కెంటకీ టోర్నడోలు: సుడిగాలుల్లో ఎగిరిపోయిన పెళ్లి ఫొటోలు, సర్టిఫికేట్‌లు 225 కిలోమీటర్ల అవతల దొరికాయి

ఫొటో సోర్స్, Michaela Copeland
- రచయిత, సోఫీ విలియమ్స్
- హోదా, బీబీసీ న్యూస్
గత వారం అమెరికాలోని కెంటకీ రాష్ట్రంలో టోర్నడోలు భీభత్సం సృష్టించాయి. టోర్నడోల ధాటికి 70 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
చాలా ఇళ్లల్లో వస్తువులు కూడా కొట్టుకుపోయాయి. అయితే, కొంత మందికి తాము సుడిగాలులలో పోగొట్టుకున్న వస్తువులు 140 మైళ్లు (225 కిలోమీటర్లు) దూరంలో లభించాయి.
ఇది కెంటకీ రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక వినాశనాన్ని సృష్టించిన టోర్నడో అని అధికారులు చెబుతున్నారు.
బలమైన సుడి గాలులకు ఇల్లినాయిస్, అర్కన్సాస్, టెన్నెసీ రాష్ట్రాల్లో కూడా నష్టం సంభవించింది.
టోర్నడో బాధితులు పోగొట్టుకున్న వస్తువులను తిరిగి వారికి చేర్చేందుకు కెంటకీలో కొందరు వ్యక్తులు సోషల్ మీడియా ద్వారా ఏకమయ్యారు. ఈ వస్తువుల్లో ఫోటోల నుంచి బైబిళ్లు, కప్పుకొనే రగ్గులు వరకు ఉన్నాయి.
అలా పోగొట్టుకున్న ఫోటోలను తిరిగి పొందిన వారిలో మిషేలా కోప్‌ల్యాండ్ ఒకరు. ఆమె పెళ్లి ఫోటోలను మేఫీల్డ్ లో ఉన్న అత్తగారింట్లో ఉంచారు. కానీ, ఈ టోర్నడోలో బాగా దెబ్బ తిన్న నగరాల్లో మేఫీల్డ్ ఒకటి. ఈ గాలులకు కోప్‌ల్యాండ్ పెళ్లి ఫోటోలు కూడా పోయాయి.
"ఈ ఫొటోలు నా జీవితంలో ఒక అత్యుత్తమ రోజుకు చెందినవి. అవి నాకు చాలా ముఖ్యమైనవి" అని ఆమె బీబీసీకి చెప్పారు.
టోర్నడో తర్వాత కొన్ని రోజులకు ఫేస్ బుక్‌లో 'క్వాడ్ స్టేట్ టోర్నడో ఫౌండ్ ఐటమ్స్' అనే గ్రూపు సభ్యులు ఆమెను చాలా పోస్టుల్లో ట్యాగ్ చేయడం కనిపించింది. కోప్ ల్యాండ్ కు ఆమె ఫోటోలు మూడు వేర్వేరు ప్రదేశాల్లో లభించినట్లు తెలిసింది. అందులో ఒకటి ఇంటికి 225 కిలోమీటర్ల దూరంలోనున్న బ్రెకిన్‌రిడ్జ్ కౌంటీలో దొరికినట్లు ఆమె బీబీసీకి చెప్పారు.

బ్రెకిన్‌రిడ్జ్ కౌంటీకి చెందిన పామెలా కాంప్‌టన్ కోప్‌ల్యాండ్ పెళ్లి ఫోటోను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశారు. ఆ ఫోటో ఆమె భర్తకు వారి పొలంలో దొరికింది.
"మా పశువులన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకునేందుకు నా భర్త కారులో వెళ్ళినప్పుడు, ఈ ఫోటో కనిపించింది. దీంతో పాటు ఇళ్ల నుంచి కొట్టుకుని వచ్చిన రకరకాల ఇనుప సామాన్ల ముక్కలు కూడా ఉన్నాయి" అని కాంప్‌టన్ చెప్పారు.
ఆ ఫోటోను ఫేస్ బుక్ లో క్వాడ్ స్టేట్ టోర్నడో ఫౌండ్ ఐటమ్స్ గ్రూప్‌లో పోస్ట్ చేశారు.
"ఈ ఫొటోలో ఉన్న అమ్మాయి దొరుకుతుందని ఊహించలేదు" అని కాంప్‌టన్ చెప్పారు. ఈ టోర్నడో సృష్టించిన విధ్వంసానికి వారి మనసులు బాధతో బరువెక్కి ఉంటాయని నాకు తెలుసు. కానీ, ఆమెను వెతికే ప్రయత్నాన్ని ఆపలేదు" అని అన్నారు.
ఆ ఫోటోను కోప్‌ల్యాండ్‌కు పంపించారు, కానీ, ఊర్లో పోస్ట్ ఆఫీసు కూడా టోర్నడో ధాటికి బాగా పాడయింది.
