ఒమిక్రాన్: 11 రాష్ట్రాలకు పాకిన కొత్త వేరియంట్ - మహారాష్ట్ర, దిల్లీలలో అత్యధికంగా కేసులు, బయటపడే మార్గం లేదా

ఫొటో సోర్స్, DRPIXEL
భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్ కరోనావైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటివరకు ఈ వేరియంట్ 11 రాష్ట్రాలకు పాకింది. ఇంతవరకు మొత్తం 101 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
అత్యధికంగా మహారాష్ట్రలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు కాగా 22 కేసులతో దిల్లీ రెండో స్థానంలో ఉంది.
రాజస్థాన్‌లో 17, కర్ణాటకలో 8, తెలంగాణలో 8, గుజరాత్‌లో 5, కేరళలో 5 కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పశ్చిమబెంగాల్, చండీగఢ్‌లలో ఒక్కో కేసు నమోదైంది.
బోట్సువానాలో తొలిసారి గుర్తించారు
ఈ ఏడాది నవంబర్ మధ్యలో, దక్షిణ ఆఫ్రికాలోని బోట్సువానాలోని శాస్త్రవేత్తలు కొత్త రకం కోవిడ్ వైరస్ నమూనాలను పరిశీలిస్తున్నారు. వైరస్ స్పైక్ ప్రోటీన్‌లో ఇంతకుముందు చూడని అనేక ఉత్పరివర్తనాలను వారు గుర్తించారు.
అక్కడికి మూడు వారాల్లోనే, ఈ వైరస్ వేరియంట్ 70 కంటే ఎక్కువ దేశాలకు పాకింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వేరింయట్‌కు B.1.1.529 ఒమిక్రాన్ అని పేరు పెట్టింది. ఇది ప్రమాదకరమైన, జాగ్రత్త పడాల్సిన అంశంగా ప్రకటించింది. శుక్రవారం నాటికి ఈ వేరియంట్ 91 దేశాల్లో కనిపించింది.
దీనికి ముందు వచ్చిన డెల్టా వేరియంట్‌కన్నా ఇది వేగంగా వ్యాప్తి చెందుతోందని, అయితే ఇది ప్రాణాంతకమా కాదా అన్నది తెలుసుకోవడానికి ఇంకా కొంత సమయం పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
ఈ కొత్త వేరియంట్‌తో ప్రపంచం ఎలా పోరాడబోతోంది ?
18 నెలల క్రితం కరోనా తొలి కేసు నమోదైంది. అప్పటి నుంచి ఇందులో చాలా మ్యుటేషన్లు వచ్చాయి. ఆల్ఫా కంటే డెల్టా ప్రాణాంతకమైంది. కాబట్టి, దాని తర్వాత వచ్చిన ఒమిక్రాన్ గురించి ఆందోళనలు సహజమే.
''ఇటీవలి నెలల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు కోవిడ్ నుంచి బయటపడ్డారు. టీకాలు కూడా పెద్ద సంఖ్యలో వేస్తున్నారు. అటువంటి పరిస్థితిలో వ్యాధి మళ్లీ విస్తరిస్తే, టీకాలు తీసుకున్నవారు, వైరస్ నుంచి బయటపడిన వారు ఈ వ్యాధిని నివారించగలరని భావించవచ్చు’’ అని ప్రొఫెసర్ రిచర్డ్ లెజెల్స్ అన్నారు. ఆయన దక్షిణాఫ్రికాలోని క్వాజులు-నాటల్ విశ్వవిద్యాలయంలో అంటు వ్యాధి నిపుణుడిగా పని చేస్తున్నారు.
"మొదట్లో ఇన్ఫెక్షన్ కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురవుతారని అనుకున్నారు. వారిలో కూడా 10 నుండి 30 సంవత్సరాల వయస్సు గల యువకులు ఉంటారని, వారు ప్రమాదంలో ఉన్నారని భావించారు. కానీ మాకు అర్థమైనదేంటంటే, వారు పూర్తిగా టీకాలు తీసుకోకపోయినా, తీవ్రమైన అనారోగ్యానికి మాత్రం గురి కాలేదు'' అన్నారాయన.
