జపాన్‌: 'బ్లూ హైడ్రోజన్' బొగ్గుకు ప్రత్యామ్నాయం కానుందా?

నిర్మాణంలో ఉన్న బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాన్ని చూస్తోన్న కార్యకర్తలు
ఫొటో క్యాప్షన్, నిర్మాణంలో ఉన్న బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాన్ని చూస్తోన్న కార్యకర్తలు
    • రచయిత, రూపర్ట్ వింగ్‌ఫీల్డ్ హయిస్
    • హోదా, బీబీసీ న్యూస్, టోక్యో

అద్భుతమైన వసంతకాలపు మధ్యాహ్న వేళ హిల్‌సైడ్ దగ్గర నిల్చోని టోక్యో బేను చూస్తున్నాను. నా పక్కనే టకావో సైకీ కూడా ఉన్నారు. 70 ఏళ్ల టకావో సాధారణంగా మృదు స్వభావి.

కానీ ఈరోజు ఆయన కోపంగా ఉన్నారు.

''ఇది హాస్యాస్పదం. పిచ్చి పని'' అని ఆయన అన్నారు.

ఆయన బాధకు కారణం అక్కడ నిర్మాణమవుతున్న 1.3 గిగావాట్ల సామర్థ్యంతో కూడిన బొగ్గు ఆధారిత పవర్ స్టేషన్. అది అందమైన సముద్ర తీరాన్ని చూసేందుకు మాకు అడ్డుగా నిలిచింది.

''విద్యుత్ ఉత్పత్తి చేయడానికి మనం ఇంకా ఎందుకు బొగ్గును మండిస్తున్నామో నాకు అర్థం కావడం లేదు. ఈ ఒక్క ప్లాంట్ ప్రతీ ఏడాదీ 70 లక్షల టన్నులకు పైగా కార్బన్ డయాక్సైడ్‌ను విడుదల చేస్తుంది'' అని సైకీ స్నేహితుడు రుకిరో సుజుకీ అన్నారు.

వీడియో క్యాప్షన్, 60, 70ల నాటి రోల్స్ రాయిస్ కార్లను ఎలక్ట్రిక్ కార్లుగా మారుస్తున్నారు.

సుజుకీ, సైకీ లేవనెత్తిన అంశం చాలా ముఖ్యమైనది. వాతావరణ మార్పులపై బొగ్గు చూపించే ప్రభావం గురించి ఆందోళనలు చెలరేగుతోన్న తరుణంలో జపాన్ బొగ్గు వినియోగం తగ్గించుకోకూడదా? అని వారు అభిప్రాయపడ్డారు.

బొగ్గునే ఎందుకు వాడుతున్నారు? అంటే దీనికి, 2011 నాటి ఫుకుషిమా న్యూక్లియర్ విపత్తును సమాధానంగా చెబుతుంటారు.

2010లో జపాన్‌లో మూడింట ఒకవంతు విద్యుత్‌ను అణుశక్తి నుంచే ఉత్పత్తి చేశారు. మరిన్ని అణువిద్యుత్ ప్లాంట్‌లు ఏర్పాటు చేయాలనే ప్రణాళికలు కూడా ఉండేవి. కానీ 2011లో న్యూక్లియర్ డిజాస్టర్ కారణంగా జపాన్‌లోని అన్ని అణువిద్యుత్ కేంద్రాలను మూసివేశారు. పదేళ్ల తర్వాత కూడా అవి ఇంకా అలాగే మూసివేసే ఉన్నాయి. వాటిని మళ్లీ ప్రారంభించాలనే అంశంపై చాలా వ్యతిరేకత ఉంది.

అణు విద్యుత్ కేంద్రాల స్థానంలో గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలు చాలా కాలంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. కానీ, ఇటీవల బ్రిటన్ కనుగొన్నట్లుగా, సహజవాయువు అనేది చాలా ఖరీదుతో కూడినది.

టకావో సైకీ
ఫొటో క్యాప్షన్, టకావో సైకీ (కుడి), రికురో సుజుకీ (ఎడమ) బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించారు.

