పాకిస్తాన్‌కు చైనా తయారు చేసిచ్చిన 'తుగ్రిల్' యుద్ధ నౌక సత్తా ఎంత... అది భారత నౌకాదళాన్ని సవాలు చేయగలదా?

ఫొటో సోర్స్, PAKISTAN NAVY
- రచయిత, ఉమర్ ఫారుఖ్
- హోదా, రక్షణ విశ్లేషకులు
ఇటీవల చైనా నిర్మిత యుద్ధ నౌక తుగ్రిల్ పాకిస్తాన్ నౌకా దళంలో చేరడంపై భారత మీడియాలో విస్తృత కవరేజీ లభించింది.
ఈ ఫ్రిగేట్ (యుద్ధ నౌక) చైనా, పాకిస్తాన్ మధ్య సైనిక సహకారానికి ఉదాహరణ నిలవడంతోపాటూ పాకిస్తాన్‌పై పైచేయిగా ఉన్న భారత నౌకా దళానికి సవాలుగా నిలుస్తుందా అని రక్షణ నిపుణులను ప్రశ్నించడం కనిపించింది.
పాకిస్తాన్ నావికాదళం కొన్ని రోజుల క్రితం చైనా నుంచి అక్కడ తయారైన 054ఎపి యుద్ధనౌకను కొనుగోలు చేసింది. ఆ దేశ నావికాదళ అధికారుల వివరాల ప్రకారం దీనికి ఉపరితలం నుంచి ఉపరితలం, ఉపరితలం నుంచి గగనతలం, సముద్ర గర్భంలో యుద్ధం చేయగలిగే సామర్థ్యం ఉంది.

ఫొటో సోర్స్, @PAKISTANNAVY
'సామర్థ్యానికి అద్భుత ఉదాహరణ'
తుగ్రిల్ యుద్ధ నౌక గురించి మరిన్ని వివరాలు తెలుసుకోడానికి పాకిస్తాన్ నౌకాదళం మీడియా వింగ్ డైరెక్టర్ జనరల్ కాప్టెన్ రషీద్‌తో బీబీసీ మాట్లాడింది.
"తుగ్రిల్ కేటగిరీలోని మొదటి యుద్ధ నౌక షాంఘై(చైనా)లోని హెచ్‌జెడ్ షిప్ యార్డ్‌లో తయారైంది. ఇలాంటివివే మరో మూడు యుద్ధ నౌకలు తయారవుతున్నాయి. అవి వచ్చే ఏడాది చివరికల్లా పాకిస్తాన్ నావికా దళంలోకి చేరుతాయి. పాక్ నావికాదళంలో ఈ యుద్ధనౌకల చేరికతో మా బలం మరింత పెరుగుతుంది" అని రషీద్ చెప్పారు.
ఈ యుద్ధ నౌకలో అమర్చిన ఆయుధాలు, సెన్సర్ల దీని పనితీరు సముద్రంలో ఎన్నో రకాల సైనిక ఆపరేషన్లు నిర్వహించేలా చాలా సమర్థంగా ఉంటుంది. తుగ్రిల్ భూమిపై, గాలిలో ఉన్న లక్ష్యాలను ఛేదించడంతోపాటూ, నీళ్లలో జలాంతర్గాములతో కూడా పోరాడే సామర్థ్యం ఉందని ఆయన తెలిపారు.
"4 వేల టన్నుల బరువున్న ఈ యుద్ధనౌక చేరికతో మాకు అవసరమైన డిటెరన్స్(రక్షణ సామర్థ్యం) లభిస్తుంది. అంటే సముద్ర సరిహద్దులకు, తీర ప్రాంతాలకు ఎదురయ్యే ప్రమాదాలకు తెరదించడంతోపాటూ సముద్ర రవాణా వనరులను సురక్షితం చేయడానికి కూడా సాయం లభిస్తుంది" అంటారు రషీద్.
