ఛత్రపతి శివాజీ పేరును బీజేపీ రాజకీయాలకు వాడుకుంటోందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, తుషార్ కుల్‌కర్ణి
- హోదా, బీబీసీ మరాఠీ
ఛత్రపతి శివాజీపై బీజేపీ మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ చేసిన ప్రకటన ఆ రాష్ట్రంలో చర్చనీయమైంది. హిందూ ఓటు బ్యాంకును సృష్టించింది శివాజీయేనని చంద్రకాంత్ పాటిల్ అన్నారు.
అయితే, శివాజీని ప్రస్తుత రాజకీయాలతో ముడిపెట్టడాన్ని కాంగ్రెస్, శివసేనలు తీవ్రంగా తప్పుబట్టాయి.
చంద్రకాంత్ పాటిల్ అసలేమన్నారు?
చంద్రకాంత్ పాటిల్ ఇటీవల విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. పార్టీ తమకు టిక్కెట్ ఇవ్వడం లేదని, పార్టీ నుంచి వెళ్లిపోతామంటూ కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
"ఓటు బ్యాంకు వ్యక్తులది కాదు. పార్టీకి చెందినది. ఈ ఓటు బ్యాంకును సృష్టించిన వారిలో సాధువులు, మహంతులు నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్ వరకూ ఉన్నారు. శివాజీయే ఈ హిందూ ఓటు బ్యాంకును అభివృద్ధి చేశారు" అన్నారు.
‘‘పార్టీ సహకారంతో మీకు ఓటు బ్యాంకు వస్తుంది. మీరు పార్టీకి ఫేస్‌గా ఉంటారు. ప్రజలకు ఉపయోగపడతారు. అంటే టిక్కెట్, అభ్యర్ధి నిర్ణయం, ఓటు బ్యాంకు అన్నీ పార్టీకే చెందుతాయి'' అన్నారాయన.
ఛత్రపతి శివాజీ ఓటు బ్యాంకును సృష్టించారన్న చంద్రకాంత్ పాటిల్ ప్రకటనతో చరిత్రకారులు ఏకీభవించడం లేదు.

ఫొటో సోర్స్, FACEBOOK
'హైందవి స్వరాజ్ అంటే హిందువుల స్వరాజ్యం మాత్రమే కాదు'
ఛత్రపతి శివాజీ మహారాజ్ కేవలం హిందువులకే కాకుండా ప్రజలందరికీ రాజు అని చరిత్రకారుడు డాక్టర్ జై సింగ్‌రావ్ పవార్ అన్నారు. "శివాజీ మహారాజ్ అన్ని మతాలను గౌరవించేవారు. ఆయన సైన్యంలో ముస్లింలు ముఖ్యమైన పాత్ర పోషించారు. ‘నేను హిందువులకే రాజును’ అని శివాజీ ఎప్పుడూ చెప్పుకోలేదు" అన్నారాయన.
"శివాజీది మహారాష్ట్ర లేదా మరాఠా రాష్ట్రం. దీనికి మతం, కులం,ప్రాంతంతో సంబంధం లేదు" అని జైసింగ్‌రావ్ పవార్ స్పష్టం చేశారు.
''శివాజీ మహారాజ్ చరిత్రను ఒక మతానికి, కులానికి పరిమితం చేయడం అన్యాయం'' అని కొల్హాపూర్‌కు చెందిన చరిత్రకారుడు ఇంద్రజిత్ సావంత్ వ్యాఖ్యానించారు.
