సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్: పార్లమెంట్ కొత్త భవనంపై మోదీ సర్కారుకు అంత తొందర ఎందుకు

ఫొటో సోర్స్, TWITTER/OM BIRLA
- రచయిత, నితిన్ శ్రీవాస్తవ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత ప్రభుత్వం ప్రతిపాదిత సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ గురించి సమాచారం బయటికొస్తున్న కొద్దీ, దానిపై వస్తున్న ప్రశ్నల జాబితా కూడా పెరుగుతోంది.
సెంట్రల్ దిల్లీకి ఒక కొత్త రూపం ఇచ్చేందుకు తలపెట్టిన ఈ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది.
ఇక్కడ చర్చకు వస్తున్న విషయం ఒకటే. కొత్త పార్లమెంట్ భవనం, రాష్ట్రపతి భవనం నుంచి ఇండియా గేట్ వరకూ మధ్య భవనాలు నిర్మించే ప్రణాళిక సరైనదా లేక తప్పా.
ప్రస్తుత సెంట్రల్ విస్టా ఒక చారిత్రక ప్రాంతం. దాన్ని చూడ్డానికి జనం సుదూర ప్రాంతాల నుంచి వస్తారు. అందంగా ఉండడంతోపాటూ భారత అధికారానికి కూడా అది కారిడార్‌గా ఉంది.
సెంట్రల్ విస్టాకు కొత్త రూపం ఇచ్చే ప్రయత్నం పార్లమెంట్ కొత్త భవనంతో ప్రారంభం అవుతుంది. దానిని దాదాపు 971 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్నారు.
అయినా పార్లమెంటులో చోటు పెంచాలని గత 50 ఏళ్లుగా డిమాండ్లు వస్తున్నాయి. గత యూపీఏ ప్రభుత్వంలో మీరా కుమార్ లోక్‌సభ స్పీకర్‌గా ఉన్నప్పుడూ దీనిపై చర్చ జరిగింది.
అయితే ప్రస్తుత ప్రాజెక్ట్ గురించి మొదట చాలా తక్కువమందికే తెలుసు. అందుకే, 2019 ఎన్నికల్లో గెలిచిన కొన్నాళ్లకు బీజేపీ ప్రభుత్వం దీనిని ప్రకటించినపుడు కొందరు ఆశ్చర్యపోయారు.
సెంట్రల్ విస్టా అంటే.. అక్కడ ఇప్పుడు ఏమేం ఉన్నాయి
నిజానికి రాజ్‌పథ్‌కు రెండు వైపులా ఉన్న ప్రాంతాన్ని సెంట్రల్ విస్టా అంటారు. ఇందులో రాష్ట్రపతి భవన్, ఇండియా గేట్ దగ్గరున్న ప్రిన్సెస్ పార్క్ ప్రాంతం కూడా వస్తాయి.
ప్రస్తుత సెంట్రల్ విస్టాలో నేషనల్ మ్యూజియం, నేషనల్ ఆర్కైవ్స్ భారీ భవనం, ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్(ఐజీఎన్సీఏ), ఉద్యోగ్ భవన్, బిగనేర్ హౌస్, హైదరాబాద్ హౌస్, నిర్మాణ్ భవన్, జవహర్ భవన్ కూడా ఉన్నాయి.
ఈ భవనాలన్నిటికీ కొత్త రూపం ఇచ్చే ప్రణాళిక మొత్తం వ్యయం 14 వేల కోట్ల రూపాయలని చెబుతున్నారు.
దీనిని ప్రకటించిన ఏడాది తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ కొత్త పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన చేశారు.
ఇందులో 1200 మందికి పైగా ఎంపీలు, వారి సిబ్బంది ఒకే దగ్గర కూర్చోవచ్చు.
దీని గురించి చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ "భారత్‌కు స్వతంత్రం వచ్చిన 75 ఏళ్ల వేడుక జరుపుకొంటున్న సమయంలో సాక్షాత్తూ మన కొత్త పార్లమెంట్ భవనం దానికి ప్రేరణగా నిలవడం కంటే అందమైనది, పవిత్రమైనది ఏముంటుంది. ఇది సమయం, అవసరాలకు తగినట్లు మనల్ని మనం మార్చుకునే ప్రయత్నం" అన్నారు.

