యాదాద్రి జిల్లాలో దళితులపై ‘గోసంరక్షకుల’ దాడి

ఫొటో సోర్స్, D RAMAKRISHNA
- రచయిత, పృథ్వీరాజ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం చిన్నకందుకూరు గ్రామంలో ఆవును కోస్తున్నారంటూ కొందరు దళితులపై దాడి జరిగింది. సంక్రాంతి ముందు రోజు రాత్రి జరిగిన ఈ దాడి వార్త ఆలస్యంగా వెలుగు చూసింది.
ఈ దాడిలో గాయపడ్డ ఎర్ర చంద్రయ్యతో బీబీసీ మాట్లాడింది. ఆరోజు రాత్రి ఏం జరిగిందో ఆయన వివరించారు.
‘'మీరు హిందువులా.. ముస్లింలారా? ఆవును కోసుకు తింటార్రా?' అంటూ కులం పేరు పెట్టి అసభ్య పదజాలంతో దూషించారు. 'దండం పెడత సారు... కాళ్లు మొక్కుత దొరా... పండగని తెచ్చుకున్నం సారు...' అని నేను ప్రాధేయపడినా వినలే. 'ఈ ఆవు కాడ్నే నిన్ను పీక కోసి చంపుతం' అంటూ కత్తులు అందుకున్నరు’’ అని ఎర్ర చంద్రయ్య తెలిపారు.
ఘటన తర్వాత పోలీసులు దాడి చేసిన వారితో పాటు, దాడికి గురైన వారి మీద కూడా కేసులు నమోదు చేశారు.
’’మేం మాదిగలం. ఎస్సీలం. తాతలు, ముత్తాతల కాలం నుంచీ మాది ఇదే వృత్తి. బర్రెగొడ్లు, బక్కావులను తెచ్చుకుంటుంటం. కోసుకుంటుంటం. అట్లనే మొన్న పండగనాడు మా ఊరువాళ్లం నవాబ్‌పేట అంగట్లో ఆవును తెచ్చుకున్నాం. జనవరి 14వ తేదీ రాత్రి ఒంటి గంట సమయంలో ఊరిబయట చెట్లలో ఓ 20 మందిమి దానిని కోసుకుంటున్నాం. కొందరు పక్కన కూర్చుంటే ఓపికగా ఉన్న పది, పన్నెండు మందిమి పనిలో ఉన్నాం.’’

ఫొటో సోర్స్, D. Ramakrishna
'కులం పేరుతో తిడుతూ కొట్టారు..'
తమపై 20, 30 మంది దాడి చేశారనీ, వారంతా బైకులపైన, కారులోనూ వచ్చారని చంద్రయ్య చెప్పారు.
"వారి దగ్గర కర్రలున్నయ్. వస్తూనే కులం పేరుతో, నీ అమ్మ, అక్క అంటూ బండబూతులు తిడుతూ మా మీదపడ్డరు. వాళ్లను చూసి ముందు సివిల్ డ్రెస్‌లో ఉన్న పోలీసులనుకుని వినయంగా నిలుచున్నం. వారు మా మీద పడటంతో అందరం చెట్లలోకి ఉరికినం. నేను దొరికిపోయిన. నా మీద పడి గుద్దుతూ, తన్నుతూ దాడిచేసిన్రు. 'ఈ ఆవు కాడ్నే నిన్ను పీక కోసి చంపుతం' అంటూ కత్తులు అందుకున్నరు. దీంతో నేను ఎలాగో వదిలించుకుని ఉరికిన’’ అని ఆ రాత్రి ఏం జరిగిందో ఆయన తెలిపారు.
’’మేం రాత్రంతా ఊరి బయట చెట్ల మధ్యనే ఉన్నం. తెల్లారేవరకూ అక్కడనే పడుకున్నం. పొద్దుగాల ఊళ్లోకెళ్లిన తర్వాత తెలుసుకున్నం. మాపై దాడి చేసింది ఆర్ఎస్ఎస్ వాళ్లని తెలిసింది. వాళ్లలో ఓ ఐదారుగురి పేర్లు గుర్తుపట్టినం. 15వ తేదీన మోటకొండూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినం'' అని చంద్రయ్య చెప్పారు.
తనతో పాటు ఎర్ర మల్లయ్య, బూశేపాక ఎల్లయ్య, బొల్లారం యాదయ్య, ఎర్ర నర్సయ్య తదితరులు ఈ దాడిలో గాయపడ్డారని ఆయన తెలిపారు.
పోలీసుల కేసుల గురించి అడిగినపుడు.. ’’ఏదో చిన్న కేసు పెట్టామన్నారు. అందేందో తెలవదు’’ అని చంద్రయ్య బదులిచ్చారు.
‘ఆవును కోస్తే కేసు అవుతుందని మీకు తెలుసా?’ అని ప్రశ్నించినపుడు.. ''ఆవును కోయకూడదని మాకు తెలియదు. ఇంతవరకూ ఎవరూ చెప్పలే. ఎవరూ హెచ్చరించలే. మా మీద కేసు పెట్టినామని అన్నరు గానీ అది ఏం కేసో మాకు తెలవదు'' అని చెప్పారు.
1977 నాటి చట్టం ప్రకారం తెలంగాణలో ఆవులను, ఎద్దులను చంపడం నిషేధం ఉంది.

