‘గర్ల్స్ డు పోర్న్’ అశ్లీల వీడియోల బాధిత మహిళలకే ఆ కంటెంట్‌పై హక్కులు, పరిహారం.. అమెరికా కోర్టు తీర్పు

వీడియో సెటప్

ఫొటో సోర్స్, Getty Images

పోర్న్ వెబ్‌సైట్ల కోసం అశ్లీలంగా చిత్రీకరించే వీడియోల్లో మోసపోయి చిక్కుకున్న బాధితులకు సంబంధించి అమెరికాలోని ఓ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. దాని ప్రకారం ఆ వీడియోల హక్కులు లభించడంతో పాటు లక్షల డాలర్ల నష్ట పరిహారం బాధితులకు అందుతుంది.

'గర్ల్స్ డు పోర్న్', 'గర్ల్స్ డు టాయ్స్' అనే వెబ్‌సైట్లపై చాలా కాలంగా న్యాయపరమైన పోరాటం జరుగుతోంది.

ఇలాంటి అశ్లీల వెబ్‌సైట్లు మహిళలను మోసగించి రూపొందించిన వీడియోలు, ఫొటోలపై హక్కులు బాధిత మహిళలకే చెందుతాయంటూ యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి తీర్పునిచ్చారు.

దీంతో 400 మందికి పైగా బాధితులకు, ఆన్‌లైన్‌లో ఉన్న తమ ఫుటేజీని తొలగించాలని అడిగే హక్కు లభించింది.

సదరు మెటీరియల్‌ను తొలిగించాలని కోరుతూ పోర్న్‌హబ్, గూగుల్ సహా మిగతా సంస్థలకు నోటీసులు ఇవ్వాలని వారు భావిస్తున్నారు.

సెక్స్ వీడియోల్లో కనిపించేలా మహిళలను బలవంతపెట్టినందుకు గానూ 'గర్ల్స్ డు పోర్న్' నిర్మాత రూబెన్ ఆండ్రీ గార్సియాకు ఇటీవల 20 ఏళ్ల జైలు శిక్ష విధించారు.

నిజానికి, దుస్తులు ధరించి చేసే మోడలింగ్ పని కోసం ఇచ్చిన అడ్వర్టైజ్‌మెంట్‌కు కొందరు మహిళలు ముందుకొచ్చారు. కానీ, తర్వాత అడల్ట్ వీడియో షూట్ చేస్తే వారికి అధికంగా డబ్బులు ఇస్తామని నిర్వాహకులు చెప్పారు.

సెక్స్‌కు సంబంధించిన వీడియోల్లో నటించేలా గార్సియా తమపై ఒత్తిడి తెచ్చారని, వీడియో షూట్‌కు సంబంధించి తమకు తప్పుడు సమాచారం ఇచ్చారని గర్ల్స్ డు పోర్న్ వీడియోల్లో కనిపించిన ఒక మహిళ ఆరోపించారు.

ఈ వీడియోలు కేవలం డీవీడీల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయని, వాటిని విదేశాల్లోనే విక్రయిస్తామని గార్సియా వారికి చెప్పారు.

నిజానికి ఆ వీడియోలన్నీ ఆన్‌లైన్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది చూసే వెబ్‌సైట్‌లలో ఒకటైన పోర్న్‌హబ్‌లో కూడా పోస్ట్ అవుతాయని గార్సియాకు ముందే తెలుసు. కానీ, మహిళలకు ఆ విషయం చెప్పలేదు.

పోర్న్ హబ్

ఫొటో సోర్స్, NURPHOTO

గార్సియా, 1.8 కోట్ల డాలర్లు(సుమారు రూ. 136 కోట్లు) నష్టపరిహారం చెల్లించడంతో పాటు వీడియో, ఫొటోలకు సంబంధించిన హక్కులను మహిళలకు అప్పగించాలని యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి జనిస్ సమ్మర్టినో తీర్పునిచ్చారు.

దీనివల్ల 'గర్ల్స్ డు పోర్న్' వెబ్‌సైట్ బాధితులైన 402 మంది మహిళలకు తమ వీడియోలకు సంబంధించిన హక్కులు లభించాయి. వీరంతా డిజిటల్ మిలీనియం కాపీరైట్ చట్టం ప్రకారం, తమ వీడియోలను ప్రదర్శిస్తోన్న వెబ్‌సైట్‌లకు వ్యతిరేకంగా 'టేక్‌డౌన్' నోటీసులను పంపించవచ్చు.

2016 నుంచి ఈ మహిళలంతా న్యాయం కోసం పోరాడుతున్నారు.

''ఇది చాలా ముఖ్యమైన తీర్పు. బాధితులకు తీవ్రమైన క్షోభను కలిగించిన వీడియోలు, ఫొటోలకు సంబంధించిన హక్కులు తిరిగి మహిళలకు ఇవ్వడం ద్వారా వారికి ఎంతో ఉపశమనాన్ని కలిగించింది'' అని సదరన్ కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ యూఎస్ అటార్నీ రాండీ గ్రాస్‌మన్ అన్నారు.

''వారి జీవితాల్లో అతి కఠినమైన అధ్యాయాన్ని ముగించేందుకు బాధితులకు ఈ తీర్పు సహాయపడుతుందని మేం ఆశిస్తున్నాం.''

''సుదీర్ఘంగా జరిగిన ఈ ప్రక్రియలో ముఖ్యమైన దశ ఏంటంటే, బాధితులు తిరిగి వారి జీవితాలపై నియంత్రణ సాధించడం'' అని ఎఫ్‌బీఐ ప్రత్యేక ఏజెంట్ ఇన్‌చార్జి సజానే టర్నల్ అన్నారు.

వీడియో క్యాప్షన్, వరకట్న వేధింపుల నుంచి మహిళలకు రక్షణనిచ్చే చట్టాలివే

''ఈ కేసులో పరారీలో ఉన్న మైఖేల్ జేమ్స్ ప్రాట్‌ను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోన్న ఎఫ్‌బీఐకి ఈ తీర్పు సహాయపడుతుంది.''

ప్రాట్ ఎక్కడున్నాడో ఇప్పటికీ అధికారులు కనిపెట్టలేకపోయారు. ప్రాట్‌ను 'రింగ్‌లీడర్'గా పేర్కొన్న ఎఫ్‌బీఐ, 2020 సెప్టెంబర్‌లో 'మోస్ట్ వాంటెడ్' జాబితాలో అతని పేరును చేర్చింది.

అక్టోబర్‌లో పోర్న్‌హబ్ మాతృసంస్థపై 50 మంది మహిళలు వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. వారంతా 'సెక్స్ ట్రాఫికింగ్ ఆపరేషన్' బాధితులమని అందులో పేర్కొన్నారు. దీన్ని ఆ కంపెనీ పరిష్కరించుకుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)