అందుకే, కొత్తగా 22 బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలను నిర్మించాలని జపాన్ ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని నడిపేందుకు ఆస్ట్రేలియా నుంచి తక్కువ ధరకు బొగ్గును దిగుమతి చేసుకోనుంది. ఆర్థికపరంగా చూస్తే ఇది మంచి అడుగే అయినప్పటికీ, పర్యావరణపరంగా మాత్రం కాదు. అందుకే జపాన్ ఇప్పుడు బొగ్గు వినియోగాన్ని ఆపాలంటూ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.

పాత బొగ్గు కర్మాగారాలను మూసివేసి, పునరుత్పాదక ఇంధన వనరుల వైపు మళ్లడానికి బదులుగా హైడ్రోజన్ లేదా అమ్మోనియా వాడకానికి మారడమే దీనికి తమ సమాధానంగా జపాన్ చెబుతోంది.

''బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాల్లో కంపెనీలు పెట్టిన పెట్టుబడులు అకస్మాత్తుగా వారి బ్యాలెన్స్ షీట్లలో విలువలేనివిగా, నిరుపయోగమైనవిగా మారతాయి'' అని స్వీడన్‌లోని చాల్‌మర్స్ యూనివర్సిటీ ఎనర్జీ పాలసీ నిపుణులు, ప్రొఫెసర్ థామస్ కబెర్‌జెర్ అన్నారు.

''ఇది ఎలక్ట్రిక్ పవర్ కంపెనీలకు ఆర్థిక ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. ఆతర్వాత బ్యాంకులపై, పెన్షన్ నిధులపై కూడా దీని ప్రభావం ఉంటుంది. అది జపాన్‌కు సవాలు'' అని ఆయన పేర్కొన్నారు.

ప్లాంట్లను కూడా చాలా సులభంగా అమ్మోనియా లేదా హైడ్రోజన్‌ను మండించేలా మార్చవచ్చు. అమ్మోనియా లేదా హైడ్రోజన్‌ను మండించడం ద్వారా కార్బన్ డయాక్సైడ్ కూడా వెలువడదు. కాబట్టి ఇది ఒక మంచి పరిష్కారంగా అనిపిస్తోంది.

కానీ జపాన్ ప్రభుత్వం ఆశయాలు మరింత పెద్దవిగా ఉన్నాయి. ప్రపంచంలోనే తొలి ''హైడ్రోజన్ ఎకానమీ''గా ఎదగాలని జపాన్ ఆశిస్తోంది.

ఇక్కడే కార్ల తయారీ కంపెనీ టయోటా గురించి మాట్లాడుకోవాలి.

మిరాయ్
ఫొటో క్యాప్షన్, ‘మిరాయ్’ అనేది టొయోటా తయారు చేసిన తొలి జీరో కర్బన ఉద్గారాల ఎలక్ట్రిక్ కారు.

నేను టోక్యోలోని ఒక హైడ్రోజన్ ఫిల్లింగ్ స్టేషన్‌లో ఉన్నా. అక్కడే తొయోతా కొత్తగా తయారు చేసిన 'మిరాయ్' కారు ఉంది. అది చాలా విలాసవంతమైన కారు. పరిమాణంలో కూడా చాలా పెద్దది.

నేను కారు క్యాబిన్‌లో కూర్చొని స్టార్ట్ బటన్‌ను నొక్కి వీధిలోకి వచ్చాను. అది చాలా నిశ్శబ్ధంగా, మృదువుగా నడుస్తోంది.

మిరాయ్ (జపనీస్‌లో భవిష్యత్ అని అర్థం) అనేది తొయోతా రూపొందించిన తొలి సంపూర్ణ ఉద్గార రహిత ఎలక్ట్రిక్ కారు. మిగతా కార్లకు ఉన్నట్లుగా మిరాయ్‌లో భారీ బ్యాటరీ ఉండదు. దానికి బదులుగా బోనెట్‌లో ఫ్యూయల్ సెల్, వెనుక సీటు కింద హైడ్రోజన్ ట్యాంకులు ఉంటాయి. హైడ్రోజన్, ఫ్యూయల్ సెల్ ద్వారా ప్రయాణించి విద్యుత్ శక్తిగా మారుతుంది. దీనివల్లనే ఎలక్ట్రిక్ కార్లు నడుస్తాయి. ఇదే సాంకేతికతను, చంద్రునిపై జరిపిన ప్రయోగాల్లో అపోలో అంతరిక్షనౌకకు శక్తిని అందించడానికి ఉపయోగించారు.

