అర్టికేరియా: ఈ వ్యాధి వచ్చిన వారు సూర్యుడికి కనిపించకుండా దాక్కోవాల్సిందేనా?

అర్టికేరియా రుగ్మత ఉన్నవారు వేడి వాతావరణానికి దూరంగా ఉండాలి.

ఫొటో సోర్స్, MICHAEL SLADEK

ఫొటో క్యాప్షన్, తన ఆర్ట్ స్పేస్‌గా మారిన బస్సు ముందు క్యారీ ష్మిట్
    • రచయిత, ఎమిలీ ఊమెన్
    • హోదా, బీబీసీ కరస్పాండెంట్

క్యారీ ష్మిట్‌కు ఒక చిత్రమైన ఆరోగ్య సమస్య వచ్చింది. ఆమెకు వేడి వాతావరణం పడదు. హీట్ అలర్జీ కారణంగా ఆమె మంచం దిగి బయటకు వచ్చే పరిస్థితి ఉండేది కాదు.

ఈ సమస్య కారణంగా ఆమె తన ఉద్యోగాన్ని కూడా వదులుకోవాల్సి వచ్చింది. అంతేకాదు చల్లని వాతావరణం కోసం ఆమె అమెరికా అంతా తిరగాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆమె ఒక కళాకారిణిగా కూడా మారారు.

2003లో ఓహియోలో బాగా వేడిగా ఉన్న ఓ రోజు, క్యారీ తన కొడుకుతో కలిసి బయటకు వచ్చారు. కాసేపటికి ఆమెకు తన శరీరంలో ఏదో మార్పు వస్తున్నట్లు, సమస్య మొదలైనట్లు అర్థమైంది. ఆమె కాళ్లు ఉబ్బడం ప్రారంభించాయి.

కాళ్లకు మూడు రెట్లు వాపు రావడంతో క్యారీ షాక్‌కు గురయ్యారు. వెంటనే ఎమర్జెన్సీ సర్వీస్‌కు కాల్ చేసి ఆసుపత్రికి వెళ్లారు. డాక్టర్లకు కూడా ఆమె సమస్య ఏంటో, కాళ్లు ఎందుకు వాచాయో అర్థం కాలేదు.

మొదట్లో తేనెటీగలు కుట్టడం వల్ల వచ్చిన అలర్జీగా డాక్టర్లు భావించారు. లేదంటే పుప్పొడి కారణంగా ఏర్పడే అలర్జీ అనుకున్నారు. కానీ, టెస్టులు చేస్తే ఆమెకు అలాంటి అలర్జీలేమీ లేవని తేలింది.

కొద్దిరోజుల తర్వాత కోలుకోవడంతో ఆమె డిశ్ఛార్జ్ అయ్యారు. కానీ తర్వాత కూడా ఆమెకు చిన్న చిన్న సమస్యలు ఏర్పడుతూనే ఉన్నాయి.

అనేక టెస్టులు, పరిశీలనలు చేసిన తర్వాత, డాక్టర్లు ఈ సమస్య ఏమిటన్న దానిపై నిర్ధారణకు వచ్చారు. ఇది కోలినెర్జిక్ అండ్ సోలార్ అర్టికేరియా. ఇది ఆమె ఆరోగ్య సమస్య పేరు. వేడి తగిలినా, సూర్యరశ్మి సోకినా ఆమె అలర్జీకి గురవుతారు.

పొడి వాతావరణాన్ని ఎంతో ఇష్టపడే క్యారీ, తన సమస్య ఏంటో తెలిసి బాధపడ్డారు.

"ఇది తన జీవితంలో మరణం వంటిది" అన్నారామె.

వీడియో క్యాప్షన్, వీడియో: పేలు ఎలా వ్యాపిస్తాయి?

ర్టికేరియా అంటే ఏమిటి?

ర్టికేరియానే దద్దుర్లు అని కూడా పిలుస్తారు. ఇది చర్మంపై దురద వల్ల ఏర్పడుతుంది.

● రోగ నిరోధక వ్యవస్థ ఆరోగ్యకరమైన కణజాలంపై పొరపాటున దాడి చేయడం వల్ల ఇది సంభవించవచ్చు.

● దీర్ఘకాలిక ర్టికేరియా ఉన్న ప్రతి ఏడుగురిలో ఒకరు తమ దుస్థితికి నిరాశ, ఆందోళనల్లో మునిగిపోతారు.

● అనేక సందర్భాల్లో, ఈ సమస్యకు స్పష్టమైన కారణం గుర్తించలేకపోయారు.

(మూలం: నేషనల్ హెల్త్ సర్వీస్, ఇంగ్లండ్)

వీడియో క్యాప్షన్, రెయిన్‌బో ఫుడ్: ఆరోగ్యానికి ఇదే మంచిదా?

