మియన్మార్: సామాన్య పౌరులను హింసించి చంపేసిన సైన్యం, బీబీసీ పరిశోధనలో బయటపడ్డ దారుణాలు

శవాలు వెలికితీస్తున్న స్థానికులు
ఫొటో క్యాప్షన్, శవాలు వెలికితీస్తున్న స్థానికులు
    • రచయిత, రెబెక్కా హెంచ్‌కే, కెల్విన్ బ్రౌన్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

ఈ ఏడాది జులైలో మియన్మార్ సైన్యం వరుస సామూహిక హత్యలకు పాల్పడింది. ఈ దాడుల్లో కనీసం 40 మరణించినట్లు బీబీసీ పరిశోధనలో తేలింది.

సైనికులు గ్రామస్థులను చుట్టుముట్టారని, పురుషులను వేరు చేసి కాల్చి చంపారని ప్రత్యక్ష సాక్షులు, దాడుల నుంచి తప్పించుకున్నవారు చెప్పారు. ఆ సైనికుల్లో కొందరు 17 ఏళ్ల వయసు వారు కూడా ఉన్నారని తెలిపారు.

ఈ ఘటనలకు సంబంధించిన వీడియో ఫుటేజిలో గ్రామస్థులను మొదట దారుణంగా హింసించి, తర్వాత చంపి తక్కువ లోతు ఉన్న గుంతల్లో పూడ్చిపెట్టినట్లు కనిపిస్తోంది.

సెంట్రల్ మియన్మార్‌లోని సగైంగ్ జిల్లాలో ప్రతిపక్షానికి బలమైన పట్టున్న కనీ పట్టణంలో నాలుగు వేరు వేరు ఘటనల్లో ఈ హత్యలు జరిగాయి.

ఫిబ్రవరిలో తిరుగుబాటు చేసిన సైన్యం.. ఆంగ్ సాంగ్ సాన్ సూచీ నేతృత్వంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని గెద్దె దించి దేశాన్ని తమ అధీనంలో తెచ్చుకుంది. తర్వాత పౌరుల నుంచి సైన్యం వ్యతిరేకతను ఎదుర్కోంటోంది.

కనీలో ఉన్న 11 మంది సాక్షులతో బీబీసీ మాట్లాడింది. వారు చెప్పిన వాటిని మియన్మార్‌లోని సాక్షులు సేకరించిన మొబైల్ ఫోన్ ఫుటేజి, ఫొటోలతో పోల్చి చూసింది. ఇక్కడ జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనపై బ్రిటన్‌కు చెందిన ఒక ఎన్జీవో దర్యాప్తు చేస్తోంది.

ఈ సామూహిక హత్యలు ఎక్కువగా యిన్ గ్రామంలో జరిగాయి. ఇక్కడ కనీసం 14 మంది పురుషులను హింసించి లేదంటే కొట్టి చంపారు. వారి మృతదేహాలను అడవుల్లో పడేశారు.

పురుషులను తాళ్లతో కట్టేశారని, కొట్టి చంపారని యిన్‌లోని ప్రత్యక్ష సాక్షులు బీబీసీకి చెప్పారు. వారి గుర్తింపును గోప్యంగా ఉంచేందుకు కోసం బీబీసీ వారి పేర్లు బయటపెట్టడం లేదు.

ఫిబ్రవరిలో సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా ప్రజల నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఫిబ్రవరిలో సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా ప్రజల నిరసనలు

తాము దానిని తట్టుకోలేకపోయామని, తలలు వంచుకుని కన్నీళ్లు పెట్టామని అక్కడ ఉంటున్న ఒక మహిళ బీబీసీకి చెప్పారు. ఆమె సోదరుడు, మేనల్లుడు, బావను సైన్యం చంపేసింది.

"వాళ్లను చంపద్దని మేం వాళ్ల కాళ్లావేళ్లా పడ్డాం. కానీ, వాళ్లు పట్టించుకోలేదు. వీరిలో మీ భర్తలు ఉన్నారా అని వాళ్లు మహిళలను అఢిగారు. ఉంటే అంత్యక్రియలు చేసుకోండి అన్నారు" అని చెప్పారు.

గ్రామంలోని పురుషులను చంపే ముందు సైనికులు వారిని గంటల తరబడి దారుణంగా హింసించారని ఆ మారణకాండ నుంచి ఎలాగోలా తప్పించుకోగలిగిన ఒక వ్యక్తి చెప్పారు.

