గ్రీన్ టీ: ఉదయాన్నే ఓ కప్పు తాగారా... అందులోని పోషకాలను కనిపెట్టిన మిషియో సుజిమూర కథేంటో తెలుసుకుంటారా?

గ్రీన్ టీ

ఫొటో సోర్స్, Getty Images

ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెప్పే గ్రీన్ టీ చేదుగా ఎందుకుంటుందని మీరెప్పుడైనా ఆలోచించారా? కోవిడ్ మహమ్మారి సమయంలో కూడా చాలా మంది వైద్య నిపుణులు గ్రీన్ టీ తాగమని సలహాలిచ్చారు.

గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిదని, రోగనిరోధక శక్తిని పెంచుతుందని కూడా చాలా మంది చెబుతుంటారు.

గ్రీన్ టీ చేదుగా ఎందుకుంటుంది?

గ్రీన్ టీలో ఉండే ఏ పదార్ధాలు దాని రుచిని చేదుగా మారుస్తాయి?

గ్రీన్ టీ చైనా, జపాన్‌ దేశాల నుంచి వచ్చింది. దీన్ని క్రీస్తు పూర్వం 2,700 నుంచే తాగుతున్నారని చెబుతారు. గ్రీన్ టీ ఆసియా దేశాల సంస్కృతిలో భాగంగా ఉండేది.

కానీ, ఈ గ్రీన్ టీలో ఉన్న రసాయనాల సమ్మేళనం గురించి 1920ల వరకూ అధ్యయనం జరగలేదు. దీని రుచి చేదుగా ఎందుకుంటుందనే విషయం గురించి విశ్లేషణలు చేయలేదు.

ఈ రహస్యాన్ని మిషియో సుజిమూర అనే శాస్త్రవేత్త కనిపెట్టారు. ఆకులను నలిపి చూసే సామర్ధ్యం వల్ల ఆ ఆకులకు ఆరోగ్యానికి మేలు చేసే గుణం ఉందని కనిపెట్టారు.

కానీ, పురుషాధిక్యత నిండిన శాస్త్రీయ ప్రపంచంలో ఆమె కనిపెట్టిన విషయాన్ని ఎలా బయటపెట్టగలిగారు?

గ్రీన్ టీ జపాన్ సంస్కృతిలో అంతర్భాగం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గ్రీన్ టీ జపాన్ సంస్కృతిలో అంతర్భాగం

జపాన్లో సైన్స్ ఆవిష్కరణలకు మార్గదర్శి

మిషియో సుజిమూర1888లో జన్మించారు. అది ప్రస్తుతం సైతామా మండలంలో ఉన్న ఓకెనావా నగరం.

ఆమె టోక్యోలోని ఉన్న మహిళల స్కూలులో చదువుకున్నారు. 1909లో పాఠశాల చదువు పూర్తి చేశారు.

ఆ తర్వాత ఆమె టోక్యో విమెన్ హై స్కూలులో బయో కెమికల్ సైన్సెస్ విభాగంలో చేరారు.

శాస్త్రీయ పరిశోధనలపై తనకున్న ఆసక్తితో ఆమె ఆ రంగంలో కృషి చేశారు. అప్పటి వరకు పరిశోధన రంగం పురుషులకే పరిమితమయింది.

ఇదే మార్గంలో పయనిస్తున్న ప్రఖ్యాతి చెందిన సెల్ బయాలజిస్ట్ కోనో యాసూయి లాంటి వారి గురించి తెలుసుకున్నారు. ఆమె సైన్సులో పీహెచ్.డి సాధించిన తొలి జపాన్ మహిళ. ఆమె సుజిమూరకు స్ఫూర్తిగా నిలిచారు.

సెల్ బయాలజిస్ట్ కోనో యాసూయి

ఫొటో సోర్స్, Archivo de la universidad de Ochanomizu

ఫొటో క్యాప్షన్, సెల్ బయాలజిస్ట్ కోనో యాసూయి

1917లో చదువు పూర్తి కాగానే, సుజిమూర ప్రముఖ మహిళా కాలేజీల్లో విద్యార్థులకు సైన్స్ పాఠాలు చెప్పేందుకు అంకితమయ్యారు.

