ఇన్స్యూరెన్స్ కోసం బాయ్‌ఫ్రెండ్ ఐడియాతో చేయి నరుక్కున్న యువతి

సర్క్యులర్ రంపం
ఫొటో క్యాప్షన్, ఇలాంటి రంపంతోనే చేయి కోసుకుంది(పాత చిత్రం)

బీమా డబ్బులకు ఆశపడిన ఓ యువతి తన బాయ్‌ఫ్రెండ్ సహాయంతో చేయి నరుక్కొంది. అయితే, అంత రిస్క్ చేసినా కూడా ఆమెకు ఒక్క రూపాయి కూడా రాలేదు సరికదా రెండేళ్ల జైలు శిక్ష పడింది.

స్లొవేనియాకు చెందిన జులీజా అడ్లెసిక్(22) 10 లక్షల యూరో( సుమారు రూ. 8.7 కోట్లు) బీమా డబ్బులొస్తాయన్న ఆశతో ఈ పనిచేశారు.

2019లో చేయి తెగ్గొట్టుకోవడానికి ముందు ఆమె ఏకంగా 5 బీమా పాలసీలు తీసుకున్నారని కోర్టు గుర్తించింది.

అలా పాలసీలు తీసుకున్న తరువాత తనకు తానే చేతిని నరుక్కొని చెట్ల కొమ్మలు నరుకుతున్నప్పుడు తన చేయి తెగిపోయిందంటూ బీమా కోసం క్లెయిమ్ చేశారని కోర్టు తేల్చింది.

దీంతో కోర్టు ఆమెకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఆమె బాయ్‌ఫ్రెండ్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధించింది.

మణికట్టు పైవరకు కోసుకుని..

2019లో జులీజా చేయి తెగిపోయిందంటూ ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలో ఆమె, బాయ్ ఫ్రెండ్ ఇద్దరూ ఉద్దేశపూర్వకంగా తెగిపోయిన చేతిని ఆసుపత్రికి తేలేదని కోర్టు నిర్ధరించుకుంది.

తెగిపడిన చేతిని తేకుంటే వైద్యులు తిరిగి అతకలేరు కాబట్టి శాశ్వత వైకల్యం ఏర్పడి బీమా డబ్బులు వస్తాయన్నది వారి పన్నాగమని కోర్టు గుర్తించింది.

అయితే జులీజా, ఆమె బాయ్ ఫ్రెండ్ అలాంటి పథకం రచించినా కూడా వారు అనుకున్నట్లు జరగలేదు. వారు ఆసుపత్రికి వచ్చాక అధికారులు జోక్యం చేసుకుని తెగిన చేతిని వెతికి పట్టుకున్నారు.

వైద్యులు ఆ చేతిని ఆమెకు తిరిగి అతికారు.

కృత్రిమ హస్తాల కోసం ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసిన బాయ్ ఫ్రెండ్

అయితే, ఇదంతా చేయడానికి ముందు జులీజా బాయ్ ఫ్రెండ్ ఇంటర్నెట్‌లో కృత్రిమ హస్తాల కోసం వెతికారని బీమా సంస్థల తరఫు న్యాయవాదులు ఆరోపించి, అందుకు ఆధారాలు సమర్పించారు.

ఒక ‘వృత్తాకార రంపం’తో చేయి కోసుకున్నట్లు న్యాయవాదులు చెప్పారు.

దాంతో జులీజా, ఆమె బాయ్ ఫ్రెండ్ ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారని కోర్టు నమ్మింది.

ఈ కేసులో జులీజా బాయ్ ఫ్రెండ్ తండ్రికీ శిక్ష పడింది.

కాగా విచారణ సమయంలో జులీజా మాత్రం ఇదంతా కావాలని చేసినట్లు అంగీకరించలేదు.

ఒకవేళ వారు అనుకున్నట్లే జరిగి బీమా డబ్బు వస్తే ఒకేసారి 5 లక్షల యూరోలు ఏకమొత్తంగా అందడంతో పాటు మిగతా పరిహారం డబ్బు వారికి నెలనెలా అందేది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)