ఇథియోపియా: 'రేప్ చేయడానికి దాడి చేసిన సైనికుడిని ఎదుర్కొనే ప్రయత్నంలో చేయి పోగొట్టుకున్నా'

అత్యాచారం

ఫొటో సోర్స్, Getty Images

మీ అభిమాన భారతీయ క్రీడాకారిణికి ఓటు వేసేందుకు CLICK HERE

ఒక సైనికుడు అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడని, ఆత్మ రక్షణ కోసం ప్రతిఘటిస్తున్నప్పుడు తన కుడి చేయి కోల్పోవాల్సి వచ్చిందని ఇథియోపియాలోని ఒక విద్యార్థిని బీబీసీకి వివరించింది.

ఆ 18 ఏళ్ల విద్యార్థిని గత రెండు నెలలుగా ఇథియోపియాలోని ఉత్తర భాగంలో గల టిగ్రే ప్రాంతంలో ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పేరును మేం వెల్లడించటం లేదు.

టిగ్రేలో 2020 నవంబర్ ఆరంభంలో అంతర్గత సంఘర్షణ మొదలైంది. ఈ ప్రాంత అధికార టీపీఎల్ఎఫ్ పార్టీ ఫైటర్లు కేంద్ర ప్రభుత్వ సైనిక స్థావరాలను స్వాధీనం చేసుకోగా.. ఆ పార్టీని అధికారం నుంచి కూలదోయటానికి ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ సైనిక దాడి ప్రారంభించారు.

ఈ సంఘర్షణ ఈ విద్యార్థిని కలలను ధ్వంసం చేసింది. ఆమె సహ విద్యార్థినుల జీవితాలను కూడా దెబ్బతీసింది.

టిగ్రే రాజధాని మెకిల్‌ను కేంద్ర బలగాలు హస్తగతం చేసుకున్న తర్వాత తాము విజయం సాధించామంటూ నోబెల్ శాంతి బహుమతి విజేత అయిన అబీ అహ్మద్ నవంబర్ 29న ప్రకటించారు. ఆ ప్రకటన తర్వాత కూడా.. ఈ విద్యార్థినుల్లో చాలా మంది.. తమ పట్టణంలోని ఇతర కుటుంబాలతో పాటు పారిపోయి పర్వతాల్లో తలదాచుకుంటున్నారు.

అందుకు కారణం.. లొంగిపోవటానికి నిరాకరించిన టీపీఎల్ఎఫ్ సభ్యులను వేటాడటానికి భద్రతా బలగాలు సైనిక చర్య చేపట్టటమే. ఈ చర్యతో టిగ్రే నివాసులపై తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణలను ఇథియోపియా ప్రభుత్వం తిరస్కరించింది.

ఇథియోపియా

ఫొటో సోర్స్, Getty Images

మెకిల్ నగరానికి పశ్చిమంగా 96 కిలోమీటర్ల దూరంలోని అబీ అడ్డీ పట్టణంలో నివసించే ఈ స్కూలు విద్యార్థిని, ఆమె తాత మిగతావారితో పాటు పారిపోయి అంత దూరం ప్రయాణించలేక ఇంట్లోనే ఉండిపోయారు.

డిసెంబర్ మూడో తేదీన.. ఇథియోపియా సైనిక దుస్తులు ధరించివున్న ఒక సైనికుడు తమ ఇంట్లోకి ప్రవేశించాడని ఈ టీనేజీ యువతి తెలిపింది. టిగ్రేయాన్ ఫైటర్ల ఆచూకీ చెప్పాలని తమను డిమాండ్ చేశాడని చెప్పింది.

ఇంట్లో అంతా వెతికాక ఎవరూ కనిపించకపోవటంతో.. ఆ బాలికను, ఆమె తాతను మంచం మీద పడుకోవాలని ఆదేశించిన సదరు సైనికుడు.. వారి చుట్టూ తుపాకీతో కాల్పులు జరపటం మొదలుపెట్టాడు.