పీఎన్ఎస్ తుగ్రిల్ నవంబర్ 24న చైనా నుంచి తన ప్రయాణం ప్రారంభిస్తుందని, అది మనీలా, మలేషియా, శ్రీలంకతోపాటూ తమ ప్రాంతీయ స్థావరాల మీదుగా ఒక నెల తర్వాత పాకిస్తాన్‌కు చేరుకుంటుందని కెప్టెన్ రషీద్ చెప్పారు.
రషీద్ వివరాల ప్రకారం 054ఏపీ రకం రెండో యుద్ధనౌక మరో ఆరు నెలల్లో పాకిస్తాన్‌కు అందనుంది. మరో ఆరు నెలల తర్వాత మూడో యుద్ధనౌక కూడా ఆ దేశ నావికాదళంలోకి చేరుతుంది. ఇలా ఏడాది చివరి నాటికి పాకిస్తాన్‌కు చైనా నుంచి అందే మొత్తం నాలుగు యుద్ధనౌకల చేరిక ప్రక్రియ పూర్తవుతుంది
భద్రతా కోణంలో చూసినప్పుడు తుగ్రిల్ కేటగిరీ యుద్ధ నౌక పాకిస్తాన్ నావికా దళాన్ని మరింత బలోపేతం చేయనుంది.
ఇది హిందూ మహాసముద్రం ప్రాంతంలో ఉన్న శక్తి సంతులనాన్ని కూడా పరిష్కరిస్తుందని, ఆ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం ఉండేలా చూస్తుందని పాకిస్తాన్ అధికారులు చెబుతున్నారు.
తుగ్రిల్ కేటగిరీ యుద్ధనౌకను పాకిస్తాన్ నావికా దళం దగ్గర ఇప్పటివరకూ ఉన్న అన్ని నౌకల్లో అత్యాధునిక యుద్ధనౌకగా పాకిస్తాన్ నావికా దళం అంశాల్లో నిపుణులు చెబుతున్నారు.
"ఇప్పటివరకూ పాకిస్తాన్ నౌకా దళం ఫ్లీట్‌లో ఉన్న అన్ని యుద్ధనౌకల్లోకీ 054ఏపీ రకం యుద్ధనౌక అత్యాధునిక యుద్ధ కౌశలం ఉన్నది" అని పాకిస్తాన్ రక్షణ విశ్లేషకులు షాహిద్ రజా బీబీసీతో అన్నారు.
ఈ యుద్ధ నౌకలు చేరికతో పాకిస్తాన్ నౌకా దళం యుద్ధ సామర్థ్యం ఎన్నో రెట్లు పెరుగుతుందని, దాని పరిధి కూడా పెరుగుతుందని, చైనా నావికా దళం ప్రస్తుతం ఉపయోగిస్తున్న అత్యాధునిక యుద్ధనౌకల్లో ఇది కూడా ఒకటని ఆయన చెప్పారు.
పాకిస్తాన్ నౌకా దళం ఫ్లీట్‌లో ఈ యుద్ధ నౌకలు చేరికతో, చైనా నిర్మిత ఎఫ్-22పి ఫ్రిగెట్ తమకు అందడం వల్ల పాక్, చైనా నౌకా దళాల మధ్య సహకారం ఎన్నో రెట్లు పెరుగుతుందని పాక్ నావికా దళానికి చెందిన ఒక సీనియర్ అధికారి చెప్పారు. పాక్ నేవీ, చైనా నావికా దళానికి ఒక ప్రధాన భాగస్వామిగా మారుతుందని అన్నారు.
పాకిస్తాన్ నావికా దళం ఇటీవల తమ యుద్ధ నౌకల ఆధునికీకరణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. దీనికి సంబంధించిన ఒక పెద్ద కార్యక్రమంపై పనిచేస్తోంది.

ఫొటో సోర్స్, PAKISTAN NAVY
భారత్, పాకిస్తాన్ నౌకా దళం పోలిక
ఇక భారత్, పాకిస్తాన్ నౌకాదళం మధ్య పోలిక విషయానికి వస్తే, ఇటీవలి మీడియా రిపోర్టుల ప్రకారం భారత్ దగ్గర ప్రస్తుతం 17 జలాంతర్గాములు ఉన్నాయి.
