పాకిస్తాన్‌: ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఆ దేశాన్ని అప్పుల్లో ముంచిందా

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
    • రచయిత, తన్వీర్ మాలిక్
    • హోదా, బీబీసీ కోసం

విదేశీ రుణాలు పెరగడం జాతీయ భద్రతకు సంబంధించిన విషయమని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఇటీవల ఓసారి అన్నారు. పాకిస్తాన్ విదేశీ రుణం 127 బిలియన్ డాలర్లు (రూ.9,51,642 కోట్లు)దాటింది. ఆ దేశ చరిత్రలో ఇదే అత్యధిక స్థాయి రుణం.

ఐఎంఎఫ్‌ తో సహా ఇతర అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, పారిస్ క్లబ్, విదేశాల నుంచి తీసుకున్న రుణాలతో పాటు స్థానిక స్థాయిలో వాణిజ్య బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు కూడా ఇందులో భాగం. ప్రభుత్వంతో పాటు దేశంలోని ఇతర సంస్థలు తీసుకున్న అప్పులను కూడా ఇందులో లెక్కిస్తారన్నది గమనించాల్సిన విషయం. ఈ రుణాలకు ప్రభుత్వం హామీ ఇస్తుంది.

ఇంతగా అప్పులు పెరిగిపోవడానికి గత ప్రభుత్వాలే కారణమని పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) ప్రభుత్వం ఆరోపిస్తోంది. అయితే, పీటీఐ అధికారంలోకి వచ్చిన ఈ 39 నెలల్లో రుణాలు తీసుకునే వేగం పెరిగింది.

గత ప్రభుత్వాలు తీసుకున్న రుణాలను వడ్డీతో సహా చెల్లించాల్సిన పరిస్థితి కారణంగా మళ్లీ రుణాలు తీసుకోవాల్సి వచ్చిందని ప్రభుత్వం చెబుతోంది. అయితే, అప్పులు తీర్చడానికే కాకుండా ద్రవ్య లోటును పూడ్చడానికి కూడా ప్రస్తుత ప్రభుత్వం రుణాలు తీసుకుందన్నది ఆర్థికవేత్తల అభిప్రాయం.

ప్రస్తుత ప్రభుత్వం అవలంబిస్తున్న బలహీనమైన విధానాల వల్ల దేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, అందుకే అప్పుల పైనే ఆధారపడాల్సి వస్తోందని వారంటున్నారు. పీటీఐ ప్రభుత్వం అప్పులు చేస్తున్న రేటు గత రెండు ప్రభుత్వాల కన్నా ఎక్కువగా ఉందని నిపుణులు భావిస్తున్నారు.

2008లో పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించినప్పటి నుంచి వరుసగా మూడు పార్టీలు అధికారంలోకి వచ్చాయి. అవి.. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ), పాకిస్తాన్ ముస్లిం లీగ్ (నవాజ్), పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ).

వీరిలో ఎవరెవరు ఎంతెంత రుణాలు తీసుకున్నారో చూద్దాం.

AFP

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, AFP

వరుసగా మూడు ప్రభుత్వాల రుణ వ్యయాలు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ డేటా ప్రకారం, 2008లో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు, మొత్తం విదేశీ రుణం 45 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 3,37,198 కోట్లు).

2013లో వీరి పాలన ముగిసే సమయానికి ఈ రుణాలు 61 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.4,57,099 కోట్లు) చేరుకున్నాయి. తరువాత అధికారంలోకి వచ్చిన నవాజ్ లీగ్ పాలన ముగిసే సమయానికి అంటే 2018కి విదేశీ రుణాలు 95 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.7,11,944 కోట్లు) పెరిగాయి.

ప్రస్తుత పీటీఐ ప్రభుత్వం పాలనలో 2021 సెప్టెంబర్ చివరి నాటికి ఈ రుణాలు 127 బిలియన్ డాలర్లకు (రూ.9,51,642 కోట్లు) చేరుకున్నాయి. ఈ లెక్కల ప్రకారం పీపీపీ పాలనలో విదేశీ రుణం 16 బిలియన్ డాలర్లు పెరిగితే, నవాజ్ లీగ్ అధికారంలో ఉన్న ఐదేళ్లలో 34 బిలియన్ డాలర్లు పెరిగింది.

