అమెరికా: శిక్ష ఏమిటో తెలియకుండానే 68 ఏళ్లు జైలులో ఉన్నాడు...

అమెరికా

ఫొటో సోర్స్, Pennsylvania Department of Corrections

    • రచయిత, స్వామినాథన్ నటరాజన్, లారెన్ పాట్స్
    • హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్

అమెరికాలో అత్యధిక కాలం జైలులో ఉన్న వ్యక్తిగా రికార్డుల కెక్కిన జో లీగన్ ఇటీవలే విడుదలయ్యారు. దాదాపు డెబ్భై ఏళ్లు జైలులో గడిపిన ఆయన బీబీసీతో మాట్లాడారు.

తాను జైలుకు వెళ్లడానికి కారణాలేంటి, స్వేచ్ఛ కోసం అన్ని సంవత్సరాలు ఎందుకు ఎదురు చూడాల్సి వచ్చింది, భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నదీ వివరించారు.

''నేను ఒంటరివాడిని కాను. కానీ ఒంటరితనాన్ని ఇష్టపడతాను. జైలులో ఉన్నంత కాలం సింగిల్‌ రూమ్‌ లోనే గడిపాను. అరెస్టు అయిన నాటి నుంచి విడుదలయ్యే వరకు అలాగే ఉండిపోయాను'' అన్నారు లీగన్.

''నేను జైలులోకి నా గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నానంటే...బయట ఏం జరిగినా పట్టించుకోను. టీవీ చూడటానికి, రేడియో వినడానికి అవకాశం ఇచ్చినప్పుడు తప్ప. ఎందుకంటే అవే నాకు కంపెనీ'' అన్నారాయన.

ఒక విధంగా చెప్పాలంటే జో లీగన్‌లాంటి వారికి జైలు బాగానే నచ్చుతుంది. ఆయన ఎప్పుడూ తలవంచుకుని మౌనంగా ఉండటానికి ప్రాధాన్యమిచ్చారు. అలా ఒకటి కాదు..రెండు కాదు, 68 సంవత్సరాలు జైలు ఊచలు వెనకే ఉండి పోయారు.

అమెరికా

ఫొటో సోర్స్, Bradley S Bridge

జైలు నుంచి బైటకు వచ్చేనాటికి 'నా' అనే వారు లేరు. ''నాకు జైలు లోపలగానీ, బైటగానీ స్నేహితులు లేరు. కానీ నాకు తెలిసిన వారందరితో బాగానే ఉంటాను'' అన్నారు జో లీగన్''తెలిసిన వాళ్లందరినీ స్నేహితులు అనను. స్నేహం అనే పెద్ద మాటను వాడను. ఈ పదానికి చాలా అర్ధం ఉందని అనుకుంటాను. కానీ చాలామంది వాడేస్తుంటారు. అది తప్పు'' అంటారాయన.

చిన్నతనంలో తన తల్లి తరఫు తాతయ్య, అమ్మమ్మల దగ్గర కొన్నాళ్లు పెరిగారు. బర్మింగ్‌హమ్, అలబామా లాంటి ప్రదేశాలలో నివసించారు. పెద్దగా స్నేహితులు లేరు. ఆదివారాలు చర్చిలో తన తాత చెప్పే ప్రసంగాలు వినేవారు.

లీగన్‌ తల్లి నర్సు కాగా, తండ్రి మెకానిక్‌గా పని చేస్తూ ఫిలడెల్ఫియాలో ఉండేవారు. 13 ఏళ్ల వయసులో ఆయన తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లారు. అక్కడి స్కూల్లో ఇమడలేకపోయారు. చదువు సంధ్యలు అబ్బలేదు.

స్నేహితులు లేకపోవడంతో ఆటలు కూడా పెద్దగా నచ్చేవి కావు. ''ఒకరిద్దరు స్నేహితులు తప్ప పెద్దగా ఎవరూ తెలియదు. జనంలో వెళ్లడమే నాకు ఇష్టం ఉండేది కాదు'' అన్నారు లీగన్.

