నరేంద్ర మోదీ: 'ఒక దేశం.. ఒకే ఎన్నిక' కావాలని ప్రధాని ఎందుకు కోరుకుంటున్నారు?

ఫొటో సోర్స్, @BJP
- రచయిత, గురుప్రీత్ సైనీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి 'ఒకే దేశం, ఒకే ఎన్నిక' అవసరం ఉందని ఉద్ఘాటించారు. ప్రిసైడింగ్ ఆఫీసర్స్ 80వ అఖిల భారత సదస్సు ముగింపు కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ప్రధాని దీని అవసరం గురించి మరోసారి మాట్లాడారు.
"వన్ నేషన్, వన్ ఎలక్షన్ చర్చనీయాంశం మాత్రమే కాదు, అది భారత్‌కు అవసరం. ప్రతి కొన్ని నెలలకూ భారత్‌లో ఎక్కడో ఒకచోట ఎన్నికలు జరుగుతున్నాయి. దీనివల్ల అభివృద్ధి పనులపై ప్రభావం పడుతోంది. అలాంటప్పుడు 'వన్ నేషన్, వన్ ఎలక్షన్' ఏర్పాటుపై మేధోమథనం అవసరం" అన్నారు.
ప్రధానమంత్రి గత ఏడాది జూన్‌లో కూడా 'ఒక దేశం, ఒకే ఎన్నిక' అంశంపై అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. ఆయన చాలా కాలం నుంచీ లోక్‌సభకు, అన్ని అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని చెబుతున్నారు. కానీ ఈ అంశంపై రాజకీయ పార్టీల్లో ఏకాభిప్రాయం రావడం లేదు.
లోక్‌సభకు, అన్ని అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే, దానివల్ల నిధులు, సమయం ఆదా చేయవచ్చని ప్రధానమంత్రి మోదీ చాలాసార్లు చెప్పారు.
మాటిమాటికీ ఎన్నికలు నిర్వహించడం వల్ల పాలనాపరమైన పనులపై వాటి ప్రభావం పడుతుందని ఆయన చెప్పారు. దేశంలో ఎన్నికలన్నీ ఒకేసారి జరిగితే, పార్టీలు దేశ, రాష్ట్రాభివృద్ధి పనులకు ఎక్కువ సమయం ఇచ్చినట్టు ఉంటుందని భావించారు.

ఫొటో సోర్స్, Getty Images
మొదటి అధికారిక సమావేశం
గత ఏడాది జూన్‌లో అన్ని పార్టీలతో ఈ అంశంపై మొదటిసారి అధికారికంగా చర్చించేందుకు ప్రధాని మోదీ ఒక సమావేశం ఏర్పాటుచేశారు. దీనికి ఆయన అన్ని పార్టీల అధ్యక్షులనూ ఆహ్వానించారు.
వీటి గురించి చెప్పిన అప్పటి కేంద్ర మంత్రి, సీనియర్ బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ కూడా "ఈ దేశంలో ప్రతి నెలలో ఎన్నికలు జరిగే పరిస్థితి ఉంది. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ చాలా నిధులు కూడా ఖర్చవుతాయి" అన్నారు.
"ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండడం వల్ల పాలనాపరమైన చాలా పనులు కూడా ఆగిపోతాయి. ప్రతి రాష్ట్రంలో ఎన్నికల్లో బయటి పదాధికారులు నియమితులవుతారు. దాంతో వారి రాష్ట్రాల్లో పనులపై కూడా ప్రభావం పడుతుంది" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పార్టీల్లో భిన్నాభిప్రాయాలు
కానీ, ఈ అంశంపై వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాలు వేరువేరుగా ఉన్నాయి. గత ఏడాది లా కమిషన్ ఈ అంశంపై వివిధ రాజకీయపార్టీలను సంప్రదించింది. టీఆర్ఎస్, శిరోమణి అకాలీదళ్ లాంటి పార్టీలు 'వన్ నేషన్, వన్ ఎలక్షన్' ఆలోచనను సమర్థించాయి.
అయితే, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ, ఏఐయూడీఎఫ్, గోవా ఫార్వార్డ్ పార్టీ దీనిని వ్యతిరేకించాయి.
కాంగ్రెస్ దీనిపై తమ వైఖరిని నిర్ణయించుకునే ముందు మిగతా విపక్షాలతో చర్చించాలని చెప్పింది.
లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం అప్రజాస్వామికం అని, సమాఖ్య సిద్ధాంతాలకు అది వ్యతిరేకం అని చెప్పింది.
ఇలా నిర్వహించాలనే ఆలోచన అసాధ్యం అన చెప్పిన సీపీఐ ఆ ప్రయత్నం ప్రజాతీర్పును, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తుందని చెప్పింది.
నిబంధనలు మార్చి ఇలా ఎన్నికలు నిర్వహించవచ్చని, కానీ ఆ మార్పులు దేశ రాజ్యాగంలోని పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, సమాఖ్యవాదం అనే రెండు అంశాలకు వ్యతిరేకంగా ఉంటాయని కూడా చెప్పింది.
