భారతీయుల దృష్టిలో ప్రేమ, పెళ్లి అంటే ఏమిటి

ఫొటో సోర్స్, Getty Images
వివాహం, సాహచర్యంపై భారత ప్రజల ఆలోచనా విధానం, వాటి వెనుక ఉన్న సామాజిక, రాజకీయ కోణాలు ఏమిటి? అనేది డాటా ఆధారంగా విశ్లేషిస్తున్నారు జర్నలిస్ట్ రుక్మిణి ఎస్.
ముంబయి లో పనిచేస్తున్న 22 ఏళ్ల నితిన్ కాంబ్లే నెలకు రెండుసార్లు మహారాష్ట్రలోని తన స్వగ్రామానికి వెళ్తుంటారు. వెళ్లినప్పుడల్లా రెండు బ్యాగులు సర్దుకుంటారు. ఒకటి ఊరెళ్లడానికి. రెండోదాంట్లో అవసరం లేని సామాన్లు నింపి తాను అద్దెకుంటున్న ఇంట్లో మంచం కింద దాచి పెడతారు.
ఆ రెండో సంచీలో తన రహస్యాలన్నీ కూడా దాచి పెడుతున్నట్లు ఊహించుకుంటారు నితిన్. ఆయన మాంసం తింటారు. అప్పుడప్పుడూ మద్యం సేవిస్తారు. ఈ విషయాలేవీ ఆయన కుటుంబానికి తెలియదు. వీటన్నింటికన్న ముఖ్యంగా తన గర్ల్ ఫ్రెండ్ కులం గురించి వాళ్లింట్లో తెలియదు. బహుశా ఆ అమ్మాయి ఇంట్లో కూడా వీరిద్దరి సంగతీ తెలియదు. తెలిస్తే రెండు కుటుంబాలూ ఎప్పటికీ ఒప్పుకోవు.
ఇదేమీ మనకి తెలియని కథ కాదు. ఎన్నోసార్లు విన్నదే, చూసిందే అనిపిస్తుంది. కానీ, డాటాను పరిశీలిస్తే నితిన్ కథ సాధారణం కాదని తెలుస్తుంది.
భారతదేశం గురించి ఆసక్తికరమైన అనేక విషయాలు ఈ డాటా లో కనిపిస్తాయి.

ఫొటో సోర్స్, EPA
ప్రేమ..పెళ్లి
భారతీయులు ఎలా డబ్బు సంపాదిస్తారు, ఎలా ఖర్చు పెడతారు, ఎలాంటి ఉద్యోగాలు చేస్తారు, ఓటు ఎవరికి వేయాలో ఎలా నిర్ణయించుకుంటారు..ఇలా ఎన్నో విషయాలు స్పష్టమవుతాయి.
అలాగే, ప్రేమ, పెళ్లి గురించి కూడా వాళ్ల ఆలోచనలు ఏమిటో నంబర్లు తెలియజేస్తాయి. డాటాను పరిశీలిస్తే ఈ అంశాల్లో అనేక దృక్కోణాలు కనబడతాయి.
భారతీయ సినిమాలు చూస్తే ప్రేమ తప్ప మరొకటి కనిపించదు. యువత ఆలోచనలన్నీ ప్రేమ, పెళ్లి చుట్టూనే తిరుగుతూ ఉంటాయనిపిస్తుంది. అది కొంతవరకు నిజమే కావొచ్చు. కానీ, అధిక సంఖ్యలో భారతీయులు పెద్దలు కుదిర్చిన వివాహాలనే చేసుకుంటున్నారు.
2018లో 1,60,000 కంటే ఎక్కువ కుటుంబాలపై జరిపిన ఒక సర్వేలో, వివాహితుల్లో 93 శాతం తమది పెద్దలు కుదిర్చిన వివాహమేనని చెప్పారు. కేవలం 3 శాతం మాత్రమే ప్రేమ వివాహం చేసుకున్నారు.
మరో 2 శాతానిది ప్రేమ ప్లస్ పెద్దలు కుదిర్చిన వివాహం. అంటే పెద్దలే ఈ సంబంధాన్ని కలుపుతారు. పరిచయమయ్యాక, అమ్మాయి అబ్బాయి ప్రేమలో పడి పెళ్లికి ఒప్పుకుంటారు. కాలంతో పాటు ఈ శాతాలు పెద్దగా పెరగలేదు.

ఫొటో సోర్స్, Getty Images
పెద్దలు కుదిర్చిన పెళ్లికే మొగ్గు
80 ఏళ్లు దాటిన వారిలో 94 శాతం తమది పెద్దలు కుదిర్చిన వివాహమేనని చెప్పారు. 20 ఏళ్లు దాటిన వారిలో 90 శాతం కన్నా ఎక్కువ జంటలు పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నవారే.