అమెరికా

ఫొటో సోర్స్, Bradley S Bridge

అమెరికా

ఫొటో సోర్స్, Bradley S Bridge

అసలు ఏం జరిగింది?

1953 సంవత్సరంలో లీగన్‌కు కష్టాలు మొదలయ్యాయి. ఒకరోజు తనకు తెలిసిన ఒకరిద్దరు వ్యక్తులతో కలిసి వెళుతుండగా, ఒక తాగుబోతుల మూకలో కలిసి పోవాల్సి వచ్చింది.

''మేమంతా జనాన్ని బెదిరించి డబ్బులు వసూలు చేసే పనిలోకి దిగాము. ఆ డబ్బుతో మందు, తిండి తినడం మొదలు పెట్టాము. చివరికి అది ఎక్కడికో వెళ్లి పోయింది'' అని గుర్తు చేసుకున్నారు లీగన్.

ఓ రాత్రి జరిగిన గొడవలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. వారిపై దాడి చేసిన గుంపులో లీగన్ కూడా ఉన్నారు.

ఈ గొడవలో మొదట అరెస్టైన వ్యక్తి లీగన్. ''ఆ రోజు నాతో కలిసి వచ్చిన వ్యక్తులు ఎవరో తెలిసినా, వాళ్ల నిక్‌నేమ్‌లు తప్ప, అసలు పేర్లు తెలియదు'' అన్నారు లీగన్.

జో లీగన్‌ను తన సొంత ప్రాంతానికి దూరంగా ఉండే రాడ్‌మన్ స్ట్రీట్ అనే పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. న్యాయ సహాయం కూడా అందలేదు. అయిదు రోజులు అక్కడ ఉంచి, హత్యా నేరం అభియోగాలు మోపారు.

కొన్నాళ్ల తర్వాత ఆయన తల్లిదండ్రులు కూడా పట్టించుకోవడం మానేశారు. అప్పటికి ఆయనకు 15 సంవత్సరాలు. అయితే తాను ఈ నేరం చేయలేదని లీగన్‌ కోర్టులో వాదించారు.

కానీ, పీబీఎస్‌ అనే టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రం తాను హత్య చేసినట్లు చెప్పారు లీగన్.

''వాళ్లు నాతో బలవంతంగా స్టేట్‌మెంట్‌ మీద సంతకం పెట్టించారు. నేనెవరినీ హత్య చేయలేదు.'' అన్నారాయన.

అమెరికా

ఫొటో సోర్స్, Bradley S Bridge

ఫొటో క్యాప్షన్, తన లాయర్ బ్రాడ్లె ఎస్.బ్రిడ్జ్ ‌తో లీగన్

జీవిత ఖైదు ఎందుకు?

పెన్సిల్వేనియా రాష్ట్రంలో అమలులో ఉన్న చట్టాల ప్రకారం జీవిత ఖైదు శిక్ష పడిన వారికి పెరోల్‌కు అవకాశం ఉండదు. పోలీసులు పెట్టిన అభియోగాల ప్రకారం ఆయనకు హత్యా నేరం కింద శిక్ష పడింది.

తనకు పెరోల్‌ కూడా రాని జైలు శిక్ష పడిందన్న తీర్పు వినడానికి ఆయన కోర్టులో కూడా లేరు. ఒక ఖైదీకి కచ్చితంగా తన శిక్షకు సంబంధించిన పూర్తి వివరాలు చెప్పాల్సి ఉంటుంది.

కానీ తనలాగా శిక్ష ఏమిటో కూడా తెలియకుండా జైలుకు వెళ్లినవారు ఎవరూ లేరని కూడా ఆయనకు తెలియదు.