ప్రాజెక్టుపై ప్రశ్నల వెల్లువ
ప్రతిపాదిత పార్లమెంట్ భవనం 2024 నాటికి పూర్తవుతుంది. కానీ, సుప్రీంకోర్టు దీని నిర్మాణానికి అనుమతి ఇస్తుందా అనేది ఒక పెద్ద ప్రశ్న. ప్రభుత్వం మాత్రం దీనిపై, అందరి అభిప్రాయాలూ పరిగణనలోకి తీసుకుంటామని సుప్రీంకోర్టుకు భరోసా ఇచ్చింది.
మరోవైపు అత్యున్నత న్యాయస్థానం కొత్త పార్లమెంట్ భవన నిర్మాణంపై ప్రభుత్వ వైఖరిని దూకుడుగా వర్ణించింది.
ఈ ప్రాజెక్ట్ సాగుతున్న తీరు, మన అన్ని ప్రక్రియలను, సంస్థలను ఉల్లంఘిస్తోంది అని సుప్రీంకోర్టులో సెంట్రల్ విస్టాకు వ్యతిరేకంగా పిటిషన్ వేసిన సీనియర్ ఆర్కిటెక్ట్ నారాయణ్ మూర్తి అన్నారు.
"నాకు, మీకూ ఎఫ్ఏఆర్ అనే ఒకటి ఉంటుంది. మనం ఒక ప్లాట్‌లో ఏమేరకు నిర్మించవచ్చు అనేది చెబుతుంది. మనం పది చదరపు మీటర్లు ఎక్కువ నిర్మించినా, దానికి అనుమతి ఉండదు. ఎంసీడీ టీమ్ వచ్చి దాన్ని కూల్చేస్తుంది. కానీ, ఎంత ఎత్తు అనుమతిస్తున్నారో, దానికంటే ఒకటిన్నర రెట్లు, ఎఫ్ఏఆర్ అనుమతి కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువగా నిర్మిస్తున్నారు. అలా దేశానికి ఏం చెబుతున్నట్లు... ఇక్కడ 'అధికారం ఉన్న వాడిదే పెత్తనం' అనే అర్థం వస్తోంది" అన్నారు.
ఈ ప్రాజెక్ట్ అవసరం, దీనికి అయ్యే వ్యయం, ప్రభుత్వ అనుమతులు లేదా ప్రతిపాదిత పార్లమెంట్ భవనం డిజైన్ వీటన్నిటి గురించీ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఇలాంటి సమయంలో, స్వతంత్ర భారతదేశంలో ఇంతకు ముందు కూడా ఇలా జరిగాయా అనే ప్రశ్నలు కూడా రావడం సహజమే.
"ఐజీఎన్‌సీఏ అయినా వేరే ఏదైనా అవి ఏర్పడిన ప్రక్రియలో ప్రజలు, ఆర్టిస్టులు, ఆర్కిటెక్టులు అందరూ భాగం అయ్యేలా చేశారు.
ఇప్పుడు ఏ ప్రభుత్వం లేదా అధికారగణం ఉంటే దీనిపై వారిదే ఎక్కువ ఆధిపత్యం ఉన్నట్లు నాకు అనిపిస్తోంది. ఇక పార్లమెంట్ భవన నిర్మాణం విషయానికి వస్తే, పార్లమెంటులో సమయం గడిపిన, లేదా ఇప్పటికీ ఉన్నవారి అభిప్రాయాలు ఎక్కడా కనిపించడం లేదు. ప్రస్తుతం ప్రభుత్వానికి ప్రజలకు ఏది మంచి అనిపిస్తే దాన్ని చేసేస్తుంది. ఏ చర్చా లేకుండానే వారికి చెబుతుంది" అని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ మృదులా ముఖర్జీ చెప్పారు.

ప్రభుత్వం ఏం చెబుతోంది
అటు, ఈ ప్రాజెక్ట్ దేశ ప్రయోజనాల కోసమే అని కేంద్ర ప్రభుత్వం అంటోంది.
