దిల్లీలో ప్రముఖులు నివసించే అక్బర్ రోడ్ పేరు మార్చేస్తారా, ఇంతకీ దేశ రాజధానిలో రహదారుల పేర్ల చరిత్ర ఏమిటి

ఇండియా గేట్ రోడ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, వివేక్ శుక్లా
    • హోదా, సీనియర్ జర్నలిస్ట్, బీబీసీ కోసం

దేశ రాజధాని నడిబొడ్డున లూటెన్స్ దిల్లీలో అత్యంత ప్రత్యేకమైన అక్బర్ రోడ్డులో ట్రాఫిక్ మామూలుగానే ఉంది. రోడ్డుకు రెండు వైపులా ఉన్న భవనాల్లో నివసించినవారికి, వచ్చిపోయేవారికి అక్కడున్న వేప, చింత, రావి చెట్లు సుదీర్ఘ కాలంగా సాక్షులుగా నిలిచాయి.

1931లో న్యూదిల్లీ ఆవిర్భవించిన తర్వాత అక్కడ జనాభా వృద్ధిని అవి చూశాయి. కానీ, ఇప్పుడు అక్కడి అక్బర్ రోడ్ పేరు మార్చాలనే డిమాండ్ మొదలైంది.

ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ పేరును అక్బర్ రోడ్‌కు పెట్టాలని వీరంతా కోరుతున్నారు.

మొఘల్ చక్రవర్తి అక్బర్ స్మారకంగా ఈ రహదారికి పెట్టిన పేరు మార్చాలనే డిమాండ్ ఎప్పుడూ ఉంది. అలా కోరుకుంటున్నవారు ఈ రోడ్‌లో ఉన్న సైన్ బోర్డ్ మీద నల్ల రంగు కూడా వేశారు.

అయితే, ఇప్పుడు అక్బర్ రోడ్ పేరు కూడా మార్చేస్తారా. మనం వేచిచూడాల్సి ఉంటుంది. కానీ, ఒకటి మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. ఈసారి రాజకీయ వాతావరణం అందుకు అనుకూలంగానే ఉంది. ఎందుకంటే జనరల్ రావత్ అకాల మరణంతో అక్బర్ రోడ్ కాస్తా, జనరల్ రావత్ రోడ్‌గా మారితే. బహుశా పెద్దగా వ్యతిరేక గళాలేవీ వినిపించకపోవచ్చు.

రాజధానిలో అక్బర్ రోడ్‌ను పవర్ రోడ్ అని కూడా అంటారు. దేశంలోని చాలా మంది ప్రముఖులు ఇక్కడే ఉంటూ వచ్చారు. ఇదే అక్బర్ రోడ్‌లోని 24 నంబర్ భవనం 1977 నుంచి కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంగా ఉంది.

ఇదే అక్బర్ రోడ్‌లో 20వ నంబర్‌ రెండతస్తుల భవనంలో 1952 నుంచి లోక్ సభ స్పీకర్లు ఉంటున్నారు. ఒక విధంగా ఇది లోక్‌సభ స్పీకర్‌కు రిజర్వ్ అయిన భవనం.

లోక్‌సభ మొదటి స్పీకర్ గణేష్ వాసుదేవ్ మావ్లంకర్ నుంచి ప్రస్తుత స్పీకర్ ఓం బిర్లా వరకూ అందరికీ ఇదే అధికారిక ప్రభుత్వ నివాసం.

అక్బర్ రోడ్

ఫొటో సోర్స్, Getty Images

మొట్టమొదట ఏ రోడ్ పేరు మారింది

అక్బర్ రోడ్ నుంచి కాస్త బయటకు వచ్చి రాజధానిలోని రహదారుల పేర్లు మారిన పరంపరను గమనిస్తే.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొట్టమొదట అల్‌బుకర్క్ రోడ్డు పేరును మార్చారు.

