మియన్మార్ సైనిక తిరుగుబాటు: "నా బిడ్డ లేని ఈ జీవితం ఎందుకు.. చనిపోవడమే మంచిదనిపిస్తోంది"

మూడు కుటుంబాలు తమ కథలను బీబీసీతో పంచుకున్నాయి.

ఫొటో సోర్స్, COURTESYOFFAMILIES

ఫొటో క్యాప్షన్, మూడు కుటుంబాలు తమ కథలను బీబీసీతో పంచుకున్నాయి.
    • రచయిత, గ్రేస్ టోయ్
    • హోదా, బీబీసీ బర్మా

మియన్మార్ తిరుగుబాటు తర్వాత ఆ దేశంలో హింస కొనసాగుతూ నిరసనకారులపై దాడులు కూడా తీవ్రం కావడంతో బాధితుల సంఖ్య పెరుగుతోంది.

నిరసనల్లో పాల్గొన్న వారినే కాకుండా ఇంట్లో కూర్చున్న వారినీ కొందరిని కాల్చేశారు. ఇక్కడ మూడు కుటుంబాలు తమ కథలను బీబీసీతో పంచుకున్నాయి.

14 ఏళ్ల పాన్ ఎయ్ ఫ్యూ ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమానికి మద్దతుగా నిలిచారు.

ఫొటో సోర్స్, COURTESY OF FAMILIES

ఫొటో క్యాప్షన్, 14 ఏళ్ల పాన్ ఎయ్ ఫ్యూ ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమానికి మద్దతుగా నిలిచారు.

టిక్‌టాక్‌లో ప్రజాస్వామ్యానికి అనుకూలంగా పాటలు పాడిన టీనేజ్ అమ్మాయి

14 ఏళ్ల పాన్ ఎయ్ ఫ్యూ ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. ప్రజాస్వామ్యానికి అనుకూలంగా టిక్‌టాక్‌లో ఎన్నో పాటలు పాడారు.

పాన్‌కు ఏం జరుగుతుందోనని భయపడ్డ తల్లి థిడా శాన్ వీధుల్లో జరుగుతున్న నిరసనలకు వెళ్లకుండా ఆమెను కట్టడి చేశారు. కానీ ఆ జాగ్రత్తలు ఆమె బిడ్డను కాపాడలేకపోయాయి.

మార్చి 27న సైనికులు అణచివేత చర్యలకు దిగినప్పుడు నిరసనకారులు పారిపోవడానికి వీలుగా తలుపు తెరవాలనుకున్న పాన్ ఎయ్ ఫ్యూను ఆమె ఇంట్లోనే కాల్చిచంపారు.

తిరుగుబాటు మొదలైనప్పటి నుంచి కనీసం 114 మందిని కాల్చి చంపారు. వీరిలో 11 మంది పిల్లలు కూడా ఉన్నారు.

"ఆమె హఠాత్తుగా కింద పడిపోయింది. నేను తను జారిపడిందేమో అనుకున్నా. కానీ తర్వాత ఆమె వీపు పై ఉన్న రక్తం చూశాక తనను కాల్చారని తెలిసింది" అని థిడా శాన్ ‘బీబీసీ’తో చెబుతూ ఏడుపు ఆపుకోలేకపోయారు.

బర్మా భాషలో పాన్ అంటే పువ్వు, ఎయ్ అంటే మృదువైన, ఫ్యూ అంటే తెల్లటి అని అర్థం.

నా కూతురు పుట్టినపుడు తెల్లగా ఉన్న చిన్న పువ్వులా అందంగా ఉండేది, అందుకే తనకు ఆ పేరు పెట్టుకున్నా అని ఆమె చెప్పారు.

ఇంటి పనుల్లో కూతురు తనకు ఎంత సాయంగా ఉండేదో, తను పెద్దయ్యాక అనాథాశ్రమం ప్రారంభించాలని ఆమె ఎలా కలలు కనేదో ఆమె గుర్తు చేసుకున్నారు.

"నా బిడ్డ లేని ఈ జీవితం ఎందుకు అనిపిస్తోంది. తను లేనప్పుడు చచ్చిపోవడమే మంచిదనిపిస్తోంది" అన్నారామె.

