కిల్లర్: ఆస్తి రాయించుకుని 132 మంది రోగులను చంపేశారని డాక్టర్‌పై అభియోగం.. ఇంతకీ ఏమిటీ కేసు

డాక్టర్ ఆడమ్స్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, కె. శుభగుణం
    • హోదా, బీబీసీ ప్రతినిధి

జాన్ బాడ్కిన్ ఆడమ్స్.. ఈ పేరు ఇప్పుడు చాలామందికి తెలియకపోవచ్చు. కానీ, 1950లలో యూరోపియన్ వార్తాపత్రికల్లో మారుమోగిపోయిన పేరు ఇది.

ఇంగ్లండ్‌కు ఆగ్నేయ తీర ప్రాంతంలోని ఈస్ట్‌బోర్న్‌లో వైద్యుడిగా పనిచేసేవారు ఆడమ్స్.

ఆయన డబ్బు కోసం వంద మందికి పైగా రోగులను చంపేశారనే అభియోగాలు వచ్చాయి. ఆడమ్స్ మొత్తం 300 మందిని చంపేశారనే వార్త అప్పట్లో వ్యాపించింది.

1950లలో 132 మంది రోగులకు సంబంధించిన వీలునామాల్లో ఆడమ్స్ పేరు కనిపించిందని జేన్ రాబిన్స్ రాసిన 'ది క్యూరియస్ హ్యాబిట్స్ ఆఫ్ డాక్టర్ ఆడమ్స్' పుస్తకంలో వివరించారు.

తన దగ్గరకొచ్చే రోగులను డాక్టర్ ఆడమ్స్ హత్య చేస్తున్నారనే అనుమానంతో 1956 డిసెంబర్ 19న పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు.

1957 మార్చి 18న ఈ కేసు విచారణ ప్రారంభమై 17 రోజుల పాటు కొనసాగింది.

ఈ కేసు విచారణ సమయంలో 310 మరణ ధ్రువీకరణ పత్రాలపై దర్యాప్తు జరపాలంటూ ఆదేశాలు ఇచ్చారు. అందులో 163 పత్రాలను కూలంకుషంగా విశ్లేషించారు.

అయితే, ఆడమ్స్‌పై మోపిన అభియోగాలు రుజువు కాకపోవడంతో ఆయన్ను నిర్దోషిగా ప్రకటించి ఏప్రిల్ 4న విడుదల చేశారు.

ఈ విచారణను "మర్డర్ ట్రయల్ ఆఫ్ ది సెంచరీ’’గా వార్తాపత్రికలు అభివర్ణించాయి.

డాక్టర్ ఆడమ్స్

ఫొటో సోర్స్, Getty Images

వీలునామాల్లోకి ఆడమ్స్ పేరు ఎలా వచ్చింది?

డాక్టర్ ఆడమ్స్ 1922లో ఉత్తర ఐర్లాండ్ నుంచి బ్రిటన్‌లోని ఈస్ట్‌బోర్న్‌కు వచ్చారు.

అక్కడ చాలాకాలం వైద్యుడిగా సేవలందించారు. క్రమేపీ, ఇంగ్లండ్‌లోని అత్యంత ధనవంతులైన డాక్టర్లలో ఒకరిగా పేరు పొందారు.

ఆడమ్స్ దగ్గరకు వచ్చే రోగులు చనిపోతున్న సమయంలో వారి వీలునామాల్లో ఆయన పేరు చేర్చినట్లు విచారణలో బయటపడింది.

ఆడమ్స్ దగ్గర చికిత్స పొందిన ఎడిత్ ఆలిస్ మోరెల్ 1950 నవంబర్ 13న మరణించారు.

"చనిపోయినప్పటికి ఆమెకు 81 సంవత్సరాలు. తన ఆస్తిలో 1,57,000 యూరోల నగదు, రోల్స్ రాయిస్ కారును ఆడమ్స్ పేర రాశారు" అని 1962లో సిబిల్ బెడ్‌ఫోర్డ్ రాసిన 'ది ట్రయిల్ ఆఫ్ డాక్టర్ ఆడమ్స్' పుస్తకంలో పేర్కొన్నారు.

ఈ కేసును విచారించిన న్యాయమూర్తి పాట్రిక్ డెవ్లిన్ 1985లో 'ఈజింగ్ ది పాసింగ్' పేరుతో ఈ విచారణ ఆధారంగా ఒక పుస్తకాన్ని రాశారు.

ఈ పుస్తకంపై సమీక్ష రాసిన లివర్‌పూల్‌కు చెందిన కిడ్నీ వైద్యుడు జె.జి.గౌ మాట్లాడుతూ, 25 ఏళ్ల తర్వాత ఒక న్యాయమూర్తి ఈ విచారణ గురించి ఎందుకు రాశారన్నది పాఠకులకు ఆశ్చర్యం కలిగిస్తుందని అన్నారు.

