మియన్మార్‌: సైనికుల కాల్పుల్లో 82 మంది మృతి.. శవాలను ఒకదానిపై ఒకటి పేర్చారన్న స్థానిక మీడియా

మియన్మార్ ఊచకోత

ఫొటో సోర్స్, STRINGER/ANADOLU AGENCY VIA GETTY IMAGES

మియన్మార్‌లోని యాంగూన్ నగరం సమీపంలో ప్రదర్శనలు చేపట్టిన నిరసనకారులపై భద్రతా బలగాలు శుక్రవారం కాల్పులు జరిపాయి. దీంతో 80 మందికిపైగా చనిపోయారు.

మియన్మార్‌కు చెందిన ఒక వార్తా ఏజెన్సీ, ‘అసిస్టెన్స్ అసోసియేషన్ ఫర్ పొలిటికల్ ప్రిజనర్స్’(ఏఏపీపీ) సంస్థలు ఈ సమాచారం అందించాయి.

అంతకు ముందు, ఆగ్నేయ యాంగూన్‌లోని బగో నగరంలో భద్రతా బలగాలు దాడుల్లో చనిపోయిన వారి సంఖ్యను అంచనా వేయలేకపోతున్నామని మియన్మార్‌ స్థానిక మీడియా, ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

భద్రతా బలగాలు నిరసనకారుల శవాలను జెయార్ మునీ పగోడా(బౌద్ధ నిర్మాణం) పరిసరాల్లో ఒకదానిపై ఒకటి కుప్పగా పెట్టారని, ఆ ప్రాంతాన్ని అన్నివైపుల నుంచి భద్రతా బలగాలు చుట్టుముట్టాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న 82 మందిని భద్రతా బలగాలు చంపేశాయని స్థానిక సమాచార సంస్థ మియన్మార్ నావు, ఏఏపీపీ శనివారం చెప్పాయి.

శుక్రవారం ఉదయం నుంచీ కాల్పులు జరపడం ప్రారంభించిన సైన్యం మధ్యాహ్నం వరకూ కొనసాగించింది అని 'మియన్మార్ నావు' చెప్పింది.

"అది ఊచకోత లాంటిదే. వాళ్లు కనిపించిన అందరిపైనా కాల్పులు జరిపారు. నీడలపై కూడా కాల్పుల జరిపారు" అని ఆ నిరసనల్లో పాల్గొన్న హుతూత్ వార్తా సంస్థకు చెప్పాడు.

మియన్మార్ ఊచకోత

ఫొటో సోర్స్, STRINGER/GETTY IMAGES

ఇప్పటివరకూ మొత్తం 618 మంది మృతి - నివేదిక

చాలా మంది బగో వదిలి పారిపోయారని మియన్మార్ సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి.

భద్రతా బలగాలు అరెస్ట్ చేస్తున్న, వారి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోతున్న వారి రోజువారీ జాబితాను ఏఏపీపీ రూపొందిస్తోంది.

సైన్యం లెక్కల ప్రకారం దేశంలో 248 మంది పౌరులు, 16 మంది పోలీసులు చనిపోయారని మియన్మార్ సైన్యం జుంటా ప్రతినిధి మేజర్ జనరల్ జా మిన్ టున్ శుక్రవారం చెప్పారు. భద్రతా బలగాలు ప్రజలపై ఎలాంటి ఆటోమేటిక్ ఆయుధాలూ ఉపయోగించలేదని తెలిపారు.

స్థానిక మీడియా రిపోర్టుల ప్రకారం మియన్మార్‌లో ఒక సాయుధ గ్రూప్ జుంటాకు వ్యతిరేకంగా శనివారం ఒక పోలీస్ స్టేషన్ మీద దాడి చేసింది. ఆ దాడిలో 10 మంది పోలీసులు చనిపోయారు.

బాగోలో ప్రదర్శనలు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, బాగోలో ప్రదర్శనలు

వినాశనం అంచున మియన్మార్

స్థానిక సాయుధ గ్రూపులు మియన్మార్‌లోని తూర్పు ప్రాంతం షాన్‌లోని ఒక పోలీస్ స్టేషన్ మీద దాడి చేశాయి అని స్థానిక మీడియా చెప్పింది.

ఈ దాడిలో 10 మంది పోలీసులు చనిపోయారని 'షాన్ న్యూస్'.. ఈ ఘటనలో మొత్తం 14 మంది పోలీసులు చనిపోయారని 'ష్యూ ఫీ మ్యాయ్' న్యూస్ తెలిపాయి

"సైనిక పాలనకు వ్యతిరేకంగా ప్రజల నిరసనలు చల్లబడుతున్నాయని, వాళ్లు శాంతిని కోరుకుంటున్నారని మియన్మార్ సైన్యం శుక్రవారం చెప్పింది. రెండేళ్ల లోపు ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపింది.

మరోవైపు, మియన్మార్ సైన్యంపై చర్యలు తీసుకోవాలని అధికారం కోల్పోయిన మియన్మార్ నేతలు ఐక్యరాజ్యసమితి భద్రతామండలికి అపీల్ చేశారు.

"మా ప్రజల తమ హక్కులు, స్వాతంత్ర్యం కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నారు" అని సైనిక తిరుగుబాటు తర్వాత పదవి కోల్పోయిన ఆ దేశ ఎగ్జిక్యూటివ్ విదేశాంగ మంత్రి జిన్ మార్ ఆంగ్ అన్నారు.

యుఎన్ఎస్‌సీ జుంటాపై ప్రత్యక్ష, పరోక్ష ఒత్తిడి తీసుకురావాలని ఆయన అపీల్ చేశారు.

"మియన్మార్ వినాశనం అంచున నిలిచింది" అని 'మియన్మార్ విత్ ద ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూప్' సీనియర్ సలహాదారు రిచర్డ్ హోర్సీ ఐక్యరాజ్యసమితి ఒక సమావేశంలో అన్నారు.

మియన్మార్‌లో సైనిక తిరుగుబాటు తర్వాత నిరననల పరంపర కొనసాగుతోంది. భద్రతా బలగాల చేతుల్లో జనం భారీ సంఖ్యలో చనిపోతున్నారు. అరెస్టుల కూడా జరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)