ఖాళీగా గడపడం ఎలా? ఇలా ఆలోచించడం వల్ల ఆనందం ఆవిరైపోతోందా?

విరామాన్ని గడిపే విధానంలో కూడా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విరామాన్ని గడిపే విధానంలో కూడా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి
    • రచయిత, ఆయేషా ఇంతియాజ్
    • హోదా, బీబీసీ వర్క్‌ లైఫ్

ఖాళీ సమయం దొరకడం ఒక బహుమతి లాంటిది. మనం కష్టపడి పని చేస్తేనే విరామాన్ని కూడా అంతే ఆనందంగా గడపగలం. జీవితంలో లభించే ఖాళీ సమయాన్ని బట్టి జీవితం ఉత్తమంగా ఉంటుందనే ఉద్దేశ్యంతో విరామం కోసం ఎదురుచూస్తూ ఉంటాం.

కానీ, ఖాళీ సమయం దొరకడం, దొరికిన సమయాన్ని గడపడమెలాగో నిర్ణయించుకోవడం కూడా చాలా ఒత్తిడికి గురి చేస్తోందని అధ్యయనాలు చెబుతున్నాయి.

విరామ సమయాన్ని ఎలా గడపాలో నిర్ణయించుకునేందుకు, ఎక్కువ రీసెర్చ్ చేస్తూ, డబ్బును ఎలా వెచ్చించాలో ఆలోచిస్తూ చాలామంది ఒత్తిడికి గురవుతూ ఉంటారు.

కానీ, ఈ ఒత్తిడి అసలైన ఆనందాన్ని చంపేస్తుందని ఈ అంశంపై అధ్యయనాల కోసం సేకరించిన డేటా చెబుతోంది.

కొంతమంది జీవితంలో విరామం తీసుకోవడాన్ని ఉపయోగకరమైన పనిగా భావించరు. సాధారణంగా ఎక్కువ ఒత్తిడికి గురయ్యే, అధిక ఆదాయం సంపాదించే వారు, వారి పనికే ప్రాధాన్యత ఇస్తూ విరామ సమయాన్ని కూడా ఆనందంగా గడపలేరు. ఇదంతా వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది.

అయితే, రెండు రకాల వారూ ఈ ఖాళీ సమయం విషయంలో ఒత్తిడిని అనుభవిస్తూ ఉంటారు. విరామ సమయాన్ని చూసే విధానం, గడిపే విధానంలో కూడా కాలానుగుణంగా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి.

ఈ మార్పుల గురించి తెలుసుకోవడం అందరికీ లాభదాయకంగా ఉండి, తిరిగి జీవితాన్ని ఆస్వాదించడానికి సహకరించవచ్చు.

"కొన్ని శతాబ్దాలుగా విరామ సమయం గడిపే విధానంలో వివిధ సంస్కృతుల్లో నాటకీయ మార్పులు చోటు చేసుకున్నాయి" అని క్యూబెక్ యూనివర్సిటీలో మేనేజ్‌మెంట్ సైన్సెస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ బ్రాడ్ ఇయాన్ అన్నారు.

"అయితే ఖాళీగా ఉండటమనేది పని చేయకుండా ఉండటానికి వ్యతిరేకమైనది" అని భావించే విషయంలో మాత్రం ఎటువంటి మార్పూ రాలేదు.

వీడియో క్యాప్షన్, ఆహారానికి, వ్యాయామానికి మధ్య ఎంత విరామం ఉండాలి?

2000 సంవత్సరాల క్రితం, పని, విరామం అనే రెండు విషయాలు సేవ చేయడం, స్వతంత్రంతో కూడుకుని ఉండేవి.

ప్రాచీన గ్రీస్ దేశంలో, చాలా వరకు పనులను బానిసలకు అప్పగించి, ధనిక వర్గాల వారు ఇతర వ్యవహారాలను చూసుకుంటూ ఉండేవారు.

"విరామం అనేది మెదడును చురుకుగా ఉంచే ఒక అంశం. విరామ సమయం బాగా గడపడం అంటే, క్రీడల్లో పాల్గొనడం, సంగీతం నేర్చుకోవడం, తోటి వారితో చర్చించడం, లేదా తాత్వికతలో మునిగితేలడంలా ఉండేది. కానీ, విరామ సమయం గడపడం అంత సులభమైనదేమి కాదు. కానీ, ఆ సమయం సంతృప్తినిచ్చేది అయి ఉండాలి" అని ఇయాన్ వివరించారు.