''ఎవరిని అడగాలో, ఏమని అడగాలో కూడా తెలియదు'' అన్నారు లీగన్. ''శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తెలుసు కానీ... జీవితాంతం ఇలాగే ఉండిపోతానని తెలియదు. పెరోల్‌ తో కూడిన జీవిత ఖైదు అనే మాట కూడా వినలేదు.

నాకు చదువు సంధ్యలు లేవు. నా పేరు రాసుకోవడం కూడా తెలియదు. నా పేరు జో లీగన్ అన్న ఒకే ఒక్క విషయం నాకు తెలుసు. దానిని మర్చిపోకుండా మననం చేసుకుంటూ ఉండేవాడిని'' అన్నారు జో.

ఖైదీ నంబర్ AE 4126 అనే పేరుతో జైలులోకి వెళ్లిన జో లీగన్, తన విడుదల ఎప్పుడని ఎవరినీ అడగ లేదు. అలా ఆయన 68 సంవత్సరాలు జైలులోనే గడిపారు.

''పొద్దున్నే ఆరింటికి నిద్రలేవడం, ఏడు గంటలకు భోజనం, 8 గంటలకు పని'' ఇదే టైమ్‌ టేబుల్‌.

జైలులో ఉన్న రోజుల్లో కిచెన్, లాండ్రీ లాంటి పనులు చేసినప్పటికీ, ఎక్కువ కాలం క్లీనర్‌ పనే చేశారు. బయట ప్రపంచం ఏళ్లు గడుస్తున్న కొద్దీ పెను మార్పులకు లోనైనా, ఆయన ఉన్న జైలులో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు.

''మద్యం, మాదక ద్రవ్యాలు తీసుకోవడం లాంటి చెడు అలావాట్లు ఏవీ లేవు. ఎప్పుడూ జైలు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించ లేదు. నా వల్ల ఎవరికీ ఎప్పుడూ ఇబ్బంది కలగ లేదు'' అని చెప్పారు లీగన్.

అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జో లీగన్ కేసుపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది.

ఎలా తెలిసింది?

అలా 53 ఏళ్లు గడిచాక, ఆయన్ను కలవడానికి ఓ లాయర్ వచ్చారు. 2005లో అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం బాల నేరస్తులను ఉరి తీయరు. కానీ ఆయన్ను విడిపించడానికి బ్రాడ్లే ఎస్. బ్రిడ్జ్‌ అనే లాయర్, పెద్ద న్యాయ పోరాటాన్ని చేయాల్సి వచ్చింది.

ఎందుకంటే లీగన్‌ పెరోల్‌కు వీలులేని జీవిత ఖైదుగా ఉన్నారు.

పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఇదే రకమైన శిక్షను ఎదుర్కొంటున్న వారు 525మంది ఉండగా, ఫిలడెల్ఫియాలో 325మంది ఖైదీలు ఉన్నారు.

వీరందరిలో జో లీగన్ అతి ఎక్కువ కాలం శిక్షను అనుభవిస్తున్న వ్యక్తి. దీంతో అతని తరఫున మాట్లాడేందుకు న్యాయవాది బ్రిడ్జ్ ఆయన్ను కలుసుకున్నారు.

''నేను కలిసే వరకు తన శిక్ష ఏంటో ఆయనకు తెలియదు. భవిష్యత్తు మీద ఆశలు పెట్టుకున్నారు. ఏదో ఒక రోజు అద్భుతం జరుగుతుందని ఆశించారు. తనకు అవకాశం వస్తుందని ఎదురు చూస్తున్నారు'' అన్నారు న్యాయవాది బ్రిడ్జ్.

లాయర్ బ్రిడ్జ్‌ ద్వారా తన జైలుశిక్షకు సంబంధించిన పేపర్లు చూశాక, మొదటిసారి ఆయనకు అసలు విషయం తెలిసింది.