బోధనలో ఉంటూనే అధ్యయనం పట్ల ఉన్న ఆసక్తితో ఆమె హోక్కైడో ఇంపీరియల్ యూనివర్సిటీలో చేరారు. సాధారణంగా ఆ యూనివర్సిటీలో అమ్మాయిలను చేర్చుకునేవారు కాదు.

అక్కడ అగ్రికల్చరల్ కెమిస్ట్రీ విభాగంలో ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లేబొరేటరీలో అసిస్టెంట్‌గా చేరారు. అందుకు ఆమెకు ఎటువంటి జీతం వచ్చేది కాదు.

అక్కడే పట్టు పురుగులు, వాటి పోషకాల గురించి అధ్యయనం చేసేందుకు సమయాన్ని కేటాయించేవారు. నెమ్మదిగా ఆమెకు గుర్తింపు రావడం మొదలయింది.

విటమిన్ సి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విటమిన్ సి

విటమిన్ సి

అయితే, పట్టు పురుగుల అధ్యయనం ఆమెకు ఆసక్తికరంగా కనిపించలేదు. 1923లో జపాన్ లోని అతి పెద్ద నేచురల్ సైన్సెస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆర్ ఐకెన్‌లో చేరారు.

అక్కడ వ్యవసాయంలో రసాయనాలు, పోషకాల గురించి అధ్యయనం చేయడం మొదలుపెట్టారు. బియ్యం తవుడు నుంచి విటమిన్ బి1 ను తీయడాన్ని కనిపెట్టిన ఉమెటారో సుజుకీ అనే శాస్త్రవేత్తతో కలిసి పని చేయడం మొదలయింది.

సుజిమూర ముఖ్యంగా గ్రీన్ టీ వైపు ఆకర్షితులయ్యారు. ఇది జపాన్, చైనా, ఇతర ఆసియా దేశాల ప్రసిద్ధి చెందిన పానీయం. కానీ, దీని పై ఎక్కువ అధ్యయనాలు జరగలేదు.

1924లో ఆమె సహాధ్యాయిని సీటా రో ముయిరా తో కలిసి చేసిన అధ్యయనంలో గ్రీన్ టీ ఆకుల్లో విటమిన్-సి ఉందని కనిపెట్టారు.

దీంతో, పాశ్చాత్య దేశాల్లో ముఖ్యంగా అమెరికాలో గ్రీన్ టీ పై ఆసక్తి పెరిగిందని జపాన్‌లోని ఒచానోమీజు యూనివర్సిటీ తెలిపింది.

అప్పటి నుంచి జపాన్ నుంచి అమెరికాకు గ్రీన్ టీ ఎగుమతులు కూడా మొదలయ్యాయి.

గ్రీన్ టీ ఎగుమతులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గ్రీన్ టీ ఎగుమతులు

ఆమె పరిశోధనలు అంతటితో ఆగిపోలేదు.

1929లో కేట్‌చిన్ అనే ఫ్లావనాయిడ్‌ను వేరు చేసి వెలికి తీసే పద్ధతిని ఒక జపాన్ శాస్త్రవేత్త కనిపెట్టారు. ఇది సహజమైన యాంటీ ఆక్సిడెంట్. గ్రీన్ టీలో ఉన్న ఈ పదార్ధం శరీరంలో కణజాలం దెబ్బ తినకుండా కాపాడుతుంది. ఇదే టీ చేదుగా ఉండటానికి వెనుక కారణం.

ఆ మరుసటి సంవత్సరమే సుజిమూర ఈ కేట్‌చిన్ అనే పదార్ధాన్ని స్ఫటిక రూపంలో వెలికి తీయడాన్ని కనిపెట్టారు.

ఇదే విధంగా గ్రీన్ టీలో ఉన్న మరొక యాంటీ ఆక్సిడెంట్ ట్యానిన్‌ను కూడా గుర్తించారు.

