ఆంధ్రప్రదేశ్‌: ‘తొలి ఒమిక్రాన్ కేసు అని ప్రచారం చేయొద్దు’ - శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి : BBC Newsreel

సంతబొమ్మాళి
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

శ్రీకాకుళం జిల్లాలో ఒమిక్రాన్ కేసు నమోదు అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి జగన్నాధ రావు తెలిపారు.

ఈ మేరకు శుక్రవారం (10.12.21) సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.

సంతబొమ్మాళి మండలం ఉమ్మిలాడకు చెందిన ఒక వ్యక్తి గత నెల 22వ తేదీన లండన్​ నుంచి ముంబయి వచ్చి అక్కడ పరీక్షలు చేయించుకున్నాడని, అక్కడ నెగిటివ్​ రావడంతో 23వ తేదీన స్వగ్రామం వచ్చారని డీఎంహెచ్ఓ పేర్కొన్నారు.

ఆ వ్యక్తి వచ్చి ఏడు రోజులు కావడంతో సాధారణ పరీక్షల్లో భాగంగా మళ్లీ టెస్టు చేయగా.. కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యిందని చెప్పారు.

అయితే అది కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ కాదనిపిస్తోందని తెలిపారు. అతని శాంపిల్స్ హైదరాబాద్​కు పంపించామన్నారు.

పరీక్ష ఫలితాలు రావడానికి ఇంకా మూడు రోజుల సమయం పడుతుందని అప్పటివరకు ఒమిక్రాన్ అంటూ వదంతులు ప్రచారం చేయవద్దని డీఎంహెచ్ఓ జగన్నాధ రావు విజ్ఞప్తి చేశారు.

వీడియో క్యాప్షన్, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాక్సీన్లకు లొంగదా

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)