Omicron symptoms: కరోనావైరస్ ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు ఏమిటి? జలుబు వస్తే ఏం చేయాలి?

మాస్కు ధరించిన యువతి

ఫొటో సోర్స్, Getty Images

భారత దేశంలోనూ ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి పెరిగిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

దిల్లీలో వీకెండ్ కర్ఫ్యూ విధించారు. తమిళనాడులో జనవరి 6 నుంచి రాత్రి కర్ఫ్యూ విధిస్తామని, ఆదివారం పూర్తిగా షట్ డౌన్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరికొన్ని రాష్ట్రాల్లోనూ పరిమితంగా ఆంక్షలు విధిస్తున్నారు.

అమెరికాలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి., బ్రిటన్‌, ఫ్రాన్స్ సహా యూరప్ దేశాల్లోనూ ఈ వేరియంట్ విపరీతంగా వ్యాప్తి చెందుతోంది.

అయితే, ఈ కొత్త వేరియంట్ గురించి ఇప్పటివరకు మనకు తెలిసింది తక్కువే.

కానీ, ఈ ఒమిక్రాన్ వేరియంట్ కరోనావైరస్ ఎలా వ్యాపిస్తుంది? ఇప్పుడున్న టీకాలు దీనిపై పని చేస్తాయా? లేదా? వ్యాధి లక్షణాలు ఏమిటి? అనే అంశాలపై ఇంకా అధ్యయనాలు జరుగుతున్నాయి. ప్రాథమిక పరిశీలనల్లో ఏం కనిపించింది అనేది చూద్దాం.

జలుబు

ఫొటో సోర్స్, Getty Images

'సాధారణ జలుబు లక్షణాలే'

ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటా ప్రకారం సాధారణ జలుబు లక్షణాలే ఒమిక్రాన్ వేరియంట్‌కు ఉన్నట్లు బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ఎపిడమాలజిస్ట్ ప్రొఫెసర్ టిమ్ స్పెక్టర్ చెప్పారు.

వ్యాక్సీన్ వేసుకున్న వారికి ఇతర వేరియంట్లు సోకినప్పుడు కనిపించే తేలికపాటి లక్షణాలే ఒమిక్రాన్ వేరియంట్ సోకినప్పుడూ కనిపిస్తున్నాయని లండన్‌లోని కింగ్స్ కాలేజీ ప్రొఫెసర్ టిమ్ స్పెక్టర్ చెప్పారు. 'జో సింప్టమ్ స్టడీ'కి ఆయన హెడ్‌గా ఉన్నారు.

వ్యాక్సీన్ వేసుకున్న వారిలో ఒమిక్రాన్ లక్షణాలు చాలావరకు సాధారణ జలుబును పోలి ఉన్నాయని ఆయన చెప్పారు. తలనొప్పి, గొంతు నొప్పి, ముక్కు కారడం, అలసట, తుమ్ములు లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయని వివరించారు.

జ్వరం, దగ్గు, రుచి/వాసన కోల్పోవడం వంటివి ఇదివరకు వచ్చిన కరోనా వేరియంట్ల ప్రధాన వ్యాధి లక్షణాలు.

కానీ ఈ లక్షణాలు తమలో కనిపించడం లేదని కొత్తగా కోవిడ్ సోకిన వారు చెబుతున్నారని ప్రొఫెసర్ టిమ్ వివరించారు.

అయితే, ఈ లక్షణాలు కనిపించినా అప్రమత్తంగా ఉండాలని బ్రిటిష్ నేషనల్ హెల్త్ సర్వీస్ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

కోవిడ్ టెస్ట్

ఫొటో సోర్స్, Getty Images

ఒమిక్రాన్ వేరియంట్ వ్యాధి లక్షణాలు

  • తలనొప్పి
  • గొంతు నొప్పి
  • ముక్కు కారడం
  • అలసట
  • తుమ్ములు

ఆధారం: జో కోవిడ్ అధ్యయనం, కింగ్స్ కాలేజీ లండన్

వీడియో క్యాప్షన్, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాక్సీన్లకు లొంగదా

'జలుబు వస్తే అనుమానించాలి'

ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకిన వాళ్లలో జలుబు లాంటి లక్షణాలే కనిపిస్తున్నాయి. దాంతో ప్రజలు తమకు కోవిడ్ సోకిందని గుర్తించకపోయే ప్రమాదం ఉంది.

ఒమిక్రాన్ వేరియంట్ శరవేగంగా వ్యాపిస్తున్న ప్రాంతాల్లోని ప్రజలు తమకు జలుబు వచ్చినా, అది కోవిడ్‌గా అనుమానించి, పరీక్షలు చేయించుకోవాలని కింగ్స్ కాలేజీకి చెందిన ఎపిడమాలజిస్ట్ ప్రొఫెసర్ టిమ్ స్పెక్టర్ చెప్పారు. అలాంటి ప్రాంతాల్లో ఉన్న వారికి కోవిడ్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉందని వివరించారు.

