కరోనా లాక్‌డౌన్ కుటుంబ సంబంధాల ప్రాధాన్యాన్ని గుర్తు చేసిందా?

తల్లి కొడుకు
ఫొటో క్యాప్షన్, కుమారుడితో దివ్య గుప్తా

కరోనా వైరస్ ప్రపంచంలోని అనేక దేశాల్లో విజృంభిస్తుంది. ఇప్పుడు భారత్ లో కూడా కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు భారత ప్రభుత్వం 21రోజుల లాక్ డౌన్ ప్రకటించింది. లాక్ డౌన్ ప్రకటించక ముందే దేశంలోని అనేక స్కూళ్ళు, కాలేజీలు విద్యార్థులకు సెలవులు ప్రకటించారు.

అకస్మాత్తుగా వచ్చిన సెలవులతో పిల్లల బాధ్యత ఎలా నిర్వహించాలో కొంత మంది ఉద్యోగాలు చేస్తున్న గృహిణులు సతమతమవుతుంటే, మరి కొంత మంది తల్లులు తమకు పిల్లల్తో గడిపే సమయం దొరికినందుకు ఆనందిస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలలోని మహిళలు ఈ లాక్ డౌన్ సమయాన్ని ఎలా గడుపుతున్నారో తెలుసుకునేందుకు బీబీసీ న్యూస్ తెలుగు ప్రతినిధి పద్మ మీనాక్షి ప్రయత్నించారు.

కరోనావైరస్ భయం మనసులో ఉన్నప్పటికీ, చాలా మంది పిల్లల తల్లులు ఈ సమయాన్ని తమ బంధాలను బలపర్చుకునే సమయంగా చూస్తున్నారు.

నాగిని కందాల
ఫొటో క్యాప్షన్, నాగిని కందాల

"నాకైతే వీకెండ్ కాస్త పెరిగినట్లుగా ఉంది", అని చెన్నై లో ఒక ఐటీ కంపెనీ లో పని చేస్తున్న ప్రియా ఆనంద్ అన్నారు.

పిల్లల్ని బలవంతంగా వేసవి క్యాంపులకి పంపకుండా ఇంటి పట్టునే ఏదో ఒక పనిలో పాలు పంచుకునేటట్లు చేసే అవకాశం దొరికిందని అన్నారు. ఆమెకి 10 ఏళ్ళ బాబు, నాలుగేళ్ళ పాప ఉన్నారు.

పిల్లలు ఇంట్లో ఉండటం వలన ఇల్లు ఎక్కువ సార్లు శుభ్రం చేసుకోవల్సి వస్తుంది గాని దానితో వచ్చే ఇబ్బంది ఏమి లేదని అన్నారు.

12 సంవత్సరాల బాబు ఉన్న తేని, మధురైకి చెందిన నాగిని కందాళ కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తపరిచారు. సహజంగానే పుస్తకాలంటే ఆసక్తి ఉన్న వాళ్ళ అబ్బాయి కిండ్లేల్లో దొరికే బోలెడు కొత్త పుస్తకాలు చదువుకుంటున్నాడని చెప్పారు.

జి సి కవిత, సైకాలజిస్ట్
ఫొటో క్యాప్షన్, జి సి కవిత, సైకాలజిస్ట్

అయితే, సమస్య అంతా టీనేజ్ పిల్లలతోను, చంటి పిల్లలతోను వస్తుందని, హైదరాబాద్ కి చెందిన కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ జీసీ కవిత అన్నారు.

ఇంట్లోనే ఉండటం పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న ఒక టీనేజ్ అమ్మాయి తల్లి తన దగ్గరకి కౌన్సిలింగ్‌కు వచ్చినప్పుడు ఏం జరిగిందో ఆమె వివరించారు.

"ఆ అమ్మాయికి సోషల్ ఐసొలేషన్ వలన ఇంటి నుంచి బయటకి వెళ్లలేకపోతున్నానని, స్నేహితులను కలవలేకపోతున్నానే సమస్యలు ఉన్నాయి. బయటకి వెళ్లలేకపోతున్నప్పటికీ స్నేహితులు అందరితోనూ ఫోన్ లో వాట్సాప్ లో, స్కైప్ లో మాట్లాడే అవకాశం ఉందని ఆ అమ్మాయికి అర్ధం అయ్యేటట్లు చెప్పడానికి నాకు బోలెడు సమయం పట్టింది."

ఈ సెలవుల పట్ల చాలా మందికి ఫిర్యాదులు ఏమి లేవు. పిల్లలు ఈ నిర్బంధం వలన క్రమశిక్షణగా తయారు అవుతున్నారని చాలా మంది తల్లులు భావిస్తున్నారు.

నీహారిక రెడ్డి
ఫొటో క్యాప్షన్, నీహారిక రెడ్డి

హైదరాబాద్ కి చెందిన ఫాషన్ డిజైనర్ నీహారిక రెడ్డి తన పిల్లల గురించి చెబుతూ , నిత్యం పని ఒత్తిడితో పిల్లలతో గడిపే సమయమే ఉండదని, ఇప్పుడు రోజంతా వాళ్ళతో గడుపుతూ, కావాల్సిన కధలు చెబుతున్నానని చెప్పారు.