వీటితో పోల్చి చూస్తే పీటీఐ హయాంలో కేవలం 39 నెలల్లోనే విదేశీ రుణం 32 బిలియన్ డాలర్లు పెరిగింది.

1947 నుంచి 2008 వరకు దేశానికి కేవలం 60 బిలియన్ల అప్పులు మాత్రమే ఉన్నాయని, ఆ తరువాత కేవలం 13 ఏళ్లలోనే అవి 500 బిలియన్లు దాటాయని ఆర్థికవేత్త డాక్టర్ ఫరూక్ సలీం చెప్పారు. డాక్టర్ సలీం పాకిస్తాన్ ప్రధాని ఆర్థిక సలహా మండలి మాజీ సభ్యుడు కూడా.

ఒక రోజుకు రుణాల లెక్క చూసినా గత రెండు ప్రభుత్వాల కన్నా ప్రస్తుత పీటీఐ ప్రభుత్వం రుణాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన అన్నారు.

ఈ గణాంకాలన్నీ చూస్తుంటే, గత ప్రభుత్వాలతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వం రుణాలు తీసుకుంటున్న వేగం అధికంగా ఉందని ఆర్థికవేత్త, పాకిస్తాన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డెబిట్ ఆఫీస్ మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అష్ఫాక్ హసన్ ఖాన్ అన్నారు.

నవాజ్ లీగ్ ప్రభుత్వం అయిదేళ్లల్లో 33 బిలియన్ డాలర్ల విదేశీ రుణాలు తీసుకుందని, అదే పీటీఐ ప్రభుత్వం కేవలం 39 నెలల్లోనే 32 బిలియన్ డాలర్ల రుణం తీసుకుందని చెప్పారు.

Getty Images

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, Getty Images

ఈ వాదనలను తిరస్కరించిన పాకిస్తాన్ ప్రభుత్వం

అయితే, ప్రస్తుత ప్రభుత్వ పాలనలో రుణాలు పెరుగుతున్నాయన్న వాదనను ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ముజమ్మిల్ అస్లమ్‌ తోసిపుచ్చారు. నవాజ్ లీగ్ పాలనలోని ఐదు సంవత్సరాలలో వడ్డీతో సహా రుణాలు తిరిగి చెల్లించిన తర్వాత నికర రుణం 22.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1,68,361 కోట్లు) కాగా, ప్రస్తుత ప్రభుత్వ నికర రుణం కేవలం 9.9 బిలియన్ డాలర్లేనని ( సుమారు రూ. 74,079 కోట్లు) అస్లమ్ వివరించారు.

‘‘స్థూల జాతీయ ఉత్పత్తిలో రుణం నిష్పత్తి తగ్గింది. 2020 జూలైలో ఈ నిష్పత్తి 107 శాతం కాగా, ఈ ఏడాది 93.7 శాతానికి తగ్గింది. ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం ఉన్నప్పటికీ దీన్ని మేం సాధించగలిగాం’’ అని అస్లం అన్నారు.

" పాకిస్తాన్ ముస్లిం లీగ్ (నవాజ్) పార్టీ హయాంలో ఉన్న మారకం రేటు బట్టి రుణాలను లెక్కిస్తే, మొత్తం అప్పు 285 బిలియన్ డాలర్లు (సుమారు రూ.21,32,699 కోట్లు). ఈరోజు డాలరుకు రూపాయి విలువ 175 ఉంది. ఈ లెక్క ప్రకారం కూడా 285 బిలియన్ డాలర్ల ఉంటుంది. నవాజ్ ప్రభుత్వం మారకపు రేటును కృత్రిమంగా తగ్గించింది. అలా చేసి ఉండకపోతే, ఆ ప్రభుత్వం అయిదేళ్ల చివరికి ఇంతకన్నా చాలా ఎక్కువ విదేశీ రుణాలు ఉండేవి" అని అస్లం అభిప్రాయపడ్డారు.