"వాళ్లను కట్టేశారు. రాళ్లతో, రైఫిల్ బట్స్‌తో కొట్టారు. రోజంతా హింసించారు. సైనికుల్లో కొందరు చాలా చిన్నవాళ్లు. బహుశా 17, 18 ఏళ్లుంటాయి. కానీ కొందరు చాలా పెద్దవాళ్లు. వాళ్లతో కొందరు మహిళలు కూడా ఉన్నారు" అని ఆయన చెప్పారు.

యిన్‌కు సమీపంలో ఉన్న జీ బిన్ డ్విన్ గ్రామంలో జులై నెల చివర్లో అవయవాలు ఛిద్రం చేసిన మృతదేహాలను, తక్కువ లోతున్న ఒక గుంటలో గుర్తించారు.

ఆ మృతదేహాల్లో ఒక చిన్నారి, మరో వికలాంగుడు కూడా ఉన్నారు. వాటిలో కొన్నింటికి కళ్లు లోడేయడం, వేళ్లు నరికేయడం లాంటివి చేశారు.

ఆ ప్రాంతానికి సమీపంలో 60 ఏళ్లు పైబడిన ఒక వృద్ధుడి శవాన్ని ఒక రేగు చెట్టుకు కట్టేసి ఉండడం గుర్తించారు. ఆయన మృతదేహం వీడియోను బీబీసీ పరిశీలించింది. అందులో ఆయన్ను హింసించినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

సైన్యం ఊళ్లోకి వచ్చినపుడు ఆయన కొడుకు, మనవడు పారిపోయారని, కానీ వయసైన తనను వాళ్లు ఏమీ చేయరులే అని ఆయన గ్రామంలోనే ఉండిపోయారని ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు.

ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలంటూ దేశంలోని పౌర మిలీషియా గ్రూపులు సైన్యంపై జరిపిన దాడులకు విధించే సామూహిక శిక్షల్లా ఈ హత్యలు కనిపించాయి.

మ్యాప్

ఈ సామూహిక హత్యలకు కొన్ని నెలల ముందు సైన్యానికి, పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ అనే పేరుతో ఒక్కటైన పౌర మిలీషియా గ్రూపుల స్థానిక శాఖలలకు మధ్య ఈ ప్రాంతంలో పోరాటం తీవ్రమైంది. వీటిలో జీ బిన్ డ్విన్ దగ్గర జరిగిన ఘర్షణలు కూడా ఉన్నాయి.

బీబీసీకి లభించిన వీడియో ఫుటేజి ఆధారాలు, సేకరించిన వాంగ్మూలాలను బట్టి ప్రత్యేకంగా సైనికులు ప్రధానంగా పురుషులనే లక్ష్యంగా చేసుకున్నారనే విషయం స్పష్టమవుతోంది.

ఈ సామూహిక హత్యల్లో ప్రాణాలు కోల్పోయిన పురుషుల కుటుంబ సభ్యులు మాత్రం సైన్యంపై జరిగిన దాడుల్లో వారి ప్రమేయం లేదని గట్టిగా చెబుతున్నారు.

"మా తమ్ముడికి కనీసం ఉండేలు పట్టుకోవడం కూడా రాదని చెబుతూ, సైనికుల కాళ్లావేళ్లా పడ్డాను. కానీ మాకేం చెప్పద్దు. మేం వినీవినీ విసిగిపోయాం. నిన్నే చంపుతాం" అని బెదిరించారని సోదరుడిని కోల్పోయిన మరో మహిళ చెప్పారు.

మియన్మార్‌లో సైనిక తిరుగుబాటు తర్వాత ఆ దేశంలో విదేశీ జర్నలిస్టులను నిషేధించారు. అక్కడ చాలావరకూ ప్రభుత్వేతర మీడియా సంస్థలు మూతపడ్డాయి. దీంతో అక్కడ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో రిపోర్ట్ చేయడం అసాధ్యం అవుతోంది.

బీబీసీ ఈ కథనంలో వచ్చిన ఆరోపణల గురించి మియన్మార్ డిప్యూటీ సమాచార శాఖ మంత్రి, సైనిక ప్రతినిధి జనరల్ జా మిన్ టున్‌ను ప్రశ్నించింది. సైనికులు సామూహిక హత్యలకు పాల్పడడాన్ని ఆయన ఖండించలేదు.

"అలా జరగచ్చు. వాళ్లు మమ్మల్ని శత్రువుల్లా చూస్తున్నప్పుడు, మాకు మమ్మల్ని కాపాడుకునే హక్కు ఉంటుంది" అన్నారు.

మియన్మార్‌ సైన్యం మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్లు వస్తున్న ఆరోపణలపై ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి దర్యాప్తు చేస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)