'పుణె' ఘటనలపై విచారణకు సీఎం ఆదేశం

పుణెలో తాజాగా జరిగిన హింసాత్మక ఘటనలకు నిరసనగా పిలుపునిచ్చిన ముంబయి బంద్ పాక్షికంగా జరిగింది. దళిత యువత పిలుపు మేరకు నగరంలో కొన్ని ప్రాంతాల్లో దుకాణాలు మూతపడ్డాయి.
ఆందోళనకారులు కొన్ని రైళ్లు, బస్సులపై రాళ్లు రువ్వారు. ఈ సంఘటనలతో ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవేతోపాటు చెంబూర్ ప్రాంతంలో కూడా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది.
సోమవారంనాడు జరిగిన హింసాత్మక ఘటనలకు నిరసనగా దళిత హక్కుల పోరాట ఉద్యమ నేత, బీఆర్ అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ ముంబయి బంద్‌కు పిలుపునిచ్చారు.
ఈ ఘటనలకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దీనిపై క్రిమినల్ విచారణకు ఆదేశించారు.
ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎలాంటి వదంతులను నమ్మవద్దని ముంబయి పోలీసులు పిలుపునిచ్చారు.
సోషల్ మీడియాలో అసత్యాలను ప్రచారం చేయవద్దని, ఎలాంటి అనుమానమొచ్చినా పోలీసులను సంప్రదించాలని ప్రజలను కోరారు.
కోరేగాం-భీమా పోరాటానికి 200 ఏళ్లు పూర్తైన సందర్భానికి గుర్తుగా సోమవారంనాడు పుణెలో విజయోత్సవ సభ జరిగింది.
ఈ సభకు వేల సంఖ్యలో దళితులు హాజరయ్యారు. ఈ విజయోత్సవ సమావేశంలో హింస చెలరేగింది.

ఫొటో సోర్స్, Mayuresh Kunnur/BBC
ఆత్మగౌరవం కోసం జరిగిన పోరాటం
మహార్లకూ, పీష్వా సైన్యాలకూ మధ్య జరిగిన ఈ యుద్ధాన్ని విదేశీ ఆక్రమణదారులైన ఆంగ్లేయులకు వ్యతిరేకంగా భారతీయ పాలకులు చేసిన యుద్ధంగా చరిత్రకారులు చెప్పేది కూడా వాస్తవ విరుద్ధమైందేమీ కాదు.
అయితే, మహార్లు ఆంగ్లేయులతో చేయి కలిపి బ్రాహ్మణ పీష్వాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందనే ప్రశ్న మాత్రం తప్పక వేసుకోవాల్సిందే.
మహార్ల దృష్టితో చూసినపుడు ఇది ఆంగ్లేయుల కోసం చేసిన యుద్ధం కాదు, తమ ఆత్మ గౌరవం కోసం చేసిన యుద్ధం.
దీనిని చిత్పావన్ బ్రాహ్మణ వ్యవస్థపై ప్రతీకారం తీర్చుకోవడం కోసం లభించిన అవకాశంగా వారు భావించారు.
ఎందుకంటే, రెండు వందల యేళ్ల క్రితం పీష్వా పాలకులు మహార్లను పశువులకన్నా హీనంగా చూశారు.
పీష్వా సైన్యంపై బ్రిటిష్ పాలకుల విజయానికి గుర్తుగా దళితులు దీన్ని నిర్వహిస్తుంటారు. మహార్ వర్గం వారు ఈస్ట్ ఇండియా కంపెనీలో భాగంగా బ్రిటిష్ సైన్యంతో కలసి పీష్వాలపై పోరాడారు.
ఆ పోరాటంలో బ్రిటిష్ సైన్యం విజయం సాధించింది.
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