పాన్ ఎయ్ ఫ్యూ మరణం పదేళ్ల ఆమె తమ్ముడు జీ శాయ్ శాయ్‌ను కూడా కుంగదీసింది. అక్క చనిపోయిన తర్వాత తాను ఒక్క రాత్రి కూడా ప్రశాంతంగా నిద్రపోలేకపోయాడు. ఆమె గుర్తొచ్చినప్పుడల్లా తన టిక్‌టాక్ వీడియోలు చూస్తుంటాడని థింటా శాన్ చెప్పారు.

తమకు మళ్లీ ఏదో చెడు జరుగుతుందని థిడా ఆందోళనలో ఉండడంతో ఆ కుటుంబం వేరే ఇల్లు కూడా మారింది. మా జీవితాలు ఏమాత్రం సురక్షితం కాదు అంటారామె.

జిన్ మిన్ టెట్

ఫొటో సోర్స్, COURTESY OF FAMILIES

ఫొటో క్యాప్షన్, జిన్ మిన్ టెట్

బంగారం పని నేర్చుకుంటూ సరదాగా జీవించే మనిషి

జిన్ మిన్ టెట్ తన స్నేహితులకు సాయం చేయడానికి ఏమైనా చేస్తాడు.

"తనకు ఆర్థికంగా ఎంత కష్టంగా ఉన్నా.. తన స్నేహితులకు డబ్బు కావాలన్నా, వేరే ఏం కావాలన్నా సాయం చేస్తుంటాడు.

తను చాలా మంచి మనిషి. ఎప్పుడూ నవ్వుతుంటాడు" అని అతని స్నేహితుడు కో సాయ్ బీబీసీకి చెప్పారు.

మార్చి 8న కాల్పుల్లో చనిపోయే కొన్ని క్షణాల ముందు ఈ 24 ఏళ్ల యువకుడు తిరుగుబాటుకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల్లో ముందుండి మిగతా నిరసనకారులను కాపాడుతున్నాడు. అప్పటికి ఆయన చేతిలో ఒక ఇనుప రేకు తప్ప ఏం లేదు.

అతడిపై కాల్పులు జరిగాయని తెలియగానే వాళ్ల అమ్మ డా ఓహ్న్ హాస్పిటల్‌కు పరుగులు తీశారు. "నేను వాడి చివరి మాటలు వినాలనుకున్నా, నన్ను అమ్మా అని పిలుస్తాడనుకున్నా. కానీ వినలేకపోయా. అక్కడంతా రక్తం కనిపించింది. తనను అసలు చూడలేకపోయా. చాలా రక్తం పోవడంతో పాలిపోయిన తను చల్లగా అయిపోయి కనిపించాడు" అని ఆమె బీబీసీకి చెప్పారు.

"నేనింకేం చెప్పగలను, అది చాలా దారుణం. నాకు తెలిసిందల్లా వీలైనంత తొందరగా తన శవాన్ని ఇంటికి తెచ్చుకోవాలి" అంతే అని అన్నారు.

జిన్ మిన్ టెట్

ఫొటో సోర్స్, COURTESY OF FAMILIES

ఫొటో క్యాప్షన్, జిన్ మిన్ టెట్

జిన్ మిన్ టెట్ మూడేళ్లుగా బంగారం పనిలో శిక్షణ తీసుకుంటున్నాడు. తను ఇంట్లో అందరి కంటే చిన్నవాడు, ఏకైక కొడుకు.

బాగా డబ్బు సంపాదించగానే నీకు ఇల్లు కొనిస్తానని కొడుకు తనకు మాట ఇచ్చాడని తల్లి గుర్తు చేసుకున్నారు.

"తనకు ఎలాంటి చీకూచింతా ఉండేది కాదు. నన్ను ఎప్పుడూ చికాకు పెట్టడం, బాధ పెట్టడం చేయలేదు. తనకు నా వంటలంటే చాలా ఇష్టం. ఏది పెట్టినా వద్దనకుండా తినేవాడు. భోజనానికి స్నేహితులను కూడా తీసుకొచ్చేవాడు".

తను చనిపోయిన రోజు జిన్ మిన్ టెట్ తల్లితో పనికెళ్తున్నానని అబద్ధం చెప్పాడు. ఎందుకంటే నిరసనల్లో పాల్గొనడానికి అని చెబితే తల్లి వెళ్లనివ్వదని అనుకున్నాడు.