చాలా మందికి ఈ సాంకేతికత అంతగా రుచించలేదు. ఇది బ్యాటరీల కంటే చాలా ఖరీదుతో కూడినది, క్లిష్టమైనది. ఎలాన్ మస్క్ హైడ్రోజన్ కార్లను మూర్ఖత్వం అని అన్నారు.

''ఫ్యూయల్ సెల్‌ అంశంపై కంపెనీ విజన్ అనేది కార్లతోనే ఆగిపోదు. వాటికి మించి ఉంటుంది'' అని తొయోతా పబ్లిక్ అఫైర్స్ డివిజన్ హెడ్ హిసాషి నకాయ్ అన్నారు.

''ప్రజలందరికీ విభిన్న అభిప్రాయాలు ఉంటాయనేది నాకు తెలుసు. కానీ, ఇక్కడ కర్బన ఉద్గారాలను తటస్థం చేయడం చాలా ముఖ్యం. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ప్యూయల్ సెల్ సాంకేతికతను ఎంతలా ఉపయోగించుకోగలమనేది మనం ఆలోచించాలి. హైడ్రోజన్ అనేది శక్తిమంతమైన, కీలకమైన ఇంధన వనరు అని మేం గట్టిగా నమ్ముతున్నాం'' అని ఆయన వివరించారు.

ఆయన చెప్పినదాని ప్రకారం చూస్తే... ఇళ్లలోనూ, కార్యాలయాల్లోనూ, కార్లలో ఇలా భవిష్యత్‌లో ప్రతీ చోటా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్‌ సాంకేతికతను వినియోగించాలని టయోటా ఆలోచిస్తున్నట్లు మనకు తెలుస్తోంది. ఈ కొత్త హైడ్రోజన్ సాంకేతికతలో ముందుండాలని ఆ సంస్థ కోరుకుంటోంది.

కానీ ఇక్కడ మనకో ప్రశ్న ఎదురవుతోంది. అదేంటంటే, జీరో కార్బన్ సొసైటీగా మార్చడానికి కావాల్సిన హైడ్రోజన్, జపాన్‌కు ఎక్కడ నుంచి లభిస్తుంది?

దానికి సమాధానం '' బ్లూ హైడ్రోజన్''.

బొగ్గు

ఫొటో సోర్స్, Reuters

నీటిని ఉపయోగించుకునే పునరుత్పాదక శక్తి ద్వారా హైడ్రోజన్‌ను తయారు చేస్తే మనకు 'గ్రీన్ హైడ్రోజన్' లభిస్తుంది. కానీ, ఇక్కడ సమస్యేంటంటే, గ్రీన్ హైడ్రోజన్ అనేది చాలా ఖరీదైనది.

దానికి బదులుగా, ప్రస్తుతం సహజ వాయువు లేదా బొగ్గు నుంచి హైడ్రోజన్‌ను తయారు చేస్తున్నారు. ఇది చౌకగా లభిస్తుంది. కానీ దీనివల్ల ఎక్కువ మొత్తంలో గ్రీన్‌హౌస్ ఉద్గారాలు బయటకు వెలువడుతాయి. కానీ మీరు ఆ గ్రీన్ హౌస్ ఉద్గారాలను సంగ్రహించి, వాటిని భూమిలో పాతిపెట్టినట్లయితే, దాన్ని 'బ్లూ హైడ్రోజన్' అని పిలుస్తారు.

సరిగ్గా ఇలాగే చేయనున్నామని జపాన్ ఇప్పుడు చెబుతోంది.

లిగ్నైట్ లేదా 'బ్రౌన్ కోల్' అని పిలవబడే ఒక రకమైన బొగ్గును హైడ్రోజన్‌గా మార్చడానికి జపాన్, ఆస్ట్రేలియా దేశాలు ఒక సంయుక్త ప్రాజెక్టును ఈ ఏడాది ప్రారంభంలో విక్టోరియా రాష్ట్రంలో ప్రారంభించాయి.