మనీషా మండల అనే యువతి ప్రేమ వివాహం చేసుకుందామని అనుకున్నారు. "మా ఇంట్లో అన్నిటికీ నాకు పోరాటమే. మా ఇంటికి కొంచెం దూరంగా ఉన్న కాలేజీలో చదువుకోవడానికి నా తల్లిదండ్రులతో పోరాడాను. ఇక తరువాతి పోరాటం ప్రేమ వివాహానికే అనుకున్నా" అని మనీషా చెప్పుకొచ్చారు.
తూర్పు భారతదేశంలోని చిన్న పట్టణమైన భిలాయ్‌లో ఆఫీస్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారామె.
కాలేజీలో కొంతమంది అబ్బాయిలు ఆమె వెనకాల పడేవారు. అయితే, వారితో మాట్లాడితే పరువు పోతుందని సీనియర్ అమ్మాయిలు హెచ్చరించారు. అలాగే, మనీషా వాళ్ల అన్నయ్య ఆమెను ఓ కంట కనిపెడుతూ ఉండేవారు.
మనీషాకు మాత్రం చదువే ముఖ్యం. ప్రేమలో పడడం కన్నా చదువుకుని, ఉద్యోగం చేయాలన్నదే ఆమె ఆశయం. అయితే, మనీషా కాలేజీ చివరి సంవత్సరంలో ఉండగా, వాళ్ల కులంలోని అబ్బాయితోనే ఆమె పెళ్లి నిశ్చయించారు.
"మా అమ్మనాన్నల్ని దగ్గరగా చూశాను. వాళ్లెప్పుడూ పోట్లాడుకోలేదు. కాబట్టి పెద్దలు కుదిర్చిన వివాహం సజావుగానే సాగుతుంది అనిపించింది" అని 24 ఏళ్ల మనీషా చెప్పారు.
భారతీయ వివాహాల్లో కులం, మతం ప్రాధాన్యం వహిస్తాయి. సొంత కులాల్లోనే సంబంధాలు చూస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రేమ పెళ్లిళ్లు తక్కువే
2014లో 70,000 కంటే ఎక్కువ మందిపై జరిపిన సర్వేలో, పట్టణ ప్రాంత భారతీయుల్లో కులాంతర వివాహాలు చేసుకున్నవారు 10 శాతం కన్నా తక్కువే అని తేలింది. మతాంతర వివాహాలు అంతకన్నా తక్కువ. కేవలం 5 శాతం మాత్రమే మతాంతర వివాహాలు చేసుకున్నట్లు చెప్పారు.
కులాంతర వివాహాలు చేసుకునేందుకు అభ్యంతరం లేదని యువత తరచూ చెబుతుంటారు. కానీ, డాటా పరిశీలిస్తే అభిప్రాయాలకు, వాస్తవాలకు మధ్య చాలా పెద్ద వ్యత్యాసం కనిపించింది.
2015లో మాట్రిమోనియల్ సైట్లలో తమ పేరు రిజిస్టర్ చేసుకున్న 1,000 మంది అమ్మాయిలను సంప్రదించాం. సగంమంది కులాంతర వివాహాలను అభ్యంతరం లేదని చెప్పినా, చాలా వరకు అమ్మాయిలు సొంత కులానికి చెందిన అబ్బాయిలనే వివాహం చేసుకోవడానికే మొగ్గు చూపారు.
మంచి చదువు, ఉద్యోగం, అందం అన్నీ ఉన్నా ఒక దళిత అబ్బాయికి వెళ్లే ప్రపోజల్స్ చాలా తక్కువగానే ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో, మనసుకు నచ్చినవాడిని కులాంతర లేదా మతాంతర వివాహం చేసుకోవాలంటే పెద్ద యుద్ధమే చేయాల్సి ఉంటుంది.
2013లో దిల్లీలోని ఏడు జిల్లా కోర్టుల్లో అత్యాచారానికి సంబంధించిన ప్రతీ కేసులోనూ ఇచ్చిన తీర్పును పరిశీలించాను. సుమారు 600 కేసులుంటాయి. కోర్టుల్లో విచారణ ముగిసిన 460 కేసుల్లో 40 శాతం సమ్మతి ఉన్న జంటలకు సంబంధించిన కేసులే.
కోర్టుల్లో విచారణ ముగిసిన 460 కేసుల్లో 40 శాతం అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడ్డవారే. చాలావరకు కులాంతర, మతాంతర ప్రేమలే. వాళ్లు ప్రేమించుకుని ఇంట్లోంచి పారిపోయిన తరువాత, అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి మీద అత్యాచారం లేదా అపహరణ కేసులు పెట్టారు.