కానీ, కనీసం తను ఏం చేయాలనుకున్నాడో అదే చేస్తూ ప్రాణాలు పోగొట్టుకున్నాడని ఆమె అంటున్నారు.

"నా కొడుకును చూసి నేను గర్విస్తున్నా. తను ఒక హీరో. దేశానికి తన వంతుగా ఏదైనా చేయాలని చాలా ఆసక్తి చూపేవాడు" అని అన్నారు.

హీన్ టుట్ ఆంగ్

ఫొటో సోర్స్, COURTESY OF FAMILIES

భార్య చూస్తుండగా ట్యాక్సీ డ్రైవర్‌ని కాల్చి చంపేశారు.

హీన్ టుట్ ఆంగ్, ఆయన భార్య మా జిన్ మార్ కలిసి ఫిబ్రవరి 28న తిరుగుబాటుకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల్లో పాల్గొనేందుకు వెళ్లారు.

రోజువారీ పనులు పూర్తి చేసుకున్నాక ఈ జంట నిత్యం నిరసనల్లో పాల్గొంటోంది.

నిరసనల్లో పాల్గొనేందుకు వారు ఆ రోజు బస్సు ఎక్కారు. కానీ, అక్కడ కాల్పులు జరుగుతుండటంతో బస్సును ఆపి ప్రయాణికులను దించేశారు.

నిరసనకారులపై కాల్పులు జరుపుతూ ఉండటంతో మాకు కనుచూపు మేరలో రోడ్డును డస్ట్ బిన్‌లతో, బ్యారికేడ్లతో మూసివేస్తున్న నిరసనకారులు కనిపించారు.

"మేమిద్దరం రోడ్డు దాటుతుండగా ఆయనను కాల్చి చంపేశారు" అని ఆమె బీబీసీకి చెప్పారు.

"ఆయన నొప్పితో అరిచారు. అయన ఛాతీలోంచి రక్తం కారుతోంది. నేను ఆ కన్నాన్ని మూసిపెట్టి రక్తాన్ని ఆపాలని ప్రయత్నించాను.

ఆయనకు ఆసుపత్రికి తరలించాం. కానీ , అప్పటికే ఆలస్యమైపోయింది".

హీన్ టుట్ ఆంగ్ ఒక మోటారు సైకిల్ ట్యాక్సీ డ్రైవర్ కావడం వల్ల ఆయన పరిసర ప్రాంతాల్లో వారందరికీ పరిచయస్తులు.

"ఆయన చాలా నిరాడంబరమైన వ్యక్తి. ఎప్పుడూ శాంతియుతంగా ఉండేవారు. ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడేవారు కాదు. ఆయన ఖాళీ సమయంలో ఫోన్ లో ఆటలు ఆడుకుంటూ ఉండేవారు. ఆయన సంపాదించిన దానితోనే కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవారు.

వీరిద్దరూ ఒకరికొకరు ఆన్ లైన్ లో పరిచయం అయ్యారు. వారికి వివాహమై అయిదేళ్లయింది. అప్పటి నుంచి వారు సౌత్ డాగన్ టౌన్ షిప్‌లోనే ఉంటున్నారు.

"మేమెక్కడికి వెళ్లినా కలిసే వెళ్ళేవాళ్ళం. నేను ఆయనను బాగా మిస్ అవుతున్నాను.

ఈ తిరుగుబాటు ముగిసే వరకు పోరాడతాను" అని మా జిన్ మార్ అంటున్నారు.

"ఈ దేశం కోసం వారి జీవితాలను త్యాగం చేసిన వారి కుటుంబాలను నేను ప్రశంసిస్తాను. వారు ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను.

వారి బాధను నేనర్ధం చేసుకోగలను. నేను కూడా భర్తను కోల్పోయి అటువంటి బాధనే అనుభవిస్తున్నాను.

కానీ, మనం ఏదీ ఆపలేం. ఇప్పుడు వెనకడుగు వేయలేం. ఇప్పుడు వెనకడుగు వేస్తే మరిన్ని మరణాలు తప్పవు’’ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)