‘‘ఒక దేశం, ఒక ఎన్నిక' నిర్వహించడం అంటే అర్థం ఎన్నికలన్నీ ఐదేళ్ల తర్వాతే జరుగుతాయి. ఆ లోపు రావు. అదే ఇప్పటి వ్యవస్థను చూస్తే, ఒకవేళ అసెంబ్లీలో ఏ పార్టీకైనా ఆధిక్యం లేదని అనిపిస్తే, ఐదేళ్ల లోపే మళ్లీ ఎన్నికలు రావచ్చు. కానీ, 'ఒక దేశం, ఒక ఎన్నిక' వ్యవస్థలో అలా జగదు’’ అని సుహాస్ పల్షికర్ చెప్పారు.
వన్ ఎలక్షన్‌లో ఎప్పుడు లోక్‌సభ ఎన్నికలు వస్తే, అసెంబ్లీ ఎన్నికలు కూడా అప్పుడే రావాలి. చాలా ఏళ్ల నుంచీ ఈ అంశంపై చర్చిస్తున్నారు. ఇప్పుడు ఇది మరోసారి చర్చకు వచ్చింది.
దీనివల్ల నిధులు ఆదా అవుతాయని తనకు అనిపించడం లేదని సుహాస్ పల్షికర్ చెప్పారు. ఒకవేళ నిధులు ఆదా అవుతాయని అనుకున్నా, దానికోసం ప్రజాస్వామ్యాన్ని అంతం చేస్తారా అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
వ్యతిరేక, అనుకూల వాదనలు
ఓటర్లు లోక్‌సభ ఎన్నికల సమయంలో ఒక విధంగా, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒక విధంగా ఓటు వేస్తారని చెబుతారు.
"ఈ రెండు ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే ఓటర్లు కేంద్ర, రాష్ట్రాల్లో ఒకే పార్టీకి ఓటు వేస్తార"ని ఒక దేశం, ఒకే ఎన్నిక ఆలోచనను వ్యతిరేకిస్తున్న వారు చెబుతున్నారు.
కానీ ఈ ఆలోచన, ఈ అంశాన్ని సమర్థించేవారు మాత్రం ఒడిశాలో ఎన్నికలను ఉదాహరణగా చెబుతారు. 2004లో ఒడిశాలో ఎన్నికలు జరిగినప్పుడు నాలుగు అసెంబ్లీలకు, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. కానీ అక్కడ ఫలితాలు వేరువేరుగా వచ్చాయి అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూడా అలాగే జరిగింది. అక్కడ లోక్‌సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగినప్పటికీ, ఫలితాలు మాత్రం వేరువేరుగా వచ్చాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఒకేసారి ఎన్నికలన్నీ ఎప్పుడు జరిగాయి?
స్వాతంత్ర్యం వచ్చాక 1951-52లో దేశంలో మొదటిసారి ఎన్నికలు జరిగాయి. అప్పుడు లోక్‌సభ ఎన్నికలు, రాష్ట్రాల ఎన్నికలను ఒకేసారి నిర్వహించారు.
ఆ తర్వాత 1957, 1962, 1967లో కూడా ఎన్నికలు ఒకేసారి జరిగాయి. కానీ తర్వాత నుంచి ఆ క్రమం తప్పింది. 1999లో లా కమిషన్ మొదటిసారి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగితే బాగుంటుందని తన రిపోర్టులో చెప్పింది.
ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని 2015లో చట్ట, న్యాయ అంశాల పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసింది.
ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ కూడా ఒకే దేశం, ఒకే ఎన్నిక ఆలోచనను సమర్థిస్తున్నారు.
గత ఏడాది లోక్‌సభ ఎన్నికల ముందు మోదీ ప్రభుత్వం లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం గురించి ఆలోచిస్తోందని అన్నారు. కానీ అలా జరగలేదు.
మోదీ ప్రభుత్వం గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికలతోపాటూ హరియాణా, మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించాలని భావించింది. కానీ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు దానికి అంగీకరించలేదని చెబుతారు.
ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ తమ పదవీకాలానికి ముందే అసెంబ్లీని రద్దు చేయలేమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు చెప్పారు.
ఇలాంటి సమయంలో, జమిలి ఎన్నికలకు బీజేపీ అసలు తన పార్టీ ముఖ్యమంత్రులనే ఒప్పించలేనప్పుడు, అది మిగతా పార్టీల ముఖ్యమంత్రులను ఎలా ఒప్పించగలదు అనే ప్రశ్నలు వస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
- మోదీ కేబినెట్లో మంత్రి రాజీనామాకు కారణమైన మూడు బిల్లుల్లో ఏముంది.. రైతులకు లాభమా, నష్టమా?
- తెలంగాణలో నియంత్రిత సాగుపై రైతులు ఏమంటున్నారు
- పొగాకు వదిలి తీపి పంట వైపు మళ్లిన రైతులు.. లాభాల దిశగా పయనం
- BBC SPECIAL: ఆత్మహత్యకు పాల్పడిన రైతుల పిల్లలకు తల్లి ఒడి లాంటి బడి 'శాంతివన్'
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- బ్రిటిష్ వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్ కథ ఎలా ముగిసిందంటే...
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
- 2,000 ఏళ్ల కిందటి రోమ్ సామ్రాజ్యపు యజమాని, బానిస... బయటపడ్డ బూడిద శిలలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








