కిచెన్ రోబో: 5,000 రకాల వంటలు చేసే మర మనిషి, ధర ఎంతంటే

ఫొటో సోర్స్, MOLEY ROBOTICS
- రచయిత, కిట్టి పల్మై, విల్ స్మేల్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
క్రిస్మస్ వస్తోంది. పండుగ అంటే ఇంటికి చుట్టాలొస్తారు. స్నేహితులకు, ఆత్మీయులకు విందు ఏర్పాటు చేయాలి. ఇంతమందికి ఎలా వండాలి, ఏం వండాలి అని మనలో చాలామంది కంగారుపడుతుంటారు.
కానీ, భవిష్యత్తులో ఇంత కంగారు పడాల్సిన అవసరం రాకపోవచ్చు. మనకేం కావాలో అవి వండిపెట్టడానికి రోబో షెఫ్‌లు రానున్నాయి. కావలసిన పదార్థాలు ఇచ్చేస్తే మనకేం కావాలో అవి స్వహస్తాలతో వండి పెట్టేస్తాయి.
మొత్తం వంట వండి, భోజనం సిద్ధం చేయగల రోబో షెఫ్‌లను అభివృద్ధి చేసేందుకు టెక్ కంపెనీలు కృషి చేస్తున్నాయి. వాణిజ్య అవసరాలకే కాకుండా, మన వంటింట్లో మనకు సహకరించేందుకూ రోబోలు అందుబాటులోకి రానున్నాయి.
ఈ దిశలో ముందంజలో ఉంది లండన్‌కు చెందిన మోలీ రోబోటిక్స్. వచ్చే ఏడాది 'మోలీ రోబోటిక్ కిచెన్'ను విడుదల చేయనుంది.
వంటింట్లో స్టవ్ గట్టు దగ్గర సీలింగ్‌కు రెండు రోబో చేతులను అమరుస్తారు. ఈ రెండు చేతులూ మనకు కావలసిన వంట చేసేస్తాయి. 5,000 కంటే ఎక్కువ రకాల పదార్థాలను ఇవి వండగలవు.
ఆ జాబితా అంతా టచ్ స్క్రీన్‌పై ఉంటుంది. కావలసిన వంటను టచ్ స్క్రీన్ మీద సెలెక్ట్ చేసి, అందుకు కావలసిన పదార్థాలను పాత్రల్లో నింపి ఇచ్చేస్తే మిగతా పనంతా రోబో చేతులు చేసేస్తాయి.
స్టవ్ వెలిగించడం, ఓవెన్ ఆపరేట్ చేయడం, గిన్నెల్లో పదార్థాలు కలపడం, తిరగేయడం, వేయించడం, పదార్థాలను పాత్రల్లో అందంగా అలంకరించడం.. అన్నీ వాటికి తెలుసు.

ఫొటో సోర్స్, PAUL WINCH-FURNESS
రోబోలు వంట ఎలా చేస్తాయి?
2011 బీబీసీ మాస్టర్ షెఫ్ పోటీల్లో విజేతగా నిలిచిన ప్రొఫెషనల్ షెఫ్ టిమ్ ఆండర్సన్ ఈ రోబోలను అభివృద్ధి చేయడంలో మోలేకు సహాయపడ్డారు.
రోబోలు ఎలా వంటలు చేస్తాయో టిమ్ ఆండర్సన్ వివరించారు. ఆయన వంట చేసే విధానాన్ని ఈ రోబోలు కాపీ చేసేలా వాటిని ప్రోగ్రాం చేస్తారు.
"ముందు మోలీ కిచెన్‌లో నేను వంట చేస్తాను. నా విధానం, కదలికలు అన్నింటినీ రికార్డ్ చేస్తారు. వాటిని రోబో చేతులకు బదిలీ చేస్తారు. నా కదలికలను రోబోటిక్స్ బృందం క్రమబద్ధీకరిస్తుంది. అదంతా ఒక ఫార్మాట్‌లోకి వచ్చాక రోబోకు బదిలీ చేస్తారు. ఇక ఎప్పుడు మీరు ఆ వంటకం చేయమని అడిగినా, రోబో అచ్చం అలాగే చేస్తుంది. ఒక వంటకాన్ని ఎన్నిసార్లైనా ఒకేలాగ వండగలుగుతుంది" అని ఆండర్సన్ వివరించారు.
