ఆల్కహాల్: మద్యం తాగితే మనిషి శరీరంలో ఏం జరుగుతుంది... హ్యాంగోవర్ దిగడానికి పారాసెటమాల్ మంచిదేనా?

హ్యాంగోవర్ సమస్య రాకుండా ఉండాలంటే మద్యం తీసుకోకపోవడం మంచి ఆప్షన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హ్యాంగోవర్ సమస్య రాకుండా ఉండాలంటే మద్యం తీసుకోకపోవడం మంచి ఆప్షన్
    • రచయిత, ఫ్రాన్సిస్కో జేవియర్ ఒటెరో ఎస్పినార్
    • హోదా, ది కన్వర్‌జేషన్

రాత్రిపూట ఎక్కువగా విందూ వినోదాలలో పాల్గొనే వారికి హ్యాంగోవర్ అనేది తరచుగా ఎదురయ్యే సమస్య. అయితే, ఆల్కాహాల్ తీసుకున్న ప్రతి ఒక్కరికీ ఈ సమస్య రాదు. వచ్చినా ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా ఉంటుంది.

హ్యాంగోవర్‌కు ఎవరు ఏ స్థాయిలో ఇబ్బంది పడుతున్నారన్నది దాని తీవ్రత మీద కూడా ఆధారపడి ఉంటుంది.

ఆల్కాహల్ తీసుకోవడం వల్ల హ్యాంగోవర్ కలుగుతుందని తెలిసినప్పటికీ, దానికి నిర్దిష్టమైన కారణమేంటో ఇప్పటికీ స్పష్టంగా తెలియదు.

హ్యాంగోవర్ ఎందుకు ఏర్పడుతుంది?

ఈ విషయంపై ఇప్పటి వరకు జరిగిన పరిశోధనలను పరిశీలించినప్పుడు హ్యాంగోవర్ లక్షణాలకు వివిధ కారణాలు కనిపించాయి. వీటిలో మొదటిది నిర్జలీకరణం అంటే డీ హైడ్రేషన్.

శరీరంలో సహజంగా ఏర్పడే రసాయన పదార్థాల సాంద్రత (కాన్సంట్రేషన్)ను ఆల్కాహాల్ తగ్గిస్తుంది. ఎక్కువ మొత్తంలో మద్యం తీసుకోవడం వల్ల ఇది ఏర్పడుతుంది. ఇలా తీసుకోవడం వల్ల రక్తంలో ఇథనాల్, దాని డీకంపోజిషన్ ఉత్పత్తుల సాంద్రత పెరుగుతుంది.

అయితే, ఈ హ్యాంగోవర్ ఈ మార్పుల కారణంగానే ఏర్పడిందా అన్న మాత్రం స్పష్టం కాలేదు. దీని మీద ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి.

ఈ అసౌకర్యాన్ని కొందరు పరిశోధకులు వ్యాధి నిరోధకతతో ముడి పెట్టారు. మద్యం తీసుకున్నప్పుడు నొప్పి, మంటకు సంబంధించిన కొన్ని పదార్ధాలు విడుదలవుతాయని, దీనివల్ల హ్యాంగోవర్ వంటి అసౌకర్యం ఏర్పడుతుందని భావించారు.

సరే, హ్యాంగోవర్‌కు కారణాలను పరిశోధకులకు వదిలేద్దాం. మరి దీన్ని అడ్డుకోవడానికి లేదా తగ్గించడానికి ఎలాంటి మార్గాలున్నాయో పరిశీలిద్దాం.

దీనికన్నా ముందు మన శరీరంలో మద్యం ఏమేం చేస్తుందో అర్ధం చేసుకోవాలి.

రాత్రి తీసుకున్న ఆల్కహాల్ ప్రభావం ఉదయం లేచిన తర్వాత కనిపిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రాత్రి తీసుకున్న ఆల్కహాల్ ప్రభావం ఉదయం లేచిన తర్వాత కనిపిస్తుంది.

ఆల్కహాల్ శరీరంలోకి ఎలా వెళుతుంది?

ఆల్కహాల్ తీసుకున్నప్పుడు దానిలోని ఇథనాల్ ఆహార నాళం (gastrointestinal tract )లోకి వేగంగా చేరుతుంది. తరువాత కాలేయానికి చేరుకుంటుంది. ఆల్కహాల్ డీహైడ్రోజినీస్ (ఏడీహెచ్) అనే ఎంజైమ్‌ల ద్వారా జీవక్రియలను నిర్వహించడంలో కాలేయం కీలకమైంది.