“తలసరి ఆదాయం, తలసరి రుణాలను పరిశీలిస్తే, 2018 సంవత్సరంలో దేశ తలసరి ఆదాయం రూ.1,44,000 కాగా, తలసరి అప్పు రూ.1,80,000. నేడు తలసరి ఆదాయం రూ.2,35,000 కాగా, తలసరి అప్పు రూ.2,80,000.”

ప్రభుత్వం తీసుకున్న రుణాలను ఎలా ఖర్చు పెట్టారు?

పాత అప్పులు వడ్డీలతో సహా తీర్చడానికే కొత్త అప్పులు చేయాల్సి వస్తోందన్నది పీటీఐ ప్రభుత్వం వాదన. ఈ వాదనలో కొంత నిజం ఉన్నప్పటికీ, ఇది మొత్తం పరిస్థితిని తెలియపరచడంలేదు.

గణాంకాల ప్రకారం, ప్రస్తుత ప్రభుత్వం 32 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ రుణం తీసుకుని అందులో 17 బిలియన్ డాలర్లు పాత రుణాన్ని తిరిగి చెల్లించడానికి వాడుకుంది. అంటే, ఇతర ప్రభుత్వ ఖర్చుల కోసం 14 నుంచి 15 బిలియన్ డాలర్ల్ రుణాలు తీసుకున్నట్లు లెక్క.

పాకిస్తాన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డెబిట్ పాలసీ కోఆర్డినేషన్ కార్యాలయం జారీ చేసిన డెబిట్ బులెటిన్‌లో 2021 జూన్ 30తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గణాంకాలు పొందుపరిచారు. ఈ గణాంకాల ప్రకారం, 2018-19 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం 10.496 బిలియన్ డాలర్ల విదేశీ రుణాన్ని తీసుకుంది. ఆ సంవత్సరం 9.458 బిలియన్ డాలర్ల పాత రుణాలను తిరిగి చెల్లించింది.

2019-20 ఆర్థిక సంవత్సరంలో 13.074 బిలియన్ డాలర్ల రుణాలు తీసుకోగా, 11.075 బిలియన్ డాలర్ల పాత రుణాలను చెల్లించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో విదేశీ రుణం 13.301 బిలియన్ డాలర్లు కాగా, 8.388 బిలియన్ డాలర్ల పాత రుణాలను చెల్లించింది.

మొత్తం మూడేళ్లల్లో 36.871 బిలియన్ డాలర్లు (సుమారు రూ.2,75,927 కోట్లు) అప్పుగా తీసుకున్నారు. 28.921 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2,16,415 కోట్లు) పాత రుణాలను వడ్డీతో సహా తిరిగి చెల్లించారు. కొత్త, పాత రుణాలకు మధ్య వ్యత్యాసం 7.950 బిలియన్ డాలర్లు ( సుమారు రూ.59,489 కోట్లు). ఆ మేరకు రుణభారం పెరిగింది.

"డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్‌ గణాంకాల ప్రకారం, ఈ మూడేళ్లల్లో నికర రుణం 9.9 బిలియన్ డాలర్లు (సుమారు రూ.74,075 కోట్లు). బహుశా పబ్లిక్ డెబిట్ ఆఫీస్ గణాంకాలలో స్థానిక రుణాలను కలపకపోవచ్చు" అని అస్లం అన్నారు.

కరంట్ ఖాతా లోటును అప్పుల ద్వారా పూడ్చడం వల్లే నికర రుణాలు పెరిగాయని ఆయన వివరించారు.

పీటీఐ ప్రభుత్వం ఏర్పడిన తొలి ఆర్థిక సంవత్సరంలో కరెంట్ ఖాతా లోటు 13 బిలియన్ డాలర్లు కాగా, రెండో ఏడాదికి 7 బిలియన్ డాలర్లకు తగ్గించామని, గతేడాది 1.8 బిలియన్ డాలర్లకు తగ్గిందని అస్లం తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న రుణాలు ఎక్కువగా కరంటు ఖాతా లోటు, ఆర్థిక లోటును పూడ్చడానికే వినియోగించారని డాక్టర్ అష్ఫాక్ హసన్ అన్నారు.

కాగా, కరెంటు ఖాతా లోటును తగ్గించేందుకు ప్రభుత్వం విదేశీ రుణాలను తీసుకున్నట్లే, బడ్జెట్ లోటును తీర్చేందుకు స్థానిక బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటుంది.

