వియా: చైనాలో పన్ను ఎగ్గొట్టిన లైవ్ స్ట్రీమర్‌కు రూ.1600 కోట్ల జరిమానా

ఫొటో సోర్స్, VCG VIA GETTY
ఆన్‌లైన్ వేదికగా సంపాదన అవకాశాలు ఇటీవల కాలంలో పెరిగాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఆన్‌లైన్‌లో తమ సృజన, తెలివితేటలు చూపుతూ డబ్బు సంపాదించగలుగుతున్నారు.
అయితే, సంపాదించిన డబ్బుకు ఆయా దేశాల చట్టాల ప్రకారం పన్ను కట్టకపోతే మాత్రం కష్టాల్లో చిక్కుకోకతప్పదు.
చైనాలో పన్ను ఎగ్గొట్టిన ఒక ప్రముఖ లైవ్ స్ట్రీమర్‌కు 134 కోట్ల యువాన్ల(భారతీయ కరెన్సీలో సుమారు రూ.1588 కోట్లు) జరిమానా చెల్లించాలని అధికారులు నోటీసులు పంపారు.
వియా పేరుతో పాపులర్ అయిన హాంగ్ వెయ్ చైనాలో ఒక ఇంటర్నెట్ సెలబ్రిటీ. ఆమెకు కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు.
వియా రకరకాల ఉత్పత్తులు విక్రయించడానికి తన ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంను ఉపయోగిస్తుంటారు.
2019-2020 మధ్య ఆమె తన ఆదాయం దాచడంతోపాటూ, ఇతర ఆర్థిక నేరాలకు కూడా పాల్పడ్డారని చైనాలోని హాంగ్‌ఝౌ అధికారులు ఆరోపించారు. అంతేకాదు జరిమానా కూడా విధించారు.
దీంతో ఆమె తన వీబో అకౌంట్‌లో ఈ పరిణామాలపై స్పందించారు.
‘‘జరిగినదానికి నేను ఎంతో చింతిస్తున్నాను. ఆదాయ పన్ను అధికారులు విధించిన శిక్షను పూర్తిగా అంగీకరిస్తున్నాను" అని పోస్ట్ చేశారు.
చైనాలో ఆన్‌లైన్ షాపింగ్ విపరీతంగా పెరగడంతో 36 ఏళ్ల వియా ఒక టాప్ ఇంటర్నెట్ సెలబ్రిటీ అయిపోయారు.
వియాను చైనాలో 'లైవ్ స్ట్రీమింగ్ క్వీన్'గా చెప్పుకుంటారు. టావ్‌బావ్ ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫాంలో నూడుల్స్ నుంచి కమర్షియల్ రాకెట్ లాంచ్ వరకూ ఆమె అన్నింటినీ విక్రయిస్తారు.
"వియా సోమవారం సాయంత్రం ఒక కాస్మెటిక్స్ సేల్స్ ఈవెంట్‌ను హోస్ట్ చేయాల్సి ఉంది. కానీ, దానికి ముందే ఆమె లైవ్ స్ట్రీమింగ్ అకౌంట్ ఆఫ్‌లైన్ అయింది" అని రాయిటర్స్ చెప్పింది.
వియా పాపులర్ ప్లాట్‌ఫాం వల్ల టైమ్ మేగజైన్ తాను ప్రచురించిన 2021 టాప్ 100 ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో ఆమెకు కూడా చోటు కల్పించింది.

లైవ్-స్ట్రీమింగ్ స్టార్‌కు వ్యతిరేక పవనాలు
కెర్రీ అలెన్, చైనా మీడియా విశ్లేషకులు
చైనాలోని అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో, పాపులర్ ఆన్‌లైన్ సేల్స్ వ్లాగర్లలో వియా ఒకరు.
పన్ను ఎగవేసినందుకు భారీ జరిమానా విధించడంతో ఆమె పాపులారిటీ మొత్తం ఒక్కసారిగా తలకిందులైపోయింది.
దీంతో చైనా ట్విటర్ సినా వీబోలో ట్రెండ్ అయ్యే టాప్ హాష్‌ట్యాగ్‌లలో #ViyaCompletelyBlockedOnline కూడా ఒకటిగా నిలిచింది.
అవుట్‌లెట్లు ఆమెను తొలగించడానికి ప్రయత్నిస్తుండడంతో ఇది జోరుగా ట్రెండ్ అవుతోంది.
తన వీబో అకౌంట్లో వియాకు 1.8 కోట్ల మంది ఫాలోయర్స్ ఉన్నారు. ఆ అకౌంట్ కూడా ఇప్పుడు ఉనికిలో లేకుండా పోయింది.
ఈబే లాంటి టావ్‌బావ్ షాపింగ్ ప్లాట్‌ఫాం కూడా ఆమె అకౌంట్‌ను తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి.
"వియాకు విధించిన జరిమానా మిగతావారికి ఒక హెచ్చరిక లాంటిది" అని ‘ది గ్లోబల్ టైమ్స్’ పత్రిక రాసింది.
అయితే చైనా ఈ పరిశ్రమను సంస్కరించడానికి ప్రయత్నిస్తున్నట్లు గత నెల రోజులుగా సంకేతాలు కనిపిస్తున్నాయి.
చైనాలో ప్రపంచంలోనే అతిపెద్ద లైవ్-స్ట్రీమింగ్ ఇండస్ట్రీ ఉంది. చైనాలో 40 కోట్ల మందికి పైగా వ్లాగర్స్ ఉన్నారు.
ఆన్‌లైన్‌లో స్టాక్స్ సిఫారసు చేయకుండా వ్లాగర్లపై నవంబరులో నిషేధం విధించారు. లైవ్ స్ట్రీమింగ్ కంటెంట్ గురించి 88 మంది సెలబ్రిటీలకు హెచ్చరికలు పంపారు.
మరో ఇద్దరు ప్రముఖ లైవ్ స్ట్రీమర్లు ఝూ చెన్హుయ్‌కు 10.2 మిలియన్ డాలర్లు(రూ.77 కోట్లు), లిన్ షాన్‌షాన్‌కు 4.3 మిలిటన్ డాలర్స్(రూ.32 కోట్లు) జరిమానా విధించారు, వారి వీబో అకౌంట్లు కూడా తొలగించారు.
న్యాయంగా పన్ను చెల్లించేలా ఒక వాతావరణం సృష్టించడానికి చైనా పన్ను ఎగవేతదారులకు శిక్షలు తీవ్రం చేయనున్నట్లు ది చైనా డెయిలీ పత్రిక ఆ సమయంలో వార్త ప్రచురించింది.
ఇవి కూడా చదవండి:
- హిందూ ఓట్ బ్యాంక్ సృష్టించింది ఛత్రపతి శివాజీయా? ఈ బీజేపీ నేత చెబుతున్నది నిజమేనా
- తెలంగాణలోని ఈ ఊరిలో రోజూ సూర్యోదయం ఆలస్యంగా, సూర్యాస్తమయం వేగంగా అయిపోతుంది
- పాకిస్తాన్: సమ్మెటతో అమ్మవారి విగ్రహం ధ్వంసం చేసిన యువకుడు, దైవదూషణ కేసు నమోదు
- హంసా నందినికి క్యాన్సర్ : వంశపారపర్యంగా వచ్చే క్యాన్సర్‌ను కనిపెట్టడం ఎలా..
- నలుగురిని ట్రక్కుతో గుద్ది చంపిన యువకుడిని రక్షించేందుకు 30 లక్షల మంది పోరాడుతున్నారు, ఎందుకు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