జూన్-జూలైలో డెల్టా వేవ్ వచ్చినప్పుడు, ఇన్ఫెక్షన్ రేటులో వేగవంతమైన పెరుగుదల లేదు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఒమిక్రాన్ వేవ్ ప్రారంభంలోనే మూడు రెట్ల వేగవంతమైన పెరుగుదల కనిపిస్తోంది. దీనర్ధం, ఇది ఇంతకు ముందు వ్యాధి బారిన పడినవారి రోగ నిరోధక శక్తిని కూడా దెబ్బతీయగలదు అని.
"కొత్త వేరియంట్‌లు వేగంగా విస్తరిస్తున్నాయి. ప్రభుత్వాలు స్పందించి ఆంక్షలు విధించినా, ఇప్పటికే చాలా దేశాలకు చేరింది. వైరస్ బాధితులు కూడా పెరుగుతున్నారు'' అని ప్రొఫెసర్ రిచర్డ్స్ అన్నారు.
దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్ కనిపించగానే దానికి జినోమ్ సీక్వెన్స్‌ను కూడా వేగంగా ప్రకటించడంతో, అడ్డుకునే చర్యలకు దిగిన సైంటిస్టుల పని సులభంగా మారింది. అయితే, దీని నుంచి ఎదురవుతున్న సవాళ్లు చిన్నవేం కాదు.
''ప్రజలు వీధుల్లోకి వస్తున్నారు. బహిరంగ ప్రదేశాలలో గుంపులుగా తిరగడంపై ఎలాంటి నిషేధాలు కనిపించడం లేదు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునే ప్రయత్నాలు పెద్దగా జరగడం లేదు. ఒమిక్రాన్ వ్యాప్తిని ఆపడానికి చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత దిగజారిపోతుందనే ఆందోళన ఉంది'' అని ప్రొఫెసర్ రిచర్డ్స్ అన్నారు.
ఇది ప్రమాదకరమని హెచ్చరికలు వినిపిస్తున్నా, ఆంక్షలు విధించడానికి ప్రభుత్వాలు వెనకాడుతున్నాయి. ప్రజల్లో వ్యతిరేకత వస్తుందేమోనన్నది వాటి భయం.

రోగనిరోధక వ్యవస్థ మీద ఎలాంటి ప్రభావం పడుతుంది
ప్రొఫెసర్ ఫ్రాంకోయిస్ బల్లాక్స్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్‌లోని జెనెటిక్స్ ఇన్‌స్టిట్యూట్‌కి డైరెక్టర్ గా పని చేస్తున్నారు. వైరస్‌ల జీనోమ్ సీక్వెన్స్‌ని చదవడం ద్వారా, ఒక వేరియంట్ ఒక వ్యక్తిని ఎలా ప్రభావితం చేస్తుంది, అంటే టీకాలు తీసుకోవడం, లేదా మొదటిసారి కోవిడ్ సోకిన వ్యక్తి రోగనిరోధక వ్యవస్థ వీటిని ఎలా ఆపగలదు అన్న విషయాలను తెలుసుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు.
''మనలోని వ్యాధి నిరోధక శక్తి వైరస్‌లోని వందల రకాల భాగాలను గుర్తించగలదు. వైరస్‌లోని స్పైక్ ప్రోటీన్ వైరస్ రోగ నిరోధక వ్యవస్థలోకి ప్రవేశించడానికి కారణమయ్యే భాగం. ఒకవేళ ఇందులో మార్పులు జరిగితే అప్పుడు మన రోగ నిరోధక వ్యవస్థ వైరస్‌ను గుర్తించలేదు'' అని ప్రొఫెసర్ బల్లాక్స్ వివరించారు.
వైరస్ సోకడానికి రోగనిరోధక వ్యవస్థను దాటుకుని రావడం చాలా ముఖ్యమని ప్రొఫెసర్ బల్లాక్స్ అంటున్నారు. "వైరస్ భాగాలను యాంటీబాడీస్ గుర్తించకపోతే, ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ, మన రోగనిరోధక వ్యవస్థ ఇప్పటికీ వైరస్‌కు చెందిన వందలాది భాగాలను గుర్తిస్తోంది. కాబట్టి, వైరస్ సోకిన వ్యక్తి వెంటనే తీవ్ర అనారోగ్యానికి గురి కావడం ఉండదు" అని ప్రొఫెసర్ బల్లాక్స్ వివరించారు.