సెంట్రల్ విస్టాను ఆధునికంగా మార్చాల్సిన అవసరం ఉందని, దానివల్ల కోట్ల రూపాయలు ఆదా కూడా అవుతాయని, కొత్త భవనాలు మరింత బలంగా, భూకంపాలను తట్టుకునేలా ఉంటాయని చెబుతోంది.
ఇక పచ్చగా ఉండే ఆ ప్రాతంలో ఎక్కువ భవనాలు నిర్మించే విషయానికి వస్తే, తాము అంతకంటే ఎక్కువ పచ్చదనం తీసుకురాబోతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.
కానీ, దీనిపై పర్యావరణవేత్తల నుంచి ఎక్కువ వ్యతిరేకత వస్తోంది.
"చట్టం అండతో ప్రతిపాదిత భవనాలను మొత్తం ప్రాజెక్టు నుంచి వేరు చేశారు. ప్రభుత్వం మాత్రం తమ ప్రెస్ రిలీజ్‌లో మొదటి నుంచీ అది మొత్తం ప్రాజెక్టులో భాగం అని స్పష్టంగా చెబుతోంది" అని దిల్లీ సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్‌లో పర్యావరణ నిపుణులు కాంచీ కోహ్లీ చెప్పారు.
"మొత్తం పర్యావరణ అనుమతుల ప్రక్రియను ఒక విధంగా ప్లాటుకు.. ప్లాటుకు, బిల్డింగుకు.. బిల్డింగుకు వేరు చేశారు. అందులో మొదట పర్యావరణ అనుమతులు తీసుకోడానికి మొత్తం ప్రాజెక్టును ముక్కలుగా విడగొట్టారు.
తర్వాత ఇది ఒక మినహాయింపు ప్రాజెక్టు కాబట్టి దీనికి పర్యావరణ అంచనాలు అవసరం లేదు అన్నారు" అని తెలిపారు.
దీనిపై బంతి ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంది. కొత్త భవనం శంకుస్థాపనకు అది ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. కానీ, ఎలాంటి కూల్చివేతలు, కొత్త పనులు చేపట్టకూడదని ఆదేశించింది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రస్తుత సెంట్రల్ విస్టా పునాదులు
ఎంతోమంది చక్రవర్తులకు, పాలకులకు దిల్లీ రాజధానిగా ఉంది అనడానికి చరిత్రే సాక్ష్యం.
ఇక్కడ వరుసగా నిర్మాణాలు జరుగుతూనే వచ్చాయి. స్వాతంత్ర్యానికి ముందు, ఆ తర్వాత కూడా అవి కొనసాగాయి.
దాంతో, నగరం స్వరూపం మారిపోయింది. ఎన్నో ప్రముఖ భవనాలను కూడా నిర్మించారు.
బ్రిటన్ మహారాజు జార్జ్-5 1911లో దేశ రాజధానిని కలకత్తా నుంచి దిల్లీకి మారుస్తామని చెప్పినపుడు దిల్లీలో ప్రస్తుత సెంట్రల్ విస్టాకు పునాదులు పడ్డాయి.
ఆ టౌన్ ప్లానింగ్ కమిటీలో బ్రిటన్ ఆర్కిటెక్ట్ ఎడ్వర్డ్ లుటెన్స్, హర్బర్ట్ బెకర్ ఉండేవారు.
రాజధాని నిర్మాణాన్ని దిల్లీలోని షాజహానాబాద్ ప్రాంతంలో నిర్మించాలనే కమిటీ ప్రాథమిక నిర్ణయాలను వారు మార్చేశారు.
అద్భుతమైన రాజధాని కోసం వారు రైజీనా హిల్ అనే కొండ ప్రాంతాన్ని ఎంచుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పరస్పరం అభిప్రాయ బేధాలు అనేవి అప్పుడు కూడా వచ్చాయి. అయితే, అవి ప్రభుత్వం, ప్రజల్లో రాలేదు.