క్యారీ అలర్జీ తీవ్ర రూపం దాల్చింది. ఒక దశలో ఆమె మెట్లు కూడా ఎక్కలేకపోయారు. ఇల్లు శుభ్రం చేయడంలాంటి పనులు కూడా చేయలేకపోయారు. వాతావరణం కాస్త వేడెక్కితే చాలు, ఆమె అనారోగ్యానికి గురవుతారు.

''ఈ వ్యాధి రావడానికి అనేక కారణాలను చెబుతున్నారు. కానీ, ఏదీ పూర్తి స్థాయిలో నిరూపణ కాలేదు'' అని అలర్జీ స్పెషలిస్ట్ డాక్టర్ మానసీ కానుగ అన్నారు.

"అలర్జీ కణాలలో సున్నితత్వం పెరగడం, స్టిమ్యులేషన్లు, వాతావరణ పరిస్థితుల కారణంగా ఇది ఏర్పడే అవకాశం ఉంది'' అని ఆమె అన్నారు.

ఆమె కొడుకు పుట్టినప్పటి నుంచి ఈ సమస్య మొదలై ఉండవచ్చని క్యారీ ఆరోగ్యాన్ని పరిశీలిస్తున్న నిపుణుడు ఒకరు తెలిపారు.

చిన్నారికి పాలిస్తుండటంతో క్యారీ బరువు బాగా తగ్గారు. ముగ్గురు పిల్లల్లో మొదటి ఇద్దరి మాదిరిగా కాకుండా, మూడో పిల్లవాడు విపరీతమైన ఆకలితో ఉండేవాడు. ఆ చిన్నారికి నిత్యం పాలివ్వాల్సి వచ్చేది. ఆమె శరీరం పోషకాలను కోల్పోయి చివరకు జుట్టు రాలే స్థాయికి వచ్చింది.

తన శరీరంలో జరిగే మార్పుల విషయంలో డాక్టర్లు పొరబడుతున్నారేమో అని ఒక్కోసారి క్యారీ భావించేవారు. ఈ సమస్య నుంచి బయటపడటానికి మంచం దిగకపోవడమే పరిష్కారమని ఆమె భావించారు. బెడ్ ఒక్కటే ఆమెకు సరైన ఆలంబనగా మారింది. కొన్ని నెలలపాటు ఆమె బెడ్ మీద ఉండిపోయారు.

అదృష్టం కొద్దీ తన భర్తకు మంచి ఉద్యోగం, ఆరోగ్య బీమా ఉండటంతో ఆర్థిక సమస్యలు తలెత్తలేదని క్యారీ అన్నారు. కానీ ఈ వ్యాధి కారణంగా తాను అనేక ఇబ్బందులకు గురయ్యానని క్యారీ వెల్లడించారు.

"నేను 50 సంవత్సరాలపాటు ఈ మంచం మీదే పడి ఉండలేను, ఇది నా జీవితం కాదు'' అని అనేకునేదాన్నని క్యారీ చెప్పారు.

క్యారీ ష్మిట్ వేసిన పెయింటింగ్

ఫొటో సోర్స్, CARRIE SCHMITT

ఫొటో క్యాప్షన్, క్యారీ ష్మిట్ వేసిన పెయింటింగ్

కళలవైపు చూపు

"ఒక రోజు ఎవరో నాకు చెబుతున్నట్లుగా ఒక స్వరం వినిపించింది. ''మీ జీవితం ముగిసింది, ఇక మీకు ఇష్టమైన పెయింటింగ్ ఎందుకు చేయకూడదు?' అన్నట్లనిపించింది.

క్యారీకి ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం. కానీ, చదువులు పూర్తయ్యాక, మంచి కెరీర్ కోసం దాన్ని వదులుకోవాల్సి వచ్చింది.

హీట్ అలర్జీ రాక ముందు, సిన్సినాటి చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో మెడికల్ రైటర్‌గా పనిచేశారు క్యారీ. అక్కడ ఆమె మెడికల్ జర్నల్‌లు, పాఠ్యపుస్తకాలు, హాస్పిటల్ వెబ్‌సైట్ కోసం కంటెంట్ రాసేవారు.

కానీ, తిరిగి పెయింటింగ్ మొదలుపెట్టినప్పుడు "ఇది నా శారీరక స్థితితో సంబంధం లేని కొత్త లోకానికి నన్ను తీసుకెళ్లింది'' అన్నారు క్యారీ.

"ఉదయం లేచిన దగ్గర్నుంచి పెయింట్ చేయడానికి నేను ఎదురు చూసేదాన్ని. నన్ను రక్షించినందుకు, సృజనాత్మకతతో అనుబంధాన్ని పెంచుకున్నాను" అన్నారామె.

ఆమె పెయింటింగ్‌లు రంగురంగులవి, అందమైన పూలతో నిండి ఉంటాయి. క్యారీ ఒకవైపు బొమ్మలు గీస్తూనే, ట్రీట్‌మెంట్‌ను కూడా కొనసాగించారు.