వీటిలో 16 డీజిల్‌తో, ఒకటి అణుశక్తితో నడుస్తాయి. పాకిస్తాన్ నేవీ అధికారుల వివరాల ప్రకారం ఆ దేశం దగ్గర ప్రస్తుతం డీజిల్‌తో నడిచే 9 జలాంతర్గాములు ఉన్నాయి. యుద్ధనౌకల విషయంలో కూడా పాకిస్తాన్‌పైన భారత్‌దే పైచేయిగా ఉంది.
కానీ, చైనా నౌకా దళం విషయానికి వస్తే పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అమెరికా రక్షణ విభాగం వివరాలను బట్టి యుద్ధ నౌకల విషయానికి వస్తే చైనా దగ్గర ప్రపంచంలోనే అతిపెద్ద నౌకాదళం ఉన్నట్లు తెలుస్తోంది.
2020 చివరి నాటికి చైనా నావికా దళం దగ్గర 70కి పైగా జలాంతర్గాములు ఉన్నాయి. వాటిలో అణుశక్తితో నడిచే ఏడు జలాంతర్గాముల(ఎస్ఎస్‌బీఎన్)కు అణ్వాయుధాలు ప్రయోగించే సామర్థ్యం ఉంది.
చైనాకు మరో 12 న్యూక్లియర్ అటాక్ సబ్ మెరీన్లు(ఎస్ఎస్ఎన్), 50 డీజిల్‌తో నడిచే అటాకింగ్ జలాంతర్గాములు ఉన్నాయి.
పాకిస్తాన్ నావికాదళ అంశాల నిపుణులు 054ఏ/పి రకం యుద్ధనౌకలను అత్యంత విజయవంతమైనవిగా భావిస్తున్నారు. 1990లో పాకిస్తాన్ బ్రిటిష్ నావీ నుంచి కొనుకోలు చేసిన 1970 నాటి 21 యుద్ధనౌకలతో పోలిస్తే ఈ యుద్ధ నౌకలకు పోరాటంలో ముఖ్యంగా జలాంతర్గాములతో చేసే యుద్ధంలో ప్రత్యేక సామర్థ్యం ఉందని చెబుతున్నారు.
అయితే, నావికా దళంలో యుద్ధ నౌకల సంఖ్య, సామర్థ్యం విషయంలో చూసినా పాకిస్తాన్ పై భారత నౌకా దళం పైచేయి సాధిస్తోంది.
ప్రపంచ ఆయుధ విపణిలో భారత్‌ను అత్యాధునిక ఆయుధాల పట్ల ఆత్యంత మక్కువ చూపే కొనుగోలుదారుగా చూస్తారు. ఈ వాస్తవమే యూరప్, అమెరికా, రష్యాలో ఉన్న ఆయుధ విక్రేతలను భారత్ వైపు ఆకర్షితులయ్యేలా చేస్తోంది.
భారత మీడియా కథనాల ప్రకారం భారత్ కూడా మరో పదేళ్లలో 56 యుద్ధనౌకలను కొనుగోలు చేసే ప్రణాళికకు ఆమోదం తెలిపింది.
మరోవైపు పాకిస్తాన్ ఆర్థికవ్యవస్థ మూలధన కొరతను ఎదుర్కుంటోందని, అందుకే అది యుద్ధనౌకలు, జలాంతర్గాములతోపాటూ అత్యాధునిక ఆయుధాల కోసం మిత్రదేశం అయినా చైనాను ఆశ్రయిస్తోందని కొందరు రక్షణ నిపుణులు చెబుతున్నారు.
చైనా ఆయుధ కంపెనీలు పాకిస్తాన్‌కు ప్రత్యేక ధరకు ఆయుధాలు విక్రయిస్తున్నాయని నిపుణులు భావిస్తున్నారు.
