ఒమిక్రాన్ కరోనా వేరియంట్‌ను అరికట్టేందుకు కొత్తగా తీసుకుంటున్న చర్యలు పని చేస్తాయా?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, జేమ్స్ గళ్లఘర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచదేశాలను భయపెడుతోంది. దక్షిణాఫ్రికాలో బయటపడిన ఈ కొత్త వేరియంట్ అత్యంత ప్రమాదకరమైనదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే పలు దేశాలకు వ్యాపించింది. బ్రిటన్‌లో మూడో కేసు బయటపడింది. పలు దేశాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. కొన్ని దేశాలు ట్రావెల్ బ్యాన్ విధించాయి.
ఈ కొత్త వేరియంట్ 'ఆందోళనకరం'గా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కూడా పేర్కొంది.
ఈ పరిస్థితి చాలా వేగంగా మారుతోంది. 'ఒమిక్రాన్' జెనెటిక్ ప్రొఫైల్ ఆందోళనను రేకెత్తిస్తోంది.
కానీ, ఈ వేరియంట్ వల్ల కలిగే ప్రమాదమేంటో చెప్పేందుకు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఎవరి దగ్గరా లేవు.
దీని వల్ల ఎంత తీవ్రమైన ముప్పు పొంచి ఉందనే విషయంపై ప్రస్తుతం ఎవరికీ స్పష్టత లేదు.
దీని గురించి సరైన సమాచారం లేని ఈ దశలో దీనిని పట్టించుకోకపోయినా, తీవ్రంగా పరిగణించినా కూడా ప్రమాదమే అనే ఉద్ద్యేశ్యంతో, యూకే ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టింది.
'ఒమిక్రాన్'లో ఉన్న మ్యుటేషన్ల కారణంగా అది వేగంగా వ్యాప్తి చెందుతుందని మాత్రం తెలుసు. ఇలా జరుగుతుందనడానికి దక్షిణాఫ్రికాలో ఆధారాలు కనిపిస్తున్నాయి.
వీటిలో వ్యాక్సీన్ల ప్రభావాన్ని తగ్గించే మ్యుటేషన్లు ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. దీంతో ఇతర వేరియంట్ల కంటే కూడా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చేసే ముప్పు దీనికి ఎక్కువగా ఉంటుంది.
అయితే దీని వ్యాప్తి ఎలా జరుగుతుందనే విషయం మనకు తెలియదు. ఇది తేలికపాటి ఇన్ఫెక్షన్‌ను కలుగచేస్తుందా, తీవ్రమైన ఇన్ఫెక్షన్‌కు లోను చేస్తుందా అనే విషయం గురించి కూడా తెలియదు.
ఇది శరీరంలోవ్యాక్సీన్లు, బూస్టర్ల ద్వారా సమకూరిన రోగనిరోధక శక్తిపై దాడి చేసినప్పుడు ఏమి జరుగుతుందో కూడా తెలియదు.

ఫొటో సోర్స్, Getty Images
యూకేలోకి అడుగుపెట్టే ప్రతీ ఒక్కరికి పరీక్షలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒమిక్రాన్ వేరియంట్ ఇన్ఫెక్షన్ సోకిన వారికి దగ్గరగా మెలిగిన వారందరినీ విడిగా పెట్టాలని, బహిరంగ స్థలాల్లో మాస్కులను తప్పనిసరి చేయాలని, బూస్టర్ డోసులు ఇవ్వడాన్ని వేగవంతం చేయాలని నిర్ణయం తీసుకుంది.
అయితే ఈ చర్యలు ఒమిక్రాన్ కేసులు సోకడాన్నిగాని, వ్యాప్తి చెందడాన్నిగాని పూర్తిగా ఆపలేవు. ఇది ఇప్పటికే వచ్చేసింది. దానికి వ్యాప్తి చెందే లక్షణం ఉంటే మాత్రం దానిని ఆపడం సాధ్యం కాదు.
అదెక్కడైనా వ్యాప్తి చెందవచ్చు. అక్టోబరులో సగం రోజులు మాత్రమే కేసులు నమోదవ్వలేదు. తిరిగి కేసుల సంఖ్య పెరుగుతోంది.
వ్యాధి సోకిన రోగి నుంచి సగటున వైరస్ ఎంత మందికి వ్యాప్తి చెందగలదని అంచనా వేసే సంఖ్యని ఆర్ నాట్ అంటారు. ఈ లెక్కన రోజుకు సగటున 40,000 కేసులు నమోదయితే, ఆర్ సంఖ్య ఒకటిని మించిపోతుంది. ఈ సంఖ్య పెరిగితే కేసులు పెరుగుతున్నట్లు అర్థం.
ఆసుపత్రులపై పడే ఒత్తిడి గురించి ప్రభుత్వం ఆలోచిస్తోంది. కానీ, ఒకవైపు కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ కూడా, బూస్టర్ వ్యాక్సీన్లు విజయవంతం కావడంతో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య తగ్గుతోంది.
డెల్టా వేరియంట్ వ్యాప్తికి ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి కూడా తోడైతే, రోగనిరోధకశక్తిపై ప్రభావం చూపిస్తుంది. దాంతో, కోవిడ్ మరింత వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది.
ఇంకా కొన్ని శాస్త్రీయ ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది.
