Suicide: భారతదేశంలో ఏటా వేల మంది గృహిణులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు

మహిళలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, గీత పాండే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

గత ఏడాది భారత్‌లో 22,372 మంది గృహిణులు ఆత్మహత్య చేసుకున్నట్లు ఇటీవల నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విడుదల చేసిన గణాంకాలు తెలుపుతున్నాయి. అంటే, సగటున రోజుకు 61, ప్రతి 25 నిమిషాలకు ఒక ఆత్మహత్య చోటు చేసుకుంటున్నట్లు అర్థమవుతోంది.

భారతదేశంలో 2020లో ఆత్మహత్య చేసుకున్న మొత్తం 1,53,052 మందిలో మహిళలు 50 శాతం కంటే ఎక్కువగా ఉండగా, వారిలో 14.6 శాతం మంది గృహిణులు

ఇలా జరగడం ఒక్క గత ఏడాదికే పరిమితం కాదు. ఎన్‌సీ‌ఆర్‌బీ నేర గణాంకాల నమోదు ప్రారంభించిన 1997 నుంచి ఏటా 20,000 మందికి పైగా గృహిణులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. 2009లో వారి సంఖ్య 25,092కు చేరింది.

అటువంటి ఆత్మహత్యలకు కుటుంబ సమస్యలు లేదా వివాహ సమస్యలు కారణాలని నివేదికలు చెబుతూ ఉంటాయి. కానీ, కొన్ని వేల మంది గృహిణులు ప్రాణాలు తీసుకోవడానికి గల కారణాలేంటి?

ఈ ఆత్మహత్యలకు ప్రధాన కారణం గృహ హింస అని మానసిక ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 30 శాతం మంది మహిళలు గృహ హింసకు గురవుతున్నారని.. పెళ్లి తర్వాత రోజువారీ ఇంటి చాకిరీ, వివాహ బంధాలలో అణచివేతకు గురవుతూ అత్తవారింటి జీవితంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు ఇటీవల నిర్వహించిన ఒక ప్రభుత్వ సర్వేలో తేలింది.

"సాధారణంగా మహిళలు ఓపికగానే ఉంటారు. కానీ, ఆ ఓపికకు కూడా ఒక హద్దు ఉంటుంది" అని వారణాసికి చెందిన క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ ఉష వర్మ శ్రీవాస్తవ చెప్పారు.

"చాలా మంది అమ్మాయిలకు వివాహ వయసు 18 రాగానే పెళ్లిళ్లు చేసేస్తారు. పెళ్లి తర్వాత ఆమె జీవితం అంతా ఇంటి పనులు, వంటకే పరిమితమైపోతుంది. ఆమె పై అన్ని రకాల నిబంధనలు విధిస్తారు. వ్యక్తిగత స్వాతంత్ర్యం చాలా తక్కువగా ఉంటుంది. ఆర్థిక స్వాతంత్రం కూడా ఉండదు" అన్నారామె.

"ఆమె చదువుకున్న చదువుకు, కలలకు విలువ ఉండదు. ఆశలు నెమ్మదిగా ఆవిరైపోతూ ఉంటాయి. దాంతో, నిస్సహాయత, నిరుత్సాహం ఆవరించి ఆమె మనుగడ హింసాత్మకంగా మారుతుంది" అని అన్నారు.

మహిళలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మహిళలు

అనేక ప్రభావాలు

పెద్ద వయసు మహిళల ఆత్మహత్యలకు కారణాలు వేరని డాక్టర్ వర్మ శ్రీ వాస్తవ అంటారు.

"పిల్లలు పెద్దవారై బయటకు వెళ్లిపోయాక ఇల్లంతా ఖాళీ అయిపోయిందనే బాధలో ఉంటారు. కొంత మంది పెరీ మెనోపాజ్ లక్షణాలతో బాధపడుతూ ఉంటారు. దాంతో, అది మానసిక ఒత్తిడికి దారి తీసి తెలియకుండా ఏడ్చేస్తూ ఉంటారు" అని చెప్పారు.

"కానీ, ఒక్క క్షణం పాటు ఎవరినైనా ఆపగలిగితే ఆత్మహత్యలను సులభంగా నివారించవచ్చు" అంటారామె.

"చాలావరకు భారతదేశంలో క్షణికావేశంలో జరిగే ఆత్మహత్యలే అధికం. చాలామంది పురుషులు ఇంటికొచ్చి భార్యను కొడతారు. ఆ వెంటనే ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది" అని మానసిక నిపుణులు సౌమిత్ర పథారే చెప్పారు.

ఆత్మహత్యలు చేసుకుంటున్న మహిళల్లో మూడు వంతుల మంది గృహ హింసకు గురైనట్లు ఒక స్వతంత్ర సంస్థ నిర్వహించిన అధ్యయనం తెలిపింది. కానీ, ఎన్‌సీఆర్‌బీ డేటాలో ఎక్కడా ఆత్మహత్యలకు కారణం గృహ హింస అనే విషయాన్ని ప్రస్తావించలేదు.

"గృహ హింస బాధితులైన చాలామంది మహిళలు తమకు అనధికారంగా దొరికే సహాయంతోనే ధైర్యంగా నిలబడుతూ ఉంటారు" అని బెంగళూరుకు చెందిన మెంటల్ హెల్త్ యాప్ ‘వైశా’ కు చెందిన మానసిక నిపుణురాలు చైతాలీ సిన్హా చెప్పారు.

