చైనాతో ముప్పు పొంచి ఉందన్న నాటో.. గట్టిగా బదులిచ్చిన బీజింగ్

చైనా మిలటరీ బలగం గురించి నాటో హెచ్చరించింది కానీ, చైనాతో కోల్డ్ వార్‌ను కోరుకోవట్లేదని తెలిపింది

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, చైనా మిలటరీ బలం గురించి నాటో హెచ్చరించింది. కానీ, చైనాతో మరోసారి కోల్డ్ వార్‌ కోరుకోవట్లేదని తెలిపింది.

చైనా సైన్యంతో ముప్పు పొంచి ఉందని, ఇతర దేశాలకు ఇది "వ్యవస్థాగతమైన సవాలు" అని నాటో నాయకులు హెచ్చరించారు.

చైనా అణ్వాయుధాలను వేగంగా పెంచుకుంటోందని, మిలటరీ ఆధునికీకరణకు సంబంధించిన విషయాలను దాచిపెడుతోందని, రష్యాతో సైనిక సంబంధాలు నెరుపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

సైనికంగా, సాంకేతికపరంగా చైనా నాటోకు దాదాపు సమానంగా వస్తోందని నాటో చీఫ్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ హెచ్చరించారు. అయితే నాటో కూటమి చైనాతో ప్రచ్ఛన్నయుద్ధాన్ని కోరుకోవట్లేదని బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో జరిగిన శిఖరాగ్ర సదస్సులో ఆయన స్పష్టం చేశారు.

నాటో అంటే 'నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్'.

ఐరోపా, ఉత్తర అమెరికాలకు చెందిన 30 దేశాలు ఇందులో సభ్యులుగా ఉన్నాయి. ఇదొక శక్తివంతమైన రాజకీయ, సైనిక కూటమి.

నాటో

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్‌తో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్

నాటో చైనా మీద ఎందుకు దృష్టి పెడుతోంది?

"చైనా ఆశయాలు, దూకుడు స్వభావం ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ సమాజానికి, కూటమి భద్రతకు వ్యవస్థాగతమైన సవాళ్లుగా మారాయి. చైనా పాటిస్తున్న అపారదర్శకత, సమాచార గోప్యత పట్ల ఆందోళనగా ఉంది" అని నాటో ఒక ప్రకటనలో పేర్కొంది.

"చైనా మాకు శత్రువు కాదు. ఆ దేశంతో కోల్డ్ వార్‌కు తలపడే ఉద్దేశం లేదు. కానీ, చైనా ఎదుగుతున్న తీరు, కూటమికి పొంచి ఉన్న ముప్పు గురించి చర్చించాల్సిన ఆవశ్యకత ఉంది" అని స్టోల్టెన్‌బర్గ్ చెప్పారు.

ప్రపంచంలో బలమైన సైనిక, ఆర్థిక శక్తులుగా ఎదిగిన దేశాల్లో చైనా కూడా ఒకటి. ఆ దేశంలో అధికారంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీకి రాజకీయలపై, సమాజంపై గట్టి పట్టు ఉంది.

ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక సైనిక బలగం ఉన్న దేశం చైనా. వారి సైన్యంలో 20 లక్షల మంది క్రియాశీలకంగా పనిచేస్తున్నారు.

వేగంగా విస్తరిస్తున్న చైనా మిలటరీ పట్ల నాటో ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ వృద్ధి, నాటో సభ్య దేశాల భద్రత, ప్రజాస్వామ్య విలువలకు ముప్పుగా భావిస్తోంది.

ఇటీవల ఆఫ్రికాలో పెరిగిన చైనా కార్యకలాపాల పట్ల నాటో కూటమి ఆందోళన వ్యక్తం చేసింది. ఆఫ్రికాలో చైనా ఆర్మీ స్థావరం ఏర్పాటు చేసుకుంది.

అయితే, తమ శాంతియుత అభివృద్ధిని చూసి నాటో తమపై నిందలు వేస్తోందని ఈయూలో చైనా మిషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. తమ రక్షణ విధానానికి తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది.

నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్

పుతిన్ గురించి బైడెన్ ఏమన్నారు?

మార్చిలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒక ఇంటర్వ్యూలో మట్లాడుతూ రష్యా అధ్యక్షుడిని తాను ఓ "కిల్లర్"గా భావిస్తున్నానని అన్నారు. కానీ, సోమవారం ఆయన పుతిన్ గురించి కొంచం మెత్తబడినట్లు మాట్లాడారు.

"ఆయన తెలివైనవారు, కఠినంగా ఉంటారు. ఆయన విలువైన విరోధి అని గ్రహించాను" అని బైడెన్ వ్యాఖ్యానించారు.

"సైబర్ సెక్యూరిటీ, ఇతర కార్యకలాపాలకు సంబంధించి ఆయన మాతో సహకరించకపోతే, గతంలో ప్రవర్తించినట్లుగానే ప్రవర్తిస్తే అప్పుడు మేము ప్రతిస్పందిస్తాం. పరిమితులు ఎక్కడ ఉన్నాయో మేము స్పష్టంగా తెలియజేస్తాం" అని బైడెన్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)