కోవిడ్ 19: మద్యం, వంట నూనెల వంటి ప్రోత్సాహకాలు వ్యాక్సీన్ వేయించుకోని వారిని టీకా కేంద్రాలకు రప్పించగలవా

వ్యాక్సినేషన్ రేటు పెంచేందుకు ప్రోత్సాహకాలు తోడ్పడకపోవచ్చని పలు అధ్యయనాల్లో తేలింది

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, వ్యాక్సినేషన్ రేటు పెంచేందుకు ప్రోత్సాహకాలు తోడ్పడకపోవచ్చని పలు అధ్యయనాల్లో తేలింది
    • రచయిత, శరణ్య హృషికేశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారతదేశంలో కోవిడ్ 19 వ్యాక్సినేషన్ కార్యక్రమం మెల్లగా మొదలైనప్పటికీ క్రమంగా పుంజుకొంది. గత కొన్ని నెలల్లో కీలక మైలురాళ్లు దాటింది.

అయితే, డిసెంబర్ 31 కల్లా వయోజనులందరికీ 100 శాతం వ్యాక్సీన్లు అందించాలన్న లక్ష్యం చేరుకోకపోవచ్చు. కానీ, 85 శాతం కంటే ఎక్కువ మంది కనీసం ఒక డోస్ టీకా అయినా వేయించుకున్నారు.

సుమారు 55 శాతం వయోజనులు రెండు డోసులూ వేయించుకున్నారు.

అయినా కూడా, ఇంకా కొన్ని కోట్లమందికి టీకాలు అందలేదు. వీరిలో వయసు కారణంగా ప్రమాదం అంచున ఉన్నవారూ అధికమే.

దీనికి తోడు, తాజా ఒమిక్రాన్ వేరియంట్ భయాందోళనలను రేకెత్తిస్తోంది.

ఈ నేపథ్యంలో, ప్రజలను టీకా కేంద్రాలకు రప్పించడానికి దేశంలో కొన్ని రాష్ట్రాలు అసాధారణ ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి.

మొదట్లో ఎదుర్కొన్న వ్యాక్సీన్ కొరత సమస్య ఇప్పుడు లేదని నిపుణులు అంగీకరిస్తున్నారు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, మొదట్లో ఎదుర్కొన్న వ్యాక్సీన్ కొరత సమస్య ఇప్పుడు లేదని నిపుణులు అంగీకరిస్తున్నారు

గుజరాత్‌లోని ఓ మున్సిపల్ కార్పొరేషన్ టీకాలు వేయించుకున్నవారికి ఒక లీటరు వంట నూనెను ఉచితంగా అందించింది. ఈ ఉపాయం ఫలించింది. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడినవారు వంట నూనె కోసం టీకాలు వేయించుకోవడం ప్రారంభించారు.

రాజధాని దిల్లీలో వ్యాక్సీన్ వేయించుకున్నవారి పిల్లలకు మంచి ప్రీ స్కూల్‌లో సీటు దక్కే అవకాశం ఉంది. ఇది కాస్త కష్టమైన లక్ష్యమే.

భారతదేశంలో ఇలాంటి ప్రోత్సాహకాలు కొత్తేం కాదు. కేంద్ర, రాష్ట్ర స్థాయిలలో అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతూనే ఉంది.

అయినప్పటికీ, నవంబర్ 23న మధ్యప్రదేశ్‌లోని ఒక స్థానిక అధికారి ఇచ్చిన ప్రకటన ప్రత్యేకంగా ఆకర్షించింది.

రెండు డోసుల కోవిడ్ వ్యాక్సీన్ తీసుకున్నవారికి మద్యంపై 10 శాతం తగ్గింపు ప్రకటించారు.

కానీ, ఆ మర్నాడే దాన్ని వెనక్కు తీసుకున్నారు. ఇది మద్యపానాన్ని ప్రోత్సహించినట్లు అవుతుందని బీజేపీకి చెందిన ఒక శాసనసభ్యుడు సూచించడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.

ఇది "వికృతమైన ప్రోత్సాహకం" అని ఎపిడెమియాలజిస్ట్ చంద్రకాంత్ లహరియా అభిప్రాయపడ్డారు.

అయితే, 100 శాతం వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని అందుకోవడంలో ఉన్న ఒత్తిడిని, సవాళ్లను కూడా ఈ చర్య స్పష్టపరుస్తోంది.

వ్యాక్సీన్

ఫొటో సోర్స్, Getty Images

ఎందుకు వ్యాక్సీన్ వేయించుకోవట్లేదు? అడ్డంకులేంటి?