పాకిస్తాన్ నావికా దళంలోని కొన్ని యుద్ధ నౌకలు ఆధునిక క్షిపణి వ్యవస్థతో ఉత్పన్నమయ్యే ప్రమాదాలను ఎదుర్కునేంత సమర్థంగా లేవు. కానీ, తుగ్రిల్ యుద్ధనౌక చేరికతో ఇక ఆ పరిస్థితి మెరుగు పడవచ్చని ఆ దేశ రక్షణ నిపుణులు భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, AFP
తుగ్రిల్ చేరిక భారత్‌కు ప్రమాద ఘంటిక అనుకోవాలా...
పాకిస్తాన్ నౌకా దళంలో తుగ్రిల్ చేరికపై భారత మీడియాలో విస్తృత కథనాలు వచ్చాయి.
దీనివల్ల పాకిస్తాన్ నౌకా దళ సామర్థ్యం పెరగడం పక్కన పెడితే, హిందూ మహాసముద్రంలో చైనా సైన్యం ఉనికి పెరగడం వల్లే భారత్‌కు ఎక్కువ ముప్పు ఉంటుందనేది సుస్పష్టం.
పాకిస్తాన్ నౌకా దళాన్ని ఆధునీకరించడం, ఆ దేశ నౌకా దళ స్థావరాల్లోకి చేరుకోవడం వల్ల వల్ల హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రంలో చైనా నౌకా దళం ఉనికి పెరుగుతుందని టైమ్స్ ఆఫ్ ఇండియా చెబుతోంది.
పాకిస్తాన్ అత్యాధునిక యుద్ధనౌకలతోపాటూ చైనా నుంచి 8 జలాంతర్గాములు కూడా కొనుగోలు చేయబోతోంది. పాకిస్తాన్ నావికాదళం ఆధునికీకరణలో ఇవి కూడా భాగం.
బ్రోకింగ్స్ ఇన్‌స్టిట్యూట్ 2020 జూన్‌లో జారీ చేసిన ఒక రిపోర్టు ప్రకారం గత మూడు దశాబ్దాల్లో చైనా హిందూ మహాసముద్రం ప్రాంతంలో తన ఉనికి, కార్యకలాపాలను గణనీయంగా పెంచుకుంది.
చైనా నావికా దళం బలం పెరగడం, చిన్న దేశాలను అప్పుల్లో ఇరికించే ఆ దేశ దౌత్యంతో భారత యుద్ధ వ్యూహకర్తల్లో భయం పెరిగింది. దానివల్ల చైనా తన సముద్ర సరిహద్దులు దాటి ముందుకెళ్లి అదనపు సైనిక సామర్థ్యాన్ని సొంతం చేసుకోగలదు.
హిందూ మహాసముద్రంలో పీఎల్ఏ నేవీ ఉనికి పెరగడం, పాకిస్తాన్ నావికా దళానికి పెరుగుతున్న దాని సహకారం అనేది ముఖ్యంగా బారత్‌కు ఆందోళనకరంగా మారింది.

ఫొటో సోర్స్, ARUN SANKAR
గ్లోబల్ ఫైర్ ఇండెక్స్ పేరుతో ఉన్న ఒక వెబ్‌సైట్‌ను ఉటంకిస్తూ భారత మీడియా చెబుతున్న వివరాల ప్రకారం పాకిస్తాన్, భారత నేవీ మధ్య చాలా వ్యత్యాసం ఉంది. గ్లోబల్ ఫైర్ ఇండెక్స్ వెబ్‌సైట్ ప్రపంచంలోని వివిధ దేశాల సైన్యం బలాబలాలను విశ్లేషిస్తుంది.
ఈ సైట్ వివరాల ప్రకారం భారత్ దగ్గర ప్రస్తుతం 285 యుద్ధనౌకలు ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర 100 యుద్ధనౌకలే ఉన్నాయి.
బ్రోకింగ్ ఇన్‌స్టిట్యూషన్ ఒక నివేదిక ప్రకారం ఐఓఆర్(ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్)లో ఇటీవల ఏళ్లలో పీఎల్ఏఎన్(పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నావీ) ఎక్కువసార్లు పాకిస్తాన్‌లో పర్యటించింది.
చైనా యుద్ధనౌకల విషయానికి వస్తే అవి కరాచీ షిప్‌యార్డులో ఉన్న అన్ని సౌకర్యాలనూ పూర్తిగా ఉపయోగించుకుంటున్నాయని చెబుతున్నారు.
