అమెరికా: నల్లజాతి వ్యక్తిపై కాల్పులకు నిరసనగా రెండో రోజూ హింసాత్మక ఆందోళనలు

ఫొటో సోర్స్, EPA
ఒక నల్లజాతీయుడిపై పోలీసులు అతి సమీపం నుంచి కాల్పులు జరిపిన ఘటనతో అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రంలో భగ్గుమన్న ఆందోళనలు వరుసగా రెండో రోజూ కొనసాగాయి.
వరుసగా రెండో రాత్రి కూడా విస్కాన్సిన్‌లో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణలు జరిగాయి.
కెనోషా పట్టణంలో జాకబ్ బ్లేక్ పోలీసుల నుంచి దూరంగా వచ్చి తన కారు ఎక్కుతుండగా వారు కాల్పులు జరిపిన వీడియో ఒకటి ఆన్‌లైన్ కనిపించింది.
స్థానికంగా జరిగిన చిన్న గొడవ ఈ కాల్పులకు దారి తీసింది. పోలీసు కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ నల్లజాతి వ్యక్తి జాకబ్ బ్లేక్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ కాల్పుల విషయం తెలీగానే నగరంలో ఆందోళనలు మొదలయ్యాయి. నిరసనలు వెల్లువెత్తడంతో కెనోషా పట్టణంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. పట్టణంలో కర్ఫ్యూ విధించారు.
“మేం వెనక్కి తగ్గం’’ అని నినాదాలు చేస్తూ ఆదివారం సాయంత్రం వందలమంది ఆందోళనకారులు పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌ను ముట్టడించారు.
అక్కడక్కడా దోపిళ్లు, దాడులు, కాల్పులు జరుగుతున్నాయన్న వార్తలతో 24గంటలపాటు స్థానికంగా షాపులను మూసేయాలని పోలీసులు ఆదేశించారు.
నేషనల్ గార్డులు స్థానిక పోలీసులకు సాయం చేయాలని గవర్నర్ టోనీ ఎవర్స్ సూచించారు. ప్రజలు ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించకుండా సురక్షితంగా తమ ఆందోళనలు చేసుకునేలా చూడాలన్నారు.

ఫొటో సోర్స్, Reuters
సోమవారం ఉదయం నుంచి కర్ఫ్యూ విధించినా, దాన్ని లెక్క చేయకుండా వీధుల్లోకి వస్తున్న ఆందోళనకారులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
ఆయుధం లేని వ్యక్తిపై పోలీసులు కాల్పులు జరపడాన్ని విస్కాన్సిన్ రాష్ట్ర గవర్నర్ టోనీ ఎవర్స్ ఖండించారు. “ నాకు పూర్తి సమాచారం అందకపోయినా ఒక్కటి మాత్రం చెప్పగలను. చట్టం పేరుతో కొందరు వ్యక్తులు నిర్దాక్షిణ్యంగా జరుపుతున్న కాల్పుల్లో గాయపడిన నల్లవాళ్లలో ఇతను మొదటి వాడు కాదు’’ అని టోనీ ఎవర్స్ ఒక ప్రకటనలో అన్నారు.
“మనం కేవలం సానుభూతి వ్యక్తం చేస్తే సరిపోదు. మన రాష్ట్రంలో, దేశంలో జాతి వివక్షను గుర్తించలేక పోయిన ప్రజాప్రతినిధులను మనం నిలదీయాలి” అని ఆయన అన్నారు.
కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన జాకబ్ బ్లేక్ పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఆయనపై కాల్పులు జరిపిన వారిని శిక్షించాలన్న డిమాండ్‌పై వేలమంది సంతకాలు చేశారు.
ఇటీవలి కాలంలో జాతి వివక్షపై తీవ్రమైన చర్చ, ఆందోళనలు జరుగుతున్న తరుణంలోనే మరో కాల్పుల ఘటన సంచలనం సృష్టించింది.