మొదట్లో వ్యాక్సీన్ల సరఫరాలో వచ్చిన సమస్యలు ఇప్పుడు దాదాపుగా సద్దుమణిగాయని నిపుణులు భావిస్తున్నారు.

కానీ, ఇంకా ఎందుకు కోట్ల మందికి వ్యాక్సీన్ అందలేదనే సందేహాలకు స్పష్టమైన కారణాలు చెప్పలేమని వారు అంటున్నారు.

"వ్యాక్సీన్ల సరఫరాకు కొదవ లేదంటే, అందరికీ టీకాలు అందుబాటులో ఉన్నాయని కాదు. చాలామందికి టీకా వేయించుకోడానికి దూరాలు వెళ్లాల్సి రావొచ్చు. ఒక రోజు లేదా పూట కూలీ వదులుకుని వెళ్లాల్సి రావొచ్చు" అని డాక్టర్ లహరియా అన్నారు.

"ప్రభుత్వం, పై పైన కాకుండా లోతుగా చూసి సమస్యలను విశ్లేషించాల్సి ఉంటుంది. అనేకమందికి టీకాలు ఎందుకు అందట్లేదు, టీకాలు వేయించుకోకుండా వారిని ఆపుతున్నది ఏమిటని విశ్లేషించేందుకు తగినంత డాటా అందుబాటులో లేదు. కవరేజీ తక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి లోతుగా అధ్యయనం చేయాలి."

ఒక డోసు టీకాతోనే తృప్తి చెందడం లేదా కోవిడ్ 19 సోకిన తరువాత టీకా వేయించుకోనక్కర్లేదు అనుకోవడం కూడా కారణం కావొచ్చు.

ఒక డోసు వేయించుకున్న 12 కోట్ల మందికి పైగా ప్రజలు రెండో డోసు కోసం ఇంకా రాలేదని ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా నవంబర్‌లో చెప్పారు.

దేశంలో కోవిడ్ కేసులు కూడా బాగా తగ్గుముఖం పట్టాయి. ఒక నెలకు పైగా ప్రతిరోజూ 10,000 లేదా అంతకంటే తక్కువ కేసులే నమోదవుతున్నాయి. ఇదీ ఓ కారణం కావొచ్చు.

వ్యాక్సీన్ పట్ల విముఖత కీలక పాత్ర పోషిస్తుండవచ్చు. వైరస్ కన్నా వ్యాక్సీన్ మరింత ప్రమాదకరమని కొంతమంది భారతీయులు అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

కేసులు పెరగడం మొదలైతే వయసులో పెద్దవాళ్లకు రిస్క్ ఎక్కువ ఉంటుందని హెల్త్ ఎకానమిస్ట్ రిజో ఎం జాన్ అన్నారు.

45 ఏళ్లు దాటినవారిలో సుమారు 40 శాతం అంటే దాదాపు 14 కోట్ల మంది ఇంకా ఒకటి లేదా రెండు డోసులూ వేయించుకోలేదు.

"ఎందుకు? అని కనిపెట్టడం ప్రభుత్వ బాధ్యత. అవసరమైతే, ఇంటింటికీ తిరిగి టీకాలు వేయాలి" అని రిజో జాన్ అన్నారు.

2014లో భారతదేశం పోలియో నుంచి పూర్తిగా విముక్తి పొందింది

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, 2014లో భారతదేశం పోలియో నుంచి పూర్తిగా విముక్తి పొందింది

ప్రోత్సాహకాలు ఫలిస్తాయా?

ఫలిస్తాయో లేదో చెప్పడం అంత సులువు కాదు. చాలా దేశాలు ఈ మార్గాన్ని ఎంచుకున్నాయి. ప్రోత్సాహకాలను ప్రకటించాయి.

రష్యాలో కొన్ని కంపెనీలు స్నోమొబైల్స్, కార్లను ఆశ చూపించాయి.

హాంగ్‌కాంగ్‌లో ఖరీదైన ఇళ్లు, బంగారు కడ్డీలు, టెస్లా కార్లు గెలుచుకునే అవకాశాలతో సహా అనేక ప్రోత్సాహకాలు ప్రకటించిన తరువాత ప్రజలు టీకా కేంద్రాలకు పరిగెత్తారు.

అమెరికాలో వ్యాక్సినేషన్‌ను ప్రోత్సహించడానికి స్థానిక ప్రభుత్వాలు గిఫ్ట్ కార్డులు అందించాయి, లాటరీలను నిర్వహించాయి.