మరింత పని చేసేందుకు తమను తాము సిద్ధం చేసుకునేందుకే విరామం అవసరమని రోమన్లు భావించడం మొదలుపెట్టినప్పటినుంచీ ఈ విషయంలో మార్పులు రావడం మొదలయ్యాయని ఇయాన్ అన్నారు.

విరామం విషయంలో మార్పులు రావడం పారిశ్రామిక విప్లవం తర్వాత మరింత పెరిగింది. 1800 నాటికి, విరామం ద్వారా వ్యక్తుల స్థాయిని ప్రతిబింబించే విషయంలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. సంపన్న వర్గాల వారు సోమరితనంగా గడపడం మొదలుపెట్టారు.

బోస్టన్ యూనివర్సిటీ క్వెస్ట్రమ్ బిజినెస్ స్కూల్‌లో పని చేస్తున్న అనత్ కీనన్ "సమయానికున్న విలువ" అనే అంశం గురించి విస్తృత పరిశోధన చేశారు.

ప్రస్తుతం ఈ ఖాళీ సమయం గడిపే విషయంలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయని వివరించారు.

ఖాళీ సమయం లేదని చెప్పడం ఒక శక్తివంతమైన స్టేటస్ సింబల్‌గా మారిపోయిందని అన్నారు.

"కొంత మంది సెలబ్రిటీలు తమకు ఖాళీ సమయం లేదంటూ, విరామ సమయం కోసం తీవ్రంగా ఎదురు చూస్తున్నామని ట్విటర్ లాంటి సోషల్ వేదికలపై చెబుతూ ఉంటారని అన్నారు. పని చేసే ప్రదేశాల్లో కూడా ఎక్కువ గంటల పాటూ పని చేయడాన్ని గౌరవం దక్కుతున్నట్లుగా పరిగణిస్తారు" అని చెప్పారు.

నిజానికి, ఖాళీ సమయం గడపడానికి సంపన్నులు కూడా అధిక పని గంటలు పనిచేస్తూ ఉంటారు.

"ఉదాహరణకు సాధారణంగా అధిక ఆదాయం ఉండే డాక్టర్లు, న్యాయవాదులు, సీఈఓల లాంటి వారు ఎక్కువ సేపు పని చేస్తారు" అని ఇయాన్ వివరించారు.

"అంటే తగినంత ఖాళీ సమయం లేదని ఫిర్యాదు చేసేవారిలో ఎక్కువగా అధిక ఆదాయ వర్గాలవారే ఉంటారు. విరామ సమయాన్ని, లేదా ఖాళీ సమయంలో లభించే ఆనందాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని ప్రతీ గంటనూ లెక్కించుకోవాలనే ఆలోచనను కలుగచేస్తుంది" అని అన్నారు.

ఒక్కొక్కసారి విరామాన్ని ఆస్వాదించడం వారి సామాజిక స్థాయిని సూచిస్తుంది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పర్యటకుడు

విరామ సమయాన్ని పూర్తిగా అనుభవించేవారు

విరామ సమయం నుంచి వచ్చే విలువను పూర్తిగా ఉపయోగించుకోవాలని ఆర్థికవేత్తలు చెబుతూ ఉంటారు.

అమెరికాకు చెందిన ఆర్ధికవేత్త డానియెల్ హమర్మేష్ రాసిన "స్పెండింగ్ టైమ్: ది మోస్ట్ వాల్యుబుల్ రిసోర్స్" అనే పుస్తకంలో ఈ అంశం గురించి వివరించారు.

"వస్తువులు, సేవలను ఆస్వాదించే సమయం కంటే కూడా వాటి మీద ఖర్చుపెట్టగలిగే సామర్ధ్యం గణనీయంగా పెరిగింది" అని అన్నారు.

ఈ ఒత్తిడి మన నిర్ణయాలపై ప్రభావం చూపిస్తుంది. మనం ఖర్చు పెట్టే ప్రతీ రూపాయికి కొన్ని నిమిషాల్లోనే మంచి ఫలితం పొందాలని అనుకుంటాం" అని ఇయాన్ వివరించారు.

అందుకే "విరామం గడపడం కోసం ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడతాం. మంచి హోటళ్లు, ఐమ్యాక్స్, నెట్‌ఫ్లిక్స్‌లో సినిమాలు చూడటం లాంటివి చేస్తూ, ప్రతీదీ ఉత్తమంగా ఉండాలని అనుకుంటాం" అని అన్నారు.