"అది చేరేందుకు ఎన్ని రోజులు పడుతుందో చూడాలి. మేఫీల్డ్‌కు మొత్తం మూడు ఫోటోలు పోస్ట్ చేశారు" అని కోప్‌ల్యాండ్ చెప్పారు.
కాంప్‌టన్ పొలంలో కనిపించిన మరో ఫోటో యజమానిని కూడా తెలుసుకోగలిగారు. ఆ ఫొటోలో ఉన్న వ్యక్తి టోర్నడోలో తన బామ్మను కోల్పోయారు. ఆయన తాతగారు ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
"నా హృదయం ద్రవిస్తోంది. కానీ, ప్రతి ఫోటో వెనుకా మంచోచెడో ఏదో ఒక కథ ఉంటుంది. ఈ కష్ట సమయంలో ఎవరూ ఒంటరివారు కారని చెప్పాలని అనుకుంటున్నాను" అని కోప్‌ల్యాండ్ చెప్పారు.
టోర్నడోలో కోల్పోయిన వస్తువుల యజమానులను కనిపెట్టేందుకు ఫేస్‌బుక్ గ్రూపులో చాలా మంది సభ్యులున్నారు.
కొన్ని పోస్టుల ద్వారా తప్పిపోయిన జంతువులు, పోగొట్టుకున్న పడవలు, ట్రోఫీలను కూడా వాటి యజమానులకు అందచేశారు.
క్వాడ్ స్టేట్ టోర్నడో ఫౌండ్ ఐటమ్స్ గ్రూపుకు కిమ్ టైలర్ అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్నారు.
కెంటకీలో ఏర్పడిన తుఫాను ఏప్రిల్ 2011లో ఏర్పడిన తుఫానును గుర్తు చేయడంతో, ఈ గ్రూపును మొదలుపెట్టినట్లు కిమ్ చెప్పారు.
"వార్తలు చూస్తుండగా 2011లో ఫోటోలు, జ్ఞాపికలు కొన్ని మైళ్ళ అవతల దొరికిన విషయాన్ని గుర్తు చేసుకున్నాను". ఈ తుఫాను తాకిడిని చూసిన తర్వాత ఈ సారి కూడా అదే జరిగి ఉండవచ్చని ఊహించాను" అని అన్నారు.
"చాలా మంది తమ వస్తువులను తిరిగి పొందుతున్నారని తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది" అని అన్నారు.
"ఫోటోలు, బాస్కెట్ బాల్, జ్ఞాపకాలుగా ఉండే తల దిండులు, పెళ్లి సర్టిఫికేట్ లు, రగ్గులు...ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి" అని ఆమె చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- వ్యవసాయ కుటుంబాల నెలసరి ఆదాయం రూ. 10 వేలు – ఆరేళ్లలో రైతుల ఆదాయం, అప్పులు ఎంత పెరిగాయి? - కేంద్ర ప్రభుత్వ తాజా సర్వే
- 2021లో ప్రజలు గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసినవి ఇవే
- కోవిడ్డెంగీ అంటే ఏంటి? తెలంగాణలో ఏం జరుగుతోంది? మీరు తెలుసుకోవాల్సిన 6 అంశాలు
- పుష్ప-సమంత: ‘ఊ అంటావా మావా..’ పాట ఐటెం సాంగ్ పంథాను తిరగరాస్తుందా? ‘మగ బుద్ధి’ గురించి చంద్రబోస్ ఏమన్నారు?
- బైజూస్: మెరుపు వేగంతో వృద్ధి వెనుక ‘చీకటి నిజం’.. ఆందోళనలో కస్టమర్లు, ఉద్యోగులు
- సర్దార్ పటేల్: ‘రాజులను అంతం చేయకుండా, రాజ్యాలను అంతం చేసిన నాయకుడు’
- ఆంధ్రప్రదేశ్: పంచాయతీ నిధులను దారి మళ్లించారా, సర్పంచుల ఆందోళన ఎందుకు, ప్రభుత్వ వాదన ఏంటి?
- పల్నాడు: ఈ పేరు ఎలా వచ్చింది, పల్నాడు ఉత్సవాల వెనుక కథ ఏంటి?
- అనకాపల్లి బెల్లం మార్కెట్లో వ్యాపారం ఎందుకు తగ్గుతోంది?
- లక్ష్మీనారాయణ ఇంట్లో సీఐడీ సోదాలు.. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ అక్కడికి ఎందుకెళ్లారు
- మనుషులు నడవడం ఎప్పుడు మొదలుపెట్టారు? ఎందుకు నడిచారు?
- చైనా కోసం పాకిస్తాన్ అమెరికానే వదులుకుంటోందా.. ఇమ్రాన్ ఖాన్ తాజా నిర్ణయ ఫలితం ఎలా ఉండనుంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