మహాత్మాగాంధీ తన జీవితపు చివరి 144 రోజులు అల్‌బుకర్క్ రోడ్‌లోని బిర్లా హౌస్‌లో గడిపారు. ఆయన హత్యకు గురైన వెంటనే ఈ రహదారి పేరును ‘30 జనవరి మార్గ్‌’గా మార్చేశారు.

ఇక్కడ మనం అల్ఫాన్సో అల్‌బుకర్క్(1453-1515) గోవా గవర్నర్‌గా ఉండేవారనే విషయం చెప్పుకోవాలి. ఆయన పేరునే ఈ రహదారికి పెట్టారు. పోర్చుగల్‌లో పుట్టిన అల్‌బుకర్క్ గోవాలో మరణించారు.

బ్రిటిష్ ప్రభుత్వం న్యూదిల్లీలోని కొన్ని రహదారులకు కొంతమంది ఆంగ్లేయతరులు, భారతీయేతరుల పేర్లు పెట్టింది.

అల్‌బుకర్క్ రోడ్ పేరు మార్చడంతోపాటూ నగరంలోని ‘క్వీన్స్ వే రోడ్’ జనపథ్‌గా మారింది. ‘కింగ్స్ వే రోడ్’ పేరు రాజ్‌పథ్ అయింది. ఆ తర్వాత ఈ రహదారుల పేర్లు మార్చే వరుస మొదలైంది.. అది అలా కొనసాగుతూనే వచ్చింది.

పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ 1946 సెప్టెంబర్ 2న దేశంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమయంలో ఆయనకు ‘17 యార్క్ రోడ్’ భవనాన్ని కేటాయించారు.

అయితే నెహ్రూను, తీన్ మూర్తి భవన్‌ను ఒకటిగా చూస్తారు. అది నిజమే. ఆయన దిల్లీలో తీన్ మూర్తి భవన్‌లోనే ఉండేవారు. నెహ్రూ దిల్లీలో మొదట యార్క్ రోడ్‌లో ఉండేవారనేది నిజం కాదు. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో నెహ్రూ ఎప్పుడు దిల్లీ వచ్చినా తన మిత్రుల ఇళ్లలోనే ఉండేవారు. కానీ యార్క్ రోడ్ ఆ తర్వాత మోతీలాల్ నెహ్రూ మార్గ్ అయింది.

పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కూడా ఉండేవారు. ఆయన అప్పట్లో ‘క్వీన్స్ విక్టోరియా రోడ్‌’లోని భవనంలో ఉండేవారు. దాంతో, ఆ రహదారిని రాజేంద్ర ప్రసాద్ రోడ్‌గా మార్చేశారు. అక్కడ 1960లో శాస్త్రి భవన్ నిర్మించారు.

సెంట్రల్ విస్టాకు కొత్త స్వరూపం ఇచ్చే క్రమంలో ఇప్పుడ దానిపై కూడా ప్రభావం పడతుందేమోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భారత మొదటి ఉప ప్రధాని సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ రాజధానిలోని ‘18 ఔరంగజేబు రోడ్‌’లో ఒక ప్రైవేటు భవనంలో ఉండేవారు. కానీ ఈ రోడ్డుకు ఆయన పేరు పెట్టలేదు.

దిల్లీ ఎర్రకోట

ఫొటో సోర్స్, Getty Images

రాజధానిని డిజైన్ చేసింది లూటెన్

అయితే ‘ఔరంగజేబు రోడ్’ పేరును సర్దార్ పటేల్ రోడ్‌గా మార్చాలని వివిధ స్థాయిల్లో డిమాండ్లు వస్తూనే వచ్చాయి. 2015లో దీనిని ఏపీజే అబ్దుల్ కలామ్ రోడ్డుగా పేరు మార్చారు. అయితే కిచ్‌నర్ రోడ్డు సర్దార్ పటేల్ రోడ్డుగా మారిపోయింది.