దీనికంతటికీ ముందు, మన విరామ సమయాన్ని గడిపేందుకు ప్రణాళిక చేసుకునేందుకు కొన్ని గంటల పాటూ రకరకాల రివ్యూలు చదవడం లాంటివి చేస్తూ ఉంటాం. అదేమీ చెడ్డ విషయం కాదు కానీ, సెలవులో వెళ్లే వారి ఆనందానికి ట్రిప్‌కు ముందు చేసే ప్రణాళిక చాలా పనికొస్తుంది.

కానీ, దాని గురించి మరీ ఎక్కువగా ఆలోచించడం వల్ల సెలవును పూర్తిగా గడపలేం. దాంతో సెలవు ఎంత తొందరగా మొదలవుతుందో అంతే తొందరగా ముగిసినట్లు అనిపిస్తుంది.

అలాగే గడిపే సెలవులు ఉత్తమంగా ఉండాలని మనం పెట్టే పరుగు, విరామ సమయాన్ని మరింత ఒత్తిడితో కూడుకున్నదిగా మారుస్తుంది.

మనం పెట్టుకున్న అంచనాలు వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఉంటాయి.

కొంతమంది అసాధారణ, వినూత్న లేదా తీవ్రతరమైన అనుభవాలను చవిచూడాలని అనుకుంటారని 2011లో కీనన్ రాసిన అధ్యయన పత్రంలో పేర్కొన్నారు. దాంతో, సెలవుల్లో గడిపిన సమయానికి తగిన ప్రయోజనం లభించినట్లు భావిస్తారు.

"ఆ క్షణాన్ని ఆస్వాదించకుండా ఏమేమి అనుభవించామో చెక్ లిస్ట్ తయారు చేసుకుంటూ ఉంటే మన అనుభవాలతో కూడిన సీవీని తయారు చేసుకోవడంలో మునిగిపోతాం" అని అన్నారు.

ఇలాంటి సీవీలు ఒక పోటీతత్వానికి నాంది పలుకుతాయి. అలాగే ప్రశాంతంగా గడపాల్సిన సమయాన్ని సోషల్ మీడియా కూడా మరికొంత పాడు చేస్తుంది అని కీనన్ అన్నారు.

ప్రజలు తమ స్టేటస్, విజయాలను, తాము ఖాళీగా గడిపిన సమయాన్ని రకరకాల డొమైన్లలో చూపించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

"కొంతమంది యూజర్లు వారు పూర్తి చేసిన మారథాన్లను సాధించిన తీరు, మచు పిచ్చు పర్వతాన్ని అధిరోహించడం లాంటి ఫోటోలను పోస్టు చేస్తారు. చాలామంది విలాసవంతమైన వస్తువులపై పెట్టిన డబ్బులను ప్రదర్శన చేసుకునేందుకు సెలవులను ఆకర్షణీయంగా గడపడం మొదలుపెట్టారు. అర్ధవంతంగా, ప్రయోజనకరంగా, ఆకర్షణీయంగా ఉన్న కార్యకలాపాలపై తమ విలువైన సమయాన్ని ఎలా గడిపారో ప్రదర్శిస్తూ ఉంటారు" అని ఆమె చెప్పారు.

వీడియో క్యాప్షన్, రెయిన్‌బో ఫుడ్: ఆరోగ్యానికి ఇదే మంచిదా?

విరామం తీసుకోవడాన్ని ద్వేషించే వర్గాలు

కొంతమంది ఖాళీ సమయాన్ని గడపడమెలా అనే విషయం గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. మరికొంత మంది ఖాళీ సమయాన్ని కూడా ప్రయోజనకరంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు అని ఇయాన్ అన్నారు.

ఉదాహరణకు జాగింగ్ చేస్తూ పాడ్ కాస్ట్ వినడం లేదా సాధారణ సమయం కంటే రెట్టింపు స్థాయిలో నెట్‌ఫ్లిక్స్‌ షోలు చూడటం లాంటివి చేస్తూ ఉంటారు.

ఇంకొందరు అసలు ఖాళీ సమయం గడపడాన్నే ఇష్టపడరు.

ఉదాహరణకు 14శాతం మంది అమెరికన్లు మాత్రమే రెండు వారాలు వరుసగా సెలవు తీసుకుంటారు.

