ఆంధ్రప్రదేశ్: నరసాపురం దగ్గర కిలోమీటరు ముందుకొచ్చి ఊళ్లను మింగేసిన సముద్రం, మళ్లీ వెనక్కి ఎందుకు వెళ్తోంది

ఫొటో సోర్స్, BBC/Sankar.V
- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుదీర్ఘ సముద్రతీరం ఉండడాన్ని అందరూ ఒక అవకాశంగా భావిస్తారు. కానీ బంగాళాఖాతంలో పరిణామాలు కొన్ని ప్రాంతాలను కలవరపరుస్తున్నాయి.
అనూహ్యంగా ఎగిసిపడే కెరటాలతో కొన్ని గ్రామాలకు గ్రామాలే సముద్రంలో కలిసిపోతున్నాయి. మరొకొన్ని చోట్ల అనూహ్యంగా సముద్రం వెనక్కి పోతూ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
వాటన్నింటికీ సాంకేతిక, పర్యావరణ కారణాలున్నాయని నిపుణులు భావిస్తుంటే, అంతుపట్టని సముద్రం తీరుతో తీర ప్రాంతంలో ఉన్నవారు తల్లడిల్లిపోతున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా రెవెన్యూ డివిజన్ కేంద్రం నరసాపురానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న చినమైనవానిలంకలో మూడు వేల జనాభా ఉంటుంది.
ఈ గ్రామం ఒకప్పుడు సముద్రానికి ఆనుకుని ఉండేది. ఆ తర్వాత 2004 డిసెంబర్‌లో వచ్చిన సునామీతో ఈ గ్రామాన్ని పూర్తిగా ఖాళీ చేయాల్సి వచ్చింది.
కానీ, అప్పటి నివాసాలకు ఆనవాళ్ళుగా శిథిలమయిపోయిన తుఫాన్ షెల్టర్ ఇప్పటికీ కనిపిస్తోంది. 1990 ప్రాంతం నుంచి ఈ తీరం కోతకు గురవుతూ 2004 నాటికి సముద్రం ఈ తుఫాన్ షెల్టర్ సమీపానికి వచ్చేసింది.
కానీ, గత ఏడెనిమిదేళ్లుగా సముద్రం మళ్లీ క్రమంగా వెనక్కి వెళ్తోంది. ఒకప్పుడు ఊరు ఉన్న ప్రాంతమంతా ఇప్పుడు ఇసుక కనిపిస్తోంది. తుఫాన్ షెల్టర్ నుంచి సముద్రం ఇప్పుడు 200 మీటర్ల వరకూ వెనక్కి మళ్లింది.

ముందుకూ, వెనక్కూ వెళ్తున్న సముద్రం
సముద్రం కొన్ని సార్లు ముందుకొస్తోంది. ఎక్కువగా తుపాన్ల సమయంలో ఈ పరిస్థితి ఉంటోంది. తుఫాన్ షెల్టర్‌ని దాటేసి కూడా సముద్రం వచ్చేస్తుంటుంది.
కానీ, మిగతా సాధారణ రోజుల్లో చాలా వెనక్కి వెళ్తోంది. ఆ సమయంలో అంతకు ముందు సముద్రం ఉన్న ప్రాంతం విశాలమైన బీచ్‌లా కనిపిస్తోంది.
ఒకప్పుడు చినమైనవాని లంకతో పాటుగా సమీపంలోనే బియ్యపు తిప్ప ఉండేది. ఇప్పుడు ఈ ఊళ్లు ఖాళీ చేసి అందరూ దూరంగా వెళ్లిపోయారు.
కానీ, అప్పుడు ఊళ్లున్న ప్రాంతం మాత్రం సముద్రం ఆటుపోట్లతో ఒక్కోసారి ఖాళీగా, ఇంకొన్ని సార్లు సముద్రపు నీటితో నిండిపోతోంది అని స్థానికుడు మైల గంగరాజు చెబుతున్నారు.
గంగరాజు కూడా 2004కి పూర్వం చినమైనవానిలంకలోనే సముద్రపు తీరంలో ఉన్న ఇంట్లో నివాసం ఉండేవారు. ఆ తర్వాత ఆయన ఆ ఇల్లు ఖాళీ చేసి రెండు కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇల్లు కట్టుకుని నివసిస్తున్నారు.
నిత్యం చేపలవేట మీద ఆధారపడి జీవించే గంగరాజు అంత దూరం నుంచి వచ్చి సముద్రంలో వేటకు వెళ్ళడం కష్టంగా ఉందని చెబుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్తుంటామని, సముద్రం వేట కంటే ఏటిలో దొరికే చేపలు పట్టుకోవడంతోనే జీవితం గడిచిపోతోందని అన్నారు.
గంగరాజు కుటుంబంతోపాటూ సుమారు 800 కుటుంబాలు ఇక్కడ సముద్ర తీరాన్ని విడిచి దూరంగా వెళ్లాయి.

