అమెరికా: నలుగురిని ట్రక్కుతో గుద్ది చంపిన యువకుడిని రక్షించడానికి 30 లక్షల మంది ఎందుకు పోరాడుతున్నారు?

110 ఏళ్ల జైలు శిక్షకు గురైన మెరెడోస్

ఫొటో సోర్స్, JEFFERSON SHERIFF'S OFFICE

ఫొటో క్యాప్షన్, 110 ఏళ్ల జైలు శిక్షకు గురైన మెరెడోస్

"నాకు విచక్షణ అంటూ ఉంటే, ఇది నేను వేయదగిన శిక్ష కాదు". ఇవి అమెరికాలోని కొలరాడో డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు. ఓ క్యూబా యువకుడికి ఆయన 110 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ ఘటన 2019లో జరిగింది. డెన్వర్‌ నగరానికి పశ్చిమంగా ఉన్న ఇంటర్‌స్టేట్ 70 హైవే లో అనేక కార్లు ఆగి ఉన్నాయి. ఆ సమయంలో కలప ట్రక్కును నడుపుకుంటూ వస్తున్న 23 ఏళ్ల రోగెల్ లాజారో అగ్యిలేరా-మెడెరోస్, తన వాహనాన్ని ఆ కార్ల మీదకు పోనిచ్చారు. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా, పలువురు గాయపడ్డారు.

లాక్‌వుడ్ పోలీస్ డిపార్ట్‌మెంట్ విచారణాధికారుల ప్రకారం, ప్రమాదం జరిగిన సమయంలో మెడెరోస్ డ్రగ్స్‌గానీ, మద్యం కానీ తీసుకోలేదు. ఆయన ట్రాక్ రికార్డులో ఎలాంటి నేరాలు కూడా లేవు.

మెడెరోస్ నడుపుతున్న ట్రక్కు బ్రేకులు ఫెయిలయ్యాయని, ప్రమాదాన్ని నివారించే ఎమర్జెన్సీ ర్యాంప్‌ను ఉపయోగించలేదని సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ ఆరోపించింది.

''మెడెరోస్‌ కు నేరం చేయాలన్న ఉద్దేశం లేకపోయినా, తీవ్రమైన నిర్లక్ష్యంతో నిర్ణయాలు తీసుకుని నలుగురి మరణానికి కారణమయ్యారు'' అని శిక్ష విధించే సమయంలో న్యాయమూర్తి బ్రూస్ జోన్స్ వ్యాఖ్యానించారు.

కొలరాడో రాష్ట్ర చట్టాల ప్రకారం మెడెరోస్ ఎదుర్కొన్న కొన్ని అభియోగాలకు పదేసి సంవత్సరాల శిక్షను సూచిస్తున్నాయి. అలాగే వాటిని ఏకకాలంలో కాకుండా వరుసగా అనుభవించాలని కూడా చట్టాలు చెబుతున్నాయి. ఆ శిక్షలు అమలైతే మెడెరోస్ జీవితాంతం జైలులోనే గడపాల్సి ఉంటుంది.

మెడెరోస్ కేసు అమెరికాలో తీవ్ర చర్చకు దారితీసింది. ఆయనకు శిక్షను మార్చాలని లేదంటే క్షమాభిక్ష పెట్టాలని కోరుతూ ఆన్‌లైన్‌లో దాదాపు 30 లక్షలమంది ప్రజలు కొలరాడో గవర్నర్‌కు విన్నవించారు. క్యూబా జాతీయులైన స్థానికులు, ఈ శిక్ష అన్యాయమని వాపోతున్నారు.

అమెరికాలోని ఇంటర్ స్టేట్ 70 హైవేవైపు జరిగిన ప్రమాదం దృశ్యాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికాలోని ఇంటర్ స్టేట్ 70 హైవే వైపు జరిగిన ప్రమాదం దృశ్యాలు

అసలేం జరిగింది?

2019 ఏప్రిల్ 25న మెడెరోస్ ఇంటర్‌స్టేట్ 70 హైవే పై కార్గో ట్రక్కును నడుపుతుండగా, దానిపై నియంత్రణ కోల్పోయారు. అప్పటికే అక్కడ ఓ యాక్సిడెంట్ జరిగి ఉండటంతో రోడ్డు మీద అనేక కార్లు నిలిచి ఉన్నాయి. మెడెరోస్ నడుపుతున్న ట్రక్కు అక్కడ ఆగివున్న కార్లపైకి దూసుకుపోయింది.

అయితే, ట్రక్కు బ్రేకులు ఫెయిలయ్యి, పొగలు వస్తున్నా మెడెరోస్ పట్టించుకోలేదని ఇన్వెస్టిగేషన్ అధికారులు ఆరోపించారు.

బ్రేకులు ఫెయిలైనప్పుడు ఉపయోగించాల్సిన ఎమర్జెన్సీ ర్యాంప్‌ను కూడా మెడెరోస్ ఉపయోగించలేదని, అది చేసి ఉంటే పెను ప్రమాదం తప్పేదని వారు తేల్చి చెప్పారు.