అసలేం జరిగింది?
ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఘటన జరిగిందని కెనోషా పోలీస్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. గాయపడిన జాకబ్ బ్లేక్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు.
స్థానికంగా జరిగిన ఒక గొడవ వ్యవహారం కాల్పుల దాకా వెళ్లిందని పోలీసులు చెబుతున్నా, ఆ గొడవేంటో, ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చిందో మాత్రం వెల్లడించడం లేదు.
కాల్పులు జరిపిన అధికారులను సెలవులో పంపాల్సిందిగా పోలీస్ శాఖకు విస్కాన్సిన్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ ఆదేశించింది.
సోషల్ మీడియాలో షేర్ అవుతున్న వీడియోలో ముగ్గురు పోలీసు అధికారులు ఒక SUV కారు దగ్గర నల్లజాతి వ్యక్తి జాకబ్ బ్లేక్‌ను ఆయుధాలతో చుట్టుముట్టి కనిపించారు.
అతను తన కారులోకి ఎక్కబోతుండగా ఒక పోలీస్ అధికారి అతని చొక్కాపట్టుకోడానికి ప్రయత్నించి, ఏడుసార్లు అతనిపై కాల్పులు జరిపినట్లు కనిపించింది. ఈ శబ్దాలు విన్న తర్వాత అక్కడ పెద్దగా కేకలు అరుపులు వినిపించాయి.కాల్పులు జరిపిన వ్యక్తి పేరును సంబంధిత పోలీస్ శాఖ వెల్లడించ లేదు.
జాకబ్ బ్లేక్‌ను పోలీసుల నుంచి రక్షించడానికి అతని కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చారని పౌర హక్కుల న్యాయవాది బెన్ క్రంప్ సీఎన్‌ఎన్‌తో చెప్పారు.

ఫొటో సోర్స్, EPA
అతనిపై కాల్పులు జరుపుతున్న సమయంలో బ్లేక్ ముగ్గురు కొడుకులు కారులోనే ఉన్నారని బెన్ క్రంప్ ట్విటర్‌లో వెల్లడించారు.
తమ తండ్రిని పోలీసులు కాల్చడం ఆ ముగ్గురు పిల్లలు చూశారు. జీవితాంతం ఆ ఘటన తాలూకు షాక్ నుంచి వారు బైటపడలేరు. మనల్ని రక్షించాల్సిన పోలీసులు ఇలా చట్టాలను ఉల్లంఘిస్తే వదిలిపెట్టాల్సిన పని లేదు’’ అని క్రంప్ ట్విటర్‌లో పేర్కొన్నారు.
ఇద్దరు మహిళల మధ్య గొడవను సర్దిచెప్పేందుకు బ్లేక్ ప్రయత్నించారని, అదే సమయంలో పోలీసులు బ్లేక్‌పై ముందు ఒక టేసర్ (షాక్ కలిగించే ఆయుధం)ను ప్రయోగించారని, ఆ తర్వాత కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్పారు.
“మాలో అసహనం పెరుగుతోంది. మా రక్తం మరిగిపోతోంది. మేం అలిసిపోయాం’’ అని బ్లాక్ లైవ్స్ మ్యాటర్స్ ఉద్యమంతో సంబంధం ఉన్న క్లైడ్ మెక్‌లెమోర్ అన్నారు.
మే నెలలలో అమెరికాలో బ్లాక్‌లైవ్స్ మ్యాటర్స్ ఉద్యమానికి కారణమైన జార్జ్ ఫ్లాయిడ్ హత్య జరిగిన మిన్నెసోటా రాష్ట్రం, విస్కాన్సిన్‌కు పక్కనే ఉంటుంది.
జార్జ్ ఫ్లాయిడ్ మెడపై మోకాలుతో నొక్కి అతని చావుకు కారణమైన పోలీసు అధికారి డెరెక్ చావిన్ ప్రస్తుతం హత్యారోపణలపై విచారణను ఎదుర్కొంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- శాంతియుత నిరసనలు హింసాత్మకంగా ఎందుకు మారతాయి? పోలీసులతో జనం ఎందుకు ఘర్షణకు దిగుతారు?
- కృష్ణా, గోదావరి పరవళ్లు.. దశాబ్దం తర్వాత మళ్లీ నిండుకుండల్లా ప్రాజెక్టులు
- కరోనావైరస్: బ్రెజిల్లో లక్ష దాటిన కోవిడ్ మరణాలు... భారత్ కూడా అలాంటి తప్పులే చేస్తోందా?
- మహిళల ఆరోగ్యం: ఇంటిపని చేయడం వ్యాయామం కిందకు వస్తుందా?
- 'మోదీజీ, మా ఆయన ఇంటి పనిలో సాయం చేయడం లేదు, మీరైనా చెప్పండి...'
- కరోనావైరస్: వర్క్ ఫ్రమ్ హోమ్ బాటలో కంపెనీలు.. ఇంటి నుంచి ఒంటరిగా పనిచేయటం ఎలా?
- వంట చేశాడు... ఇల్లు ఊడ్చాడు... హింసించే భర్త మనిషిగా మారాడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