"2017 నాటికి, అమెరికా ఉద్యోగుల్లో 54శాతం మంది తమ సెలవు సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకోరు. దాంతో విరామం తీసుకోవడం కోసం కేటాయించిన 662 మిలియన్ రోజులు వృథాగా పోతున్నాయి" అని ఈ అధ్యయనం తేల్చింది.

అయితే దీనికి కారణం సమయాన్ని ఖాళీగా గడపడం వృథా అనే భావన రావడమేనని ఇటీవల జరిగిన అధ్యయనాలు చెబుతున్నాయి.

ఖాళీగా గడిపే సమయం జీవితంలో పెట్టుకున్న లక్ష్యాలతో కలుగచేసుకోనప్పటికీ కూడా సమయాన్ని ఖాళీగా గడపడం వల్ల ఎటువంటి విలువా ఉండదని చాలామంది భావిస్తారు అని ఒహియో యూనివర్సిటీలో ఫిషర్ బిజినెస్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్ సెలిన్ ఏ మాల్కోక్ చెప్పారు.

సంతోషం తక్కువగా ఉంటుందని, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నట్లు నమోదు కావడం వల్ల సమయాన్ని ఖాళీగా గడపడం అంటే విలువ లేనిదనే ప్రతికూల అభిప్రాయాలను కలుగచేసింది.

బోర్ కొట్టే విషయాలను చదవడంలో ఆనందం పొందటం ఏమీ ఉండదని, ఈ అధ్యయనం కోసం కొంతమంది విద్యార్థులతో నిర్వహించిన ప్రయోగాల్లో తేలినట్లు మాల్కోక్ తెలిపారు.

ఆ తర్వాత వారికి కాస్త విరామం ఇచ్చి ఒక ఫన్ వీడియోను చూడమని చెప్పారు. అయితే, ఆ కొన్ని క్షణాలను గొప్పగా ఉపయోగించుకోలేకపోయినప్పటికీ కూడా ఆ వీడియోను చూడటాన్ని వాళ్ళు ఆనందించారు. కానీ, వారు పూర్తిగా ఆస్వాదించలేకపోయారు. దీనిని బట్టి చూస్తే, ఖాళీగా ఉండటం వల్ల ఉపయోగం ఏమి ఉండదనే వారి అభిప్రాయాన్ని బలపరుస్తోంది" అని చెప్పారు.

చాలా దేశాల్లో విరామం తీసుకోవడాన్ని ప్రయోజనం లేని పనిగా చూస్తారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చాలా దేశాల్లో విరామం తీసుకోవడాన్ని ప్రయోజనం లేని పనిగా చూస్తారు.

వివిధ దేశాల్లో విరామ సమయాన్ని చూసే విధానం గురించి మాల్కోక్ కొన్ని శాంపిళ్లను కూడా పోల్చి చూశారు.

జీవితాన్ని ఆనందంగా గడపడానికి ప్రాధాన్యత ఇచ్చే ఫ్రాన్స్‌తో పోలిస్తే అతిగా పనిచేసే సంస్కృతి ఉన్న భారతదేశం, అమెరికాలలో కూడా విరామం తీసుకోవడాన్ని ప్రయోజనం లేని పనిగా చూస్తున్నారు. నిజానికి, సగటున 30శాతం జనాభా విరామాన్ని పనికిరాని దానిగానే చూస్తోంది.

అయితే, ఈ విషయంలో వివిధ సంస్కృతుల మధ్య వ్యత్యాసం ఉందని మాల్కోక్ చెబుతున్నారు. ఇలాంటి అభిప్రాయం భారతదేశంలో పరిశీలించిన 55శాతం మందిలో ఉంటే, ఫ్రెంచ్ వారిలో ఇది 15 శాతం మాత్రమే ఉందని ఈ అధ్యయనం చెబుతోంది.

వీడియో క్యాప్షన్, గుడ్డు వల్ల ఆరోగ్యానికి లాభమా? నష్టమా?

కొత్త ఆశ

అయితే, ఈ రెండు వర్గాల వారికీ సహాయం చేసేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి.

"మీకెటువంటి విధానం ఇష్టం ఉన్నప్పటికీ విరామం అనేది మీరు నిరంతరం పని చేయాలనే ఆలోచనకు విశ్రాంతి కల్పించడం కోసమే.