లండన్‌లో కోవిడ్ చాలా ఎక్కువగా వ్యాపిస్తోంది. అలాంటి చోట జలుబు కంటే కోవిడ్ సోకే ప్రమాదం అధికంగా ఉంటుందని ప్రొఫెసర్ టిమ్ స్పెక్టర్ చెప్పారు.

పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తే జలుబుగా అపోహపడి నిర్లక్ష్యం చేయవద్దని, వెంటనే కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే మీకు వ్యాధి లక్షణాలు పెద్దగా లేకపోయినా.. ఇన్ఫెక్షన్ మీ నుంచి ఇతరులకు సోకుతుంది.

కొత్త వేరియంట్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోందని ఆయన వివరించారు. రెండున్నర రోజుల్లో కేసుల సంఖ్య రెట్టింపు అవుతోందని చెప్పారు.

లండన్ జనం

ఫొటో సోర్స్, Getty Images

'ఫస్ట్ వేవ్ కంటే ఇప్పుడు వ్యాప్తి వేగం ఎక్కువ'

ఫస్ట్ వేవ్‌లో కంటే ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ చాలా వేగంగా వ్యాపిస్తోందని ఆయన తెలిపారు.

లండన్‌లో నెల రోజుల క్రితం నమోదైన కోవిడ్ లక్షణాలకు, ఇప్పుడు నమోదవుతున్న కోవిడ్ లక్షణాలకు పెద్దగా తేడా కనిపించడం లేదని 'జో కోవిడ్ స్టడీ'కి చెందిన నిపుణులు అంటున్నారు.

వ్యాధి తీవ్రత అధికంగా ఉండటం లేదా దక్షిణాఫ్రికాలో నమోదైన అసాధారణ లక్షణాలు మాత్రం లండన్‌లో కనిపించడం లేదని వారు చెబుతున్నారు.

వ్యాక్సీన్ వేసుకున్న వారికి డెల్టా వేరియంట్ సోకితే ఎలాంటి లక్షణాలు ఉంటాయో ఒమిక్రాన్ సోకినా అలాంటి లక్షణాలే (ముక్కు కారడం, తుమ్ములు, గొంతు నొప్పి లాంటివి) కనిపిస్తున్నాయని వాళ్లు వివరించారు.

'దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారిలో జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చినట్లు డేటా చెబుతోంది. కానీ బ్రిటన్‌లో మాత్రం ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు గతంలో వచ్చిన వేరియంట్ లక్షణాలకు దగ్గరగా ఉన్నాయని, ఇది ప్రధానంగా ఊపిరితిత్తులకు వచ్చే ఇన్ఫెక్షన్‌' అని ప్రొఫెసర్ టిమ్ స్పెక్టర్ చెప్పారు.

వీడియో క్యాప్షన్, ఒమిక్రాన్ వేరియంట్‌ను ఎదుర్కోవాలంటే బూస్టర్ డోస్ కావాల్సిందేనా?

'బూస్టర్ డోస్ వేసుకున్న వాళ్లకూ సోకుతోంది'

ఒమిక్రాన్ వ్యాధి తీవ్రత విషయానికొస్తే వ్యాక్సీన్ వేసుకున్న వారిలో ఇప్పటివరకు తేలికపాటి లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని ప్రొఫెసర్ టిమ్ చెప్పారు.

కానీ దీన్ని నిర్ధారించుకోవడానికి మరికొంత కాలం పడుతుందని ఆయన స్పష్టం చేశారు. యువతకు ఒమిక్రాన్ ఎక్కువగా సోకుతోందని ఆయన చెప్పారు.

రెండు డోసులు, బూస్టర్ డోస్ తీసుకున్న వారు కూడా ఒమిక్రాన్ బారిన పడుతున్నారని ఆయన తెలిపారు.

నిర్ధిష్ట డేటా లేనప్పటికీ గతంలో కరోనాబారిన పడిన వారికి కూడా ఒమిక్రాన్ సోకుతోందని తమ దృష్టికి వచ్చిందని ప్రొఫెసర్ టిమ్ వివరించారు.

జో కోవిడ్ స్టడీ 18 నెలల క్రితం మొదలైంది. కోవిడ్ సోకిన వాళ్లు తమ వ్యాధి లక్షణాలను ఒక యాప్‌లో నమోదు చేస్తూ ఉంటారు. ఆ డేటా ఆధారంగా శాస్త్రవేత్తలు అధ్యయనం కొనసాగిస్తారు.

వ్యాక్సీన్ తీసుకున్న ప్రజలు మాత్రమే కింగ్స్ కాలేజీ అధ్యయనంలో పాల్గొంటున్నారు. వారి కోవిడ్ లక్షణాలను యాప్‌లో నమోదు చేస్తున్నారు.

అంటే వ్యాక్సీన్ వేసుకోని వారిలో ఒమిక్రాన్ వ్యాధి లక్షణాలు, వ్యాధి తీవ్రతకు సంబంధించిన వివరాలు ఈ అధ్యయనంలో లేవు.

వీడియో క్యాప్షన్, డెల్టా, ఒమిక్రాన్‌ల మధ్య తేడా ఏమిటి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)