పాత అప్పులు వడ్డీలతో సహా తీర్చడానికే కొత్త అప్పులు చేయాల్సి వస్తోందన్నది పీటీఐ ప్రభుత్వం వాదన

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పాత అప్పులు వడ్డీలతో సహా తీర్చడానికే కొత్త అప్పులు చేయాల్సి వస్తోందన్నది పీటీఐ ప్రభుత్వం వాదన

ప్రభుత్వం అప్పులపై ఎందుకు ఆధారపడుతోంది?

2018 సంవత్సరంలో పొదుపు ప్రచారంలో భాగంగా 2008 నుంచి పాకిస్తాన్ రుణాలు ఎలా పెరుగుతూ వచ్చాయో ప్రధానికి వివరించానని డాక్టర్ ఫరూక్ సలీమ్ బీబీసీకి తెలిపారు. "ఈ రుణం ఎలా చెల్లిస్తారని నేను చాలా ఆందోళన చెందాను. కానీ, 2019లో రుణాలు రెట్టింపు అయేసరికి ఇంక ఆ గ్రాఫ్ చూపించడం మానేశాం." అన్నారాయన.

దీనిపై తగిన రీతిలో దృష్టి పెట్టకపోవడమే రోజు రోజుకూ రుణాలు పెరిగిపోవడానికి కారణం అని డాక్టర్ సలీం అభిప్రాయపడ్దారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా లేనిపోని సమస్యలలో కూరుకుపోయి అతిపెద్ద రుణాల సమస్యను పట్టించుకోవట్లేదని ఆయన అన్నారు.

విదేశీ రుణాలు పెరగడానికి సగం కారణం ఐఎంఎఫ్ ప్రోగ్రాం నిబంధనలని డాక్టర్ అష్ఫాక్ హసన్ అభిప్రాయాడ్డారు. "ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడిన తరువాత వడ్డీ రేటు 6.50 నుంచి 13.25కి, మారకం రేటును 121 నుంచి 166కు పెరిగింది. ఈ రెండు కారణాల వల్లే రుణాలు విపరీతంగా పెరిగిపోయాయి."

90వ దశకం పాకిస్తాన్ కోల్పోయిన దశాబ్దమని, 2008 నుంచి 2018 వరకూ కొనసాగిన కాలం కూడా అలాగే అనిపిస్తోందని, ఉన్న కాస్త సానుకూల అంశాలను ప్రస్తుత ప్రభుత్వం ఈ మూడేళ్లల్లో నాశనం చేసిందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ మాజీ గవర్నర్ డాక్టర్ ఇష్రత్ హుస్సేన్ అన్నారు.

"ఐఎంఎఫ్‌ను ఆశ్రయించాలన్న ఆలోచన ప్రభుత్వానిదే. ఈ ప్రోగ్రాం పాకిస్తాన్‌కు మేలు చేయదని తెలిసి కూడా ఈ తోవ ఎన్నుకున్నారు" అన్నారాయన.

దీనిపై ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ముజమ్మిల్ అస్లం స్పందిస్తూ.. పీపీపీ ఐఎంఎఫ్‌తో తొమ్మిది కార్యక్రమాలపై సంతకాలు చేసిందిగానీ, ఏ ఒక్కటీ పూర్తి చేయలేదన్నారు.

"నవాజ్ లీగ్ ప్రభుత్వం నాలుగు ప్రోగ్రాంలపై సంతకం చేసి ఒక్కటే పూర్తిచేసింది. తద్వారా ఆరున్నర బిలియన్ డాలర్లు సంపాదించింది. ఈ ప్రభుత్వాలు ఐఎంఎఫ్ దగ్గర తీసుకున్న రుణాలు కూడా ప్రస్తుత ప్రభుత్వం నెత్తినపడ్డాయి" అని ఆయన వివరించారు.

ప్రస్తుత ప్రభుత్వం కేవలం ఒక కార్యక్రమం మాత్రమే చేసిందని, ఆరు బిలియన్ డాలర్లకు గాను ఇప్పటి వరకు కేవలం రెండు బిలియన్ డాలర్లు మాత్రమే తీసుకుందని అస్లం చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)