ఒమిక్రాన్‌కు అసాధారణ రీతిలో వ్యాపించే శక్తి ఉంది, జాగ్రత్త పడకుంటే ముప్పే.. అమెరికా నిపుణుల హెచ్చరిక

డాక్టర్‌ ఆంటోనీ ఫౌచీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డాక్టర్‌ ఆంటోనీ ఫౌచీ

క్రిస్మస్ ప్రయాణాల కారణంగా కోవిడ్-19 ఒమిక్రాన్ వేరియంట్ మరింత ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని, రెండు డోసుల టీకా వేసుకున్న వారికి కూడా ఇది సోకుతుందని అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు డాక్టర్‌ ఆంటోనీ ఫౌచీ హెచ్చరించారు.

కోవిడ్ మహమ్మారిపై అమెరికా ప్రభుత్వానికి సలహాలు ఇచ్చే డాక్టర్ ఫౌచీ వార్తా సంస్థ ఎన్‌బీసీ నిర్వహించిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడారు.

ఒమిక్రాన్‌కు అసాధారణ రీతిలో వ్యాప్తిచెందే శక్తి ఉందనడంలో ఎ‌లాంటి సందేహం లేదని, ప్రస్తుతం అది ప్రపంచమంతటా విజృంభిస్తోందని ఆయన అన్నారు.

ఈ వేరియంట్ వ్యాప్తిని నిరోధించేందుకు పలు దేశాలు ఇప్పటికే చర్యలు చేపట్టాయి. ఐరోపాలో నెదర్లాండ్స్ ప్రభుత్వం రెండు వారాల పాటు లాక్ డౌన్ ప్రకటించింది. ఫ్రాన్స్, జర్మనీ ప్రయాణ ఆంక్షలు విధించాయి. కోవిడ్ బూస్టర్ డోసు పంపిణీ కార్యక్రమాలనూ వేగవంతం చేస్తున్నాయి.

వీడియో క్యాప్షన్, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాక్సీన్లకు లొంగదా

అమెరికాలో ఈ మమ్మారి వేరియంట్ విజృంభణతో దేశవ్యాప్తంగా ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం డాక్టర్‌ ఫౌచీ హెచ్చరించారు.

ప్రజలు అశ్రద్ధ చేయకుండా మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటించాలని ఆయన కోరారు. అందరూ వ్యాక్సీన్ వేయించుకోవాలని, ఇప్పటికే టీకా తీసుకున్నవారు బూస్టర్ డోసు కూడా వేసుకోవాలని సూచించారు.

వ్యాక్సీన్ తీసుకోని వారికి ఈ వైరస్ ముప్పు చాలా తీవ్రంగా ఉంటుందని ఫౌచీ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)