‘‘నా మీద అత్యాచారం చేయాలని నా తాతను ఆదేశించాడు. నా తాతకు చాలా కోపం వచ్చింది. ఆయన తిరగబడ్డాడు. వారి మధ్య కొట్లాట జరిగింది’’ అని ఆ యువతి వివరించింది.

ఆ సైనికుడు తన తాతను బయటకు తీసుకెళ్లి ఆయన భుజాల మీద, తొడల మీద తుపాకీతో కాల్చాడని.. ఆ తర్వాత లోపలికి వచ్చి తన తాతను కాల్చిచంపేశానని తనతో చెప్పాడని తెలిపింది.

‘‘ఇప్పుడిక నిన్నెవరూ కాపాడలేరు. నీ బట్టలు విప్పేయ్’ అని నన్ను ఆదేశించాడు. నేను వద్దంటూ ఎంతో బతిమిలాడాను. అతడు నా మొఖం మీద పదే పదే గుద్దాడు’’ అని ఆమె వెల్లడించింది.

కొన్ని నిమిషాల పాటు పరిస్థితి అలాగే కొనసాగింది. అతడి చేతిలో దెబ్బలకి ఆమెకు స్పృహ కోల్పోయినట్లుగా అనిపించింది. చివరికి అతడు కోపంతో ఆమె మీద తుపాకీ ఎక్కుపెట్టాడు.

‘‘నా కుడి చేయి మీద మూడు సార్లు కాల్చాడు. నా కాలి మీద మూడు సార్లు కాల్చాడు. బయటి నుంచి తుపాకీ కాల్పులు వినిపించటంతో వెళ్లిపోయాడు’’ అని ఆమె తెలిపింది.

అదృష్టవశాత్తూ ఆమె తాత ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడు. కానీ స్పృహలో లేడు. తుపాకీ కాల్పులతో తీవ్రంగా గాయపడ్డ ఆ తాతా మనవరాళ్లు ఇద్దరూ రెండు రోజుల పాటు ఆ ఇంట్లోనే భయంభయంగా గడిపారు. బయటకు వెళ్లి ఎవరినైనా సాయం అడగటానికి కూడా వారు ధైర్యం చేయలేకపోయారు.

బదయూలో గ్యాంగ్ రేప్

‘‘న్యాయం అనేదే లేదు’’

టిగ్రేలో అత్యాచార ఆరోపణల గురించి.. అంతర్యుద్ధంలో లైంగిక హింస అంశంపై ఐక్యరాజ్యసమితి రాయబారి ప్రమీలా పాటెన్ వ్యక్తంచేసిన ఆందోళనలకు ఈ టీనేజీ యువతి చెప్పిన విషయం అద్దం పడుతోంది.

‘‘హింసిస్తామని భయపెడుతూ బాలికలు, మహిళలపై వారి కుటుంబ సభ్యులతోనే అత్యాచారం చేయిస్తున్న విషయాలు వెలుగులోకి వన్నాయి. కొంతమంది మహిళలపై కనీస అవసరాలు ఇస్తామని చెప్పి సైనికులు అత్యాచారానికి పాల్పడ్డ ఉదంతాలూ తెలుస్తున్నాయి. అత్యవసర గర్భనిరోధకాలు, లైంగికంగా సోకే వ్యాధుల పరీక్షలకు డిమాండ్ పెరిగినట్లు వైద్య కేంద్రాలు సూచిస్తున్నాయి. ఇది అంతర్యుద్ధంలో లైంగిక హింసకు సంకేతం’’ అని ఆమె చెప్పారు.

చట్టానికి అతీతంగా హత్యలు చేయటం, సామూహిక అత్యాచారాలకు పాల్పడటం నిత్యకృత్యంగా మారిందని టిగ్రేలోని మూడు ప్రతిపక్ష పార్టీలు పేర్కొన్నాయి. ఒక తండ్రికి తుపాకీ గురిపెట్టి తన సొంత కూతురి మీదే అత్యాచారం చేయించిన ఒక ఉదంతాన్ని వారు ఉదహరించారు.