ఈ ప్రమాదం కారణంగా నలుగురు వ్యక్తులు మరణించడంతోపాటు, ప్రమాద ప్రాంతంలో భారీ ఎత్తున మంటలు చెలరేగాయని, దీనివల్ల తారు రోడ్డు కూడా పాడైందని స్థానిక మీడియా వెల్లడించింది.

తాను చనిపోతానని అనుకున్నానని, భయంతో ప్రమాదానికి ముందు కళ్లు మూసుకున్నానని మెడెరోస్ కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో చెప్పారు.

రోడ్డు మీద ఆగి ఉన్న కార్లపైకి ట్రక్కు దూసుకెళ్లడంతో నలుగురు మరణించారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రోడ్డు మీద ఆగి ఉన్న కార్లపైకి ట్రక్కు దూసుకెళ్లడంతో నలుగురు మరణించారు.

'తీవ్రనిర్లక్ష్యం వల్లే ప్రమాదం'

ఈ దుర్ఘటనను నివారించడానికి మెడెరోస్‌కు అనేక అవకాశాలు ఉన్నాయని, కానీ తప్పుడు నిర్ణయాలతో ప్రమాదానికి కారణమయ్యారని ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాదులు కోర్టులో వాదించారు.

దీంతో, నిర్లక్ష్యం, ఫస్ట్ డిగ్రీ ఎటాక్ సహా మొత్తం 23 అభియోగాల కింద నేరానికి పాల్పడినట్లు విచారణాధికారులు నిర్ధారించారు. దీంతో కొలరాడో డిస్ట్రిక్ట్ కోర్టు మెడెరోస్‌కు 110 ఏళ్ల జైలు శిక్ష విధించారు.

''ఆ రోజు రోడ్డుపై ఉన్న అందరికంటే తన జీవితం ముఖ్యమని మెడెరోస్ భావించారు. ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రమాదానికి కారణమయ్యారు'' అని బాధితులలో ఒకరి సోదరి 'ది డెన్వర్ పోస్ట్' పత్రిక తో అన్నారు.

''అతను ఈ శిక్షకు అర్హుడు. కోర్టు తీర్పుతో మేం ఊరట పొందాం'' అని బాధితుల్లో ఒకరి భార్య ఓ టెలీవిజన్ ఛానల్‌ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.

పోస్ట్‌ Instagram స్కిప్ చేయండి
Instagram ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of Instagram ముగిసింది

"నేను నేరస్తుడిని కాదు"

అయితే, విచారణ సమయంలో మెడెరోస్ ఏడుస్తూ, బాధిత కుటుంబాలకు క్షమాపణలు చెప్పారు. "నేను నేరస్తుడిని కాను. నాపై వచ్చిన అభియోగాల ఆధారంగా నన్ను హంతకుడు అంటున్నారు. కానీ నేను హంతకుడిని కాను. ఒకరిని బాధపెట్టాలని నా జీవితంలో ఎప్పుడూ ఆలోచించలేదు" అని అన్నారు.

జరిగిన సంఘటనకు తానెంతో బాధపడుతున్నానని, తన వల్ల మరణించిన వారి గురించే నిత్యం ఆలోచిస్తున్నానని మెడెరోస్ అన్నారు.

"నా ట్రక్ బ్రేక్‌లు ఫెయిలయ్యాయి. అది చాలా క్లిష్టమైన సమయం. ఆ విషయం ట్రక్కు నడిపే వాళ్లకు బాగా తెలుస్తుంది. ఆ పరిస్థితుల్లో ఎవరూ ఏమీ చేయలేరు" అని మెడెరోస్ విచారణ సమయంలో అన్నారు.

డెన్వర్ పోస్ట్ వార్తా పత్రిక కథనం ప్రకారం, మెడెరోస్‌కు కొలరాడోలో సాధారణ హంతకులకు విధించే శిక్షకన్నా రెండు రెట్లు అదనంగా జైలు శిక్ష పడింది. అతనిపై నమోదైన నేరారోపణలకు చట్టంలో సూచించిన నిబంధనల ప్రకారం న్యాయమూర్తి ఆయనకు కనీసం 110 సంవత్సరాల శిక్ష విధించవలసి వచ్చింది" అని ఆ పత్రిక పేర్కొంది.

మెడెరోస్‌ కు అంత పెద్ద శిక్ష అవసరం లేదంటూ డెన్వర్ పోస్ట్ ఈ తీర్పుపై ఓ ప్రత్యేక వ్యాసాన్ని ప్రచురించింది.

అయితే, ట్రక్కు ఓనర్‌కు కూడా శిక్ష విధించాలని కొందరు డిమాండ్ చేశారు. భద్రతా తనిఖీలు చేయడంలో ట్రక్కు యజమాని నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కొందరు వాదించారు.

ప్రస్తుతం ఈ కేసు అమెరికాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మెడెరోస్‌కు విధించిన శిక్షను తగ్గించాలని డిమాండ్ చేస్తూ అనేక స్వచ్ఛంద సంస్థలు కొలరాడో గవర్నర్‌ కు విన్నపాలు చేస్తూనే ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)