జీవితంపై విస్తృతమైన దృక్పథం గురించి ఎక్కువగా అలోచించడం, ఎప్పుడో జరిగే వాటి గురించి చింతించడం మానేస్తే ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదించే అవకాశం లభిస్తుంది" అని కీనన్ చెప్పారు.

విరామ సమయాన్ని పూర్తిగా ఆస్వాదించాలని అనుకునేవారు, సెలవు మధ్యలో బంగీ జంపింగ్ లాంటివి, స్పా సేవలు పొందడం లేదా మంచి భోజనం లాంటివి చేస్తే బాగుంటుందని ఇయాన్ సూచించారు. ఇలాంటివి తెలియని ఆనందాన్నిస్తాయని సూచించారు.

ఎరుకతో ఉండటం చాలా ముఖ్యమని అన్నారు. దాని వల్ల జ్ఞాపకశక్తి పెరిగి, మీ సెలవులను ఎక్కువ రోజులు గుర్తు పెట్టుకుంటారని అన్నారు.

అలాగే, ఒకసారే సుదీర్ఘమైన సెలవు తీసుకోకుండా, చిన్న చిన్న విరామాలను తీసుకోవడం వల్ల ఎక్కువ ఆనందం లభిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నట్లు చెప్పారు.

సెలవు తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న వారు ఒక పని వల్ల వచ్చే ప్రయోజనాలను (ఆరోగ్యం మెరుగుపడటం లేదా సెలవు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు) దృష్టిలో పెట్టుకోవడం వల్ల సెలవులను ఎటువంటి న్యూనత లేకుండా గడపటానికి వీలవుతుంది.

విరామం తీసుకోవడం వృథా అనే భావనను పారదోలి, దానిని మరొక పనికొచ్చే పనితో అనుసంధానం చేసే విషయంపై ఎక్కువ దృష్టి పెట్టాలని మాల్కోక్ సూచించారు.

ఉదాహరణకు డిస్నీల్యాండ్ ట్రిప్ పిల్లలకు తాత్కాలిక ఆహ్లాదాన్ని, తల్లితండ్రులకు కాస్త కీలకమైన విరామాన్ని కలుగచేస్తుంది. వారికి అక్కడున్న వాటి వివరాలను అర్థమయ్యేలా చెప్పడం వల్ల ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు వీలవుతుంది.

వారి సమయాన్ని ఆనందంగా గడిపేందుకు ఈ ఆలోచన సహాయపడుతుందని మాల్కోక్ సూచించారు.

సెలవులను ఆస్వాదించడం కూడా క్రమేపీ అలవాటవుతుంది. బాధ్యతలను వదిలిపెట్టి ఒక 30 గంటల పాటు ఎక్కడికో వెళ్లి విరామంగా గడపడం చాలా తక్కువ సమయం కావచ్చు. చాలా ఎక్కువ పని చేయడం అలవాటు ఉన్నవారు సెలవు తీసుకున్న రోజుల్లో కూడా ప్రతీ రోజూ కొంతసేపు పని చేయడం లాంటివి చేస్తే సమయాన్ని వృథాగా గడుపుతున్నామనే భావన రాదని మాల్కోక్ సూచించారు.

రెండు రకాల వారూ కూడా సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవడం లేదనే భయం వెంటాడితే మాత్రం విరామం తీసుకోవడంలో ఉన్న ప్రయోజనాన్ని పొందలేరు. కానీ, విరామ సమయాన్ని సరిగ్గా గడపడం అంటే పూర్తిగా విశ్రాంతి తీసుకుంటూ, మిగిలిన పనులను పక్కన పెట్టి, మంచి జ్ఞాపకాలను పోగు చేసుకోవడమే.

"ఏదో ఒకటి చేయాలనే భావనతో సెలవులు గడపడం మొదలుపెడితే, అది పూర్తిగా పాడయ్యే ప్రమాదం ఉంది" అని మాల్కోక్ హెచ్చరించారు.

"ఈ సెలవుల నుంచి ఉత్తమమైనదేదో పొందుదామనే ఆలోచనతో ఉండకండి. మీలో ఉత్తమమైన కోణాన్ని వెలికి తీసుకుని రావడానికి చూడండి" అని చెప్పారు.

వీడియో క్యాప్షన్, చన్నీటి స్నానంతో జరిగే మేలు.. శాస్త్రీయ కారణాలు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)