కిలోమీటరు ముందుకొచ్చేసింది...
ఇప్పుడు సముద్రం వెనక్కిపోవడంతో ఒకప్పుడు చేపలు అమ్ముకుని జీవించిన చిన అప్పియమ్మ ఆ ప్రాంతంలో మేకలు మేపుకుంటూ జీవిస్తున్నారు. సముద్రం వెనక్కి వెళ్లిన చోట సరుగుడు తోటలు వంటివి పెంచితే బాగుంటుందని బీబీసీతో అన్నారు.
"మా ఆయన చేపల వేటకు వెళ్లేవారు. మేము ఎండుచేపలు అమ్ముకునేవాళ్లం. మాకు తెలిసినప్పటికి సముద్రం నుంచి తుఫాన్ షెల్టర్ నుంచి కిలోమీటరు దూరంలో ఉండేది. మధ్యలో సరుగుడు తోటలు, ఆ తర్వాత ఊరు ఉండేవి. అవన్నీ పోయాయి. కొన్నాళ్లకు తుఫాన్ షెల్టర్‌లోకి కూడా సముద్రం నీళ్లు వచ్చేశాయి. ఇప్పుడు అది మళ్లీ వెనక్కి పోయింది. తుపాన్లు వచ్చినపుడు పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. పున్నమి, అమావస్యకి కూడా కొన్ని సార్లు కెరాటాలు బాగా ముందుకొస్తాయి" అంటారు చిన అప్పియమ్మ.

ఫొటో సోర్స్, FB
పెదమైనవానిలంకలోనూ అదే పరిస్థితి
సుమారు ఇరవై ముప్పై ఏళ్లకు చినమైనవానిలంక లాంటి గ్రామాలు పూర్తిగా సముద్రపు కోతకు గురయితే, ఇప్పుడు సమీపంలోనే ఉన్న పెదమైనవానిలంక ప్రజలు కూడా సముద్రపు తాకిడిని ఎదుర్కోవాల్సి వస్తోంది.
తుపాన్లు వచ్చినపుడు, వివిధ సందర్భాల్లో అలల తాకిడి మధ్యే ఈ గ్రామస్థులు జీవనం సాగిస్తున్నారు. కొన్ని సార్లు ఇళ్లల్లోకి కూడా నీళ్లు చేరడంతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.
వీధుల్లోకి చేరిన నీరు వెంటనే వెళ్లిపోయే అవకాశం లేకపోవడంతో ఊళ్లో నిత్యం నీళ్లలోనే బతకాల్సి వస్తోందని స్థానికురాలు మైలి గుడవళ్లమ్మ బీబీసీకి చెప్పారు.
"తుఫాన్లు, వర్షాలు వచ్చినప్పుడు ఏం చేయాలో తెలీడం లేదు. సముద్రం ఓవైపు, పర్ర మరోవైపు పొంగి వచ్చేస్తుంటాయి. ఎటు వెళ్లాలో తెలీడం లేదు. ఒకప్పుడంటే నరసాపురం తీసుకుపోయి పునరావాసం కల్పించేవారు. ఇప్పుడలా లేదు. వానొచ్చినా వరదొచ్చినా ఇక్కడే ఉంటున్నాం. మమ్మల్ని పూర్తిగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. బయటకెళ్తే వేట ఉండదు కాబట్టి ఇక్కడే గడిపేస్తున్నాం" అన్నారామె.