ఈ సిస్టం మొత్తం ఒక గ్లాస్ వెనక అమర్చి ఉంటుంది. కాబట్టి, రోబో చేతుల వల్ల మనుషులకు ఎలాంటి ప్రమాదం జరగదని మోలీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ ఒలీనిక్ చెప్పారు.
"ఒకవేళ ఊహించని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటే వెంటనే ఆ ప్రోగ్రాంను నిలిపివేయడానికి ఒక రాడార్ సిస్టం కూడా ఉంటుంది. కాబట్టి రోబో షెఫ్‌ల గురించి కంగారుపడక్కర్లేదు. ఇవి ఎవరికీ హాని కలిగించవు."
కానీ, ఈ రోబో ఖరీదు తక్కువేం కాదు. మోలీ రోబోటిక్ కిచెన్ కనీస ధర 1,50,000 పౌండ్లు (ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.1.5 కోట్లు).
ఇజ్రాయెల్ కిచెన్ రోబోటిక్స్, అమెరికా డెక్సాయ్ రోబోటిక్స్ కూడా ఇదే విధమైన, ఇంత ఖరీదైన కిచెన్ రోబో సిస్టంలను అభివృద్ధి చేస్తున్నాయి.
అయితే, ఇలాంటి వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉందని అమెరికా ఫుడ్ కన్సల్టెన్సీ 'ది కల్నరీ ఎడ్జ్'లో సీనియర్ స్ట్రాటజిస్ట్ జూలియా సెగల్ అన్నారు.
"మొదట్లో ఇలాంటివన్నీ చాలా ఖరీదుగా ఉంటాయి. కానీ సాంకేతిక అభివృద్ధి చెందుతున్న కొద్దీ వాటి ధరలు కూడా తగ్గుతాయి." అన్నారు జూలియా.

ఫొటో సోర్స్, PAZZI
పిజ్జాలు తయారుచేసే రోబో
ఫ్రెంచ్ పిజ్జా చెయిన్ 'పజ్జి' ఇప్పటికే రోబోలను వినియోగిస్తోంది. ఈ ఫుడ్ చెయిన్‌ను ఇద్దరు రోబోటిక్ ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రారంభించారు. పిజ్జా తయారుచేసే రోబోను వాళ్లు సొంతంగా తయారుచేసుకున్నారు.
ఆ తరువాత 2019లో పారిస్‌లో తొలిసారిగా పజ్జి రెస్టారెంట్ తెరిచారు. దీని రెండో శాఖను ఫ్రెంచ్ రాజధాని మాస్కోలో, మూడోదాన్ని బ్రసెల్స్ నగరానికి ప్రారంభించారు.
పిజ్జా ఆర్డర్ రాగానే ఈ రోబో పిండిని ఒత్తడం దగ్గర నుంచి కస్టమర్‌కు పిజ్జా అందించే వరకు అన్ని పనులూ చేస్తుంది. పిండిపై సాస్ పూసి, టాపింగ్స్ వేసి, ఓవెన్‌లో పెట్టి, బయటకు తీసి, ముక్కలుగా కట్ చేసి, బాక్స్‌లో పెట్టి కస్టమర్‌కు అందిస్తుంది. ఒక్కో పిజ్జాకు కేవలం అయిదు నిముషాల సమయం మాత్రమే తీసుకుంటుందీ రోబో.
అత్యుత్తమ నాణ్యతతో పిజ్జాలు తయారుచేసే విధంగా రోబోలను రూపొందించామని పజ్జి సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఫిలిప్ గోల్డ్‌మాన్ తెలిపారు.
"పిండిని ఒత్తుతున్నప్పుడు, అందులో ఖాళీలు లేదా రంధ్రాలు ఉన్నట్టు గుర్తిస్తే రోబో పిండిని వెనక్కు పంపేస్తుంది. దాన్ని చెత్తబుట్టలో పడేసి, కొత్తది తయారుచేస్తుంది."
అయితే పజ్జి రెస్టారెంట్‌లో రోబోలతో పాటు ఉద్యోగులు కూడా ఉంటారు. ఈ సిబ్బంది పొద్దున్నే వచ్చి, పిజ్జా తయారీకి కావాల్సిన పదార్థాలను సిద్ధం చేసి రోబోల్లోకి ఎక్కిస్తారు. ఆ తరువాతే, ఆర్డర్లు తీసుకోవడం ప్రారంభిస్తారు.
తమ రోబోల గురించి చాలామంది వాకబు చేస్తారని, ఇటలీ, బ్రిటన్, అమెరికా, జర్మనీ లాంటి దేశాల నుంచి కనీసం వెయ్యి కాల్స్ అయినా వచ్చుంటాయని గోల్డ్‌మాన్ చెప్పారు.