అక్కడ హైడ్రోజన్‌ను మైనస్ 253 సెంటిగ్రేడ్ వద్ద ద్రవం రూపంలోకి మార్చుతారు. దాన్ని పైపుల ద్వారా ప్రత్యేకంగా నిర్మించిన ఓడలోకి పంపించి జపాన్‌కు చేరవేస్తారు.

ఈ ప్రక్రియలో అక్కడ వెలువడిన గ్రీన్ హౌస్ ఉద్గారాలను ఏం చేస్తారు? ఇప్పుడైతే, అవి నేరుగా వాతావరణంలోనే కలుస్తాయి. కానీ, లాట్రోబ్ వ్యాలీ సైట్‌లో విడుదల అవుతోన్న ఈ గ్రీన్ హౌస్ ఉద్గారాలను భవిష్యత్‌లో ఏదో ఒక సమయంలో సంగ్రహించి వాటిని సముద్ర తీరప్రాంతంలోని నేలలోకి పంపిస్తామని జపాన్, ఆస్ట్రేలియా దేశాలు హామీ ఇస్తున్నాయి.

వాతావరణ మార్పుల కార్యకర్తలు ఈ ప్రణాళికతో భయాందోళనకు గురవుతున్నారు. గ్రీన్‌హౌస్ వాయువులను సంగ్రహించి, భద్రపరిచే సాంకేతికత ఇంకా నిరూపితం కాలేదని వారంటున్నారు. రాబోయే దశాబ్దాలలో లిగ్నైట్ బొగ్గును పెద్ద మొత్తంలో తవ్వేలా జపాన్‌కు ఇది అనుమతిస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ప్రణాళిక ద్వారా ఆర్థికపరంగా అత్యంత ఎక్కువగా నష్టం జరుగుతుందని ప్రొఫెసర్ కబెర్‌జెర్ పేర్కొన్నారు.

జపాన్‌లో నిర్మిస్తోన్న బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రం
ఫొటో క్యాప్షన్, జపాన్‌లో నిర్మిస్తోన్న బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రం

''సాంకేతికంగా ఇది సాధ్యమే, కానీ ఇది ఎప్పుడూ చాలా ఖరీదైనదిగానే ఉంటుంది. ఇప్పుడు ప్రపంచంలోని చాలా చోట్లా కార్బన్ సంగ్రహణ లేని శిలాజ ఇంధనాల కంటే పునరుత్పాదక విద్యుత్ చౌకగానే లభిస్తోంది'' అని ఆయన చెప్పుకొచ్చారు.

పునరుత్పాదక వనరులు అత్యంత ఖరీదైనవిగా ఉన్న సమయంలో, దశాబ్ధం క్రితం జపాన్ ప్రభుత్వం ''బ్లూ హైడ్రోజన్''‌ను ఎన్నుకుందని, ఇప్పుడు కూడా అదే ప్రణాళికకు కట్టుబడి ఉండటం సరైనది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

''జపాన్ కంపెనీలకు పోటీపరంగా చౌకైన విద్యుత్, అంతర్జాతీయ ఆమోదం పొందడానికి స్వచ్ఛమైన విద్యుత్ అవసరం. అంటే వారికి పునరుత్పాదక విద్యుత్ అవసరం ఉంది. దీన్ని వాడకుండా ఇంకా ఇలాగే ఆలస్యం చేయడం మూలంగా జపాన్ ఆర్థిక వ్యవస్థకు నష్టం వాటిల్లవచ్చు'' అని కబెర్‌జెర్ హెచ్చరించారు.

టోక్యోబే వద్ద బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రం నిర్మాణం వేగంగా జరుగుతోంది. ఇది 2023 నుంచి ఉత్పత్తి ప్రారంభిస్తుంది. కనీసం 40 ఏళ్ల పాటు ఇది పనిచేస్తుందని అంచనా.

''జపాన్ పట్ల నేను సిగ్గుపడుతున్నా. చాలా నిరాశకు గురయ్యా. ఇతర దేశాల్లో యువత సామాజిక సమస్యల గురించి వీధుల్లోకి వస్తున్నారు. కానీ జపాన్‌లో మాత్రం ఇలా జరగడం లేదు. మా తరం యువత వారి అభిప్రాయాలను గొంతెత్తి తెలియజేయాలి'' అని 21 ఏళ్ల పర్యావరణ కార్యకర్త హికారీ మత్సుమొటో అసహనం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)