అయితే ప్రోత్సాహకాల వలన వ్యాక్సినేషన్ రేటు పెరగలేదని నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ (ఎన్‌బీఈఆర్) కాలిఫోర్నియా కౌంటీలో నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది.

"అధిక స్థాయిలో వ్యాక్సీనేషన్ లక్ష్యాలను చేరుకోవాలంటే ప్రభుత్వాలు చాలా బలమైన విధానాలను ప్రకటించాల్సి ఉంటుంది. ఉదాహరణకు సంస్థల యజమానులకు సంబంధించిన నిబంధనలు, ప్రభుత్వ శాసనాలు" అని ఎన్‌బీఈఆర్ వర్కింగ్ పేపర్‌లో పేర్కొన్నారు.

అమెరికాలో ఒహియో రాష్ట్రంలో నిర్వహించిన లాటరీ వల్ల కూడా ఎలాంటి ప్రయోజనాలూ కలగలేదని ఇతర అధ్యయనాలు తెలిపాయి.

వ్యాక్సీన్ వేయించుకోనివారికి అందుబాటులో లేని సౌకర్యాలను ప్రభుత్వం మంజూరు చేస్తే లేదా గణనీయమైన ఆర్థిక బహుమతులు ప్రకటిస్తే లేదా స్థానిక వైద్యులకు కోవిడ్ టీకా అందించే సౌలభ్యం లభిస్తే వ్యాక్సినేషన్ రేటు పెరగవచ్చని జర్మనీలో చేసిన ఒక అధ్యయనం పేర్కొంది.

అయితే, ఈ ప్రోత్సాహకాలు స్వల్ప కాలంలో ప్రయోజనాలు చేకూర్చగలవుగానీ ప్రజల ఆలోచనను, ప్రవర్తనను మార్చలేవని ఈ అధ్యయనంలో తెలిపారు.

రిస్క్ తక్కువ ఉన్న వయసు వారికి, ప్రోత్సాహకాలు ప్రకటించడం కన్నా కొన్ని ప్రయోజనాలను అందించకుండా ఆలస్యం చేయడం లేదా టీకాలు వేయించుకోకపోతే క్యూలో ఎక్కువసేపు వేచి చూడాలని చెప్పడం లాభదాయకంగా ఉంటుందని రిజో జాన్ అభిప్రాయపడ్డారు.

"ఆర్థికపరమైన ప్రోత్సాహకాలను ప్రకటిస్తే, దుర్వినియోగానికి లోనయ్యే అవకాశాలే ఎక్కువ. టీకా వేయించుకోవడం వారికే మేలు చేస్తుందని చెప్పగలగాలి."

జర్మనీ, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో వ్యాక్సీన్ వేయించుకోనివారిపై కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. వారికి కఠిన నిబంధనలు విధించడం, బార్లు, రెస్టారెంట్లకు వెళ్లేందుకు అనుమతించకపోవడం లాంటి చర్యలు తీసుకుంటున్నాయి.

గత నెల న్యూయార్క్ నగరంలో టీకాలు వేయించుకోని మున్సిపల్ కార్మికులకు వేతనం రహిత సెలవులను ప్రకటించారు. అలాగే, ప్రైవేట్ వ్యాపారాలలో ఆన్-సైట్ ఉద్యోగులకు టీకాను తప్పనిసరి చేయాలని కూడా యోచిస్తున్నారు.

భారతదేశంలో కఠిన నిబంధనలు లేదా ప్రోత్సాహకాలపై దృష్టి పెట్టడం కంటే గతంలో సాధించిన వ్యాక్సీనేషన్ విజయాలను పరిశీలించాలని, ముఖ్యంగా పోలియో వ్యాక్సీనేషన్ కార్యక్రమాన్ని పరిశీలించాలని డాక్టర్ లహరియా సూచించారు.

2014లో భారతదేశం పోలియో నుంచి విముక్తి పొందిందని ప్రకటించారు. దీని కోసం అట్టడుగు స్థాయి నుంచీ అడ్డంకులను తొలగించుకుంటూ వచ్చి సంవత్సరాల తరబడి శ్రమించారు.

"కోవిడ్ 19 వ్యాక్సినేషన్ కార్యక్రమం దీర్ఘకాలంలో విజయవంతం కావాలంటే కమ్యూనిటీ స్థాయిలో పనిచేయాలి" అని డాక్టర్ లహరియా సలహా ఇచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)