జనరల్ బిపిన్ రావత్ ఇండియన్ ఆర్మీ చీఫ్ హోదాలో 4 రాజాజీ మార్గ్(మొదట్లో కింగ్ జార్జ్ ఎవెన్యూ) ఆర్మీ హౌస్‌లో ఉన్నారు. ఇందులో భారత సైన్యాధ్యక్షులు ఉండేవారు. జనరల్ శామ్ మానెక్‌షా, జనరల్ కరియప్ప, జనరల్ సుందర్‌జీ లాంటి ఆర్మీ చీఫ్‌లు ఇక్కడే నివసించారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఇండియన్ ఆర్మీ చీఫ్‌లు ఇక్కడే ఉంటూ వచ్చారు. న్యూ దిల్లీలో ఎన్నో అద్భుత భవనాలు డిజైన్ చేసిన ఎడ్విన్ లూటెన్ పేరుమీద ఇక్కడ ఎలాంటి రహదారులూ లేవు. లూటెన్ 10 రాజాజీ మార్గ్‌లోని భవనంలో ఉండేవారు.

రాష్ట్రపతి భవన్, దిల్లీ జింఖానా క్లబ్, గోల్ డాక్‌ఖానా లాంటి భవనాలను డిజైన్ చేసిన న్యూ దిల్లీ చీఫ్ ఆర్కిటెక్ట్ లూటెన్ రాజాజీ మార్గ్‌లో ఉంటూనే, అక్కడ మొత్తం భవనాలను నిర్మించే పనులను పర్యవేక్షించేవారు.

దేశ మొట్టమొదటి విద్యా మంత్రి మౌలానా ఆజాద్ ‘4 కింగ్ ఎడ్వర్డ్ రోడ్‌’లోని ఒక భవనంలో ఉండేవారు. ఆయన 1947 నుంచి 1958 ఫిబ్రవరి 22న తుదిశ్వాస విడిచేవరకూ అక్కడే నివసించారు. అదే భవనం నుంచి ఆయన శవయాత్ర జరిగింది.

ఆయన మరణం తర్వాత కింగ్ ఎడ్వర్డ్ రోడ్ పేరును మౌలానా ఆజాద్ రోడ్‌గా మార్చేశారు. తర్వాత ఇక్కడ 1956లో విజ్ఞాన్ భవన్ నిర్మించారు. ఇప్పుడు దానిని కూడా కూల్చేస్తారని భావిస్తున్నారు.

కనాట్ ప్లేస్

ఫొటో సోర్స్, Getty Images

రహదారుల పేర్లు, వాటి వెనుక కథ

దిల్లీలో మొఘల్ చక్రవర్తులు, ఆంగ్లేయుల పేరిట ఉన్న ఏ రహదారుల పేర్లు మారుస్తున్నారో, లేదా మార్చాలనే డిమాండ్లు తీసుకొస్తున్నారో వాటిలో జలియన్‌వాలాబాగ్ మారణకాండకు కారణమైన ఒక పేరు కూడా ఉంది. ఆ విషాద ఘటనలో ఇద్దరు విలన్లు ఉన్నారు.

వీరిలో ఒకరు జనరల్ డయ్యర్. నిరాయుధులపై బుల్లెట్ల వర్షం కురిపించాలని ఆదేశించింది ఆయనే.

ఇంకొకరు.. అప్పటి బ్రిటన్‌కు భారత్‌లో వైస్రాయ్‌గా ఉన్న లార్డ్ చెమ్స్‌ఫోర్డ్. ఈ మారణకాండకు ఆయన ఎప్పుడూ ఎలాంటి విచారం వ్యక్తం చేయలేదు. కానీ ఆయన పేరిట దిల్లీలో చెమ్స్‌ఫోర్డ్ రోడ్ ఉంది.

ఇది న్యూ దిల్లీ రైల్వే స్టేషన్ నుంచి కనాట్ ప్లేస్‌ వరకూ కలుపుతుంది. చెమ్స్‌ఫోర్డ్ 1916 నుంచి 1921 వరకూ భారత వైస్రాయ్‌గా ఉన్నారు.