చైనా హిందూ మహాసముద్రం వ్యూహంలో ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఒక భాగమైపోయింది.
పాక్‌కు ఈ యుద్ధనౌకలు, మిగతా ఆయుధాలు అందడం వల్ల భారత్, పాకిస్తాన్ నావికా దళం మధ్య ఉన్న సంతులనంలో ఎలాంటి మార్పులూ ఏర్పడే అవకాశమే లేదని భారత నేవీ అధికారి, వ్యూహాత్మక అంశాల నిపుణులు రాజ మోహన్ బీబీసీతో అన్నారు.
"పాకిస్తాన్ నావికా దళం ఇప్పుడు చైనా హిందూ మహాసముద్రం వ్యూహంలో భాగం కావడమే భారత్‌కు అత్యంత ఆందోళన కలిగించే అంశం. హిందూ మహాసముద్రంలో చైనా నావికా దళం బల ప్రదర్శనలో ఇప్పుడు పాకిస్తాన్ కూడా భాగమైపోయింది" అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, EPA/DIVYAKANT SOLANKI
పీఎన్ఎస్ తుగ్రిల్ రాకతో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, పాకిస్తాన్ నావికా దళం సంయుక్త అభ్యాసాల కింద సూచనలు,సలహాలు ఇచ్చిపుచ్చుకోవడం, ఆపరేషన్ సామర్థ్యాన్ని పెంచుకోవడం జరుగుతుందని పాకిస్తాన్ అధికారులు అంటున్నారు.
విస్తృత సంయుక్త ఆపరేషన్ల లక్ష్యాన్ని అందుకోడానికి ఇరు దేశాల నేవీ ఎన్నోసార్లు సంయుక్త విన్యాసాలు చేసిందని తెలిపారు.
కొత్తగా తమ నావికా దళంలో చేరిన 54 ఏపీ రకం పీఎన్ఎస్ తుగ్రిల్ యుద్ధనౌక రకరకాల ఆపరేషన్లు నిర్వహించే సామర్థ్యం ఉందని పాకిస్తాన్ నేవీ అధికారులు చెబుతున్నారు.
"పాకిస్తాన్ నావికాదళం మెయిన్ ఫ్లీట్‌లో ఇది మూల స్తంభంగా మారుతుంది. సరిహద్దుల్లో పాకిస్తాన్ నావికా దళ రక్షణ సామర్థ్యం మరింత బలోపేతం అవుతుంది" అన్నారు.
పాకిస్తాన్ నావికాదళం 1993, 1994 మధ్య బ్రిటిష్ రాయల్ నేవీ నుంచి నాలుగు యుద్ధనౌకలు కొనుగోలు చేసింది. పీఎన్ఎస్ బద్ర, పీఎన్ఎస్ టిప్పూ సుల్తాన్, పీఎన్ఎస్ బాబర్, పీఎన్ఎస్ షాజహాన్ అనే ఈ నాలుగు నౌకల జీవితకాలం ముగియడంతో వాటిని నేవీ నుంచి తప్పించింది.
చైనా నుంచి 054 ఏపీ రకం యుద్ధనౌకలు కొనుగోలు చేసిన పాకిస్తాన్ నావికా దళం వాటిని బ్రిటన్ నుంచి కొనుగోలు చేసిన 21 ఫ్రిగేట్ స్థానంలో ఉపయోగించడం ప్రారంభించింది. ఎందుకంటే ఆ నౌకల జీవితకాలం కూడా పూర్తైంది.
చైనా నావికా దళం ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఆయుధాలు, సెన్సర్లతో కూడిన 054 ఏపీ రకం ఫ్రిగేట్ కోసం పాకిస్తాన్ 2017 జూన్‌లో ఆర్డర్ ఇచ్చింది.

ఫొటో సోర్స్, WWW.INDIANNAVY.NIC.IN/
బ్రోకింగ్ ఇన్‌స్టిట్యూట్ 2020 జూన్‌లో 'హిందూ మహాసముద్రంలో చైనా ఆకాంక్షలు' అనే శీర్షికతో ఒక రిపోర్టు ప్రచురించింది.