''శివాజీ పాత్ర సార్వత్రిక స్వభావంతో ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చరిత్రకారులు ఆయనను స్వేచ్ఛా పిపాసకు ప్రతీకగా తీసుకుంటారు. అస్సాంలోని అహోం రాజవంశం రాజులు కూడా శివాజీ మహారాజ్ నుంచే ప్రేరణ పొందారనడానికి ఆధారాలు ఉన్నాయి. శివాజీ దృష్టికోణంలో సింధు ప్రజల నుంచి కావేరీ వరకు హైందవీ స్వరాజ్యంలో భాగమే. కానీ దానికి హిందూ మతంతో సంబంధం లేదు'' అని సావంత్ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
శివాజీ మహారాజ్ హైందవీ స్వరాజ్యం
శివాజీ మహారాజ్ 1645లో ‘హైందవి స్వరాజ్య’ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించారని 'విజయ్ నగర్ వాయిస్-ఎక్స్‌ప్లోరింగ్ సౌత్ ఇండియన్ హిస్టరీ అండ్ హిందూ లిటరేచర్'లో విలియం జాక్సన్ చెప్పారు. ''హైందవీ స్వరాజ్యం అంటే విదేశీ శక్తుల నుంచి స్వేచ్ఛ, స్వాభిమాన రాజ్యం అని అర్థం'' అని జాక్సన్ రాశారు.
"శివాజీ మతాన్ని విశ్వసించలేదు. ఆయన సెక్యులర్. తన రాజ్యాన్ని లౌకిక రాజ్యంగా ప్రకటించారు" అని రచయిత గోవింద్ పన్సారే రాశారు. శివాజీ మత ప్రవర్తన, ఆలోచనల గురించి పన్సారే 'హూ ఈజ్ శివాజీ' అనే పుస్తకం రాశారు.
"శివాజీ హిందువు. మతంపై విశ్వాసం ఉంది. హిందూ నమ్మకాల ప్రకారం నడుచుకునేవారు. దేవుళ్లను, సాధువులను పూజించేవారు. మతపరమైన పనులు, ఆలయాలకు దేవాలయాలకు డబ్బు ఖర్చు చేసేవారు'' అని ఆయన వెల్లడించారు.
అయితే, ఇది ఇస్లాంకు వ్యతిరేకంగా చేసిందా ? హిందూ మతమే గొప్పదని ఆయన నమ్మారా, ముస్లిం మతాన్ని ద్వేషించారా ? ముస్లింలను హిందువులుగా, లేదా మరాఠాలుగా మార్చాలనుకున్నారా అని అడిగినప్పుడు, ఎంత మాత్రం కాదన్నారు పన్సారే.
శివాజీ నమ్మే హిందూ మతం, పీష్వాలు నమ్మే హిందూ మతం భిన్నమైనవని పన్సారే అన్నారు.
శివాజీ 'హైందవీ స్వరాజ్య' - సావర్కర్ 'హిందూత్వ'
పన్సారే, జైసింగ్ పవార్ చెబుతున్న ప్రకారం.. శివాజీ మహారాజ్ హైందవీ స్వరాజ్య భావన వెనుక హిందూ మత భావన లేదు. కానీ వినాయక్ దామోదర్ సావర్కర్ తన పుస్తకంలో శివాజీ చేపట్టిన చర్యలను హిందూత్వంగా అభివర్ణించారు. అయితే, హిందూత్వ అనేది 40 శతాబ్దాల పురాతనమైనదనీ ఆయన పేర్కొన్నారు.
"శివాజీ మహారాజ్ గురించి పాటిల్ ఇలాంటి ప్రకటన చేయడం సరికాదు. శివాజీ అన్ని కులాలు, మతాల ప్రజలను తన వెంట తీసుకెళ్లారు. ఆయన హిందువుల కోసం మాత్రమే పని చేయలేదు. తన స్వరాజ్యంలో ప్రతి ఒక్కరికీ న్యాయం చేసారు. బీజేపీ ఆయనను తమ ఓటు కోసం వినియోగించుకోవడం సరికాదు'' అని సీనియర్ జర్నలిస్ట్ హేమంత్ దేశాయ్ అన్నారు.

'శివాజీ పేరును ఉపయోగించడం రాజకీయాల్లో భాగం'
శివాజీ పేరుతో రాజకీయాలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మరో సీనియర్ జర్నలిస్టు సచిన్ పరాబ్ వ్యాఖ్యానించారు.