రాష్ట్రపతి భవనం, నార్త్, సౌత్ బ్లాక్ ఎత్తు గురించి అప్పటి సెంట్రల్ విస్టాను డిజైన్ చేసిన స్నేహితులు లుటెన్స్, బెకర్ మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయి. అవి చివరికి వారి స్నేహం మధ్యే చిచ్చుపెట్టాయి.
ప్రస్తుత ప్రభుత్వంలో అలాంటి అభిప్రాయ బేధాలు కనిపించవు. కానీ ఎంతో సమాజాలు, సామాన్యులు ప్రభుత్వ పారదర్శకతపై కోర్టుకు వెళ్లారు.
కానీ, బ్రిటన్ పాలనలో నిర్మించిన, ఇప్పుడు నిర్మించ తలపెట్టిన సెంట్రల్ విస్టా మధ్య పోలికలు కూడా చూస్తున్నారు. దీనిపై వస్తున్న ప్రశ్నలకు ఆధునిక చరిత్రకారులు, జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ మృదులా ముఖర్జీ సమాధానం ఇచ్చారు.
"కొత్త పార్లమెంట్ భవనం గురించి సంప్రదింపుల ప్రక్రియ ప్రభుత్వం లోపలే నడిచింది.
భారత జాతీయవాదులతో దీనిపై చర్చించలేదనేది స్పష్టంగా తెలుస్తోంది. తమను అసలు ప్రశ్నించరు కాబట్టి సామాన్యులను వారు అసలు అడగలేదు" అన్నారు.
"20వ శతాబ్దం మొదటి రెండు దశాబ్దాల ప్రభుత్వాల్లో భారతీయులు భాగం కాలేదు. 1930 తర్వాత అది పెరిగింది.
కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. ఇది మంచి అవకాశం. దానిలో మార్పు తీసుకురావాలని అనుకుంటే ప్రక్రియ మరోలా ఉండాలని నాకు అనిపిస్తోంది. నాకు అర్థం కాని ఇంకో విషయం ఏంటంటే... నిపుణులు, ఆర్కిటెక్టులు, పౌరులు లేదా కొన్ని రాజకీయ పార్టీలు ఈ ప్రక్రియకు అభ్యంతరం చెబుతుంటే అందులో తప్పేముంది. వారు ఎందుకు వినడం లేదు" అంటారు ముఖర్జీ.

ఫొటో సోర్స్, Getty Images
నేషనల్ వార్ మెమోరియల్ వివాదం కాలేదు
ఈ ప్రాంతంలో నిర్మాణాలపై నిర్ణయం తీసుకున్న బ్రిటిష్ పాలన 1947లో ముగిసింది. భారత గుర్తింపుగా భావించే ఈ భవనాలను పునర్నిర్మించాలనే నిర్ణయం దేశంలోని ఇప్పటి ప్రజాస్వామ్య ప్రభుత్వం తీసుకుంది.
మొట్టమొదటి మాస్టర్ ప్లాన్‌లో ఈ నగరానికి, ఈ దేశానికి మధ్యలో ఉన్న ఈ స్థలాన్ని పబ్లిక్‌గానే ఉంచేయాలని ప్లానర్స్ భావించారని సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పిటిషన్ వేసిన, సీనియర్ ఆర్కిటెక్ట్ నారాయణ మూర్తి చెప్పారు.
"మొదట లుటెన్స్ మాస్టర్ ప్లాన్‌లో ఈరోజు నిర్మిస్తున్నట్లు ఇలాగే ఉండేది. ఆఫీసుల కోసం పది పెద్ద పెద్ద పది భవనాలు నిర్మించాలని అనుకున్నారు. అయితే, మన దేశ మాస్టర్ ప్లానర్స్ దాన్ని అడ్డుకున్నారు. రాష్ట్రపతి భవన్ లేదా విజయ్ చౌక్ వైపు ప్రస్తుత శాస్త్రి భవన్ లేదా నిర్మాణ్ భవన్ ఉన్న నాలుగైదు భవనాలను వదిలేసి, ఇండియా గేట్ చుట్టూ నలువైపులా ఉన్న మొత్తం భూమిని ఓపెన్‌గా ఉంచేశారు" అన్నారు.

