పాకిస్తాన్‌లో దివాలాపై చర్చ ఎందుకు? ఒక దేశం ఎప్పుడు దివాలా తీస్తుంది?

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్ ఇటీవలి కరెంట్ అకౌంట్, ద్రవ్య లోటును పరిశీలిస్తే దేశం దివాలా తీయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుందని పాకిస్తాన్ ఆర్థిక వ్యవహారాల దర్యాప్తు సంస్థ ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ (ఎఫ్‌బీఆర్) మాజీ చైర్మన్ సయ్యద్ షబ్బర్ జైదీ అన్నారు.
"అంతా బానే ఉంది, అన్నీ సవ్యంగా సాగుతున్నాయి అని ప్రభుత్వం చెబుతోంది. కానీ, అవన్నీ అబద్ధాలు" అని ఆయన వ్యాఖ్యానించారు.
హమ్‌దర్ద్ యూనివర్సిటీలో చేసిన ఓ ప్రసంగంలో పాకిస్తాన్ ఆర్థిక వ్యవహారాలపై షబ్బర్ జైదీ మాట్లాడారు. జైదీ చేసిన వ్యాఖ్యలు ఆ దేశంలో పెద్ద దుమారాన్నే లేపాయి.
అయితే, తన ప్రసంగంలో దీనికి పరిష్కార మార్గాలు కూడా సూచించానని, కానీ వాటి గురించి ఎవరూ మాట్లాడట్లేదని, తాను ప్రస్తావించిన సమస్యల గురించి మాత్రమే చర్చిస్తున్నారని జైదీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
"హమ్‌దర్ద్ యూనివర్సిటీలో నా ప్రసంగాన్ని తప్పుగా ప్రచారం చేస్తున్నారు. నేను అరగంట మాట్లాడాను. కానీ, అందులో మూడు నిముషాలు మాత్రమే కత్తిరించి ప్రచారం చేస్తున్నారు. అవును, ప్రస్తుత కరెంట్ అకౌంట్, ద్రవ్య లోటులతో దివాలా సమస్యలు, దాని పట్ల ఆందోళనలు ఉన్నాయి. కానీ, దానికి పరిష్కారాలు చూడండి."
"ఎవరు ఎక్కువ రుణాలు తీసుకున్నారని చర్చించి లాభం లేదు. వారిని విమర్శించి ఏ ప్రయోజనమూ లేదు. ఇవి పాకిస్తాన్ అప్పులు. వడ్డీ రేట్లను తార్కికంగా నిర్ణయించాలి. ఒక దేశాభివృద్ధి దాని ఎగుమతులపై ఆధారపడి ఉంటుంది. మేం ఎగుమతులను మెరుగుపరచాలి.."
"అప్పులు తీసుకోవాలనే భావన నుంచి మనం బయటపడాలి. రుణాలతో దేశం నడవదు. మనం సర్వీసులను ఎగుమతి చేయాలిగానీ పని చేసే వ్యక్తులను కాదు. అఫ్గానిస్తాన్‌లో అందరినీ కలుపుకుపోయే ప్రభుత్వం వచ్చేవరకు పాకిస్తాన్ చిక్కుల్లోనే ఉంటుంది. పాకిస్తాన్ ఎగుమతులు 20 బిలియన్ డాలర్లు (రూ.1,52,027 కోట్లు). మన దేశ ఎగుమతులను పశ్చిమ దేశాలే కొనుక్కుంటున్నాయి. అందువల్ల మన ఎగుమతులు పెరగాలంటే అమెరికాతో స్నేహం చేయాలి."
"నాకు ఇప్పటి వరకూ సీపీఈసీ అర్థం కాలేదు. అందులో పారదర్శకత తీసుకురావాలి. ఇది మన ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తోంది. భారత్ నుంచి మందులు తీసుకుంటున్నాం. భారతదేశంతో మనకు వ్యాపార సంబంధాలు లేవంటూ ఆడుతున్న నాటకాలు ఆపాలి. ప్రతి ప్రాథమిక పాఠశాలలో ఆంగ్లం బోధించాలి. ఇంగ్లిష్ నేర్చుకోని పిల్లలు సెకండ్ క్లాస్ సిటిజన్ అవుతారు. మతపరమైన చదువులు గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాకే చదువుకోవాలి" అని షబ్బర్ జైదీ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో 2019 మే 10 నుంచి 2020 ఏప్రిల్ 8 వరకు షబ్బర్ జైదీ ఎఫ్‌బీఆర్ చైర్మన్‌గా ఉన్నారు.
పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితిని జైదీ ట్వీట్ల ద్వారా వివరించారు.
"కేంద్ర ఆదాయం 6,500 బిలియన్లు. అందులో 3,500 బిలియన్లు రాష్ట్రాలకు ఇస్తుంది. మిగిలినది 3,000 బిలియన్లు. కేంద్రం యొక్క రుణ సేవ: మంత్రిత్వ శాఖ 2,800 బిలియన్లు, రక్షణ 1,500 బిలియన్లు, పరిపాలన 300 బిలియన్లు, ఎస్ఓఈ 500 బిలియన్లు. నేను ఇక్కడ ఆదాయాలను పెంచి, ఖర్చులను తగ్గించి చూపిస్తున్నాను. నేను నా మాటలను వెనక్కు తీసుకోను. వాస్తవాలను మీ ముందు ఉంచుతున్నాను. కేంద్ర ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించాలి. వర్తమానంలో ఉన్న పద్ధతిలో ఇది పనిచేయలేదు. మనం పూనుకుని దీన్ని సంస్కరించకపోతే, ఇది ఇలాగే ఉంటుంది" అని ఆయన అన్నారు.
షబ్బర్ జైదీ వ్యాఖ్యల తరువాత పాకిస్తాన్ దివాలా అంచున ఉందా? లేదా ఇప్పటికే దివాలా తీసిందా? అనే చర్చ తీవ్రమైంది.
దీనిపై పాకిస్తానీ కాలమిస్ట్ ఫరూఖ్ సలీమ్ ట్వీట్ చేస్తూ దివాలా తీయడమనేది ఒక సుదీర్ఘ ప్రక్రియ అని వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
'దివాలా తీయడమనేది ఒక సుదీర్ఘ ప్రక్రియ'
దీనిపై పాకిస్తానీ కాలమిస్ట్ ఫరూఖ్ సలీమ్ ట్వీట్ చేస్తూ దివాలా తీయడమనేది ఒక సుదీర్ఘ ప్రక్రియ అని వివరించారు.
"పాకిస్తాన్ దివాలా తీసిందా?
1. దివాలా అనేది ఒక చట్టబద్ధమైన ప్రక్రియ. దీన్ని రుణ గ్రహీతలు ప్రారంభిస్తారు.
2. ఇది కోర్టు ఆదేశాల ద్వారా అమల్లోకి వస్తుంది..
3. రుణ గ్రహీత అప్పు తీర్చలేనప్పుడు.
4. రుణ గ్రహీతలు ఎవరూ పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలను తీసుకోలేదు.
5. కోర్టు నుంచి ఆదేశాలు ఏమీ లేవు.
6. పాకిస్తాన్ తన అప్పులన్నీ తిరిగి చెల్లించింది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
పాకిస్తాన్ రుణాలు
ఒక నివేదిక ప్రకారం, పాకిస్తాన్‌పై ప్రస్తుతం 50.5 లక్షల కోట్ల పాకిస్తాన్ రూపాయల రుణ భారం ఉంది. అందులో ప్రభుత్వ రుణాలు 20.7 లక్షల కోట్ల రూపాయలు.
ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ పాలనలో పాకిస్తాన్ రుణాలు బాగా పెరిగాయని ఇదే నివేదిక పేర్కొంది.
2021 సెప్టెంబర్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ రుణ గణాంకాలను విడుదల చేసిందని ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ వార్తాపత్రిక తెలిపింది.
దానికి ఒకరోజు ముందు "పెరుగుతున్న రుణం జాతీయ భద్రతకు సంబంధించిన సమస్యగా" పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు.
గత 39 నెలల్లో పాకిస్తాన్ అప్పు 20.7 లక్షల కోట్ల పాకిస్తానీ రూపాయలు పెరిగిందని, దేశం మొత్తం అప్పులో ఇది 70 శాతం పెరుగుదల అని ఆ నివేదిక వెల్లడించింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ నిబంధనలు, షరతులు అంగీకారం కాకపోవడంతో అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) పాకిస్తాన్‌కు రుణం ఇచ్చేందుకు నిరాకరించిందని ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ పేర్కొంది.

ఫొటో సోర్స్, REUTERS
నిజంగా పాకిస్తాన్ దివాలా అంచున ఉందా?
ఒక దేశం దివాలా తీయడం, ఒక కంపెనీ దివాలా తీయడం ఒకటి కాదు. దేశ ద్రవ్య విధానం ఆ దేశ పరిస్థితిని తెలియజేస్తుంది.