రోగ నిరోధక శక్తి బాగుంటే అది ఒమిక్రాన్‌తో పోరాడడంలో కొంతమేరకు సహాయంగా నిలుస్తుంది. దీనితో పాటు, వైరస్ పునరుత్పత్తి కాకుండా నిరోధించగల ఔషధాల కోసం శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు .
"మెర్క్ కంపెనీ మోల్నుపిరవిర్ అనే ఔషధాన్ని డెవలప్ చేస్తోంది. ఈ మందు వల్ల వైరస్ బలహీన పడుతుంది. ఫైజర్ కూడా మరో మెడిసిన్‌ను తయారు చేస్తోంది. ఈ రెండు కంపెనీలు ఒమిక్రాన్‌ను నిరోధించగల మందుల తయారీలో పోటీ పడుతున్నాయి'' అని ప్రొఫెసర్ ఫ్రాంకోయిస్ బల్లాక్స్ అన్నారు.

ఒమిక్రాన్ సహా కొత్తగా రావడానికి అవకాశం ఉన్న వేరియంట్‌లతో పోరాడేందుకు త్వరలోనే వ్యాక్సీన్ లు తయారు చేస్తామని టీకా కంపెనీలు కూడా చెబుతున్నాయి.
"మనం వ్యాక్సీన్‌లు తీసుకుంటూ, కరోనా ఇన్ఫెక్షన్ నుండి కోలుకున్నప్పుడే వైరస్‌తో మెరుగ్గా పోరాడగలిగినట్లుగా భావించాలి. చిన్నతనం నుండి ఇప్పటి వరకు వందలాది వైరస్‌లకు గురై ఉంటాం. అవి మనల్ని తీవ్ర అస్వస్థతకు గురి చేయలేదు. కొన్నిసార్లు ఆ వైరస్‌లు మళ్లీ సోకినట్లు మనకు తెలియదు కూడా. కాలక్రమేణా ఈ వైరస్ కూడా ప్రమాదరహితంగా మారవచ్చు. అయితే దీనికి కొన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు మనం చేయగలిగింది ఏమీలేదు'' అన్నారు ప్రొఫెసర్ ఫ్రాంకోయిస్.
ఒక వ్యక్తికి సోకిన తర్వాత, ఈ కొత్త వేరియంట్ అతన్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడానికి కొన్ని వారాలు పట్టవచ్చని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఇన్నేట్ ఇమ్యూనిటీ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న క్లైర్ బ్రయంట్ అన్నారు.
"డెల్టా కంటే ఒమిక్రాన్ తీవ్రమైన అంటువ్యాధని ఇప్పటి వరకు మనకు తెలుసు. ఇది ఆందోళన కలిగించే విషయం కూడా. ఎందుకంటే ఇది ఆసుపత్రులపై ఒత్తిడిని పెంచుతుంది. దీనివలన మరొక ఇబ్బంది కూడా ఉంది. ఇది ఎక్కువ మంది శరీరాలలోకి ప్రవేశించి, ఎక్కువగా పరివర్తన చెందే అవకాశం ఉంది. దీనివల్ల కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉంటుంది. దీనిని నివారించడానికి టీకా చాలా ముఖ్యం'' అన్నారామె.
నిర్ణీత వ్యవధిలో వ్యాక్సీన్ తీసుకోవడం సహాయకారిగా ఉంటుందని క్లైర్ చెప్పారు. ఫ్లూ వైరస్‌ను ఎదుర్కోవడానికి చాలా దేశాలు ఇలాంటి వ్యూహాలను అనుసరిస్తున్నాయి.
''దక్షిణాఫ్రికా ఈ విషయంలో త్వరగా సమాచారం అందించడం ప్రయోజనకరంగా మారింది. అయితే రాబోయే కాలంలో ఇతర దేశాలు కూడా కొత్త వేరియంట్‌ల గురించి ఇదే వేగంతో సమాచారం ఇవ్వడానికి ముందుకు వస్తాయా అన్నది సవాలు'' అని క్లైర్ చెప్పారు.