"ఆడమ్స్ చాలా గొప్ప డాక్టరు. ఆయన తన రోగుల విశ్వాసాన్ని పొందారు. ముఖ్యంగా వృద్ధులు ఆయన్ను బాగా నమ్మేవారు. అయితే, ఆయన ప్రమాదకరమైన మందులను ఎక్కువ మోతాదులో వాడమని సూచించేవారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు, ఈ పుస్తకం రాయడం ద్వారా, 25 సంవత్సరాల క్రితం తాను ఇచ్చిన తీర్పు సరైనాదా, కాదా అని న్యాయమూర్తి డెవ్లిన్ సందేహిస్తున్నారా? ఆ విచారణ ఇప్ప్పుడు, ఈ సమయంలో జరిగితే, కొత్త సాక్షాలేమైనా దొరుకుతాయా? అప్పుడు తీర్పు మారిపోతుందా?" అని ఆయన ప్రశ్నించారు.

వృద్ధులు, బాగా అనారోగ్యంతో ఉన్నవారి దగ్గర నుంచి ఆడమ్స్ బలవంతంగా తన పేర వీలునామా రాయించుకుని, తరువాత వారిని చంపేస్తారని విచారణ సమయంలో ఆరోపించారు.

ఆయనొక సీరియల్ కిల్లర్ అని కూడా ఆరోపించారు.

భార్యతో డాక్టర్ ఆడమ్స్

ఫొటో సోర్స్, Getty Images

"దీన్ని హత్య అంటారా?"

ఆడమ్స్ దగ్గర చికిత్స పొందుతూ మరణించిన 163 రోగులలో ప్రధానంగా 23 మంది మరణాలు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు దర్యాప్తు జరిపారు.

ఈ 23 మందీ తమ ఆస్తిని ఆడమ్స్‌ పేరిట రాసిన తరువాతే మరణించారు.

1956 డిసెంబర్ 19 ఉదయం డాక్టర్ ఆడమ్స్‌ను అరెస్ట్ చేశారని, తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని ఆయన పోలీసులను నిలదీశారని 'ది ట్రయిల్ ఆఫ్ డాక్టర్ ఆడమ్స్‌'లో సిబిల్ బెడ్‌ఫోర్డ్ రాశారు.

"హత్యా? నేను హత్య చేశానని మీరు నిరూపించగలరా? ఆ పని మీరు చేయలేరు" అని ఆడమ్స్ అన్నారు.

ఎడిత్ ఆలిస్ మోరెల్‌కు సేవలు చేసిన నర్స్ స్ట్రోనక్ ఈ విచారణలో ఒక సాక్షి.

డాక్టర్ ఆడమ్స్, ఎడిత్‌కు మార్ఫిన్, హెరాయిన్‌లను అధిక మోతాదులో ఇచ్చి చంపేశారని స్ట్రోనక్ ఆరోపించారు.

విచారణ చివర్లో తన వాదన వినిపించేందుకు డాక్టర్ ఆడమ్స్‌కు అవకాశం ఇచ్చారు.

"హత్యా? దీన్ని హత్య అంటారా? ఆమె మరణం అంచున ఉన్నారు. ఆమె బాధను తగ్గించేందుకు నేను సహాయం చేశాను. ఆమె ఏ క్షణంలోనైనా చనిపోవచ్చు. ఆమెకు నొప్పిలేని మరణాన్ని అందించేందుకు ప్రయత్నించాను" అంటూ ఆడమ్స్ సమర్థించుకున్నారు.

ఈ కేసులో జడ్జి డెవ్లిన్ తీర్పునిస్తూ, "డాక్టర్ ఆడమ్స్ హంతకుడని నిరూపించేదుకు బలమైన సాక్ష్యాధారాలు లేవు. ప్రవేశపెట్టిన సాక్ష్యాలు ఆయన నేరాన్ని నిరూపించడానికి సరిపోవు. అందుకే ఆయన నిర్దోషి" అని పేర్కొన్నారు.

డాక్టర్ ఆడమ్స్ 17 గదులున్న ఇంట్లో నివసించేవారు. ఆయన దగ్గర రోల్స్ రాయిస్ కారు ఉండేది.

1957లో విచారణ సమయంలో ఆయన డాక్టర్ లైసెన్సును రద్దు చేశారు.

నిర్దోషిగా విడుదల అయిన తరువాత 1960లో ఆయనకు మళ్లీ లైసెన్స్ మంజూరు చేశారు.

అనంతరం, ఆడమ్స్ డాక్టరుగా సేవలు కొనసాగించారు. 1983 జులై 4న ఆయన మరణించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)