మద్యం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎంజైమ్ యాక్టివిటీ పెరిగి కాలేయం మీద తీవ్ర ప్రభావం పడుతుంది. ఇథనాల్ జీవక్రియలు అధికం కావడం వల్ల కాలేయంలోని కణాలు దెబ్బతింటాయి.

వీటివల్ల పొట్టలో మంట ఏర్పడవచ్చు. అది ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డెవలప్ కావడానికి దారితీస్తుంది. ఇది మరింత తీవ్రమైతే ఆల్కహాలిక్ హెపటైటిస్ లేదా సిర్రోసిస్‌కు కారణమవుతుంది.

అధికంగా మద్యం తీసుకోవడం వల్ల ఏర్పడే దుష్ఫలితాల నుంచి బైటపడటానికి మనం తీసుకునే మెడిసిన్స్ వల్ల కలిగే సమస్యలేంటి? అవి మేలు చేస్తాయా లేక మరింత కీడు చేస్తాయా?

ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరంలోని జీవక్రియలలో అనేక మార్పులు జరుగుతాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరంలోని జీవక్రియలలో అనేక మార్పులు జరుగుతాయి.

తీసుకోవాల్సింది పారసెటమాలా లేక ఐబప్రోఫెనా?

రాత్రి బాగా మద్యం తీసుకుని, హ్యాంగోవర్‌తో బాధపడుతున్నప్పుడు మీకు గుర్తుకు వచ్చేది ఐబప్రోఫెన్, లేదా పారసెటమాల్. హ్యాంగోవర్ బాధ నుంచి బైటపడేందుకు మీరు ఈ రెండింటిని ఆశ్రయిస్తారు. కానీ, ఇవి ఎలా పని చేస్తాయో తెలుసా?

పారాసెటమాల్ అనాల్జెసిక్‌గా అంటే బాధా నివారిణిగా, జ్వరాన్ని తగ్గించేదిగా పని చేస్తుంది. అందుకే పెయిన్ కిల్లర్‌గా ఎక్కువగా తీసుకుంటుంటారు.

ఇది కడుపులో ఏర్పడే మంటను ఏమీ చేయలేదు. కాబట్టి హ్యాంగోవర్ తగ్గించడానికి దీనిని తీసుకోవడం వల్ల ఉపయోగం లేదు.

అయితే, ఇది సురక్షితమైన ఔషధం. ఇందులో విష ప్రభావాలు ఉండవు. ఒకసారి తీసుకున్న తర్వాత అది రక్తంలో కలిసిపోయి, కాలేయంలోని జీవక్రియలో చేరుతుంది. ఇందులో మార్పుచెందని అణువులు కిడ్నీ ద్వారా బయటకు వెళ్లిపోతాయి.

ఇక ఐబప్రోఫెన్ గురించి చెప్పాలంటే ఇది నాన్ స్టెరాయిడల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్. మంట కారణంగా వచ్చే ఆర్థరైటిస్, పన్ను నొప్పి, కండరాలకు, గాయలకు, రుతుక్రమంలో వచ్చే నొప్పులకు దీనిని ఉపయోగిస్తారు.

ఎసిటామినోఫెన్ లాగా కాకుండా ఐబప్రోఫెన్ కాలేయానికి ఎలాంటి హాని కలిగించదు. దాని సొంత యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మెకానిజం కారణంగా, ఇది గ్యాస్ట్రిక్ ముకోసా (జీర్ణాశయ శ్లేష్మం) పై ప్రభావం చూపి, ఈ అవరోధాన్ని తొలగిస్తుంది. అయితే, యాంటి ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్‌తో పోలిస్తే ఇది తక్కువ ప్రభావవంతంగా ఉంటుంది.