అందులో వివరాల ప్రకారం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆ ప్రాంతంలోని వివిధ దేశాల నావికా దళాలతో కలిసి సైనిక సహకార సామర్థ్యం పెంచుకోడానికి ఒక విస్తృత ప్రణాళికతో పనిచేస్తోంది. అది ప్రధానంగా హిందూ మహాసముద్రంలో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలపై ఫోకస్ పెట్టింది.
2021 ఫిబ్రవరిలో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, పాక్ నావికా దళం పాకిస్తాన్ నేతృత్వంలో వరుసగా ఎనిమిదోసారి నావీ ఎక్సర్‌సైజ్‌లు చేశాయి.
పాకిస్తాన్ నావికా దళం సామర్థ్యం, బలాన్ని ఆ ప్రాంతంలో, ప్రపంచంలో మిగతా నౌకా దళాల బలానికి సమానంగా తీసుకురావడం, ఇరు దేశాలు కలిసి ఉమ్మడిగా ముందుకు వెళ్లడమే దీని వెనుక ప్రధాన ఉద్దేశం
అయితే, చైనా సైనిక శక్తి పెరగడం గురించి అమెరికా విదేశాంగ శాఖ ఇటీవల జారీ చేసిన ఒక నివేదికలో చైనా తన తర్వాత నేవీ స్థావరాన్ని పాకిస్తాన్‌లో ఏర్పాటు చేయవచ్చని చెప్పింది.
పీఎల్ఏ మొదటి అవుట్ డోర్ నేవీ బేస్ ప్రస్తుతం జిబూతీలో నిర్మాణంలో ఉంది. పశ్చిమ హిందూ మహాసముద్రంలో సముద్రపు దొంగలను అణచివేయడమే లక్ష్యంగా చైనా దీన్ని నిర్మిస్తోంది.
ఇరు దేశాల నావికా దళ అభ్యాసాల్లో వృత్తిపరమైన అంశాలపై చర్చించామని పాకిస్తాన్ నేవీ చెప్పింది. సముద్ర జలాల్లో సైనిక సహకారం పెంపొందించుకునే దిశగా దృష్టి పెట్టినట్లు తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- ఉద్యోగుల జీతాలను సంస్థలు రహస్యంగా ఎందుకు ఉంచుతాయి?
- అభినందన్ వర్థమాన్‌కు వీర్ చక్ర అవార్డు ఇవ్వడంపై పాకిస్తాన్ ఏమందంటే..
- ఆరంకెల జీతాలతో ఆకర్షిస్తున్న డేటా సైంటిస్ట్ ఉద్యోగాలు
- ఒత్తిడి తట్టుకోవడానికి గంజాయిని ఆశ్రయిస్తున్న అమ్మలు, ఇది ఆరోగ్యానికి ప్రమాదం కాదా
- ఘాతక్ డ్రోన్ : పాకిస్తాన్, చైనాల నుంచి ఎదురయ్యే ముప్పును ఇది తప్పిస్తుందా
- ‘‘మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లు ఓ పెద్ద ఎత్తుగడ.. ఇదీ తెరవెనుక కథ’’
- చంద్రుడి నుంచి కొంత భాగం విరిగిపోయిందా? భూమికి సమీపంలో తిరుగుతున్న ఈ శకలం ఏమిటి
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ: లాజిస్టిక్స్ సూచీలో తెలుగు రాష్ట్రాల ర్యాంకులు ఎందుకు దిగజారాయి?
- సీఏఏ, ఎన్ఆర్సీ విషయంలో కూడా మోదీ ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా
- పేటీఎం షేర్ ధర మొదటిరోజునే ఎందుకు కుప్పకూలింది... ఈ ఐపీఓ నేర్పే పాఠాలేంటి?
- కడప జిల్లాలో వరదలు: ‘మా కళ్లెదుటే కొందరు కొట్టుకుపోయారు.. మా బంధువుల ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