నిర్మలా సీతారామన్ దత్తత గ్రామాలు
సముద్ర తీరంలోని ఈ రెండు గ్రామాలనూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దత్తత తీసుకోవడం విశేషం. 2015లో ఆమె ఈ గ్రామాలను దత్తత తీసుకున్న తర్వాత రెండు సార్లు ఇక్కడ పర్యటించారు కూడా.
అత్తవారిది నరసాపురం ప్రాంతం కావడంతో ఆమె చినమైనవానిలంక, పెదమైనవానిలంక గ్రామాలను దత్తత తీసుకుని కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.
వీటిలో భాగంగా తాగునీటి సరఫరా కోసం పైప్ లైన్ల నిర్మాణం వంటివి జరిగాయి. అయితే గ్రామంలో వాటర్ ట్యాంక్ నిర్మించి, నీటిసరఫరా అంతరాయం లేకుండా జరిగేలా చూడాలని స్థానికుడు గంగరాజు బీబీసీతో అన్నారు.
గ్రామాలను దత్తత తీసుకున్న కేంద్ర మంత్రి ఇక్కడ సముద్రపు తీరం కోతకు గురవుతున్న సమస్య మీద దృష్టి పెట్టాలని, తీర ప్రాంతాన్ని పరిరక్షిస్తామని ఇచ్చిన హామీలు నెరవేర్చాలని స్థానిక సర్పంచ్ కోరారు.

ఏపీలో కొన్ని జిల్లాల్లో అలా..మరికొన్ని జిల్లాల్లో ఇలా
తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ, సహా వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే ముందుకొచ్చిన సముద్రం కోతకు గురిచేస్తోంది.
విశాఖ నగరంలోని ఆర్కే బీచ్ ప్రాంతంలో కూడా ఈ తాకిడి కనిపిస్తోంది. ఒక్క 20వ శతాబ్దంలోనే ఏపీలోని తీరప్రాంతంలో 9 చ.కి.మీ.ల మేర భూమి సముద్రం పాలైనట్లు ఖరగ్ పూర్ ఐఐటీ నిపుణులు నిర్వహించిన సర్వేలో తేలింది.
శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా తీరానికి మధ్యలోనే ఇలా ఎక్కువగా కోతకు గురవుతున్నట్టు ఆ బృందం తేల్చింది. దేశంలోని ముంబయి, కొచ్చిలో కూడా ఇలాగే సముద్ర తీరం కోతకు గురవుతున్నట్టు గుర్తించారు
రాష్ట్రంలో గుంటూరు జిల్లా నుంచి తమిళనాడు తీరం వరకూ చాలా చోట్ల సముద్రం వెనక్కి మళ్ళుతున్నట్టు కూడా ఈ ఐఐటీ నిపుణులు 2013లో చేసిన సర్వేలో స్పష్టమయ్యింది.
సగటున 3.7 మీటర్ల దూరం వెనక్కి జరగడంతో సముద్ర గర్భంలోని సుమారు 5 చ.కి.మీ.ల తీర ప్రాంతం బయటపడిందని అంచనా వేశారు.
అయితే ఇటీవల అంతర్వేది, నరసాపురం ప్రాంతాల్లో సముద్రం వెనక్కి జరుగుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దాంతో ఒకప్పుడు సముద్రంలో కలిసిపోయిన చినమైనవానిలంక తీరం మళ్లీ ఇసుక మేటలా కనిపిస్తోంది.
గోదావరి సముద్రంలో కలిసే ప్రాంతానికి అటు తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది ప్రాంతం, ఇటు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ప్రాంతం ఉంటాయి. ఇప్పుడీ రెండు ప్రాంతాల్లో సముద్రం వెనక్కి మళ్లినట్టు స్పష్టంగా కనిపిస్తోంది.