అయితే, గత కొన్నేళ్లుగా చూస్తే, దిల్లీ నేషనల్ వార్ మెమోరియల్ దీనికి విరుద్ధంగా ఒక ఉదాహరణగా నిలుస్తుంది.
దీనిని నిర్మించాలనే డిమాండ్ 1960 నుంచి ఉంది. కానీ దీనిని ఏర్పాటు చేయాలని 2014లో నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఏడాదిపాటు గ్లోబల్ డిజైన్ టెండర్ అందుబాటులో ఉంచారు. అందులో దేశవిదేశాల ఆర్కిటెక్టులు తమ మోడల్‌తో పాటూ పాల్గొన్నారు.
దీనిని నిర్మించడం కాస్త ఆలస్యం అయినప్పటికీ, ప్రస్తుత సెంట్రల్ విస్టా ప్రాజెక్టుతో పోలిస్తే దీనిపై దాదాపు ఏ వివాదాలూ లేవు.
"సెంట్రల్ విస్టా ప్రాంతం కేవలం దిల్లీకే కాదు, మొత్తం దేశ వారసత్వం లాంటిది. అందుకే, మనం దేశ వారసత్వం గురించి ఒక నిర్ణయం తీసుకుంటున్నప్పుడు, ఒక బహిరంగ సవరణ ఎందుక చేయకూడదు, ప్రజలను దానిలో ఎందుకు చేర్చకూడదు. మొదట ప్లాన్ ఏంటో చెప్పండి, దానిపై పబ్లిక్ ఇన్‌పుట్ తీసుకోండి. అప్పుడే క్రియేటివ్ ఐడియాలు వస్తాయి. మనమంతా కలిసి ఈ ప్రాంతాన్ని నిర్మించామని ప్రజలకు కూడా అనిపిస్తుంది" అంటారు పర్యావరణ నిపుణులు కాంచీ కోహ్లీ.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: ఈ గవర్నమెంటు స్కూల్లో సీట్లు లేవు
- బెంగాల్‌తో తెలుగువారికి ఉన్న అనుబంధం ఏంటో తెలుసా?
- సిలికాన్ వాలీ తల్లిదండ్రులు తమ పిల్లలను టెక్నాలజీకి దూరంగా ఉంచుతున్నారు.. ఎందుకు?
- ‘కాందహార్’ విమానం హైజాక్: 21 ఏళ్ల క్రితం అదంతా ఎలా జరిగింది?
- నార్వే: జీతాల దాపరికంలేని దేశం
- బాయ్‌ఫ్రెండ్ వల్ల గర్భం వచ్చింది.. భర్తకు తెలియకుండా బిడ్డకు జన్మనిచ్చింది.. ఆ తర్వాత...
- ‘మర్చంట్ ఆఫ్ డెత్’: దేశాల మధ్య శత్రుత్వం పెంచి ఆయుధాలు విక్రయించి ధనవంతుడైన వ్యాపారి
- రైతు ఆత్మహత్యలు: ‘మా అమ్మను వ్యవసాయం చేయనివ్వను’
- అప్పు త్వరగా తీర్చేయాలని పాకిస్తాన్‌ను సౌదీ ఎందుకు అడుగుతోంది?
- ‘మా ఇంట్లో అమిత్ షా భోంచేశారు, కానీ నాతో మాట్లాడలేదు’
- అనిల్‌కపూర్ : పెద్ద హీరోలు వద్దన్న పాత్రలు చేయడానికి ఏ మాత్రం సిగ్గుపడని హీరో
- ఒక ఉల్కను అమ్మేసి, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవుదామనుకున్నాడు. కానీ...
- కరోనావైరస్: బాబా రామ్‌దేవ్ ‘కరోనిల్’ కోవిడ్ నుంచి రక్షిస్తుందా? - బీబీసీ పరిశోధన
- "పార్లమెంటుకు పట్టని అన్నదాతల వ్యథలు· "జీరో బడ్జెట్ వ్యవసాయం అంటే ఏమిటి? కేంద్ర ఆర్ధికమంత్రి ఏపీని ఎందుకు ప్రస్తావించారు...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