మరి వ్యాక్సీన్‌లలో మార్పులు చేయడం సులభమేనా?
"ఇప్పుడు మూడు నెలల వ్యవధిలో కొత్త వ్యాక్సిన్‌ను తయారు చేయవచ్చు. ఎందుకంటే దీని కోసం ఇప్పటికే ఉన్న వ్యాక్సీన్ లో చిన్నచిన్న మార్పులే చేయాల్సి ఉంటుంది. ఈలోపు ఏవైనా కొత్త వేరియంట్‌లు వస్తాయో లేదో మనం ఊహించలేం. కానీ వైరస్ పుట్టి 18 నెలలు అవుతోంది. వీటిని నియంత్రించడంలో ఇప్పటికే మనం మెరుగైన స్థితిలో ఉన్నాం'' అన్నారు క్లైర్
''ఓమిక్రాన్ కేసులు వచ్చినచోట, మరణాల రేటులో పెద్దగా మార్పు రాలేదని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ వికాస్ భాటియా అన్నారు. కానీ వైరస్ నిరంతరం మారుతూ ఉంటుంది, కాబట్టి అజాగ్రత్తగా ఉండకూడదని ఆయన హెచ్చరించారు. "బహుశా ఇది ఒకవైపు కోవిడ్ మహమ్మారి ముగింపుకు నాంది కావచ్చు'' అన్నారాయన.
అయితే, మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని, శత్రువు తన స్వభావాన్ని ఎలా మార్చుకోగలదో అర్థం చేసుకోవాలని భాటియా అన్నారు. టీకాలు తీసుకోవడం, మాస్కులు ధరించడమే అత్యుత్తమ మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు.
భారతదేశంలో చాలామంది వైరస్ బారిన పడి కోలుకున్నారని, వారిలో చాలామందికి కొంత రోగ నిరోధక శక్తి వచ్చి ఉంటుందని, టీకాల కారణంగా అది మరింత మెరుగుపడుతుందని వికాస్ భాటియా అన్నారు.
"రాబోయే కొద్ది రోజుల్లో 18 ఏళ్లు పైబడిన వారిలో 90 శాతం మందికి కనీసం ఒక డోస్ కోవిడ్ వ్యాక్సీన్ అందుతుంది. సహజంగా ఉండే వ్యాధి నిరోధకతా, వ్యాక్సీన్ ద్వారా వచ్చే నిరోధకతను కలిపి మేం హైబ్రిడ్ రోగ నిరోధక శక్తి అని అంటున్నాము. ఇది కోవిడ్‌కు వ్యతిరేకంగా పోరాడుతుంది'' అన్నారాయన.

ఫొటో సోర్స్, Getty Images
పిల్లలకు ఎంత వరకు ప్రమాదం?
టీకాలు తీసుకోని వారు అంటే పిల్లలు దీనివల్ల ఎక్కువ ప్రమాదంలో ఉంటారా? ''ఈ రోజుల్లో హైబ్రిడ్ రోగ నిరోధక శక్తి పెద్దలలో వచ్చినందున పిల్లలు, యుక్తవయస్సులో ఈ కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే దీని గురించి ఆందోళన చెందాల్సిన పని లేదు. ఎందుకంటే ఇలాంటి వారిలో మరణాలు చాలా తక్కువగా ఉన్నాయి. కంగారుపడి ఆసుపత్రులకు వెళ్లే సందర్భాలు కూడా లేవు'' అన్నారు వికాస్ భాటియా.
కానీ, సమస్య ఏంటంటే వైరస్ ప్రాణాంతకం కానప్పటికీ, అంటువ్యాధిగా ఎక్కువ మందిని అనారోగ్యానికి గురి చేస్తుంది. అటువంటి పరిస్థితిలో, ఆరోగ్య వ్యవస్థపై ఒత్తిడి పడుతుంది.
"అందుకే మేం పదే పదే చెబుతున్నాం. మరణాలు తక్కువగానే ఉంటాయి. కానీ, ఆసుపత్రులు ఎక్కువమందిని చేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇది ఎలా వ్యాపిస్తుంది, ఎలా రూపాన్ని మార్చుకుంటుందేనేది చెప్పడం కష్టం'' అన్నారాయన.