"పిల్లలు రోజు తాత, అమ్మమ్మలతో ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. ఇన్ని రోజులు అనుభవించలేకపోయిన క్షణాలన్నీ అనుభవిస్తున్నాను" అని అన్నారు.

ఈ రోజుల్లో ఎంత మంది పిల్లలు తమ తాత మామ్మలతో తరచుగా మాట్లాడుతున్నారని కవిత ప్రశ్నించారు. సాధారణంగా పెద్దవాళ్ళే పిల్లలతో మాట్లాడాలని తహతహలాడుతూ ఉంటారని అన్నారు.

అకస్మాత్తుగా వచ్చిన పిల్లల సెలవులతో ఉద్యోగాన్ని, ఇంటిని ఎలా చూసుకోవాలో తెలియక మరో ఉద్యోగి, సతమతమవుతున్నారని చెప్పారు. ఆమె పిల్లలు చిన్నవాళ్లు కావడంతో ఒక పని అమ్మాయిని పెట్టుకున్నట్లు చెప్పారు.

కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్
విజయభాను
ఫొటో క్యాప్షన్, విజయభాను

గ్రామాలలో పరిస్థితి కూడా ఇలాగే ఉందా?

ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా కే.ఎచ్ వాడ గ్రామం ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో టీచర్ గా పని చేస్తున్న విజయభాను కోటే తన స్కూల్ పిల్లలతో ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేసి, దాని ద్వారా పాఠాలు చెబుతూ పిల్లలని బయటకి వెళ్లకుండా చూసుకుంటున్నట్లు చెప్పారు.

ఈ సెలవుల్లో పాఠాలు చెప్పవలసిన అవసరాన్ని వివరిస్తూ, ఐదవ తరగతి వరకు ఉన్న తమ స్కూల్ విద్యార్థులు, వచ్చే విద్య సంవత్సరం నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదవాల్సి ఉంటుందని, ఒకవేళ ఇప్పుడు వాళ్ళని అందుకు తగిన విధంగా సంసిద్ధం చేయకపోతే , పిల్లలు చాలా ఇబ్బందులు పడతారని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధన ప్రవేశ పెడుతుంది.

దిల్లీలో నివసిస్తున్న రీతు శర్మ కి 10, 12వ తరగతి చదువుతున్న పిల్లలు ఉన్నారు. ఆమె కూడా పిల్లలు ఇంట్లో ఉండటం పట్ల వారి మధ్య బంధం బలపడుతుందని అన్నారు.

"వ్యాపారాలు జరగకపోవడంతో మా పిల్లలు డబ్బు విలువ అర్ధం చేసుకుంటున్నారు. బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేయకుండా ఇంట్లోనే రక రకాల వంటలు వండుకుని తింటున్నారు", అని చెప్పారు.

కుటుంబం
ఫొటో క్యాప్షన్, రీతూ శర్మ కుటుంబం

ఈ సమయం పిల్లలకి, పెద్దవాళ్ళకి మధ్య బంధాన్ని పెంపొందిస్తుందా?

అవుననే అన్నారు రీతు శర్మ. ఎందుకంటే, ఎప్పుడూ చదువులోనో, ఇంకొక పనిలోనే బిజీగా ఉండే పిల్లలతో గడిపే సమయం తమకి దొరికిందని అన్నారు.

"కుటుంబంతో గడిపే సమయం పెరిగింది. కలిసి ఇంటి పని చేసుకోవడం, కొత్త వంటలు, కళలు నేర్చుకోవడం, ఇల్లు సర్దుకోవడం లాంటి పనులు చేసుకుంటున్నాం". ఆమె తన భర్త, పిల్లలు, అత్తగారు, మామగారితో కలిసి ఉమ్మడి కుటుంబంలో ఉంటారు.

దివ్య గుప్త అనే ఇంకొక గృహిణి కూడా తమ పిల్లలలో బయటకి వస్తున్న కళాత్మకత గురించి ఆనందం వ్యక్తం చేశారు.

తన తొమ్మిదేళ్ల కూతురు పాత సాక్స్ తో బార్బీకి గౌను కొట్టిందని, తన పదమూడేళ్ల కొడుకు ఇంట్లోనే పిజ్జా తయారు చేయడం నేర్చుకున్నాడని మురిసిపోతూ చెప్పారు.

తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఈ వైరస్ బారి నుంచి బయట పడతామని ఆశని వ్యక్తం చేశారు.

పిల్లలు ఇంట్లో ఉండటం పట్ల తల్లుల దగ్గర నుంచి పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం కాలేదు.

ఈ సామాజిక నిర్బంధం కుటుంబ బంధాలని బలపరుస్తుందేమో అని కవిత అన్నారు. సోషల్ ఐసొలేషన్, కేవలం వినడానికే కొత్తగా ఉంది కానీ, నిజానికి టెక్నాలజీ రూపంలో ఎప్పుడో మన కుటుంబ వ్యవస్థని కబళించేసిందని అన్నారు.

ఒకవేళ ఈ ఊహించని నిర్బంధం కనక కుటుంబ వ్యవస్థ బలపడటానికి పునాది వేస్తె , అది ఒక మంచి భవిష్యత్ కి పునాది వేసినట్లేనని కవిత అభిప్రాయపడ్డారు.

BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)