తమ బిడ్డ కులాంతర వివాహం చేసుకుంది అనే కంటే అత్యాచారానికి గురైంది అని చెప్పుకోవడంలో వారికి ఎలాంటి అభ్యంతరం లేదు. రాను రాను పరిస్థితులు మరింత దిగజారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గత కొన్నేళ్లుగా అతివాద హిందూ గ్రూపులు "లవ్ జిహాద్" అనే పదాన్ని తెరపైకి తీసుకొచ్చాయి. మతం మార్చడానికే, ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిలను పెళ్లి చేసుకుంటున్నారని ఆరోపించడం ప్రారంభించాయి.బీజేపీ పాలనలో ఉన్న అనేక రాష్ట్రాలు పెళ్లి పేరుతో అమ్మాయిల మతం మార్చే అబ్బాయిలకు కఠిన శిక్షలను అమల్లోకి తీసుకొచ్చాయి. అలాగే, మతాంతర వివాహాలను అడ్డుకోవడానికి చట్టబద్ధత తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి.
ఇవన్నీ కూడా కులాంతర, మతాంతర వివాహాలను మరింత నిరుత్సాహపరుస్తాయి. అంతే కాకుండా, ప్రేమ, పెళ్లిళ్లకు సంబంధించిన విశ్వసనీయ డాటా దొరకదు.
మతాంతర వివాహం చేసుకున్న ఒక జంట, తాము ఎదుర్కున్న సమస్యలను వివరించారు. అమ్మాయి కుటుంబం వాళ్లని వెంటాడి వేధించిందని, తమ పేర్లు, ఇతర వివరాలు బయటపడతాయన్న భయంతో పెళ్లి సర్టిఫికెట్ కూడా తీసుకోలేని చెప్పారు.
అయితే, నితిన్ కాంబ్లే లాంటి అబ్బాయిలు ప్రేమపై ఆశావహ దృక్పథాన్ని కనబరుస్తున్నారు.
"భారతదేశంలో చాలా తక్కువ శాతం కులాంతర, మతాంతర వివాహాలు జరుగుతున్నాయని మీ డాటా చెబుతోంది. కానీ మీ డాటా ప్రేమ గురించి ఏం చెప్పట్లేదు" అన్నారు నితిన్
ఈ నమ్మకంతోనే భారతదేశంలో యువత తమ ప్రేమ కొసం పోరాడుతోంది. కానీ, ఓడిపోతోంది.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: పంచాయతీ నిధులను దారి మళ్లించారా, సర్పంచుల ఆందోళన ఎందుకు, ప్రభుత్వ వాదన ఏంటి?
- పల్నాడు: ఈ పేరు ఎలా వచ్చింది, పల్నాడు ఉత్సవాల వెనుక కథ ఏంటి?
- 12ఏళ్ల మిస్టరీ వీడినట్లేనా? బిట్ కాయిన్‌ను కనిపెట్టిన సతోషీ నకమోటో ఈయనేనా?
- ఎండ తగిలితే కాళ్లకు వాపు వస్తోంది
- అనకాపల్లి బెల్లం మార్కెట్లో వ్యాపారం ఎందుకు తగ్గుతోంది?
- గర్భిణి తల నరికి దారుణంగా హత్య చేసిన తల్లి, తమ్ముడు
- బీబీసీ 100 మంది మహిళలు 2021 - మంజులా ప్రదీప్: దళిత మహిళల హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యమకారిణి
- ఆ రోజు ఈ ఫొటో తీసింది ఎవరు? కసబ్ గురించి ఆ ఫొటో జర్నలిస్టు ఏమంటున్నారు?
- గ్రీన్ టీ: ఉదయాన్నే ఓ కప్పు తాగారా... అందులోని పోషకాలను కనిపెట్టిన మిషియో సుజిమూర కథేంటో తెలుసుకుంటారా?
- ‘కార్లను అమ్మడం మొదలుపెట్టి నెల కూడా కాలేదు.. కానీ మార్కెట్ విలువలో ఫోర్డ్ మోటార్స్‌ను దాటేసింది’
- హిట్లర్ కోసం విషం రుచిచూసే మహిళల కథ
- హనుమ విహారి ఫౌండేషన్, ఎన్టీఆర్ ట్రస్టు మధ్య గొడవేంటి? ఈ క్రికెటర్ ట్విటర్ నుంచి ఎందుకు తప్పుకున్నాడు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