ఫొటో సోర్స్, D. RAMAKRISHNA
బాధితులపైనే కేసులు పెట్టారు: బహుజన ప్రతిఘటన వేదిక
‘‘సంక్రాంతి పండగకు ఏదో ఒక మాంసం తినటం ఆ ఊరి మాదిగ ఇళ్లలో తరతరాలుగా వస్తున్న అలవాటు. ఆవు మాంసం తినటం తమ జీవితంలో భాగమనే వారు అనుకుంటున్నారు. ఊర్లో అందరూ తలా కొంచెం డబ్బులు వేసుకుని ఓ గొడ్డును తెచ్చి కోసుకుని తెల్లారేసరికి పంచుకోవటం ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆచారం. ఈ సంక్రాంతి ముందు రోజు రాత్రి అలాగే ఒక వట్టిపోయిన ఆవును తెచ్చుకుని కోసుకుంటున్నపుడు దాదాపు 30 మంది లాఠీలు లాంటి కర్రలతో వారిపై దాడి చేశారు. పోలీసులు చెదరగొట్టేందుకు వచ్చారేమోననుకుని వారు చెదిరిపోయారు. నలుగురైదురు మాత్రం తప్పించుకోలేకపోయారు. వారిని తీవ్రంగా కొట్టారు’’ అని బహుజన ప్రతిఘటన వేదిక కోఆర్డినేటర్ ఉ.సాంబశివరావు బీబీసీ ప్రతినిధితో పేర్కొన్నారు.
’’తరతరాలుగా తింటున్న తిండి ఇప్పుడెలా తప్పవుతుందనేది వారికి అర్థం కాక అయోమయంలో పడిపోయారు. ఈలోగా దాడి చేసిన వారే పోలీసులకు ఫోన్ చేసి ఆవును కోస్తున్నారని, వారిని పట్టుకుని, ఆవును తీసుకువచ్చి సంప్రదాయబద్ధంగా పూడ్చిపెట్టాలని చెప్పారు. పోలీసులు గంటలోనే ఊర్లోకి వచ్చి దళితుల ఇళ్లపై దాడిచేశారని, ఇళ్లలో ఉన్న ఆడవాళ్లను పోలీసులు సైతం దూషించారని బాధితులు చెప్తున్నారు. అలాగే ఎర్ర చంద్రయ్య మద్యం బెల్టు దుకాణం నిర్వహిస్తున్నారంటూ.. వారి ఇళ్లలో ఉన్న మద్యం సీసాలను పట్టుకెళ్లారనీ చెప్పారు’’ అని ఆయన వివరించారు.
బహుజన ప్రతిఘటన వేదిక తరఫున సాంబశివరావు, టీమాస్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్ వెస్లీ, స్థానిక సీనియర్ దళిత నాయకుడు గట్టు రామచంద్రయ్యల బృందం ఈ నెల 17వ తేదీన నిజ నిర్ధారణకు ఆ గ్రామాన్ని సందర్శించింది.