ఈ పరిశోధనకు చాలా ఓపిక అవసరమని ఒచానోమీజు యూనివర్సిటీ చెబుతోంది.

ఈ చిన్న చిన్న స్ఫటికాలను సేకరించేందుకు పెద్ద మోతాదులో గ్రీన్ టీ ఆకులను అనేక సార్లు మరిగించాల్సి ఉంటుంది.

గ్రీన్ టీ తోటలు

ఫొటో సోర్స్, Getty Images

ఆమె చేసిన పనిలో ఓపిక చాలా ప్రధాన పాత్ర పోషించిందని శాస్త్రవేత్తలకు తెలుసు.

"ఎవరైనా నిర్ణీత సమయంలో ఫలితాలు పొందాలని అనుకుంటే, వారికి కెమిస్ట్రీ సరైన సబ్జెక్టు కాదు" అని ఆమె ఒకసారి చెప్పారు.

ఆ తర్వాత ఆమె కనిపెట్టిన రెండు విషయాలతో (విటమిన్ సి, కేట్‌చిన్) 'కెమికల్ కంపోనెంట్స్ ఆఫ్ గ్రీన్ టీ' (గ్రీన్ టీలో ఉన్న రసాయన పదార్ధాలు) అనే పేరుతో థీసిస్‌ను ప్రచురించారు. దీంతో, 1932లో జపాన్‌లో వ్యవసాయ శాస్త్రంలో పీహెచ్‌డి పొందిన తొలి మహిళ అయ్యారు.

మిషియో సుజిమూర

ఫొటో సోర్స్, Ochanomizu University Library

ఫొటో క్యాప్షన్, మిషియో సుజిమూర

ఆమె 1934 వరకూ గ్రీన్ టీ పైనే అనేక పరిశోధనలు చేశారు. గ్రీన్ టీ నుంచి గాల్లోకేట్‌చిన్ అనే పదార్ధాన్ని కూడా వెలికితీయగలిగారు.

ఇది కూడా గ్రీన్ టీలో ఉన్న ఫ్లావనాయిడ్ . దీనికి కూడా ఆరోగ్యానికి మేలు చేసే లక్షణాలున్నాయి.

1935లో ఆమె మొక్కల నుంచి విటమిన్ సి స్ఫటికాలను వెలికి తీసే విధానానికి పేటెంట్ హక్కులు పొందారు.

ఇదే విధానాన్ని నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో వాడుతున్నారు. దీనిని ఔషధ రూపంలో మార్చి విటమిన్ సి మాత్రల రూపంలో సరఫరా చేస్తున్నారు.

మిషియో సుజిమూర విద్యార్థులతో

ఫొటో సోర్స్, Ochanomizu University Library

ఒక దశాబ్ధం తర్వాత సుజిమూర ఒచానీమిజు యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. ఆ యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ హోమ్ ఎకనామిక్స్ డీన్‌గా పని చేసిన తొలి మహిళగా నిలిచారు.

1955లో ఆమె ఒచానీమిజు యూనివర్సిటీ నుంచి పదవీ విరమణ చేశారు. ఆమె 1960ల మధ్య వరకూ జస్సెన్ మహిళా యూనివర్సిటీలో బోధించారు.

ఆమె మరణానికి ఒక్క సంవత్సరం ముందు ఆమె తన జీవితాన్ని వెనక్కి చూసుకుని విద్యార్థులతో ఇలా అన్నారు "నా పరిశోధన చాలా కష్టాలతో సాగింది, కానీ అది చాలా ఆహ్లాదంగా ఉండేది. నా జీవితంలో ఎటువంటి చింతలు లేకపోవడమే నన్ను అధికంగా సంతోషపెట్టే విషయం" అని అన్నారు.

ఆమె చివరి రోజుల్లో ఆమె పెంపుడు కుక్కలతో కలిసి నడకకు వెళ్లడాన్ని ఇష్టపడేవారు. ఆమె జూన్ 01, 1969లో 81 ఏళ్ల వయసులో మరణించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)