ఫొటో సోర్స్, Getty Images
ప్రభుత్వం ఏం చేయాలి?
డెల్టా వేవ్‌ను ఎదుర్కొన్న తర్వాత ఒమిక్రాన్‌తో పోరాడేందుకు మనం ఎంత వరకు సిద్ధంగా ఉన్నాం అన్నదానిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని నిపుణులు చెబుతున్నారు. "కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో ప్రభుత్వం చాలా సన్నాహాలు చేసింది. ఇప్పుడవన్నీ యాక్టివ్ మోడ్‌లో ఉండేలా చూసుకోవాలి. ప్రజలను కూడా సిద్ధం చేయాలి. పరీక్షలు కూడా పెంచాల్సిన అవసరం ఉంది'' అని డాక్టర్ వికాస్ భాటియా సూచించారు.
ఇప్పుడు మళ్లీ మనల్ని మనం మొదటి ప్రశ్న వేసుకుందాం. ఒమిక్రాన్ వేరియంట్ వేవ్‌ని ఎలా ఎదుర్కోవాలి?
ఈ ప్రశ్నకు సమాధానం కొత్త వేరియంట్ ప్రవర్తన ఎలా ఉంటుందనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఇప్పటి వరకు తెలిసిన దాని ప్రకారం, ఇది తీవ్రమైన అంటువ్యాధి. కానీ, ఎంత తీవ్రంగా మారుతుందని స్పష్టంగా చెప్పలేని పరిస్థితి.
పెద్ద సంఖ్యలో ప్రజలు అనారోగ్యానికి గురైతే, అది మన రోగనిరోధక వ్యవస్థలోకి చొచ్చుకుపోగలిగిందని అర్థం. అటువంటి పరిస్థితిలో, ప్రభుత్వాలు మరిన్ని ఆంక్షలు విధించవలసి ఉంటుంది. ఈ వైరస్ అంటువ్యాధి వైరస్ నుండి సాధారణ వైరస్‌గా మారేదాకా, వ్యాక్సీన్ తయారు చేసే పని నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది.
చివరగా చెప్పొచ్చేదేంటంటే ఈ అంటువ్యాధి పిల్లి, ఎలుక ఆట లాంటిది. ఈ ఆటలో శాస్త్రవేత్తలు గెలుస్తారని అందరూ భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘భారత సైన్యానికి లొంగిపోకపోతే మరో పాకిస్తాన్‌ను కూడా కోల్పోవాల్సి ఉండేది’
- భీకర సుడిగాలికి ఎగిరిపోయిన పెళ్లి ఫొటోలు, సర్టిఫికేట్లు 225 కిలోమీటర్ల అవతల దొరికాయి
- ప్రధాన మంత్రే స్వయంగా మిలటరీ దుస్తులు ధరించి యుద్ధ రంగంలో దిగారు
- కూరగాయలు కోసే కత్తితో సొరంగం తవ్వి ఉత్తరప్రదేశ్‌లోని జైలు నుంచి పారిపోయిన పాకిస్తాన్ సైనికులు
- క్యాన్సర్ చికిత్స తరువాత సెక్స్ సమస్యలు వస్తాయా? కెమికల్ మెనోపాజ్ అంటే ఏమిటి
- ‘కరోనా’లో ప్రవేశించిన అంతరిక్ష నౌక.. ఖగోళ చరిత్రలో తొలిసారి
- విరాట్ కోహ్లీ: ‘వన్డే కెప్టెన్సీ నుంచి తొలగిస్తున్నట్లు టెస్ట్ టీమ్ సెలక్షన్‌కు గంటన్నర ముందు చెప్పారు’
- 2021లో ప్రజలు గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసినవి ఇవే
- బిపిన్ రావత్ మరణం: చైనా విషయంలో భారత విధానంపై ప్రభావం పడుతుందా?
- ‘నీ సెక్స్ జీవితం ఎలా ఉంది అని అడిగారు, రేప్ చేసి చంపేస్తామనీ బెదిరించారు’
- ఆంధ్రప్రదేశ్: పంచాయతీ నిధులను దారి మళ్లించారా, సర్పంచుల ఆందోళన ఎందుకు, ప్రభుత్వ వాదన ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