మెకిల్‌లోని వేర్వేరు ఆస్పత్రులు, వైద్య కేంద్రాల్లో.. ఒక్క జనవరి నెలలోనే తామిద్దరం దాదాపు 200 మంది 18 ఏళ్ల లోపు బాలికల కేసులను నమోదు చేశామని, వారందరూ తమపై అత్యాచారం జరిగిందని చెప్పారని ఒక డాక్టర్, ఒక మహిళా హక్కుల బృందం సభ్యురాలు బీబీసీకి తెలిపారు.

తమపై అత్యాచారాలకు పాల్పడిన వారు ఇథియోపియా సైనిక దుస్తులు ధరించి ఉన్నారని, రేప్ చేసిన తర్వాత వైద్యం చేయించుకోవద్దని కూడా వారు బెదిరించారని బాధిత బాలికల్లో చాలా మంది చెప్పినట్లు వీరిద్దరూ వివరించారు. వీరు తమ పేర్లు గోప్యంగా ఉంచాలని కోరారు.

‘‘ఆ బాలికల శరీరం మీద గాయాలున్నాయి. కొందరి మీద సామూహిక అత్యాచారం జరిగింది. ఒక బాలికను వారం రోజుల పాటు నిర్బంధించి మరీ అత్యాచారం చేశారు. పోలీసులు అనేవారే లేరు. కాబట్టి న్యాయం అనేదే లేదు’’ అని ఆ డాక్టర్ వివరించారు.

బదయూలో గ్యాంగ్ రేప్

ఫొటో సోర్స్, GOPAL SHOONYA/BBC

‘‘టిగ్రేలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇలాంటి దిగ్భ్రాంతికర అత్యాచార ఉదంతాలు మాకు తెలుస్తున్నాయి. కానీ రవాణా సమస్యల వల్ల మేం వారికి సాయం చేయలేకపోయాం. పరిస్థితి చాలా విషాదకరంగా ఉంది’’ అని మహిళా హక్కుల బృందం సభ్యురాలు తెలిపారు.

ఇటీవలి కాలంలో హెచ్‌ఐవీని నిరోధించే మందులు కావాలని, అత్యాచారాలకు సంబంధించి అత్యవసర గర్భనిరోధక సేవలు కావాలని కోరుతూ రోజుకు ఐదారుగురు మహిళలు తమ వద్దకు వస్తున్నారని మెకిల్‌లోని ఒక ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యాధికారి తెలిపారు.

బాలికలు, మహిళలపై అత్యాచారానికి పాల్పడటాన్ని యుద్ధంలో ఒక ఆయుధంగా ఉపయోగిస్తున్నట్లుగా తాను భావిస్తున్నానని టిగ్రే మహిళా హక్కుల బృందం ‘యికోనో’ ప్రతినిధి వేనీ అబ్రహ బీబీసీతో పేర్కొన్నారు. ఆమె డిసెంబర్ చివరి వరకూ మెకిల్‌లోనే ఉన్నారు.

‘‘మెకిల్‌లో చాలా మంది మహిళలను రేప్ చేశారు. ప్రజల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయటానికి, వారిని భయపెట్టటానికి, అణగిపోయి ఉండేలా చేయటానికి ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారు’’ అని ఆమె చెప్పారు.

ఈ ఆరోపణలను ఇథియోపియా సైన్యం చీఫ్ బిర్హాను జులా గెలాల్చా తిరస్కరించారు.

‘‘మా భద్రతా బలగాలు రేప్ చేయవు. వారు దోపిడీ దొంగలు కాదు. ప్రభుత్వ బలగాలు. ప్రభుత్వ బలగాలకు నైతిక విలువలు ఉన్నాయి. నియమనిబంధనలు ఉన్నాయి’’ అని ఆయన బీబీసీతో పేర్కొన్నారు.

హక్కుల సంఘాలు చెప్తున్న లెక్కలు చాలా అతిగా ఉన్నాయని మెకిల్ తాత్కాలిక మేయర్‌గా ఇటీవలే నియమితుడైన అటాకిల్టీ హెలిసిలాస్ వ్యాఖ్యానించారు.