''శివసేన, ఎంఎన్‌ఎస్ పార్టీలు ఎప్పుడూ శివాజీ పేరును ఉపయోగిస్తాయి. అయితే, ఇటీవలి కాలంలో బీజేపీ కూడా ఆయన పేరును వాడుకోవడం బాగా పెరిగిపోయింది. ఇలాంటి ప్రకటనలు శివాజీని నమ్మే వారిని కూడా బీజేపీకి దూరం చేస్తాయి. ఛత్రపతి శివాజీ పేరును ఇలా ఉపయోగించడం సామాన్య మరాఠీకి అస్సలు ఇష్టం లేదు" అన్నారు పరాబ్.
భారతీయ జనతా పార్టీ గతంలో ఛత్రపతి శివాజీని నరేంద్ర మోదీతో పోల్చి ఆయన్ను అవమానించిందని, ఇప్పుడు ఓటు బ్యాంకు పేరుతో అవమానిస్తోందని కాంగ్రెస్ నేత సచిన్ సావంత్ విమర్శించారు. ఈ విషయంలో చంద్రకాంత్ పాటిల్ క్షమాపణలు చెప్పాలని సచిన్ సావంత్ డిమాండ్ చేశారు.
"శివాజీ మహారాజ్ సామాన్య ప్రజలకు రాజు. బీజేపీ ఆయన్ను ఎన్నడూ గౌరవంగా చూడలేదు. ఆర్‌ఎస్‌ఎస్‌కు ఎప్పుడూ శివాజీ ఆదర్శం కాదు. బీజేపీకి ఎప్పుడూ పీష్వాలే ఆదర్శం" అన్నారు సావంత్.
''చంద్రకాంత్ పాటిల్ ఏం మాట్లాడారన్నది అనవసరం. ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందూ ఓటు బ్యాంకును సృష్టించారన్నది నాకు తెలియదు. కానీ, ఆయన ఈ దేశంలో మొదటి హైందవ స్వరాజ్యాన్ని స్థాపించారు" అని శివసేన నేత సంజయ్ రౌత్ అన్నారు.
"ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆలోచనే హిందూ హృదయ సామ్రాట్ బాలాసాహెబ్ ఠాక్రేలో పాతుకు పోయింది. అంతకు ముందు వీర్ సావర్కర్‌లో ఉండేది. దేశంలో హిందూ ఓటు బ్యాంకు ఆలోచన మొదటిసారి చేసింది బాలాసాహెబ్ ఠాక్రే.'' అన్నారాయన
ఇవి కూడా చదవండి
- 2050 నాటికి భారత్‌లో టమాటా కనుమరుగైపోతుందా
- ఈ డాక్టర్ 132 మంది రోగుల నుంచి ఆస్తి రాయించుకుని వారిని చంపేశారా
- 150కి పైగా దోపిడీ, కిడ్నాప్, హత్యా కేసులున్న డాన్ పప్పూ దేవ్ పోలీసు కస్టడీలో ఎలా చనిపోయారు?
- తబ్లీగీ జమాత్‌ను సౌదీ అరేబియా ఏ భయం కారణంగా నిషేధించింది?
- ఇద్దరు మహిళల యధార్ధ గాథ: ‘పోర్న్ చూస్తూ అసహజ సెక్స్ కోసం బలవంతం చేసేవాడు, కాదంటే శిక్షించేవాడు’
- ‘కొన్ని కులాల మహిళలు వక్షోజాలు కప్పుకోరాదని ఆంక్షలు.. ఉల్లంఘిస్తే రొమ్ము పన్ను’
- జేమ్స్ వెబ్: విశ్వ రహస్యాలను వెలుగులోకి తెచ్చే టెలిస్కోప్ ఇదేనా
- ‘పెళ్లి తరువాత అమ్మాయి పేరు, ఇంటి పేరు మార్చాలా? అబ్బాయి పేరూ మారిస్తే’
- ‘భారత సైన్యానికి లొంగిపోకపోతే మరో పాకిస్తాన్‌ను కూడా కోల్పోవాల్సి ఉండేది’
- భీకర సుడిగాలికి ఎగిరిపోయిన పెళ్లి ఫొటోలు, సర్టిఫికేట్లు 225 కిలోమీటర్ల అవతల దొరికాయి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