ఫొటో సోర్స్, fb
పర్యావరణ పరిరక్షణ అవసరం..
సముద్రం కొన్ని ప్రాంతాల్లో ముందుకు రావడం, మరికొన్ని ప్రాంతాల్లో వెనక్కి వెళ్లడానికి భూగర్భంలో జరుగుతున్న మార్పులే కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సముద్ర తీర కోతలను పర్యావరణ పరిరక్షణ ద్వారా నివారించవచ్చని చెబుతున్నారు.
భూగర్భ నిర్మాణంలోని పలకల కారణంగా సముద్రం కొన్ని చోట్ల ముందుకు, మరికొన్ని చోట్లా వెనక్కి వెళ్లినట్టు మార్పులు కనిపిస్తుంటాయని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ జియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ పీజే రత్నాకర్ తెలిపారు.
"భూగర్భంలో ఉన్నట్లే సముద్ర గర్భంలో కూడా పలకల నిర్మాణం ఉంటుంది. భూ అంతర్భాగంలో జరిగే మార్పులతో పలకల కదలిక ప్రభావం సముద్ర తీరం మీద పడుతుంది. అది కొన్ని చోట్ల ముందుకూ, మరికొన్ని చోట్ల వెనక్కి వెళ్లడానికి ప్రధాన కారణం అదే. సముద్ర తీరం కోతను అడ్డుకోడానికి పర్యావరణ పరిరక్షణే మార్గం. దానికి అనుగుణంగా తీరంలో చెట్లను పెంచాలి. మడ అడవులను పరిరక్షించాలి. వాతావరణంలో వేగంగా మార్పులు జరుగుతుండడం వల్ల కాలుష్య నివారణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే సముద్రపు ప్రభావాల నుంచి కాపాడుకోగలం" అని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- తనలాంటి మరో వ్యక్తిని చంపేసి.. తానే చనిపోయినట్లు నమ్మించి.. చివరికి పోలీసులకు దొరికిపోయారు
- వ్లాదిమిర్ పుతిన్: 'రహస్యంగా ప్రైవేట్ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేశా'
- రైతుల ఉద్యమం వాయిదాపడింది.. కానీ మోదీ ఇమేజ్ పెరిగిందా.. తగ్గిందా
- ఈ సినీ దర్శకుడు ఇస్లాం వదిలి హిందూ మతం స్వీకరించడానికి, బిపిన్ రావత్ మరణానికి సంబంధం ఏమిటి
- మనుషులు నడవడం ఎప్పుడు మొదలుపెట్టారు? ఎందుకు నడిచారు?
- ఆంధ్రప్రదేశ్ పరిస్థితి 'అప్పు చేసి పప్పుకూడు...'లా మారిందా? 11 ప్రశ్నలు - జవాబులు
- ఆంధ్రప్రదేశ్‌లో తొలి ఒమిక్రాన్ కేసు.. విశాఖపట్నంలో ఐసోలేషన్‌లో 30 మంది
- ఒక బాలిక యదార్థ గాధ: "నా చేతులు పట్టుకుని అసభ్యంగా... నేను వారికి అభ్యంతరం చెప్పలేక.."
- ‘రాత్రి 12 గంటలకు ‘బతికే ఉన్నావా’ అని మెసేజ్ పెట్టాను.. జవాబు రాలేదని ఫోన్ చేస్తే ఆయన స్నేహితులు ఎత్తారు’
- ‘నేను భారతీయ పైలట్‌నని తెలిసిన తరువాత కూడా ఆ పాకిస్తాన్ గ్రామస్థులు చికెన్‌తో భోజనం పెట్టారు’
- ఇంటర్నెట్ వాడుతున్న మీ పిల్లలు ఎంత ప్రమాదంలో ఉన్నారో తెలుసా
- వాతావరణ మార్పులను అరికట్టడానికి 7 మార్గాలు
- బంగ్లాదేశ సరిహద్దుల్లో ఉన్న త్రిపుర రాష్ట్రంలో ముస్లింలపై దాడులు.. కారణమేంటి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