ఓబెరాయ్ ఇంటర్‌‌కాంటినెంటల్ హోటల్‌కు సరిగ్గా ముందున్న రోడ్ పేరు యథాలాపంగా జాకీర్ హుస్సేన్ రోడ్‌గా మారలేదు. దాని వెనుక కూడా ఒక కథ ఉంది.

నిజానికి భారత మూడో రాష్ట్రపతి డాక్టర్ జాకీర్ హుస్సేన్ 1969 మే 3న మరణించిన తర్వాత ఆయన శవయాత్ర రాష్ట్రపతి భవన్ నుంచి జామియా మిలియా ఇస్లామియా వైపు వెళ్లింది. అది ఆ దారిలో పాత వెస్లీ రోడ్ నుంచి కూడా వెళ్లింది. దాంతో ఆ రహదారి పేరు 1970లో డాక్టర్ జాకీర్ హుసేన్ రోడ్‌గా పెట్టారు.

మరోవైపు ఇండియా గేట్‌ను కనాట్ ప్లేస్‌తో కలిపే కస్తూర్బా గాంధీ మార్గ్‌.. 1960వ దశకం చివరి వరకూ లార్డ్ కర్జన్ పేరున కర్జన్ రోడ్డుగా ఉండేది.

దానికి పక్కనే ఉండేదే టాల్‌స్టాయ్ మార్క్. ఇది కిలోమీటర్ కంటే కాస్త తక్కువ దూరం ఉండే రహదారి. టాల్‌స్టాయ్ రోడ్ మొదటి పేరు సర్ హేగ్ కిలింగ్ రోడ్. న్యూదిల్లీ నిర్మాణ సమయంలో కిలింగ్ చీఫ్ ఇంజనీర్‌గా ఉన్నారు. ఆయన ఎడ్విన్ లూటెన్‌ సహచరుడు. అయితే, 1968 సమయంలో ఆ రహదారికి 'వార్ అండ్ పీస్' అనే ఒక క్లాసిక్ నవల పేరు పెట్టారు.

దిల్లీ రోడ్లు

ఫొటో సోర్స్, Getty Images

నిజానికి రాజధానిలో 1970వ దశకం మధ్యలో, 1980వ దశకంలో ఎన్నో రోడ్ల పేర్లను మారుస్తూ వచ్చారు. రాజధానిలో నివసించిన పాతవారిని కారన్‌వాలీస్ రోడ్ అని ఒక రహదారి ఉండడం గుర్తుంటుంది. అది న్యూదిల్లీలోని ఒక ముఖ్యమైన రహదారి.

ఆ రహదారి ఇప్పటికీ ఉంది. కానీ, దీని పేరు మార్చి తమిళ కవి, స్వాతంత్ర్య సమరయోధుడు సుబ్రమణ్య భారతి పేరు పెట్టారు.

లూటెన్స్ దిల్లీ మొత్తం ప్రత్యేకమే అయినా, రాజధానిలో అమృతా షేర్‌గిల్ మార్గ్ మాత్రం ఒక అద్భుతం. ఇక్కడ నేరేడు, రేల చెట్లు నిండిన అమృతా షేర్‌గిల్ రోడ్‌‌ ప్రాంతాన్ని దక్షిణాసియాలోనే అత్యుత్తమ నివాస ప్రాంతంగా భావిస్తారు.

ఈ రోడ్లో వెళ్తుంటే ట్రాఫిక్ రణగొణ ధ్వనులకు బదులు, మనకు పక్షుల కిలకిలలు వినిపిస్తాయి. కానీ, చిత్రకారిణి అయిన అమృతా షేర్‌గిల్ ఆ ప్రాంతానికి ఎప్పుడూ వెళ్లలేదు. కానీ రెటన్‌డన్ రోడ్ అమృతా షేర్‌గిల్ మార్గ్ అయిపోయింది.