ఒమిక్రాన్ అత్యంత శక్తివంతమైన రోగ నిరోధక శక్తిపై కూడా దాడి చేస్తే ఏం జరుగుతుంది? ఈ ప్రశ్నకు లభించే సమాధానమే భవిష్యత్తులో ఏమి జరుగుతుందనే విషయాన్ని నిర్దేశిస్తుంది.
యూకేలో ఇచ్చిన వ్యాక్సీన్లు వైరస్ పైనున్న స్పైక్ ప్రోటీన్‌పై దాడి చేసేందుకు శరీరానికి శిక్షణనిస్తాయి. ముఖ్యంగా చైనాలోని వుహాన్‌లో పుట్టిన కోవిడ్ తొలి వేరియంట్‌పై దాడి చేసేలా దీన్ని రూపొందించారు.
మన రోగనిరోధక శక్తి ఈ స్పైక్‌లో చాలా భాగాలపై దాడి చేయడానికి శిక్షణ పొందుతుంది.
మన రక్తంలో ఉండే యాంటీబాడీలు ఫార్ములా వన్ కారు రేసు మధ్యలో వచ్చే పిట్ క్రూలా వస్తాయి.
కానీ, ఒమిక్రాన్‌లో ఉండే మ్యుటేషన్లు మెకానిక్‌లను గాభరా పెడుతూ ఎప్పటికప్పుడు కారులో భాగాలను మార్చేస్తూ ఉంటాయి. దీంతో, మెకానిక్‌ల పని కష్టమైపోతుంది. రోగనిరోధకశక్తిపై ప్రభావం పడగానే కోవిడ్ సోకే అవకాశాలు కూడా ఎక్కువవుతాయి.
రోగ నిరోధక శక్తి తగ్గగానే తీవ్రంగా జబ్బు పడటం పెరుగుతుంది. మరణం నుంచి బయటపడే అవకాశాలు తగ్గిపోతాయి. కానీ, ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఇంకా సమయం పడుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
బూస్టర్ డోసుల వల్ల కూడా దీని ప్రభావం తగ్గుతుందా లేదా అనేది తెలియదు.
సైద్ధాంతికంగా చూస్తే, రోగ నిరోధక శక్తి తక్కువైనప్పుడు మరిన్ని యాంటీబాడీలు, టీ-కణాలు ఎక్కించి సమస్యను కొంతవరకు నివారించవచ్చు.
ఇప్పటికే యూకేలో 1.7 లక్షల మంది జనాభా మూడోడోసును కూడా తీసుకున్నారు. బూస్టర్ డోసులను ఇవ్వడం పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.
కొన్ని దేశాలు రెండు, మూడో డోసుల మధ్యనున్న వ్యవధిని ఆరు నెలల నుంచి అయిదు నెలలకు తగ్గించాయి.
అయితే, ప్రభుత్వ వ్యాక్సీన్ సలహాదారుల నుంచి మరింత సమాచారం రావాల్సి ఉంది.
అవసరమైతే, ఒమిక్రాన్ వేరియంట్‌పై పోరాడే విధంగా 100 రోజుల్లో వ్యాక్సీన్లను అప్‌డేట్ చేస్తామని ఫార్మా కంపెనీలు చెబుతున్నాయి.
మన ఆయుధాగారంలో యాంటీవైరల్ మందుల రూపంలో కొత్త ఆయుధాలున్నాయని గుర్తించడం అవసరం.
పాక్స్‌లోవిడ్, మొల్నుపిరావిర్ ఔషధాలు వైరస్ అంతర్గత పని తీరుపై గురి పెడతాయి.
అయితే, కొత్త వేరియంట్ మ్యుటేషన్లు వీటి ప్రభావాన్ని కూడా తగ్గిస్తాయా అనే విషయంపై ఇప్పటి వరకు సూచనలు అందలేదు.
ఇప్పటికే కొందరు ప్రభుత్వం అనవసరంగా స్పందిస్తోందని అంటుంటే, మరికొందరు తగినంత వేగంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవడం లేదని వాపోతున్నారు.
అయితే, వీటన్నిటికీ సరైన సమాధానాలు రాబోయే రోజుల్లో మాత్రమే లభిస్తాయి.
ఇవి కూడా చదవండి:
- చైనీస్ ఫుడ్: '8,000 రెస్టారెంట్లలో ఆహారం రుచి చూశాక నాకు తెలిసిందేంటంటే...'
- అభినందన్ వర్థమాన్‌కు వీర్ చక్ర అవార్డు ఇవ్వడంపై పాకిస్తాన్ ఏమందంటే..
- ఆరంకెల జీతాలతో ఆకర్షిస్తున్న డేటా సైంటిస్ట్ ఉద్యోగాలు
- ఈ చిన్న అట్టపెట్టె లాంటి ఉపగ్రహాలు ప్రపంచాన్ని ఎలా మార్చేయబోతున్నాయి?
- హనుమ విహారి ఫౌండేషన్, ఎన్టీఆర్ ట్రస్టు మధ్య గొడవేంటి? ఈ క్రికెటర్ ట్విటర్ నుంచి ఎందుకు తప్పుకున్నాడు?
- 'ఇప్పుడే నీ చేతుల్లో చచ్చిపోయా'.. ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ విడాకులపై రూమర్లకు ఈ కామెంట్ సమాధానమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