అర్టికేరియా: తన బస్సు మీద నిలబడి పెయింటింగ్ వేస్తున్న క్యారీ

ఫొటో సోర్స్, MICHAEL SLADEK

ఫొటో క్యాప్షన్, తన బస్సు మీద నిలబడి పెయింటింగ్ వేస్తున్న క్యారీ

జాగ్రత్తలు ముఖ్యం

వేడి నీటి స్నానం, నేరుగా సూర్యకాంతి పడటం నుంచి దూరంగా ఉండటం ద్వారా కోలినెర్జిక్ అండ్ సోలార్ అర్టికేరియా నుంచి కొంత వరకు ఉపశమనం పొందవచ్చని క్యారీ గుర్తించారు. సంప్రదాయ చికిత్సలు పని చేయకపోవడంతో అడ్వాన్స్‌డ్‌ అలర్జీ థెరప్యూటిక్స్ (ఏఏటీ)తో సహా అనేక చికిత్సల కోసం ప్రయత్నించారు.

ఏఏటీ అనేది ఆక్యుపంక్చర్ మాదిరిగానే ఉంటుంది. కానీ, సూదులు ఉండవు. అయితే, అలర్జీ నివారణకు ఏఏటీ పరిష్కారం కాదని డాక్టర్ మానసీ కానుగ అన్నారు. ప్రస్తుతానికి క్యారీ లేచి నడవగలుగుతున్నారు. డ్రైవింగ్ చేయడం, మెట్లు ఎక్కడం లాంటివి చేయగలుగుతున్నారు. అప్పుడప్పుడు దద్దర్లు వస్తున్నా, రియాక్షన్లు బాగా తగ్గాయి.

వీటన్నింటికన్నా వేడి తక్కువగా ఉండే ప్రదేశంలో నివసించడం మంచిదని కూడా డాక్టర్లు సూచించారు. ఆమె ఉండే ఓహియో స్టేట్‌లో ఉష్ణోగ్రతలు 38డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉంటాయి. కాబట్టి అక్కడి నుంచి చల్లదనం ఎక్కువగా ఉండే రాష్ట్రానికి వెళ్లడం ఉత్తమమని డాక్టర్లు సూచించారు.

క్యారీ వెంటనే నిర్ణయం తీసుకున్నారు. 21 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉండే సియాటెల్ నగరానికి వెళ్లారు. చల్లని వాతావరణంలో ఆమె ఆరోగ్యం మెరుగుపడటం మొదలైంది. బెడ్రూమ్ దాటి బయటికొచ్చి యోగా, పెయింటింగ్‌లాంటివి చేయగలుగుతున్నారు.

తన పెయింటింగ్‌ల కోసం ఒక స్టూడియో ఏర్పాటు చేయాలని క్యారీ ప్రయత్నించారు. కానీ, సియాటెల్‌లో విపరీతమైన రియల్ ఎస్టేట్ ధరల కారణంగా ఆమె దానిని మానుకోవాల్సి వచ్చింది. దీంతో, ఒక పాత స్కూల్ బస్సును కొని, దానికి రంగులు వేసి, రోసీ అని పేరు పెట్టారు. దానిని తన ఆర్ట్ స్పేస్‌‌గా మార్చుకున్నారు.

"ఇది నా జీవితానికి లభించిన వరాలలో ఒకటి" అన్నారు క్యారీ.

క్యారీకి సియాటెల్‌లో హాయిగానే ఉన్నప్పటికీ, వాషింగ్టన్‌లో పెరుగుతున్న వేసవి, కార్చిచ్చుల కారణంగా ఆమె ఇంకా జాగ్రత్తగా ఉండాలి. వేసవి కాలం చాలా వేడిగా ఉంటే, ఆమె తప్పనిసరిగా ఎయిర్ కండిషన్డ్ హోటల్ గదుల్లో లేదా చల్లని దీవుల్లోని ఆశ్రయం పొందాలి.

ఇలా మేనేజ్ చేయడం చాలా కష్టంగా ఉంటుందని ఆమె అన్నారు. ‘‘వేడి ఎక్కువగా ఉన్న రోజుల్లో నా పిల్లలతో ఆడుకునే అవకాశం దొరకదు. ఇంట్లోకి అవసరమయ్యే సరుకులు తీసుకురావడం సాధ్యం కాదు. కుటుంబ సభ్యులే చూసుకోవాలి’’ అన్నారామె.

కానీ, ఇందులో కూడా పాజిటివ్ అంశాలు ఉండటం క్యారీకి ఊరటను మిగిల్చింది. తన పెయింటింగ్‌లకు సంబంధించి ‘ద స్టోరీ ఆఫ్ ఎవ్రీ ఫ్లవర్’ పేరుతో ఓ పుస్తకం కూడా రాశారామె.

కష్టసమయంలో కళలు ఆలంబనగా నిలుస్తాయంటూ ఆన్‌లైన్‌లో ఆర్ట్స్ క్లాసులను కూడా బోధిస్తున్నారు క్యారీ.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)