మండీ హౌస్ దగ్గరున్న లిటన్ రోడ్ కూడా కోపర్నికస్ మార్గ్ అయిపోయింది. దానికి దగ్గరగా పటౌడీ హౌస్ ఉంటుంది. దానికి దగ్గరగా ఉండే కానింగ్ రోడ్ 2001లో మాధవరావ్ సింధియా విమాన దుర్ఘటనలో చనిపోయిన తర్వాత శ్రీమంత్ మాధవరావ్ మార్గ్‌గా మారిపోయింది.

రాష్ట్రపతి భవన్‌కు కొద్ది దూరంలో ఉండే డల్హౌసీ రోడ్.. 2017లో దారా షికోహ్ రోడ్‌గా మారింది. 2016 సెప్టెంబర్ 21న రేస్‌కోర్స్ రోడ్ పేరును మార్చి లోక్ కల్యాణ్ మార్గ్ అని పెట్టారు. ఇక్కడ దేశ ప్రధానమంత్రి నివాసం ఉంటారు.

పాకిస్తాన్ మీద 1971 యుద్ధంలో సాధించిన విజయానికి 50 ఏళ్లయిన సందర్భంగా డిసెంబర్ 16న భారత్‌లో వేడుకలు నిర్వహించారు.

ఈ యుద్ధంలో గెలిచిన తర్వాత భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు బలోపేతం అవుతూ వచ్చాయి. ఫలితంగానే బంగ్లాదేశ్ బంగబంధు షేక్ ముజీబుర్ రహమాన్ పేరుతో రాజధాని దిల్లీలోని పార్క్ స్ట్రీట్ పేరును భారత్ షేక్ ముజీబుర్ రహమాన్ రోడ్‌గా మార్చింది. ఆయన బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా తండ్రి.

ఇండియా గేట్ రోడ్

ఫొటో సోర్స్, Getty Images

రహదారుల పేర్లు ఎవరు, ఎలా మారుస్తారు

మనం మాట్లాడుకునేది న్యూ దిల్లీ అయినా లేక లూటెన్స్ దిల్లీ అయినా.. ఇక్కడ ఒక రహదారి లేదా ప్రాంతం పేరు కొత్తగా మార్చాలంటే, ఆ ప్రతిపాదనలను విదేశాంగ శాఖ, ఎన్జీఓ, స్థానిక ప్రజలు లాంటి వారు న్యూదిల్లీ మునిసిపల్ కార్పొరేషన్‌(ఎన్డీఎంసీ)కు పంపించాల్సి ఉంటుంది.

ఒకసారి ప్రతిపాదనలు అందిన తర్వాత ఎన్‌డీఎంసీ వాటిని తమ జనరల్ విభాగానికి పరిశీలన కోసం పంపిస్తుంది. ఆ తర్వాత ఎన్డీఎంసీకి చెందిన 13 మంది సభ్యుల పేర్లు మార్చే కమిటీ దానిని పరిశీలిస్తుంది.

ఒక ప్రతిపాదనను ఆమోదించినట్లయితే దానికి సంబంధించిన సమాచారాన్ని దిల్లీ పోస్ట్ మాస్టర్ జనరల్‌కు పంపుతారని ఎండీఎంసీ మాజీ సమాచార డైరెక్టర్ మదన్ తప్లియాల్ చెప్పారు.

ఒక రహదారి లేదా ప్రాంతానికి పేరు మార్చడానికి సంబంధించి హోం మంత్రిత్వ శాఖ నుంటి స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. వాటిని కచ్చితంగా అనుసరించాలి.

ఉదాహరణకు ఒక రహదారి లేదా ప్రాంతానికి కొత్త పేరు మార్చేటపుడు, స్థానిక ప్రజల మనోభావాలను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. మరో విషయం ఏంటంటే ఈ కొత్త పేరు పెట్టడం వల్ల ప్రజలు ఎలాంటి గందరగోళానికి గురికాకుండా కూడా చూసుకోవాలి.

(అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)

వీడియో క్యాప్షన్, సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై కేసులెందుకు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)