అషిన్ విరాతు: ‘మియన్మార్ ఒసామా బిన్ లాదెన్’ విడుదల

ఫొటో సోర్స్, Getty Images
వివాదాస్పద బౌద్ధ సన్యాసి అషిన్ విరాతును మియన్మార్ మిలిటరీ విడుదల చేసింది. మియన్మార్‌లో ముస్లిం వ్యతిరేక, జాతీయవాద ప్రసంగాలతో ఆయన పాపులర్ అయ్యారు.
పౌర ప్రభుత్వంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన ఆయన దేశద్రోహం ఆరోపణలతో జైలుకు వెళ్లారు. అనంతరం ఫిబ్రవరిలో సైనిక తిరుగుబాటు కారణంగా ఆ ప్రభుత్వం కూలిపోయింది.
ఫైర్ బ్రాండ్‌గా పేరొందిన ఈ బౌద్ధ సైన్యాసి, సైన్యానికి అనుకూలంగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు.
ముస్లింలను, ముఖ్యంగా రోహింజ్యాలను లక్ష్యంగా చేసుకొని ఈయన చేసే ప్రసంగాల కారణంగా ఆయనను ''బౌద్ధ బిన్ లాడెన్'' అని పిలుస్తారు.
అప్పటి ఆంగ్ సాన్ సూచీ నాయకత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రటిక్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, జాతీయవాద ప్రసంగాలు చేస్తూ ఆయన పలు మిలిటరీ ర్యాలీల్లో పాల్గొన్నారు.
పౌర ప్రభుత్వంపై ద్వేషాన్ని, ధిక్కార ధోరణులను ప్రోత్సహిస్తున్నారని 2019లో విరాతుపై చార్జి షీటు నమోదైంది.
అప్పుడు తప్పించుకు తిరిగిన ఆయన, గతేడాది నవంబర్‌లో అధికారులకు లొంగిపోయారు. అప్పటి నుంచి ఆ కేసు విచారణ కోసం ఎదురు చూస్తున్నారు.
విరాతుపై ఉన్న ఆరోపణలన్నీ కొట్టివేసినట్లు సైనిక ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. అందుకుగల కారణాలను వెల్లడించలేదు.
ఆయన సైనిక ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు మిలటరీ పేర్కొంది. అయితే విరాతు ఆరోగ్య పరిస్థితి సంబంధించి ఎలాంటి వివరాలు ఇంకా తెలియవు.

ఫొటో సోర్స్, Getty Images
'బౌద్ధ తీవ్రవాదానికి ముఖ చిత్రం'
మియన్మార్‌లోని ముస్లింలు, రోహింజ్యాలకు వ్యతిరేకంగా హింసను ప్రేరేపిస్తారని విరాతుపై ఆరోపణలు ఉన్నాయి.
బౌద్ధులు నడిపించిన 'జాతీయవాద 969 ఉద్యమం'లో విరాతు కీలకంగా వ్యవహరించారు.
ఆయనకున్న ప్రజాదరణ కారణంగా సామాజిక మాధ్యమాల్లో లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. ర్యాలీల్లో, ఆన్‌లైన్‌లో ఆయన ప్రసంగాల పట్ల ఫాలోవర్లు ఆసక్తి కనబరుస్తారు.
2012లో రఖైన్ రాష్ట్రంలో బౌద్ధులకు, రోహింజ్యా ముస్లింలకు మధ్య మత ఘర్షణలు జరిగినప్పుడు, ఆయన చేసిన ప్రసంగాలతో విరాతుకు ప్రజల్లో అధిక గుర్తింపు లభించింది.
మరుసటి సంవత్సరమే ఆయన టైమ్ మ్యాగజీన్ ముఖచిత్రంగా నిలిచారు. 'ది ఫేస్ ఆఫ్ బుద్ధిస్ట్ టెర్రర్?' పేరుతో టైమ్ మ్యాగజీన్ ఆయన ముఖచిత్రాన్ని ప్రచురించింది.
మియన్మార్‌లోని అత్యున్నత బౌద్ధమతాధికారుల సంస్థ, 2017లో ఆయన బోధనలపై ఒక ఏడాది పాటు నిషేధం విధించింది.
విద్వేష పూరిత ప్రసంగాలు చేస్తున్నారనే కారణంతో 2018లో ఫేస్‌బుక్ ఆయన పేజీని నిలిపివేసింది.
5.4 కోట్ల జనాభా ఉండే మియన్మార్‌లో బౌద్ధం ప్రధాన మతం.
ఇవి కూడా చదవండి:
- '9/11 దాడుల సూత్రధారి ఎఫ్‌బీఐ నుంచి ముందే ఎలా తప్పించుకున్నాడు’
- ‘ఆ కరెంట్ మేం వాడలేదు’
- శాటిలైట్ ఇంటర్నెట్ ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది?
- చింగ్ షి: ఒక సెక్స్ వర్కర్ ప్రపంచంలోనే అతిపెద్ద సముద్రపు దొంగల ముఠాకు నాయకురాలు ఎలా అయ్యారు?
- తాలిబాన్ నుంచి తప్పించుకున్న మహిళా రోబోటిక్స్ టీమ్ కథ సుఖాంతం అవుతుందా?
- జీ7 దేశాలను మించి కోవిడ్ టీకాలు వేసిన భారత్
- వర్షాల కోసం బాలికలను నగ్నంగా ఊరేగించిన గ్రామస్థులు
- పిల్లలకు కరోనా వ్యాక్సీన్ అవసరమా, వైద్యులు ఏం చెబుతున్నారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