''అరెస్టు సమయం నుంచి నా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. బాల నేరస్తులకు పెరోల్‌ లేని జీవితఖైదు విధించడం రాజ్యాంగ విరుద్ధమని నాకు అప్పుడే తెలిసింది'' అన్నారు లీగన్.

తాను ఎప్పటికైనా బయటికి వస్తానని నమ్మిన ఆయనకు ప్రతిసారి జీవిత ఖైదు అనే ముద్ర అడ్డంకిగా మారింది.

అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జో లీగన్ చిన్న తనంలో నివసించిన ప్రాంతం

విడుదల ఎలా సాధ్యమైంది?

2016లో జీవిత ఖైదు అనుభవిస్తున్న బాల నేరస్తుల శిక్షలను అమెరికా ప్రభుత్వం రివైజ్ చేసింది. దీంతో అప్పటికే ఆయన శిక్ష అనుభవించి ఉండటంతో 2017లో ఆయన శిక్ష 35 ఏళ్లుగా మారింది.

దీని ద్వారా ఆయన పెరోల్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా వచ్చింది. కానీ లాయర్ బ్రిడ్జ్ ఎంతగా బతిమాలినా లీగన్ పెరోల్‌కు దరఖాస్తు చేసుకోలేదు.

'' చేయని నేరానికి ఎంతో శిక్ష అనుభవించాను. ఇప్పుడు పెరోల్‌ మీద బయటకు వెళ్లడం వల్ల నన్ను అధికారులు మళ్లీ అదే చిన్న చూపు చూస్తారు. నాకు కోరుకుంటున్నది పెరోల్‌ కాదు....సంపూర్ణ స్వేచ్ఛ'' అన్నారు లీగన్.

2017లో ఈ శిక్షను సవాల్‌ చేస్తూ బ్రిడ్జ్‌ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. 2020 నవంబర్‌లో జో లీగన్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది.

ఫిబ్రవరి 11, 2021న న్యాయవాది బ్రిడ్జ్‌ జో లీగన్‌ను విడిపించడానికి మాంట్‌గోమరీ కౌంటీకి వెళ్లారు. అయితే తీర్పు అనుకూలంగా వచ్చినా... ఆయనలో ఎలాంటి సంతోషం కనిపించ లేదు. మౌనంగా ఉండిపోయారు లీగన్.

''ఓ మై గాడ్ అంటూ అమితానందానికి లోనవుతారని అనుకున్నాను. కానీ ఆయనలో ఎలాంటి ఫీలింగ్ లేదు.'' అన్నారు బ్రిడ్జ్‌.

విడుదలయ్యాక కూడా లీగన్‌ తాను దశాబ్దాలుగా అనుసరించిన వైఖరిని మానలేదు. తనలోని ఆలోచనలను తనలోనే దాచుకుని మౌనంగా ఉండిపోయారు.

''ఇప్పుడే పుట్టినట్లు ఉంది. అన్నీ కొత్తగా ఉన్నాయి. అన్నీ మారిపోయాయి. ఇక్కడ కనిపిస్తున్న కార్లను నేనెప్పుడూ చూడ లేదు. నేను చూసిన కార్లు వేరేగా ఉన్నాయి. నా చిన్నతనంలో ఇంత ఎత్తైన బిల్డింగ్‌లు లేవు.'' అన్నారు జో లీగన్.

''నా పుట్టుకతో సంబంధం ఉన్నవాళ్లు, నాతోపాటు పుట్టిన వాళ్లు అంతా చనిపోయారు. నా మేనకోడలు నేను మాత్రమే మిగిలాము'' అన్నారు జో లీగన్.

83 సంవత్సరాల వయసున్న ఆయన ఇప్పుడు రాబోయే రోజుల గురించి ఆలోచిస్తున్నారు.

''నా జీవితంలో నాకు బాగా తెలిసిన విద్య శుభ్రం చేయడం. నాకు అలాంటి జాబ్ ఏదైనా ఉంటే ఇప్పించండి'' అన్నారు జో లీగన్‌.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)