ముంబయిలో మూడేళ్ళ పాటు ఒక ప్రభుత్వ మానసిక రోగుల ఆసుపత్రిలో చైతాలీ పని చేశారు. ఆత్మహత్యకు ప్రయత్నించిన మహిళలకు ఆమె కౌన్సిలింగ్ ఇచ్చేవారు. చాలా మంది మహిళలు సహాయం కోసం లోకల్ ట్రైన్స్‌లోనూ, లేదా ఇరుగు పొరుగు వారితోనూ చిన్న చిన్న సమూహాలు ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పారు.

"వారి బాధను చెప్పుకునేందుకు మరో దారి లేదు. కోవిడ్ మహమ్మారి, లాక్‌డౌన్ వారి పరిస్థితిని మరింత దిగజార్చాయి" అని ఆమె అన్నారు.

"మగవాళ్లు పనుల్లోకి వెళ్లిన తర్వాత మహిళలకు ఇంట్లో సురక్షితమైన ప్రదేశం దొరికేది. కానీ, మహమ్మారి తర్వాత ఆ పరిస్థితి కరువయింది. గృహ హింస విషయంలో చాలా సార్లు వేధించేవారితో కలిసి బందీలుగా ఉండిపోయారు. దాంతో, వారికి సాంత్వన పొందే మార్గం లేదు. లోపల విచారం, కోపం గూడు కట్టుకుపోయి, ఆత్మహత్య ఒక్కటే మార్గమని అనుకుంటారు" అని చెప్పారు.

ప్రపంచ వ్యాప్తంగా భారతదేశంలో అత్యధిక ఆత్మహత్యలు నమోదవుతున్నాయి. అందులో పురుషులు పావు వంతు మంది ఉంటే, మహిళలు 36% మంది ఉంటున్నారు. వీరిలో ఎక్కువగా 15-39 సంవత్సరాల వయసు వారుంటున్నారు.

భారతదేశంలో వెలువడుతున్న అధికారిక అంచనాలు చాలా తక్కువ స్థాయిలో అంచనా వేస్తున్నాయని, ఈ సమస్య లోతులను సరైన రీతిలో కొలవటం లేదని మానసిక సమస్యలు, ఆత్మహత్యల నివారణ గురించి అధ్యయనం చేసిన డాక్టర్ పథారే అన్నారు.

మహిళలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మహిళలు

సమస్యను చర్చించరు

"భారతదేశంలో నమోదవుతున్న ఆత్మహత్యల సంఖ్య కంటే వాస్తవ ఆత్మహత్యల సంఖ్య ఎక్కువగా ఉంటుందని మిలియన్ డెత్, లాన్‌‌సెట్ అధ్యయనాలు చెబుతున్నాయి.

"ఇప్పటికీ ఆత్మహత్యల గురించి బహిరంగంగా చర్చించరు. దీనికి కొంత సిగ్గు, భయం కూడా ఉన్నాయి. చాలా కుటుంబాలు ఈ విషయాన్ని దాచి పెట్టి ఉంచాలని అనుకుంటాయి. గ్రామాల్లో శవాన్ని అటాప్సీకి కూడా ఇవ్వరు. ధనవంతులు పోలీసుల సహకారంతో ఆత్మహత్యలను ప్రమాదాలుగా నమోదు చేయిస్తారు. పోలీసులు నమోదు చేసిన వివరాలను ఎవరూ ధ్రువీకరించరు" అని చెప్పారు.

భారతదేశంలో జాతీయ స్థాయిలో ఆత్మహత్యల నివారణకు వ్యూహాన్ని అభివృద్ధి చేస్తున్న సమయంలో దీనికి సంబంధించిన డేటా కూడా సక్రమంగా ఉండేటట్లు చూసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని డాక్టర్ పథారే అన్నారు.

"భారతదేశంలో ఆత్మహత్యలకు ప్రయత్నించిన వారి సంఖ్యను పరిశీలిస్తే అది చాలా తక్కువగా ఉంటుంది.

ప్రపంచంలో ఎక్కడైనా సాధారణంగా అది ఆత్మహత్యలు చేసుకున్న వారి సంఖ్య కంటే ఆత్మహత్యకు యత్నించిన వారి సంఖ్య 4 - 20 రెట్లు ఉంటుంది. భారతదేశంలో గతేడాది 150,000 ఆత్మహత్యలు నమోదైతే, కనీసం 60 లక్షల మంది ఆత్మహత్యా యత్నం చేసి ఉండవచ్చు" అని చెప్పారు

ఆత్మహత్యలను నివారించాలంటే ముందుగా ఆత్మహత్యకు ప్రయత్నించిన జనాభా పై దృష్టి పెట్టాలి. కానీ, మన దగ్గర లభించే డేటా సక్రమంగా ఉండదు" అని అన్నారు.

2030 నాటికి ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న ఆత్మహత్యలను తగ్గించాలని ఐక్యరాజ్యసమితి లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, గత ఏడాది భారతదేశంలో ఆత్మహత్యలు 10 శాతం పెరిగాయి.

వీడియో క్యాప్షన్, యూట్యూబ్‌ ఫ్యాషన్ సెన్సేషన్ కిరాక్ అభిజ్ఞ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)