ఈ ఆరోపణలపై దర్యాప్తు చేయటానికి ప్రభుత్వం ఇటీవల ఒక టాస్క్ ఫోర్స్‌‌ను టిగ్రేకు పంపించింది. మహిళా, ఆరోగ్య శాఖల ప్రతినిధులు, అటార్నీ జనరల్ అధికారులతో కూడిన ఈ బృందం అత్యాచారాలు జరిగాయని ధృవీకరించింది. వీరు ఇంకా పూర్తిస్థాయి నివేదిక సమర్పించాల్సి ఉంది.

టిగ్రే మొత్తం మీద గత రెండు నెలల్లో 108 రేప్ కేసులు నమోదయ్యాయని ఇథియోపియన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గత వారం చెప్పింది. అయితే.. లైంగిక హింస బాధితులు సాధారణంగా సాయం కోసం ఆశ్రయించే స్థానిక పోలీసు, ఆరోగ్య వ్యవస్థలు అక్కడ లేవని ఈ కమిషన్ అంగీకరించింది.

అత్యాచారం

ఫొటో సోర్స్, Getty Images

‘నేను ఇంజనీర్ కావాలనుకున్నాను’

సైనికుడి అత్యాచార యత్నాన్ని ప్రతిఘటించి కాల్పులకు గురైన అబీ అడ్డీ టీనేజీ యువతి గురించి ఒక డాక్టర్ బీబీసీకి వివరించారు. ఆ యువతి చేయిని సదరు డాక్టర్ తొలగించాల్సి వచ్చింది.

తమపై దాడి జరిగిన రెండు రోజుల తర్వాత.. ఆ ప్రాంతంలో సోదాలు నిర్వహిస్తున్న ఎరిత్రియా సైనికులు తమను ఎలా గుర్తించారో ఆ యువతి, ఆమె తాత సదరు వైద్యుడికి వివరించారు. అయితే.. టిగ్రే సంఘర్షణలో ఎరిత్రియా ప్రమేయాన్ని ఇథియోపియా, ఎరిత్రియా రెండు దేశాలూ తిరస్కరిస్తున్నాయి.

ఎరిత్రియా సైనికులు తమ గాయాలకు కట్లుకట్టి తమను ఇథియోపియా సైనికులకు అప్పగించారని, అబీ అడ్డీలో ఆస్పత్రి మూతపడటంతో వారు తమను మెకిల్‌కు తీసుకువచ్చారని తాతామనవరాళ్లు తెలిపారు.

ఆ యువతి తాత ఇప్పుడు గాయాల నుంచి కోలుకున్నాడు. కానీ అతడి మనవరాలి చేయిని తీసివేయటంతో ఆమెకు ఇంకా చికిత్స అవసరం. ఆమె కుడికాలికి ఇంకా కట్టుకట్టే ఉంది.

ఆస్పత్రి బెడ్ మీద నుంచే ఆ యువతి బీబీసీతో మాట్లాడింది. తను కన్న కలల గురించి కన్నీటితో వివరించింది.

ఈ యుద్ధం మొదలవటానికి ముందు స్కూలు చివరి సంవత్సరం చదువుతోందీ యువతి. అది పూర్తయ్యాక యూనివర్సిటీకి వెళ్లి ఇంజనీరింగ్ చదివి ఏదైనా మంచి ఉద్యోగం చేయాలని.. తన తల్లి చనిపోయినప్పటి నుంచీ తనను పెంచుతున్న తన తాతను బాగా చూసుకోవాలని ఆమె ఆకాంక్షించేది.

‘‘ఇప్పుడు అది ఎలా జరుగుతుంది? నేను ఇంజనీర్‌ను అవుతానని అనుకున్నా. కానీ ఇప్పుడు కాలేను’’ అంటూ ఏడుస్తున్న ఆ బాలికను బెడ్ పక్కనే ఉన్న ఆమె తాత ఓదార్చారు.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)