ఫొటో సోర్స్, Getty Images
‘పద్ధతి ప్రకారం కేసులు నీరుగారుస్తున్నారు’
దాడిచేసిన వారిని వదిలేసి బాధితులపైనే పోలీసులు దాడి చేశారని ఉ. సాంబశివరావు ఆరోపించారు.
"వారి మీద ఆవును చంపారని, పరిమితికి మించి మద్యం కలిగివున్నారని కేసులు నమోదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో అసలు నేరస్తులను వదిలిపెట్టి అనామకుల మీద కేసు నమోదు చేశారు’’ అని అన్నారు.
రాష్ట్రంలో గోవధ నిషేధ చట్టం అమలులో ఉందా, లేదా అనేదానిపై చాలా మందికి స్పష్టత లేదని ఉ.సా. అన్నారు. ఒకవేళ చట్టం ఉన్నా చర్య తీసుకోవాల్సింది పోలీసులే కానీ ప్రైవేటు వ్యక్తులకు దాడి చేసే హక్కు ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు.
"ఒకవేళ ఉంటే దాని గురించి ప్రజలకు, ముఖ్యంగా గొడ్డు మాంసం తినటం జీవన విధానంలో భాగమైన దళితులకు అవగాహన కలిగించేలా ప్రచారం చేశారా అన్నది ప్రశ్నార్థకం. అలాగే.. సుప్రీంకోర్టు గోరక్షణ పేరుతో దాడులను నియంత్రించటానికి రాష్ట్రాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని కూడా నిర్దేశించింది కదా. తాము చట్ట ప్రకారం కేసులు నమోదు చేశామని, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నామని పోలీసులు చెప్తున్నారు’’ అని ఆయన చెప్పారు.
ఈ దాడికి 'సూత్రధారులైన' కట్టెకొయ్యల రవీందర్‌రెడ్డి, సంపత్, సందీప్ తదితరుల మీద ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామని ఉ.సా. తెలిపారు.
"కట్టెకొయ్యల రవీందర్‌రెడ్డి మీద చాలా ఆరోపణలున్నాయి. గతంలో కులం, మతం పేరుతో దాడులకు పాల్పడ్డట్లు స్థానికులు చెప్తున్నారు. ఆయన మీద రౌడీ షీట్ తెరవాలని కోరుతున్నాం. గోవధ నిషేధం చట్టాన్ని ఎవరు ఏ రూపంలో చేసినా అది రాజ్యాంగ విరుద్ధం. దానిని రద్దు చేయాలి. అందుకోసం మేం పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం’’ అని ఉ.సాంబశివరావు చెప్పారు.

ఫొటో సోర్స్, D. Ramakrishna
కేసులను దర్యాప్తు చేస్తున్నాం: పోలీసులు
దీనిపై బీబీసీ యాదగిరిగుట్ట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎ.ఆంజనేయులుతో మాట్లాడింది.
’’దళితులు గోవును వధిస్తుండటం మీద గోవధ నిషేధ చట్టం కింద కేసు నమోదు చేశాం. అలాగే ఒక దళితుడు నిర్వహిస్తున్న బెల్టు షాపులో రూ. 20 వేల నుంచి రూ. 40 వేల విలువైన మద్యం లభించింది. దీనిమీద ఎక్సైజ్ చట్టం సెక్షన్ 34ఎ కింద కేసు నమోదయింది. దళితుల మీద దాడి చేసిన కేసులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశాం. మూడు కేసులనూ దర్యాప్తు చేస్తున్నాం. ఇంకా ఎవరినీ అరెస్ట్ చేయలేదు’’ అని ఎ.ఆంజనేయులు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








