దిల్లీలో గల్లీ గల్లీకో వైన్ షాప్

- రచయిత, సల్మాన్ రావి
- హోదా, బీబీసీ ప్రతినిధి
దిల్లీలో బుధవారం నుంచి కొత్త ఎక్సైజ్ విధానం అమలులోకి రానుంది. ప్రభుత్వ కాంట్రాక్టులు ముగియనుండటంతో, ఇకపై మద్యం వ్యాపారం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లనుంది. దేశ రాజధానిలో ఇకపై తొమ్మిది లక్షల లీటర్ల మద్యం అందుబాటులోకి రానుంది.
కొత్తగా ప్రారంభించబోయే మద్యం షాపులకు అవసరమయ్యేంత స్టాక్ తమ వద్ద ఉందని లైసెన్సులు పొందిన పది మంది హోల్‌సేల్ వ్యాపారస్థులు ప్రభుత్వానికి తెలిపారు.
ప్రస్తుతం 430 దుకాణాలను వేలంవేసి, ప్రైవేట్ వ్యక్తులకు లైసెన్సులు ఇచ్చినట్లు ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఈ ప్రక్రియ ద్వారా ఢిల్లీ ప్రభుత్వానికి రూ.8,911 కోట్ల ఆదాయం సమకూరింది.
మద్యం దుకాణాల వేలం ద్వారా రూ.10 వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవడాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తెలిపారు. అదనంగా మరో 400 దుకాణాల వేలం ప్రక్రియను కూడా ప్రభుత్వం త్వరలో ప్రారంభించనుందన్నారు.
తద్వారా దిల్లీలోని ప్రతి మూలలో మద్యం అందుబాటులోకి రానుంది.
దిల్లీలో మొత్తం 850 మద్యం దుకాణాలు ఉన్నాయని, వాటిలో 260 ప్రైవేట్‌గా నడుస్తుండగా, మిగిలిన షాపులను ప్రభుత్వం నిర్వహించేదని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి.
మంగళవారంతో ఈ ప్రభుత్వ, ప్రైవేట్ షాపులన్నీ మూతపడనున్నాయి. నూతన ఎక్సైజ్ విధానంతో మద్యం విక్రయాలు ప్రైవేట్ వ్యక్తులే నిర్వహించనున్నారు. ఇకపై ప్రభుత్వం మద్యం షాపులను నిర్వహించదు.

ఫొటో సోర్స్, Getty Images
లిక్కర్ షాపింగ్ ఎలా ఉండబోతోంది?
దిల్లీ ప్రభుత్వం ఈ ఏడాది జూన్‌లో కొత్త ఎక్సైజ్ పాలసీని ప్రకటించింది. దీని ప్రకారం, మాల్‌లో ప్రజలు వస్తువులను కొనుగోలు చేసినంత సులువుగా ఇకపై మద్యం కొనుగోలు చేయవచ్చు.
ఇప్పటి వరకు మద్యం దుకాణాల్లో గ్రిల్స్ వెనుక నుంచి మద్యం అమ్మేవారు. ఈ దుకాణాల వద్ద తోసుకుంటూ అతికష్టమ్మీద మద్యం కొనుగోలు చేసేవారు.
అయితే, ఇప్పుడు మద్యం ప్రియులు షాపులకు వెళ్లి హాయిగా తమకు ఇష్టమైన బ్రాండ్‌ను కొనుగోలు చేసుకోవచ్చు.
ఎక్సైజ్ పాలసీలోనూ ఇందుకు సంబంధించిన నిబంధనలను పొందుపరిచారు. ఉదాహరణకు, మద్యం దుకాణాల నిర్వహణకు ఎక్కువ స్థలం అవసరం. సాధారణ దుకాణాలకు 500 చదరపు మీటర్ల విస్తీర్ణం, 'సూపర్ ప్రీమియం రిటైల్ స్టోర్స్'కి 2500 చదరపు మీటర్ల స్థలాన్ని తప్పనిసరి చేశారు.
'సూపర్ ప్రీమియం రిటైల్ స్టోర్' నుండి మద్యం కొనుగోలు చేసే ముందు వివిధ బ్రాండ్‌లను పరీక్షించే సదుపాయం కూడా ఉంటుంది.
అన్ని మద్యం దుకాణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. అన్ని బ్రాండ్లను డిస్‌ప్లేలో ఉంచనున్నారు.
ఢిల్లీని 32 జోన్లుగా విభజించి లైసెన్సుల కేటాయింపు ప్రక్రియ పూర్తి చేశారు. కొత్త ఎక్సైజ్ విధానాన్ని అనుసరించి త్వరలో అనేక కొత్త మద్యం దుకాణాలను తెరవనున్నారు.