ఫొటో సోర్స్, MOLEY ROBOTICS
'మానవ స్పర్శను రోబోలు భర్తీ చేయలేవు'
రోబోట్ షెఫ్‌లు రెస్టారెంట్లకు అనేక ప్రయోజనాలు చేకూరుస్తాయని టెక్నాలజీ సెక్టార్ మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ 'రూట్‌స్ట్రాప్'లో డేటా సైంటిస్ట్, మెషిన్ లెర్నింగ్ నిపుణురాలు మైకేలా పిసాని లీల్ అభిప్రాయపడ్డారు.
"ఈ రోబోలు పదార్థాల్లో ఉన్న వైరస్‌లను తగ్గించి, పరిశుభ్రమైన ఆహారాన్ని వండగలవు. ఆహార పరిశ్రమను ఎత్తులకు తీసుకెళ్లగలవు."
కానీ, వీటివల్ల ఎంతోమంది ఉపాధి కోల్పోవచ్చని ఆమె హెచ్చరిస్తున్నారు.
కిచెన్ రోబోలు సౌకర్యవంతంగా ఉన్నా హై ఎండ్ మార్కెట్లకు అవి ఆసక్తి కలిగించవని మెయిడెన్‌హెడ్‌లోని బెర్క్‌షైర్ పట్టణంలో ఉన్న 'సీజనాలిటీ' రెస్టారెంట్ యజమాని, హెడ్ షెఫ్ వెస్లీ స్మాలీ అభిప్రాయపడ్డారు.
"మానవ స్పర్శను ఒక రోబో భర్తీ చేయగలదన్న నమ్మకం నాకు లేదు. ముఖ్యంగా తినేవారి కోరికను బట్టి వంటకంలో మార్పులు చేయడం, వైవిధ్యం నింపడంలో రోబో విఫలమవుతుంది."
"మనుషులు తాము వండే పదార్థాలకు ఒక సొంత గుర్తింపును జోడిస్తారు. వంట పట్ల శ్రద్ధ, దానితో ఒక అనుబంధం వారికి ఉంటుంది. అందుకే రెస్టారెంట్ మెనూల్లో షెఫ్ స్పెషల్స్ లాంటివి కనిపిస్తాయి."
"రోబోలు వంటింట్లో పని తగ్గిస్తాయి, వేగంగా జరిగేట్లు చూస్తాయని అంగీకరిస్తాను. కానీ, వాటిని ప్రోగ్రాం చేయడానికి, అందులో పదార్థాలు నింపడానికి మళ్లీ మనుషులే కావాలి. ఇది మనం మర్చిపోకూడదు" అని వెస్లీ స్మాలీ అన్నారు.
ఏది ఏమైనా, పండుగలు పబ్బాలకు ఎక్కువ వంటలు వండాల్సి వచ్చేవారికి కిచెన్ రోబోల ఆలోచన ఉత్సాహాన్నిస్తుందని మాత్రం చెప్పవచ్చు.
ఇవి కూడా చదవండి:
- కళ్లజోడే స్మార్ట్ ఫోన్ - డిజిహబ్
- వాట్సాప్ స్కాములతో జాగ్రత్త
- ఫేస్‌బుక్ ఇక కొత్త ప్రపంచాన్ని చూపించనుందా? ఏమిటీ మెటావర్స్
- ఆరంకెల జీతాలతో ఆకర్షిస్తున్న డేటా సైంటిస్ట్ ఉద్యోగాలు
- ఈ చిన్న అట్టపెట్టె లాంటి ఉపగ్రహాలు ప్రపంచాన్ని ఎలా మార్చేయబోతున్నాయి?
- నిజ జీవితంలో ‘ఇన్సెప్షన్’ ప్రయోగం.. కలల్లోకి చొరబడిన శాస్త్రవేత్తలు
- మెటావర్స్: ఇంటర్నెట్లో మాయా బజార్ - డిజిహబ్
- ఫిల్మీమోజీ: మారుమూల పట్నం కుర్రకారు కోట్లాది హిట్లు ఎలా కొట్టేస్తున్నారు..
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది?
- తల్లి పాలు ఎవరు దానం చేయవచ్చు? తల్లిపాల సేకరణ ఎలా చేయాలి?
- శాటిలైట్ ఇంటర్నెట్ ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