హ్యాంగోవర్ నుంచి బైటపడటానికి చాలామంది పారాసెటమాల్, ఐబప్రోఫెన్ మాత్రలు వాడతారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హ్యాంగోవర్ నుంచి బైటపడటానికి చాలామంది పారాసెటమాల్, ఐబప్రోఫెన్ మాత్రలు వాడతారు

పారాసెటమాల్ పవర్ అధికం

మద్యం సేవించిన తర్వాత పారాసెటమాల్ తీసుకుంటే అది కాలేయాన్ని అధికంగా పని చేసేలా చేస్తుంది. అంటే అధికంగా మద్యం తీసుకున్న తర్వాత పారాసెటమాల్ తీసుకోవడం మన జీవక్రియ మీద ప్రభావం చూపుతుంది.

ముందు చెప్పుకున్న ఏడీహెచ్ ఎంజైమ్ గుర్తుందా? ఇది కాలేయం, జీర్ణాశయ శ్లేష్మంలోని ఆల్కహాల్‌ను జీర్ణం చేసి చిన్న అణువులుగా మార్చి సులభంగా శరీరం నుంచి బయటకు వెళ్లేలా చేస్తుంది.

అధికంగా తాగినప్పుడు, ఈ ఎంజైమ్ కూడా నిష్క్రియం అవుతుంది. అప్పుడు ఇంకొక ఎంజైమ్ అవసరం అవుతుంది. దీనినే CYP2E1 ఎంజైమ్ అంటారు. ఈ ఎంజైమ్‌ వ్యవస్థపై ఆల్కహాల్ ప్రేరేపకంగా పని చేస్తుంది.

పారాసెటమాల్ కూడా కాలేయంలో రెండు ప్రక్రియలు అంటే 80% గ్లూకురోనిక్ యాసిడ్‌తో సంయోగం ద్వారా, 20% CYP2E1 ఎంజైమ్ ద్వారా జీవక్రియ కొనసాగేలా చేస్తుంది.

ఈ ఎంజైమ్ ఆల్కహాల్, పారాసెటమాల్ జీవక్రియగా మార్చే ప్రక్రియలో పాల్గొంటుంది. ఇక్కడే సమస్య వస్తుంది.

CYP2E1 ఎంజైమ్ ద్వారా జీవక్రియగా మారిన పారాసెటమాల్‌లోని చిన్న భాగం అత్యంత రియాక్టివ్ మెటాబోలైట్ ఎంజైమ్ NAPQI గా మారిపోతుంది. ఇది ఆక్సిడేషన్ ప్రెషర్ (ఆక్సీకరణ ఒత్తిడి)కు, కణాల మరణానికి దారితీస్తుంది.

సాధారణ పరిస్థితులలో గ్లూటాతియోన్‌ కారణంగా ఇది బయటకు వెళ్లిపోతుంది. కానీ, అధిక మొత్తంలో మద్యం తాగినప్పుడు ఈ ప్రక్రియ సంక్లిష్టంగా మారుతుంది.

హ్యాంగోవర్ ఎందుకు ఏర్పడుతుందన్నది పరిశోధకులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హ్యాంగోవర్ ఎందుకు ఏర్పడుతుందన్నది పరిశోధకులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు

ఎందుకంటే మన శరీరంలో CYP2E1 ఎంజైమ్ (ఆల్కహాల్ మెటాబోలైజ్ చేయగలిగినది) చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పారాసెటమాల్ దాని రెండో జీవక్రియ మార్గాన్ని (CYP2E1 ద్వారా) ఉపయోగిస్తుంది.

దీనివల్ల చాలా ఎక్కువ NAPQI ఉత్పత్తి అవుతుంది. గ్లూటాతియోన్ పరిమితంగా ఉండటం వల్ల అది శరీరం నుంచి బైటికి వెళ్లదు. దీనివల్ల కాలేయానికి హాని కలిగే అవకాశం ఉంది.

దీనిని బట్టి మనం ఏం అర్ధం చేసుకోవాలి? రెండింటిని గమనిస్తే పారాసెటమాల్‌కన్నా ఐబప్రోఫెన్ మంచిదని అర్ధమవుతుంది.

హ్యాంగోవర్‌తోపాటు మంట కూడా ఉంటే ఐబప్రోఫెన్ తన నొప్పిని, మంటను తగ్గించే గుణంతో వాటిపై ప్రభావవంతంగా పని చేస్తుంది.

చివరగా చెప్పే విషయం ఒకటుంది. హ్యాంగోవర్‌కు ఉత్తమ పరిష్కారం ఆల్కహాల్ తీసుకోకపోవడం. లేదంటే కనీసం తక్కువగా తీసుకోవడం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)