కోర్టు ఆమోదం
కొత్త ఎక్సైజ్ విధానాన్ని రతన్ లాల్ అనే వ్యక్తి హైకోర్టులో సవాల్ చేశారు. అయితే జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ జ్యోతి సింగ్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఆయన పిటిషన్‌ను కొట్టివేసింది. కొత్త లిక్కర్ విధానాన్ని రూపొందించడం లేదా పాత విధానాన్ని సవరించడం ప్రభుత్వ అధికార పరిధిలోని అంశం అని పేర్కొంది.
ఇంతకుముందు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచిన దుకాణాల విషయానికొస్తే.. అందులో పనిచేసేవారు కాంట్రాక్ట్ లేదా ప్రభుత్వ ఉద్యోగులు. వీరి ఉద్యోగం విషయంలో ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇక కొత్త ఎక్సైజ్ పాలసీ కారణంగా మూతపడుతున్న ప్రైవేట్ మద్యం దుకాణాల్లో దాదాపు 3000 మంది పనిచేసేవారు. ఈ ప్రైవేట్ ఉద్యోగుల ఉపాధి ప్రశ్నర్థకంగా మారనుందని 'దిల్లీ లిక్కర్ ట్రేడర్స్ అసోసియేషన్' అధ్యక్షులు నరేష్ గోయల్ తెలిపారు.
అయితే, మాల్స్‌లోని ప్రైవేట్ మద్యం దుకాణాలు మూసివేస్తామని, తాజాగా లైసెన్స్ పొందిన వెంటనే అవి కూడా తిరిగి తెరుచుకుంటాయని ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ ముందు ఢిల్లీ ప్రభుత్వ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ పేర్కొన్నారు.
దిల్లీలో అక్టోబర్ 1 నుంచి ప్రైవేట్ మద్యం షాపులన్నీ మూతపడటంతో మద్యం ప్రియులు ఇన్ని రోజులు ఓపిక పట్టాల్సి వచ్చింది.

ఫొటో సోర్స్, EPA
నిరసనలు, ఆందోళనలు
ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఎక్సైజ్ విధానంపై వ్యతిరేకత కూడా మొదలైంది. సోమవారం స్వరాజ్ ఇండియా పార్టీ కార్యకర్తలు రాజ్‌ఘాట్ వద్ద ధర్నా చేశారు. అనంతరం ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లి తమ నిరసనను తెలిపారు.
స్వరాజ్ ఇండియా పార్టీ దిల్లీ రాష్ట్ర అధ్యక్షుడు నవనీత్ తివారీ మాట్లాడుతూ, రాజ్యాంగంలోని ఆర్టికల్ 47ను ఉటంకిస్తూ, "రాష్ట్ర ప్రభుత్వం మద్య పానీయాల వినియోగాన్ని నిషేధించడానికి ప్రయత్నించాలి" అనే నిబంధనకు అనుగుణంగా నడుచుకోవాలని పేర్కొన్నారు.
దిల్లీలో మొత్తం 272 వార్డులు ఉంటే, కొత్త ఎక్సైజ్ పాలసీ అమల్లోకి వచ్చాక ఒక్కో వార్డుకు మూడు మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయని తివారీ చెప్పారు.
''మొత్తం 849 మద్యం దుకాణాలను ప్రైవేట్ వ్యక్తులు ప్రారంభించనున్నారని ఆయన చెప్పారు. అంటే, దిల్లీలోని దాదాపు ప్రతి వీధిలో మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయి'' అని తివారీ పేర్కొన్నారు.
''దిల్లీలో ఒకవైపు మద్యపానానికి వయో పరిమితిని తగ్గించి, మరోవైపు కొన్ని చోట్లు 24 గంటల పాటు మద్యం విక్రయాలు జరిగేలా నిబంధనలు తీసుకురావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నిర్ణయాలతో యువతపై చెడు ప్రభావం ఎక్కువగా పడే అవకాశం ఉంది" అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఫిల్మీమోజీ: మారుమూల పట్నం కుర్రకారు కోట్లాది హిట్లు ఎలా కొట్టేస్తున్నారు..
- అంతరిక్షంలో శాటిలైట్‌ను పేల్చేసిన రష్యా.. కాప్స్యూల్స్లోకి వెళ్లి దాక్కున్న స్పేస్ స్టేషన్ సిబ్బంది
- ప్రధాన మంత్రి తండ్రి ‘పిరుదులపై గట్టిగా కొట్టారు.. నీ సీటు లవ్లీగా ఉంది’ అన్నారు - మహిళా ఎంపీ ఆరోపణ
- భారత్‌తో విభేదాలు కోరుకోవడం లేదు - బీబీసీ ఇంటర్వ్యూలో తాలిబాన్ విదేశాంగ మంత్రి
- ఇంటర్నెట్ వాడుతున్న మీ పిల్లలు ఎంత ప్రమాదంలో ఉన్నారో తెలుసా
- డేవిడ్ బ్యూక్: ‘లక్షల కోట్ల కంపెనీకి ఆద్యుడు.. చేతిలో చిల్లిగవ్వ లేకుండా చనిపోయాడు’
- మానేరు చెక్ డ్యామ్ విషాదం: ఒకరిది ఈరోజు పుట్టిన రోజు, ఇంకొకరు లేక లేక పుట్టారు.. విషాదంలో తల్లిదండ్రులు
- 'జై భీమ్': ఈ నినాదం ఎలా పుట్టింది, మొట్టమొదట వాడింది ఎవరు
- IPLలో కెప్టెన్‌గా తప్పించారు, జట్టు నుంచి తీసేశారు, మైదానంలోకీ దిగలేదు.. తన దేశానికి వరల్డ్ కప్ అందించాడు
- సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీకాలం పొడిగించాలన్న ప్రధాని మోదీ నిర్ణయంపై వివాదం ఎందుకు
- హార్దిక్ పాండ్య: రూ. 5 కోట్లు కాదు ఆ వాచీల ధర రూ. 1.5 కోట్లే
- ‘పుష్ప’ ఐటెం సాంగ్‌లో సమంత
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








