోయింది.

ఇలాంటి పరిస్థితులలో చీఫ్ కోచ్‌గా ద్రవిడ్‌పై భారీ అంచనాలున్నాయి. ఆయన దగ్గర ఉన్న సమయం పరిమితంగా ఉంది. ఇలాంటి తరుణంలో భవిష్యత్ ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)