దీనితో పాటు, పెట్టుబడిదారుల విశ్వాసం ఎలా ఉందన్నది కూడా ఒక దేశం దివాలా స్థితిని చెబుతుంది.
క్రెడిట్ రేటింగ్ సంస్థలు ఇచ్చే రేటింగులు కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి.
ఈ ఏడాది మే నెలలో ఫిచ్ రేటింగ్ సంస్థ, పాకిస్తాన్‌కు రుణాలిచ్చే రిస్క్ బట్టి 'B' రేటింగ్ ఇచ్చింది.
ఒక దేశ ఆర్థిక చరిత్ర, గత రుణాల చెల్లింపు, ప్రస్తుతం ఐఎంఎఫ్ రుణ చెల్లింపు ప్రణాళికను బట్టి రేటింగ్ సంస్థలు తమ రేటింగ్ ప్రకటిస్తాయి.
అంతర్జాతీయ బాండ్ మార్కెట్ నుంచి రుణాలు తీసుకోవడం కూడా చాలా దేశాలకు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఎందుకంటే, పెట్టుబడిదారులకు అధిక లాభాలు హామీ ఇస్తారుగానీ కానీ అవి నెరవేర్చలేకపోవచ్చు.
ఒక దేశం రుణాలు చెల్లించలేకపోయినప్పుడు, కొత్త అప్పులు చేస్తుంది లేదా ఆర్థిక విధానాలను మారుస్తుంది. పెట్టుబడిదారులకు నష్టం రాకుండా తమ బాండ్ల ప్రస్తుత ధరలను పెంచుతుంది.
ఇన్ని ప్రయత్నాల తరువాత కూడా ఆర్థిక వ్యవస్థ కోలుకోకపోతే , రుణాలు చెల్లించలేకపోతే అప్పుడు ఆ దేశం దివాలా తీసినట్టు లెక్క.
2001లో అర్జెంటీనా ఇదే పరిస్థితికి వచ్చింది. తమ దేశం దివాలా తీసినట్టు ప్రకటించింది.
పాకిస్తాన్ రుణాలు నిరంతరం పెరుగుతూ ఉన్నాయి. కానీ, రేటింగ్ వ్యవస్థలు ఆ దేశ ఆర్థిక పరిస్థితిపై కొంత ఆశను ప్రకటించాయి.
కరోనా మహమ్మారి తర్వాత పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ తిరిగి ట్రాక్‌లోకి వస్తోందని ఫిచ్ రేటింగ్ ఏజెన్సీ తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- అఫ్గానిస్తాన్: తాలిబాన్ల రాకతో పాకిస్తాన్ ఆర్థికవ్యవస్థ మరింత దెబ్బతింటుందా?
- ఒమిక్రాన్ వేరియంట్ వ్యాధి లక్షణాలు ఏమిటి? జలుబు వస్తే ఏం చేయాలి?
- పాకిస్తాన్ జైల్లో 24 ఏళ్లు ఉన్న వ్యక్తి చివరికి స్వదేశానికి ఎలా చేరుకున్నారంటే...
- జపాన్: 'బ్లూ హైడ్రోజన్' బొగ్గుకు ప్రత్యామ్నాయం కానుందా?
- పంజ్‌షీర్‌లో పాకిస్తాన్ వెన్నుపోటు పొడుస్తోందా? ఇరాన్ వ్యాఖ్యలకు అర్థం ఏంటి?
- సెకండ్ వైఫ్ డాట్ కామ్: రెండో పెళ్లి చేసుకునే వారికోసం ఏర్పాటు చేసిన వెబ్‌సైట్‌పై పాకిస్తాన్‌లో విమర్శలు ఎందుకు
- ‘గర్ల్స్ డు పోర్న్’ బాధిత మహిళలకే ఆ వీడియోలపై హక్కులు, పరిహారం
- డాక్టర్లు బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ చేస్తుంటే... ఆ అమ్మాయి పియానో వాయించింది
- సముద్రపు చేపలా.. చెరువుల్లో పెంచిన చేపలా.. ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది?
- కొన్ని పదాలు నాలుక చివరి వరకు వస్తాయి, కానీ గుర్తుకు రావు... వీటిని గుర్తు చేసుకోవడం ఎలా?
- సైన్స్: కొబ్బరి నూనెను కూరల్లో వాడొచ్చా? ఈ నూనె ఆరోగ్యానికి మంచిదా? కాదా?
- బంగ్లాదేశ్ యుద్ధంలో 'రా' చీఫ్ రామేశ్వర్నాథ్దే కీలక పాత్ర
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












